డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సొరంగం
అవలోకనం | |
---|---|
ఇతర పేర్లు |
|
ప్రదేశం | జమ్మూ కాశ్మీరు, భారతదేశం |
స్థితి | Active |
మార్గము | ఎన్‌హెచ్ 44 |
క్రాస్లు | పత్నీటాప్, కుడ్, బటోటే |
మొదలు | చెనాని |
చివర | నాశ్రీ, రంబన్ జిల్లా |
నిర్వహణ వివరాలు | |
ప్రారంభ తేదీ | 2011 జూలై[1] |
ప్రారంభం | 2017 ఏప్రిల్ 2 [2] |
యజమని | భారత జాతీయ రహదారుల అధికార సంస్థ |
ట్రాఫిక్ | మోటారు వాహనాలు |
లక్షణం | ప్రయాణీకులు, వస్తువులు |
సాంకేతిక వివరాలు | |
ఇంజనీరు | IL&FS ట్రాన్స్పోర్టేషన్ నెట్‌వర్క్స్ లిమిటెద్ |
పొడవు | 9.28 కిలోమీటర్లు (5.77 మై.)[3] |
సందుల సం. | 2[3] |
కార్యాచరణ వేగం | 50 కి.మీ./గం[4] |
అత్యధిక ఎత్తు | 1,200 మీ. (3,937 అ.) |
వెడల్పు | 13 మీ. (43 అ.) |
డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ సొరంగం, జమ్మూ కాశ్మీర్‌లోని ఒక రహదారి సొరంగం. ఇది దిగువ హిమాలయాల్లో, జాతీయ రహదారి 44 పై ఉంది. దీనిని చెనాని-నాశ్రీ సొరంగం అని కూడా పిలుస్తారు. దీని నిర్మాణం 2011లో ప్రారంభమై, 2017 నాటికి పూర్తయింది.
9.28 కి.మీ. (5.8 మై.) పొడవుతో ఇది భారతదేశపు అతి పొడవైన రహదారి సొరంగం,[4] పూర్తిగా ఇంటిగ్రేటెడ్ టన్నెల్ కంట్రోల్ సిస్టమ్‌తో ఉన్న మొదటి సొరంగం కూడా.[5] ఈ సొరంగం వలన జమ్మూ, శ్రీనగర్ ల మధ్య దూరం 30 కి.మీ. తగ్గుతుంది. ప్రయాణ సమయంలో రెండు గంటలు ఆదా అవుతుంది. ఈ సకల వాతావరణ సొరంగం పట్నిటాప్, కుడ్, బటోట్ వంటి శీతాకాలంలో హిమపాతం సంభవించే ప్రాంతాలను దాటవేస్తుంది, మంచు వలన ప్రతి శీతాకాలంలో NH 44 కి ఆటంకాలు కలిగి, వాహనాలు పొడవైన క్యూలలో, కొన్నిసార్లు రోజుల తరబడి, నిలబడిపోవాల్సి వచ్చేది.[4] ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ క్యాబినెట్‌లో పరిశ్రమలు, సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు. ఆయనే భారతీయ జనసంఘ్‌ను స్థాపించాడు.
స్థానం
[మార్చు]ఈ సొరంగం, దిగువ హిమాలయ శ్రేణిలో, సముద్ర మట్టం నుండి 1,200 మీ. (3,937 అ.) ఎత్తున ఉంది.[4] సొరంగం యొక్క దక్షిణ పోర్టల్ (ముగింపు) 33°02′47″N 75°16′45″E / 33.0463°N 75.2793°E వద్ద, ఉత్తర ప్రవేశం 33°07′43″N 75°17′34″E / 33.1285°N 75.2928°E. వద్ద ఉన్నాయి. సొరంగం తవ్వకం చెనాని పట్టణం నుండి 2 కి.మీ. (1 మై.) దూరాన పత్నీటాప్‌కు దక్షిణంగా మొదలుపెట్టి పత్నీటాప్‌కు ఉత్తరాన ఉన్న నాశ్రీ గ్రామం వరకు ఉంది.
నిర్మాణం
[మార్చు]పాలక యుపిఎ ప్రభుత్వ హయాంలో అప్పటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్ర ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్‌తో కలిసి 2011 జూలైలో ఈ ప్రాజెక్టుకు పునాది వేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఆ తర్వాత కొన్నేళ్లపాటు నిధుల ఇబ్బందులతో నిలిచిపోయింది. అంచనాల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి.[6] ఈ రెండు బరుసల సొరంగాన్ని నిర్మించడానికి అసలు అంచనా ₹2,520 crore (equivalent to ₹44 billion or US$550 million in 2020) కాగా ఇది ₹3,720 crore (US$470 million)కు పెరిగింది.[4][7] ప్రాజెక్టు పూర్తి చేయడానికి షెడ్యూల్ చేసిన తేదీ 2016 మే. తరువాత, నిర్మాణ కార్మికులు, సంస్థల మధ్య వివాదం కారణంగా, పని ఆలస్యమైంది. తదుపరి తేదీని 2016 జూలైగా నిర్ణయించారు.[8]
ఈ సొరంగాన్ని 2017 ఏప్రిల్ 2 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించాడు. ఈ నిర్మాణంలో దాదాపు 1,500 మంది ఇంజనీర్లు, జియాలజిస్టులు, కార్మికులు, నైపుణ్యం కలిగిన కార్మికులు పాల్గొన్నారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ కోసం ₹3,720 కోట్లు ఖర్చు చేసింది.[9]
లక్షణాలు, ప్రయోజనాలు
[మార్చు]డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ సొరంగంలో ఒకదానికొకటి సమాంతరంగా నడిచే రెండు గొట్టాలున్నాయి. 13 మీ. వ్యాసం గల ప్రధాన ట్రాఫిక్ సొరంగం, 6 మీ. వ్యాసం గల ప్రత్యేక భద్రతా సొరంగం లేదా ఎస్కేప్ సొరంగం. ఈ రెండు గొట్టాలు - ఒక్కొక్కటి సుమారు 9 కిమీ పొడవు ఉంటాయి. సొరంగం మొత్తం పొడవునా పాటు ప్రతి 300 మీటర్లకు ఒకచోట, రెండు సొరంగాలను కలుపుతూ క్రాస్ పాసేజ్ నిర్మించారు. మిత్తం 29 క్రాస్ పాసేజ్‌లున్నాయి. ఈ పాసేజ్‌ల మొత్తం పొడవు దాదాపు 1 కి.మీ.ను కలుపుకుని సొరంగం మొత్తం పొడవు సుమారు 19 కి.మీ.ఉంటుంది. అంత పొడవైన సొరంగం ఆక్సిజన్ కొరత సమస్యను కలిగిస్తుంది కాబట్టి, లోపల అధిక కార్బన్-డయాక్సైడ్ ఏర్పడకుండా చూసేందుకు, సొరంగం పొడవునా గాలిని తనిఖీ చేసే అనేక ఎగ్జాస్ట్ మీటర్లు ఉన్నాయి. ఇన్‌లెట్‌లతో, ప్రతి 8 మీటర్లకు, ప్రధాన ట్యూబ్‌లోకి స్వచ్ఛమైన గాలిని తీసుకురావడం, ఎస్కేప్ ట్యూబ్‌లోకి ప్రతి 100 మీటర్లకు ఒక ఎగ్జాస్ట్ అవుట్‌లెట్ ద్వారా చెడుగాలిని బయటికి పంపడం చేస్తుంది. ఈ సొరంగం విలోమ వెంటిలేషన్ సిస్టమ్ కలిగిన దేశంలోనే మొదటిద సొరంగం ఇది, ప్రపంచంలో ఆరవది.
ఊపిరాడకుండా నిరోధించడానికి, దృశ్యమానతను ఆమోదయోగ్యమైన స్థాయిలో ఉంచడానికి - ప్రత్యేకించి సొరంగం చాలా పొడవుగా ఉన్నందున - ట్రాన్స్‌వర్స్ వెంటిలేషన్ సొరంగం లోపల టెయిల్‌పైప్ పొగను కనిష్ఠ స్థాయిలో ఉంచుతుంది. రెండు సొరంగాల మధ్య ఉన్న 29 క్రాస్ పాసేజ్‌లు, ఎస్కేప్ సొరంగం ద్వారా, ఆపదలో ఉన్న వినియోగదారుని ఖాళీ చేయడానికి లేదా ప్రధాన సొరంగంలో విచ్ఛిన్నమైన ఏదైనా వాహనాన్ని లాగడానికి ఉపయోగించబడుతుంది. సొరంగం లోపల ఉన్న మొత్తం 124 కెమెరాలు, లీనియర్ హీట్ డిటెక్షన్ వ్యవస్థలు, సొరంగం వెలుపల ఉన్న ఇంటిగ్రేటెడ్ సొరంగం కంట్రోల్ రూమ్ (ITCR) కు జోక్యం చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తాయి. ట్రాఫిక్ ఉల్లంఘన విషయంలో, కంట్రోల్ రూమ్ సొరంగం వెలుపల మోహరించిన ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇస్తుంది, వారు అక్కడికక్కడే తప్పు చేసిన డ్రైవర్లకు జరిమానా విధిస్తారు.[4][5][10]
ప్రతి 150 మీటర్లకు SOS బాక్స్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. ఆపదలో ఉన్న ప్రయాణికుల కోసం అత్యవసర హాట్‌లైన్‌లుగా పనిచేస్తుంది. సహాయం కోరేందుకు ITCRకి కనెక్ట్ కావడానికి, SOS బాక్స్ తలుపు తెరిచి 'హలో' అని చెబితే చాలు అని ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రయాణికులు సొరంగం లోపల తమ మొబైల్ ఫోన్‌లను ఉపయోగించవచ్చు. సొరంగంలోకి వెళ్లేటప్పుడు లేదా బయటకు వస్తున్నప్పుడు కాంతిలో మార్పు కారణంగా దృష్టి క్షీణతను నిరోధించడానికి, లోపల వెలుతురు ప్రకాశించే బలం యొక్క ప్రవణతతో సర్దుబాటు చేయబడింది. సొరంగాన్ని అగ్నిమాపక భద్రతా చర్యలతో నిర్మించారు. సెన్సార్లు అగ్నిని గుర్తించిన వెంటనే, భద్రతా ప్రోటోకాల్ ప్రారంభమవుతుంది. స్వచ్ఛమైన గాలిని నెట్టడం ఆగిపోతుంది. ఎగ్జాస్ట్‌లు మాత్రమే పని చేస్తాయి. క్రమ వ్యవధిలో అమర్చిన లాంగిట్యూడినల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లు అగ్నికి ఇరువైపులా 300 మీటర్లపై దృష్టి కేంద్రీకరించి, పొగను పైకి లాగివేస్తాయి. అంబులెన్స్‌లు లేదా నురుగును మోసే వాహనాలు ప్రయాణికులను ఖాళీ చేయడానికి మంటలను అదుపు చేసేందుకు ఎస్కేప్ సొరంగం గుండా వెళతాయి.[5]
సొరంగం లోపల వేడిని గుర్తించే వ్యవస్థ సొరంగంలో ఉష్ణోగ్రత పెరుగుదలను నమోదు చేస్తుంది - ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాహనాల వల్ల సంభవించే అధిక ఉద్గారాల ఫలితం. అటువంటి సందర్భాలలో, ITCR సొరంగం లోపల ఉన్న సిబ్బందితో సంప్రదింపులు జరుపుతుంది. తప్పు చేసిన వాహనాన్ని ఒక లే-బైలోకి లాగి, తరువాత సమాంతర ఎస్కేప్ సొరంగం ద్వారా క్రేన్‌తో తొలగిస్తారు.[5]
ఈ సొరంగం కష్టతరమైన హిమాలయ భూభాగంలో దాదాపు 4,000 అడుగుల ఎత్తులో ఉంది. అటువంటి భౌగోళిక పరిస్థితులలో త్రవ్వకాలు జరిగినప్పటికీ, రెండు గొట్టాలు పూర్తిగా నీటిని అడ్డుకునేలా నిర్మించారు.[5]
ఈ రెండు-వరుసల సొరంగం కారణంగా, చెనాని, నాష్రీ మధ్య, తద్వారా జమ్మూ, శ్రీనగర్‌ల మధ్య దూరం 30 కిమీ తగ్గింది. ప్రయాణ సమయం రెండు గంటలు ఆదా అవుతుంది. ఈ సొరంగం వలన హైవే 44 పై, హిమపాతం, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రదేశాలను దాటవేస్తుంది. ఇది "సకల వాతావరణ" సొరంగం. రాష్ట్రంలో వాణిజ్యం, పర్యాటకం అభివృద్ధికి వీలు కల్పిస్తుంది. వాహనాలు చెడిపోయినప్పుడు సొరంగంలో పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి.[9]
ఇవి కూడా చూడండి
[మార్చు]- జవహర్ సొరంగం
- బనిహాల్ ఖాజిగుండ్ రహదారి సొరంగం
- పీర్ పంజాల్ రైల్వే సొరంగం
- జోజి-లా సొరంగం
- Z-మలుపు సొరంగం
- అటల్ సొరంగం
మూలాలు
[మార్చు]- ↑ "Centre unveils Rs 10,000 cr road projects for J&K – The Hindu". Retrieved 3 April 2017.
- ↑ "PM Modi inaugurates Indias longest road tunnel in J&K – The Hindu". Retrieved 3 April 2017.
- ↑ 3.0 3.1 "IL&FS Transportation Networks Ltd – Chenani-Nashri Tunnel Project Page". Retrieved 24 March 2017.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "PM Narendra Modi to inaugurate India's longest tunnel: 10 facts about the 'engineering marvel'". Hindustan Times (in ఇంగ్లీష్). 27 March 2017. Retrieved 27 March 2017.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 "Chenani-Nashri tunnel: Through the heart of the Himalayas, a shorter, safer route to the Valley". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-03-30. Retrieved 2017-04-03.
- ↑ "CENTRE UNVEILS RS 10,000 Cr ROAD PROJECTS FOR JK". Greater Kashmir. Retrieved 2017-04-03.
- ↑ "PM to inaugurate Chenani Nashri tunnel, read the facts". Archived from the original on 20 March 2017. Retrieved 19 March 2017.
- ↑ "9-km Chenani-Nashri tunnel to be thrown open in November". Greater Kashmir. Archived from the original on 2017-04-04. Retrieved 2017-04-03.
- ↑ 9.0 9.1 "New tunnel between Srinagar, Jammu to shorten distance by 2 hours – Times of India". The Times of India. Retrieved 2017-04-03.
- ↑ Upadhyay, Abhishek. "Asia's Longest Bi-directional Tunnel – Chenani-Nashri-Tunnel". Shared Machine. Archived from the original on 2019-01-29. Retrieved 2024-07-12.