తెలుగునాట జానపద కళలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తప్పెటగుళ్ళు
తోలుబొమ్మలాట
హరిదాసు
నెమలినృత్యం
పులివేషం

తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వము ఉన్నది. జానపద కళా సాహిత్యము ద్వారా జాతి సంస్కృతి తెలుస్తుంది. ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలు జానపద కళలు అందిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి సంస్కృతీ వారసత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. జానపద ప్రదర్శన కళలకు తెలుగు భూమి పండిన పంట పొలం వంటిది. ఎన్నో రకాల జానపద ప్రదర్శన కళలు తెలుగు నేలను సుసంపన్నం చేశాయి. శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించినవి జానపద ప్రదర్శన కళలే.

చరిత్ర

[మార్చు]

తెలుగు జానపద ప్రదర్శన కళల చరిత్రలోనికి కొంచెం చూస్తే కొన్ని విషయాలు మనకు అవగతం అవుతాయి. ఎప్పటినుండి ఈ కళారూపాలు ఉన్నాయి అని ప్రశ్నిస్తే సరిగ్గా ఏ శతాబ్దంలో ఇవి ప్రారంభం అయ్యాయో చెప్పడానికి ఆధారాలు లేవు. వీటి మొదలు ఎప్పుడు అన్నది ఎవరూ చెప్పలేరు. కాని జానపద సాహిత్యమే జానపద ప్రదర్శన కళలకన్నా ముందటిదని మాత్రం తార్కికంగా చెప్పడానికి వీలున్నది. సంస్కృతి కొంత పరిణామ దశను చేరుకున్న తర్వాత ఆ క్రమంలోనే జానపద ప్రదర్శన కళలు క్రమంగా జీవం పోసుకొని ఉంటాయి. జానపద ప్రదర్శన కళలు పరివర్థిత నాటకాలలాగే, అన్నీ సమాహార కళలు. పరివర్థిత నాటకానికి ఆధునిక నాటకానికి జానపద నాటకాలే మూలాలు. రెండు వేల సంవత్సరాలనాటిదిగా భావిస్తున్న భరతుని నాట్య శాస్త్రంలో ఆనాటికి లభిస్తున్న దేశి నాటక రూపక ప్రక్రియల గురించిన వివరాలు ఉన్నాయి. వాటిని జానపద ప్రదర్శన కళలు అనే అర్థం చేసుకోవాలి. సంస్కృత ప్రక్రియలలో చేరిన వీధి అనే తరహా రూపక ప్రక్రియ జానపద ప్రక్రియకు మారు రూపమే. కాని భాష మారుతుంది. సంస్కృత సాహిత్యంలోని చాలా ఆధారాలను పరిశీలిస్తే భారత దేశంలో జానపద ప్రదర్శన కళలు దాదాపు ఈ కాలంనుండే ఉన్నాయని చెప్పడానికి వీలుంది. కాని అంత ప్రాచీన కాలంనుండి అంటే రెండు వేల సంవత్సరాల కాలంనుండి తెలుగు జానపద కళారూపాలు ఉన్నాయని చెప్పడానికి నిక్కచ్చి ఆధారాలు లేవు. అసలు తెలుగు భాష అప్పుడు ఉందో లేదో కుడా చెప్పడానికి అవసరమైన చారిత్రక ఆధారాలు ఏవీ మనకు లభించవు. శాతవాహనులు తెలుగు రాజులు అని చెబుతున్నారు. వారికాలం నాటిదైన గాథా సప్తశతిలో కళారూపాలకు సంగీత వాద్యాలకు చెందిన పరోక్ష ఆధారాలను కొంతమంది విద్వాంసులు చూపారు. కాని గాథాసప్తశతి తెలుగులో లేదు. ప్రాకృతంలో ఉంది. ఆధారాలు ఉన్నా కూడా అవి ఏ భాషలో ఉన్న కళారూపాలను తెలుపుతున్నాయో చెప్పడం, రుజువు చేయడం కష్టం. కేవలం 11, 12 శతాబ్దాల కాలం నుండే మనకు నమ్మదగ్గ చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. 11 వ శతాబ్ది కాలంనాటికే ఎన్నో జానపద కళారూపాలు ఉన్నట్టు తిరుగలేని ఆధారాలతో చెప్పవచ్చు. కాని అంతకు ముందు లేవు అని అనడానికి వీలులేదు. ఆధారాలు లేనంత మాత్రాన ఐదారు, శతాబ్దాలు ఏడు ఎనిమిది శతాబ్దాలలో జానపద కళారూపాలు తెలుగులో లేవు అని అనడానికి వీలులేదు. ఆరవ శతాబ్ది కాలంనాటికే తెలుగు భాష బాగా అభివృద్ధి చెందినదని చెప్పడానికి చారిత్రకులు, ఎపిగ్రపిస్టులు చాలా శాసన ఆధారాలు చూపుతున్నారు. అంత అభివృద్ధి చెందిన భాష ఉన్నప్పుడు ఆనాటికే జానపద ప్రదర్శన కళలు ఉండి ఉండాలి. కాని వాటిని వివరంగా చెప్పే వివరమైన ఆధారాలు ఆ శాసనాలలో లభించలేదు. క్రీస్తుశకం 1200 ప్రాంతం వాడైన పాల్కురికి సోమనాథుడు దేశిసాహిత్య పితామహుడుగా ఉండి పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం అనే శైవసాహిత్య గ్రంథాలను దేశి సాహిత్యంలో రచించాడు. ద్విపద ఛందస్సు జానపద సాహిత్యనికి అత్యంత దగ్గరి రూపం. ఝటితిగా రచితమయ్యే చాలా జానపద గేయాలలో ఈ ఛందస్సు రూపాలు ఉంటాయి. అందుకే ప్రచారం అవసరం అనుకున్న విషయాలను ప్రజలకు విరివిగా అందించాలనుకున్న కథలను ఆనాటి కవులు జానపద సాహిత్యానికి చాలా దగ్గరిగా ఉన్న ద్విపద ఛందస్సును స్వీకరించి రచించారు. పాల్కురికి, శ్రీనాథుడు (పల్నాటి వీరచరిత్ర), రంగనాథ రామాయణ కర్త ఇందుకు మంచి ఉదాహరణలు. జానపద జీవితాన్ని విస్తారంగా వర్ణించిన సోమన జానపదులైన శివభక్తుల జీవితాలను కథలను విపులంగా వర్ణించిన సోమన వాటిలో భాగంగానే జానపద కళలను వివరంగా వర్ణించాడు. తన కాలం నాటికి తెలిసిన చాలా జానపద కళలను గురించి ఆచూకీ చెప్పడం మనకు ఇందులో బాగా కనిపిస్తూ ఉంది. పాల్కురికి రచనలలో ఉన్న జానపద కళల గురించి ఇప్పటికే చాలా మంది పండితులు చెప్పిఉన్నారు. వాటిని తిరిగి వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. కాని ఏ ఏ కళారూపాల ప్రసక్తి ఉందో చెప్పడం అవసరం. చాలామంది నాటకాలు ఆడుతున్నారని చెప్పాడు అవి జానపద నాటకాలే. రోకళ్ళ పాటలను గురించి చెప్పి వాటిని పాడే ఘట్టాల్ని చెప్పాడు. పిచ్చుకుంటి కళాకారులు శ్రీశైలం వెళ్తున్నట్లుగా వర్ణించాడు. పిచ్చుకుంటి కళాకారులు ఈనాటికీ జీవించి ఉన్నారు. వీరి కళారూపమైన పిచ్చుకుంటికథ ఇప్పటికీ బాగా తిరుగుతూ ఉంది. దీనిలో పల్నాటి వీర చరిత్ర ప్రసిద్ధం. మెరవణి ఉందని, బహురూపులు ఉన్నారని చెప్పాడు. బహురూపులు అంటే వివిధ వేషాలు వేసుకునే కళాకారులు అని పగటి వేషగాళ్ళు అని అర్థం. ఇప్పటికీ రాయలసీమలో కనిపించే మెరవణిని గురించి పాల్కురికి ఆనాడే ప్రస్తావించాడు. 'భారతాది కథల జీరమఱుగుల నారంగ బొమ్మల నాడించువారు గడునద్భుతంబుగ గంబసూత్రంబు లడరంగ బొమ్మల నాడించు వారు' అని స్పష్టంగా చెప్పి దీని ద్వారా ఆనాటికి తోలుబొమ్మలాట, చెక్క బొమ్మలాట ఉన్నాయని స్పష్టమైన చారిత్రక ఆధారాన్ని ఇచ్చాడు సోమనాథుడు. ‘నమరంగా గడలపై నాడెడు వారు’ అని చెప్పి దొమ్మరాటను గురించి చెప్పాడు. యక్షగానాన్ని చెప్పాడు. చిందువారి ప్రసక్తి ఉంది కాబట్టి అది చిందు యక్షగానం కావచ్చు. వెడయాట, కోడంగియాట, వెడ్డంగము అనే వాటిని గురించి చెప్పాడు. ఈనాడు ఈ కళారూపాలు కనిపించవు. కాలగతిలో అంతరించిపోయాయి. ఇంకా పక్షుల ఆటలు, జంతువులతో ఆడించే ఆటలు, బహురూపులు అంటే పగటివేషగాళ్ళ ఆటలు, పేరణి, కోలాటం, గొండ్లి నృత్యం మొదలైన కళారూపాలను గూడా ప్రస్తావించాడు పాల్కురికి సోమన. ఇంకా నటులకు సంబంధించిన వివరాలు చాలా ఇచ్చాడు. ఈ విధంగా ఆనాటి జానపదకళల విజ్ఞాన సర్వస్వంగా కనిపిస్తాయి పాల్కురికి పండితారాధ్య చరిత్ర, బసవపురాణ గ్రంథాలు. పాల్కురికి రాసిన ఆనాటి భక్తుల కథలు కూడా ఈనాడు జానపద సాహిత్య ప్రక్రియలోని పురాకథా ప్రక్రియ అవుతాయి. ఆనాటి చాలా జానపద కళలు ఈ నాడు జీవించిలేవు. ఇటీవలి 100 సంవత్సరాల లోపున కూడా ఉన్న వాలకం అనే కళా రూపం ఇప్పుడు అంతరించింది

కళల్లో రకాలు

[మార్చు]

జానపద ప్రదర్శన కళలు రెండు రకాలుగా మనకు కనిపిస్తాయి. సర్వ జానపదకళలు, వృత్తి జానపద కళలు అని వీటిని రెండు రకాలుగా విభజించడానికి వీలుంది. తెలుగు జానపద కళలలో ఎక్కువగా ఒక కులం వారు వారికి జీవనోపాధినిచ్చే వృత్తిగా స్వీకరించిన కళాకారులు ప్రదర్శించే కళలే ఎక్కువగా మనకు కనిపిస్తాయి. భారత దేశంలోని చాలా రాష్ట్రాలలో చాలా భాషా ప్రాంతాలలో ఉండే జానపద కళలలో ఎక్కువగా ఉన్నవి వృత్తి జానపదకళలే. తెలుగు జానపదకళలలో ఎక్కువగా ఉన్నవి వృత్తి జానపద కళారూపాలు. ఒగ్గుకథ, పంబకథ, ఆసాదికథ, బైండ్లకథ, కొమ్ములకథ, పాండవకథ, రుంజకథ వంటి కళారూపాలు అన్నీ కూడా ఒక కులం వారికి వృత్తిగా ఉన్న కళారూపాలే. ఇలా కాక వృత్తిగా కాకుండా ఊరి వారిచే వినోదాన్ని అందించే కళారూపాలుగా ఉన్నవి కొన్ని ఉన్నాయి. ఉదాహరణలు కొన్ని ఇక్కడ చూడవచ్చు. కోలాటం, చెక్కభజన, పండరిభజన, సెల్ భజన కొన్ని జానపద నాటక ప్రక్రియలు వృత్తి కళా రూపాలు కావు. ఒక గ్రామం లోని ఏ కులం వారైనా అందరూ కలిసి అనుకొని అన్నింటినీ తయారు చేసుకొని వారి వినోదార్థం వారు ఈ కళా రూపాలను ప్రదర్శించుకుంటారు. ఇందులో ప్రదర్శించే వారు కూడా వారి వినోదార్థమే ప్రదర్శిస్తున్నారు కాని వారికి ఈ ప్రదర్శన ద్వారా ఆదాయం కాని మరేదైనా కాని రావలసిన అవసరం లేదు. ప్రదర్శించడం వారికి వినోదం అలాగే చూడడం చూచే వారికి వినోదం. వీటిని సర్వజానపద కళలు అని పిలవవచ్చు. పై చెప్పినవి వృత్తి జానపద కళలు. అందువల్ల ఇక్కడ సర్వ జానపద కళలు, వృత్తి జానపద కళలు అనే రెండు రకాల వర్గీకరణలు వచ్చాయి.

తెలుగు జానపద కళలను మరొక రకంగా విభజించే వీలుంది. ఎవరు ఎవరికి ప్రదర్శిస్తున్నారు అనే విషయాన్ని ఆధారం చేసుకొని ఈ విభజన చేయవచ్చు. వీటినే అనియతాశ్రయ కళారూపాల్ని ఆశ్రిత కళారూపాలు అని రెండు రకాలుగా విడదీయవచ్చు. అనియతాశ్రయ కళారూపాలు అంటే కళాకారులు వారి కళను ఎవరికొసమైనా ప్రదర్శిస్తారని అర్థం. ఉదాహరణకి ఒక పాముల వాడు ఒక గ్రామంలో ప్రవేశిస్తే తన కళను ఆగ్రామంలో ఉన్న అందరికీ ప్రదర్శిస్తాడు. కొన్ని కులాల వారికి ప్రదర్శించవచ్చు కొన్ని కులాల వారికి ప్రదర్శించ కూడదు అనే నిబంధన కాని అడ్డు కాని అతనికి లేదు. అదేవిధంగా ఒక హరిదాసు ఒక గ్రామానికి వెళితే అతను కూడా అన్ని ఇండ్లకు వెళ్లి తన కథని కాని, పాటను కాని ప్రదర్శించి తనకు రావలసిన దాన్ని తను తీసుకుంటాడు. బహురూపుల వారు అంటే పగటివేషగాళ్ళు కూడా ఊరి వారందరికీ తమ కళను ప్రదర్శిస్తారు. తోలు బొమ్మలాట చెక్క బొమ్మలాట వంటి ప్రదర్శన కళలు కూడా అందరికోసం ప్రదర్శించబడతాయి. ఇంకా ఇలాంటి వాటిని మరికొన్నికళారూపాలనూ చెప్పవచ్చు. ఈ కళలను ఆయా కళాకారులు ఊరి వారి అందరి కోసం ప్రదర్శిస్తారు అందువల్ల వీటిని అనియతాశ్రయ జానపపద కళలు అని అనవచ్చు. ఇలా కాకుండా కేవలం ఒక కులంవారికే ప్రదర్శించే జానపద కళారూపాలు కొన్ని ఉన్నాయి. వీటినే ఆశ్రిత జానపద కళలు అనిచెప్పవచ్చు. ఇక్కడ కొన్ని ఉదాహరణలను పరిశీలించవచ్చు. ఒక రుంజకథా గాయకుడు ఉంటే అతను ఒక గ్రామానికి వస్తే అతని కళను ఆ గ్రామం మొత్తానికి ప్రదర్శించే వీలు లేదు. కేవలం అతనికి ప్రత్యేకించి ఉన్న అతని దాతలైన విశ్వకర్మ లేదా విశ్వబ్రాహ్మణ కులం వారైన అయిదు వృత్తుల వారికి మాత్రమే అతని రుంజ కథను ప్రదర్శిస్తాడు. అంతే కాదు అతని కళారూపంలో ప్రధానంగా ప్రదర్శించే కథ విశ్వకర్మ పురాణం ఇంకా ఆ కులానికి చెందిన ఇతర కథలు మాత్రమే. ఆ కథలతో మిగతా కులాల వారికి అవసరం ఉండదు. అందువల్ల అతని కళా ప్రదర్శన అతని దాతృకులమైన విశ్వబ్రాహ్మణులకు మాత్రమే ఉంటుంది. పిచ్చుకుంటి వారి కళా ప్రదర్శన వారి దాతలైన రెడ్లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే అతను కథ చెప్పేది రెడ్డి కులం వారికి మాత్రమే. కాని అతను కథ చెబుతుండగా మిగతా కులం వారు అక్కడ కూర్చో కూడదని వినకూడదని కాదు. కూర్చో వచ్చు. కాని అతని దాతలు మాత్రం రెడ్డి కులం వారే అతనికి వారే మిరాసులు ఇస్తారు. అందువల్ల అతని ఉద్దేశంలో అతను కథ చెప్పేది రెడ్లకు మాత్రమే. కూనపులి వారు సాలె వారికి కథ చెప్తారు. జెట్టివారు గౌండ్లవారికి చెప్తారు. చిందువారు వారి గోసంగి వేషాన్ని మాదిగవారికి మాత్రమే ప్రదర్శిస్తారు. ఇలా కనీసం 60 కులాలవారికి వారి ఆశ్రితులు మాత్రమే వారికి కథను చెప్తున్నారు. ఇలాంటి వారిని ఆశ్రిత గాయకులు అని ఆశ్రిత కళాకారులు అని పిలవవచ్చు. వీరు ప్రదర్శిచే జానపద కళలను ఆశ్రిత కళారూపాలు అని అనవచ్చు. అలాగే వీరు సృష్టించే కథా సాహిత్యాన్ని ఆశ్రిత జానపద సాహిత్యం అని లేదా ఆశ్రిత సాహిత్యం అని కాని అనవచ్చు. అందుకే తెలుగు జానపద కళలను అనియతాశ్రయ ప్రక్రియలు, ఆశ్రితజానపద ప్రక్రియలు అని రెండు రకాలుగా విభజించవచ్చు. తెలుగు జానపద కళలను అన్నింటిని గురించి చెప్పడం ఈ వ్యాసంలో సాధ్యం కాదు. తెలుగు జానపద కళలలో ఉన్న వైవిధ్యాన్ని అంతటినీ కూడా ఇక్కడ వివరించడం కుదరదు. కాని తెలుగు జానపద కళలు ఎంత సుసంపన్నంగా ఉన్నాయో చెప్పడానికి వాటిలో ఉన్న భిన్న భిన్నమైన ప్రదర్శన రీతులను ఇక్కడ వివరిస్తే తెలుగు జానపద కళలకున్న సమగ్ర స్వరూపం బోధపడుతుంది. ఒకే కళాకారుడు ఉండి ఒక సంగీత వాద్యం సహాయంతో కాని లేకుండా కాని కథ చెబుతూ ప్రదర్శించే కళారూపాలు తెలుగువారికి ఉన్నాయి. రుంజకథ, పిట్టలదొర ప్రదర్శన, సంక్రాంతి హరిదాసు, వాలకం వంటివి ఇలాంటి ప్రదర్శనలు. రుంజకథలో కథ ఉంటుంది. పాట ఉంటుంది. ఒకే కళాకారుడు అన్ని పాత్రలు తానై నటించి అభినయిస్తూ కథను ప్రేక్షకులకు ప్రదర్శిస్తాడు. పిట్టల దొర ప్రదర్శనలో కథ ఉండదు. కానీ కళాకారుడు ఒక్కడే అన్నీ తానై ప్రదర్శిస్తాడు. వాలకంలో కథ ఉండదు. కాని రకరకాల పాత్రలను ఒక్కడే చూపించి విషయాన్ని ప్రదర్శించడం ఉంటుంది. ఇలాంటి ఏకవ్యక్తి ప్రదర్శనలు కళారూపాలు, జానపద ప్రదర్శనకళా సంప్రదాయాలలో ఆదిమమైనవి అని చెప్పడానికి వీలుంది. ఇలా ఒక కళాకారుల ప్రదర్శనలే తొలుత ఉండి తర్వాత బహుకళాకారులు ప్రదర్శనలు వచ్చి ఉంటాయని వీటి తీరును చూచి పరిణామ క్రమాన్ని చెప్పడానికి వీలుంది. తెలుగు వారి జానపద ప్రదర్శన కళల సంప్రదాయాలలో ఇలా ఏకవ్యక్తి ప్రదర్శనకళలు ఉండడం చాలా ప్రాచీనతను తెలియజేస్తున్నాయి. దీని తర్వాత ఇద్దరు కళాకారులు ఉండి ప్రదర్శించే కళారూపాలు మనకు ఉన్నాయి. చిందు మాదిగ వారి గోసంగి వేషం కళారూపం ఇటువంటిదే గోసంగి అంటే జాంబవుడు బ్రాహ్మణ పాత్రలు సంవాద రూపంలో కథను చెప్పడం విషయాలను పురాణాంశాలను చర్చించడం ఈ కళారూపంలో కనిపిస్తుంది. దీనితర్వాత ముగ్గురు కళాకారులు ప్రధానంగా ఉండి ఒకడు ప్రధాన కథకుడుగా ఉంటూ ఇద్దరు కళాకారులు వంతలుగా ఉండి కథను అభినయ పూర్వకంగా చేసి ప్రదర్శించే కళారూపాలు మంచి పరివర్ధిత కాలానికి వచ్చిన పరివర్థిత కళారూపాలు. పరిపూర్ణమైన నాటకానికి ఇవి తొలి రూపాలుగా చెప్పడానికి వీలుంది. ఇలాంటి కళారూపాలు తెలుగులో కొల్లలుగా ఉన్నాయి. తెలుగులో ఉన్నన్ని ఇలాంటి కళారూపాలు భారత దేశంలోని ఇతర భాషా ప్రాంతాలలోఉన్నాయే లేదో చెప్పడం కష్టం. ముగ్గురు కళాకారులు ఉండడంలో కథను ప్రదర్శించడంలో చాలా సౌకర్యం ఉంటుంది. సంభాషణలలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను వహించి మాట్లాడతారు. పాటలో కథను చెప్పే సందర్భంలోనూ ఇలా వివిధ పాత్రలను ఆ కళాకారులు వహించి చెప్పడం ఇక్కడ జరుగుతుంది. ప్రేక్షకులకు ఇక్కడ కథ బాగా దృశ్యమానం అవుతుంది. ఏక వ్యక్తి ప్రదర్శనలతో ఆదిమంగా ప్రారంభమైన జానపద ప్రదర్శన కళాసంప్రదాయం ఇక్కడి ప్రదర్శన సంప్రదాయంలో బాగా విస్తృతి పరిణతి చెందినదని చెప్పడానికి వీలుంది. సంపూర్ణమైన నాటకం దిశలో ఇక్కడ కొంత పరిణతమైన రూపం ఏర్పడిందని చెప్పడానికి బాగా ఆస్కారం ఉంది. తెలుగువారి జానపద కళా సంప్రదాయాలలో ఇలాంటి ముగ్గురు వ్యక్తులు ప్రధానంగా ఉండే కళారూపాలు మంచి పరిణతి చెందినవి చాలా కనిపిస్తాయి. వీటికి తొలిగా చెప్పవలసిన కళారూపం శారదకథ. దీన్నే జంగం కథ అని కూడా అంటారు. ఈనాడు ఉన్న బుర్రకథా కళారూపానికి ఇది ఆదిమ రూపం ఆధార రూపం. దీనిలో ఒక ప్రధానకథకుడు ఇద్దరు వంతలు ఉంటారు. కథాగానాన్ని ప్రధానంగా కథకుడే చేసినా కథావిస్తృతి మాత్రం ముగ్గురి ద్వారా జరుగుతుంది. ముగ్గురి మధ్యన జరిగే సంభాషణల రూపంలో కథావ్యాప్తి ఉంటుంది. ఇలాంటి కళారూపాలకు ఉదాహరణలుగా, ఆసాదికథ, పిచ్చుకుంటికథ, పాండవులకథ, గొల్లసుద్దులు, ఒగ్గుకథ, వంటి అనేక కళారూపాలను చెప్పవచ్చు. జానపద ప్రదర్శన కళాసంప్రదాయాలలో మరొక విశిష్ట శైలి తెలుగు వారికి ఉంది. ఇలాంటి ప్రదర్శన సంప్రదాయాలు మరే భాషాప్రాంతాలలో ఉన్నాయో ఇంకా వెదక వలసి ఉంది. ఒక చిత్రిత పటాన్ని ప్రదర్శిస్తూ పైన చెప్పిన ముగ్గురు కళాకారులు కలిసి కథాగాన ప్రదర్శన చేయడం ఇక్కడి ప్రత్యేకత. కళాకారులు చెప్పే కథను ఒక గుడ్డమీద చిత్రిస్తారు. ఈ గుడ్డ నాలుగు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. 40 నుండి 50 అడుగుల పొడవులో చుట్ట చుట్టి ఉంటుంది. ఈ చుట్టను సమాంతరంగా ఉన్న రెండు గుంజల పైన అమర్చి పటాన్ని విప్పుతూ ప్రధాన కథకుడు చిత్రించిన బొమ్మలను కర్రతో చూపిస్తూ కథను పాడడం వివరించడం ఇక్కడ ఉన్న ప్రత్యేకత. వేలాడ దీసిన పటానికి ముందు వీరు నిలబడి కథను సంగీత వాద్యాల సహాయంతో ప్రదర్శిస్తారు. కథకుడు వంతలు సంగీత వాద్యాలు పైన చెప్పిన శారదకథ వంటి కళారూపాలలో ఉన్నట్టు ఉన్నా పట ప్రదర్శన ఇక్కడి కళాప్రదర్శనలో ప్రత్యేకత. ఇలాంటి కళారూపాలు తెలుగు వారికి చాలా ఉన్నాయి. చాకలి పటం కథ, గౌడజెట్టి పటం కథ, డక్కలి పటం కథ, కూనపులి పటం కథ ఇందుకు మంచి ఉదాహరణలు గొల్లలకు కథలు చెప్పే తెరచీరలవారు అనే కళాకారులు కూడా చిత్రిత పటాన్ని ఆధారంగా చేసుకొనే కథలు చెబుతారు. కాని వీరి పటం శైలి మరికొంత భిన్నంగా ఉంటుంది. మందెచ్చు వాళ్ళు అనే గొల్లలకు ఆశ్రితులైన వారిలో కూడా మరింత భిన్నమైన కళారూపం ఉంది. వారు కథలోని పాత్రలను కొన్ని బొమ్మలుగాచేసి వాటిని ముందు పెట్టి ప్రదర్శిస్తూ కథను చెబుతారు. కళాప్రదర్శన పరిణామ క్రమంలో తోలు బొమ్మలాటకు ఈ పటం కథలను తొలి రూపాలుగా చెప్పడానికి వీలుంది.

తోలుబొమ్మలాటను ప్రక్రియా పరంగా మరింత పరిణామం పొందినదిగా చెప్పడానికివీలుంది. ఇలా పట ప్రదర్శన కళలు తెలుగు జానపద ప్రదర్శన కళా సంప్రదాయంలో మంచి సంప్రదాయంగా చెప్పడానికి వీలుంది. తర్వాత ప్రదర్శన కళా క్రమంలో వీధినాటక ప్రక్రియను నాటక తర్వాత స్థానం పొందిన దానిగా చెప్పడానికి వీలుంది. ఇందులో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పాత్రను గ్రహించి కథను నడిపే వీలుంది. అంతే కాక పూర్తి స్థాయి అభినయానికి కూడా ఇక్కడ స్థానం ఉంటుంది. ఆహార్యం ఇతర ప్రదర్శన వస్తువులు ఇతరత్రా రంగ సౌకర్యాలను రంగోద్దీపనలు ఏమీ లేకుండానే అన్నీ ఉన్నట్లుగా భావింపజేస్తూ ప్రదర్శించడానికి వీలున్న నాటక రూపంగా వీధినాటకాన్ని చెప్పడానికి వీలుంది. తెలుగులో భిన్నమైన వీధినాటక రూపాలు వేరు వేరు ప్రాంతాలలో ఉన్నాయి. తెలంగాణా సర్కారు ప్రాంతాలలో ఉన్న వీధినాటకాలు, రాయలసీమ అనంతపురం ప్రాంతాలలో ఉన్న బయలాటలు, కుప్పం వీధినాటక ప్రక్రియ ఇలాంటివి. వీటికి ప్రత్యేకంగా రంగస్థలం అక్కర లేదు. వాలకం కూడా వీధినాటక ప్రక్రియ అయినా ఒకే కళాకారుడు ఉండడం అక్కడి ప్రత్యేకత. ఇక ఈ తరహా వీధినాటక రీతి ప్రదర్శన కళా సంప్రదాయాల తర్వాత మరింత పరివర్ధితంగా పూర్తినాటకానికి పూర్తిగా చేరువ అయిన కళారూపాలు యక్షగాన ప్రదర్శన కళలు తెలుగులో భిన్నమైన యక్షగాన కళారూపాలు ఉన్నాయి. అన్ని పాత్రలకు పాత్రధారులు ఉండి పూర్తి ఆహార్యం ఉండి రంగస్థలాన్ని కూడా పరిణతంగా ఏర్పాటు చేసుకొని ప్రదర్శించే కళారూపం యక్షగానం. కొన్ని యక్షగాన ప్రదర్శలనకు ప్రత్యేకించి రంగస్థలం అవసరం లేకుండానే వీధిలో కూడా ప్రదర్శించవచ్చు. కాని ఇక్కడ పాత్రలు పాత్రధారణలు పూర్తిగా ఉండడాన్ని గమనించాలి. ఈ తరహా యక్షగానాలలో చిందు యక్షగానాన్ని తొలిగా ఉదాహరించవలసి ఉంటుంది. చిందు యక్షగానాన్ని తెలుగులో ఉన్న అన్ని యక్షగానాలలోనికి ప్రాచీనమైనదిగా చెప్పడానికి వివిధ చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. చిందు యక్షగానం ఈ నాటికి కూడా వన్నెతరగకుండా ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. తెలంగాణా యక్షగాన ప్రక్రియ కూడా చిందు యక్షగానానికి చాలా దగ్గరగా ఉంటుంది. కర్ణాటకలో ఈనాడు బహుళ ప్రచారంలో ఉన్న యక్షగాన శైలి చిందు యక్షగాన శైలికి చాలా దగ్గరగా ఉండి చిందు యక్షగానంనుండి అభివృద్ధి చెందినది అని చెప్పడానికి వీలుగా కనిపిస్తుంది. చిందు యక్షగానం తెలంగాణాలో బహుళ ప్రచారంలో ఈనాటికీ ఉంది. ఇక కూచిపూడి యక్షగానం ఈ కాలంలో బాగా పరివర్ధితమై ఆధునికమై శాస్త్రీయ ప్రదర్శన సంప్రదాయం అనే పేరు తెచ్చుకున్నా ఇది ప్రాచీన కాలంనుండి ఉన్న యక్షగాన సంప్రదాయానికే చెందుతుంది. తూర్పు భాగవతం, కుప్పం నాటకం కూడా భిన్నమైన యక్షగాన సంప్రదాయాలు. చిరుతల యక్షగానం అనే ప్రక్రియ చాలా భిన్న శైలిలో ఉంటుంది. యక్షగానంలో పాత్రలు వేసే కళాకారులు అందరూ కూడా చిరుతలు ధరించి వాయిస్తూ పాట పాడుతూ కథను వెలారుస్తూ ఉంటారు. వీరు చుట్టు తిరుగుతూ ఉండగా సంభాషణలు ఉన్న పాత్రలు మాత్రమే మధ్యకు వచ్చి పాడుతూ కథను చెబుతూ ఉంటారు. పాత్రలన్నింటికీ ఆహార్యం ఉంటుంది. ఇది తెలుగువారికే సొంతమైన ప్రత్యేకమైన జానపద ప్రదర్శన కళా సంప్రదాయం. ప్రాచీన కాలంనుండి జానపద ప్రదర్శన కళలో మనిషి సాధించిన సాంకేతికతకు ఉదాహరణప్రాయంగా కనిపిస్తూ అతను ఈ కళా సంప్రదాయాలలో సాధించిన విజ్ఞానానికి ప్రతీకగా కనిపించే కళారూపాలు తోలుబొమ్మలాటలు. దీన్ని ప్రాచీన కాలపు సినిమాగా చెప్పవచ్చు.

ఒక కథను మానవ పాత్రలతో ప్రదర్శించడం మొదటి ఆలోచన అయితే కథను మానవ పాత్రలతోనే కాకుండా మానవులు చేసిన బొమ్మలతో కథను ప్రదర్శించడం అనే ఆలోచన మానవుడి అభివృద్ధిచెందిన సాంకేతికతకు కళా తృష్ణకు సంకేతంగా చెప్పదగిన పరిణామం. ఇలాంటి కళారూపాలు తోలుబొమ్మలాట చెక్కబొమ్మలాట కళారూపాలు. జానపద కళా ప్రదర్శనలో మనిషి సాధించిన ప్రగతికి ఇవి మచ్చులు. తెలుగు వారికి ఈ రెండు కళాప్రదర్శన సంప్రదాయలు ఉన్నాయి. తెలుగునాట తోలు బొమ్మలాటలు చెక్కబొమ్మలాటలు కనీసం 12 వ శతాబ్దినుండి ఉన్నాయని చెప్పడానికి చారిత్రక ఆధారాలు లభించాయి. తోలు బొమ్మలాట సంగీత రీత్యా సాహిత్య రీత్యా ప్రాథమికంగా యక్షగానం. పాత్రలు మనుషులకు బదులుగా బొమ్మలు ఉంటాయి. తేడా అదే. తోలుబొమ్మలాటలు ప్రదర్శించే వారు తొలినాళ్ళలో తెలుగు వారే ఉండేవారేమో చెప్పలేము కాని కాలంలో కనిపించే తోలుబొమ్మల కళాకారులు అందరూ మరాఠీ భాషను మాట్లాడే ఆరె మరాఠీలు అనే తెగకు చెందిన మరాఠా ప్రాంతానికి చెందిన వారు. మనకు నాటక ప్రక్రియ కూడా మహారాష్ట్రనుండి కొంత వలస వచ్చిన సంగతి ఉంది. జానపద కళలు ప్రయాణం చేయడం సహజంగా జరిగిన వైనం. వీరు మాతృభాష మరాఠీ అయినా కూడా వీరి ప్రదర్శనలో వీరు మాట్లాడే తెలుగులో ఏమాత్రం మరాఠీ యాస కనిపించదు. తెలుగు మాతృభాషగా ఉన్న వారి తెలుగు ఎలా ఉంటుందో అలాగే వీరి తెలుగు ఉంటుంది. కొన్ని శతాబ్దాలుగా వీరు ఇక్కడ ఉండడం వల్ల ఇది సాధ్యం అయింది. రామాయణ భారత కథలను వీరు ప్రదర్శిస్తున్నారు. ఇక చెక్కబొమ్మలాట విషయానికి వస్తే దీని కళాకారులు అందరూ తెలుగువారు. తెలుగునాట దళిత కులాల ఉపకులాలలో ఒకరైన వారు. వీరిని బుడిగజంగాలు అనిఅంటారు. కాని బుడిగ జంగాలు అందరికీ వృత్తి లేదు. అందుకే వీరిని బొమ్మలోళ్ళు అని ప్రత్యేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. చెక్క బొమ్మలాట కూడా 12 వ శతాబ్ది నాటికే ఉందని చెప్పడానికి ఆధారాలు లభించాయి. వీరికి అవసరమైన చెక్క బొమ్మలు తయారు చేసిన విశ్వకర్మ కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. వీరిని బొమ్మలాటవారు అని పిలవడం కూడా ఇప్పటికీ ఉంది. చెక్కబొమ్మలాట కూడా ప్రాథమికంగా యక్షగాన ప్రక్రియ. ప్రదర్శన కళలలో మానవేతర పాత్రధారులతో ఉన్న కళారూపాలు తెలుగు సంప్రదాయంలో ఎలా ఉన్నాయో చూశాము. ఇక్కడ ప్రస్తావించే కళారూపాలు కొన్నింటి గురించిన వివరమైన ఆరోపాలు ఈ గ్రంథంలోనే ఉన్నాయి. ఇవి కాక ఇక్కడ ప్రస్తావించవలసిన వైవిధ్యం ఉన్న కళారూపాలు సంగీత ప్రధానమైన కళారూపాలు కొన్ని ఉన్నాయి. ఉత్తరాంధ్రప్రాంతంలోప్రవర్తితమయ్యే తప్పెటగుళ్ళు కళారూపం సంగీత ప్రధానమైంది. ప్రదర్శనకు తావు ఉన్నా ఇందులో వాద్యానికి సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కోలాటం, వివిధ రకాలైన భజన సంప్రదాయాలు ప్రదర్శనతోపాటు సంగీతానికి ప్రాధాన్యం ఉన్న కళారూపాలు. ఇంకా వివిధ నృత్య సంప్రదాయాలు గిరిజన నృత్య సంప్రదాయాలు మనకు ఉన్నాయి. తెలుగునాట ఈ విధంగా జానపద ప్రదర్శన కళలలో అత్యంత వైవిధ్య భరితమైన ప్రదర్శన సంప్రదాయాలు ఉండడం చాలా ప్రాచీనమైనవిగా ఉండడం వివిధ కళాపరిణామ క్రమాలను తెలిపే కళారూపాలు ఉండడాన్ని గమనించవచ్చు.

వర్గీకరణ

[మార్చు]
సంగీతం
నాట్యము (నృత్యం)
హస్తకళలు
శిల్ప కళలు

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సిద్ధి నృత్యం. "తెలంగాణ జానపద నృత్యాలు". www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 5 September 2017.