Jump to content

గాలి పెంచల నరసింహారావు

వికీపీడియా నుండి
(జి.పెంచలయ్య నుండి దారిమార్పు చెందింది)
గాలి పెంచల నరసింహారావు
గాలి పెంచల నరసింహారావు
జననంగాలి పెంచల నరసింహారావు
1903
మరణంమే 25, 1964
ఇతర పేర్లుసంగీతోపాధ్యాయ
ప్రసిద్ధితెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు

గాలి పెంచల నరసింహారావు (ఇంటిపేరు - గాలి; వ్యక్తి పేరు - పెంచల నరసింహారావు) (1903 - 1964) తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. దక్షిణభారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం.[1] ఆయన చివరి చిత్రం ఎన్.ఏ.టి వారి సీతారామ కల్యాణం (1961), ఆ చిత్రం ఆయన సంగీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన సీతారాముల కళ్యాణం చూతము రారండి పాట ఎంతో పెద్ద విజయం సాధించింది. ఆ పాట ఇప్పటికి శ్రీరామనవమి నాడు, పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన సంగీతం అందించిన తొలి, చివరి చిత్రాలు ఒకే నేపథ్యం ఉన్న కథతో తయారుకావడం కాకతాళీయం.

1936లో విడుదలైన మాయాబజార్ లేక శశిరేఖా పరిణయం చిత్రంలో ఆయన స్వరపరిచిన వివాహభోజనంబు పాటయే ఘంటసాల స్వరపరిచిన 1957లోని మాయాబజార్లోని పాటకు ఆదర్శం.

1943లో వచ్చిన పంతులమ్మ చిత్రంలో కృష్ణవేణి అనే అమ్మాయికి పాడే అవకాశం ఇచ్చారు, ఆమె ఎవరో కాదు మధుర గాయని జిక్కి. ఈ చిత్రంలో ఆమె ఈ తీరున నిన్నెరిగి పలుకగా నాతరమా అనే పాట స్వయంగా నటిస్తూ పాడారు. 1945లో వచ్చిన మాయలోకం చిత్రం ద్వారా అలనాటి ప్రముఖ సంగీతదర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావును తన బృందంలో హార్మోనిస్టుగా అవకాశం ఇచ్చారు. 1947లో వచ్చిన పల్నాటి యుద్ధం చిత్రానికి ఆయనే సంగీతదర్శకుడు. ఈ చిత్రంలో తనకు సహాయకునిగా పనిచేసిన ఘంటసాలతో కొన్ని పాటలు పాడించారు. ఆ చిత్రంలోని పాటలు చాలా ప్రాధాన్యత ఉన్నవి, ఎందుకంటే అందులో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా పాటలు పాడారు, అక్కినేని నాగేశ్వరరావు, ఘంటసాల కలిసి ఒక పాట పాడారు, ఘంటసాల, కన్నాంబ కలిసి ఒక యుగళగీతం (భక్తిగీతం) - తెరతీయగరాదా దేవా ఆలాపించారు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి కలిసి ఒక యుగళగీతం ఆలాపించారు.

1948లో వచ్చిన బాలరాజు చిత్రంలో ఈయన స్వరపరచిన పాటలు ఆ చిత్ర విజయానికి ముఖ్య కారణం. ఘంటసాల పాడిన చెలియా కనరావా, ఎస్.వరలక్ష్మి పాడిన ఎవరినే నేనెవరినే మొదలైన పాటలు, ఆ చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఆ చిత్రంలో కొన్ని పాటలను ఘంటసాల కూడా స్వరపరిచారు, అందుకు కారణం గాలిపెంచలనే. ఆయనకి సంగీతోపాధ్యాయ అని బిరుదు. నరసింహారావుగారు సంగీతం అందించిన చిత్రాలన్నీ సంగీతపరంగా పెద్ద విజయాలను సాధించాయి. మాలపిల్ల (1938) చిత్రంలో కథానాయకునిగా నటించిన గాలి వెంకటేశ్వరరావు ఈయన తమ్ముడు. ఆయన ఇంటిపేరును చాలామంది గాలి పెంచల అనుకుంటారు, కానీ ఆయన ఇంటిపేరు గాలి, అసలు పేరు పెంచల నరసింహారావు. కొన్ని చిత్రాలలో ఆయనపేరును జి.పెంచలయ్యగా, కొన్ని చిత్రాలలో గాలి పెంచలగా, కొన్ని చిత్రాలలో పూర్తి పేరును వేశారు. పెంచల నరసింహారావు 61 ఏళ్ళ వయస్సులో మే 25, 1964న పరమపదించారు.

చిత్రసమాహారం

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]