తెరచీరల వారు
యాదవుల్లో ఉన్న పన్నెండు ఉపకులాల్లో గొల్లవారి ఆశ్రిత కులమైన తెరచీరలవారిని 'తెల్జూరివారు', 'బైకానివారు' అనికూడా పిలుస్తారు. వీరు గొల్లల కర్మకాండలు, దేవర పండుగలు చేస్తారు. యాదవులలో ఎవరైనా చనిపోతే వారి ఆత్మశాంతికోసం కర్మకాండలలో సంగీత వాయిద్యాలతో పాల్గొని మరణించినవారి పేరున కథలు చెప్పి పారితోషికం పొందుతారు. యాదవులు తమ కులవృత్తి అయిన గొర్రెల మందలు, వ్యవసాయం, పశుపోషణ అన్ని విధాల సంపదలు అభివృద్ధి చెందాలని ప్రతి రెండు ఏండ్లకు ఒకసారి తమ కులదైవములైన గంగమ్మ, కోటిలింగాల, లింగమంతుల, సౌనమ్మ వంటివారికి జరుపుకునే పండుగలకు తెరచీరల వారు పూజారులుగా వ్యవహరిస్తారు.[1]
దేవర పెట్టె
[మార్చు]బైకానివారు మొదటగా తమ బైకానిపెట్టె (దేవర పెట్టె)ను పండుగ చేసే దేవాలయాలున్న ప్రదేశంలోని గుడారం లోకి తీసుకువస్తారు. దేవర పెట్టెలో వీరు చెప్పే కథలకు సంబంధించిన దేవతా విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాలను కథలు చెప్పడానికి ముందు పట్నం వేసిన తరువాత అందులో విగ్రహ ప్రతిష్ట చేసి పూజలు నిర్వహించి ఈ దేవతా విగ్రహాలను చూపెడుతూ కథలు చెబుతారు. వీరి బృందంలో ఆరుగురు సభ్యులుంటారు. సుమారు 30 కథలు చెప్పగలరు. ఒక్కొక్క కథను వీరు రెండు లేదా మూడు రోజుల్లో పూర్తి చేయగలరు. వీరు చెప్పే కథలలో కుల దండకాలు, హరిశ్చంద్ర కథ, నల్లమూకరాజు కథ వంటివి ముఖ్యమైనవి.[2]
తాళపత్ర గ్రంథాలు
[మార్చు]తెరచీరల వారి దగ్గర సుమారు 26 కథలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వీరు తాళపత్రాల్లో లిఖితమై ఉన్న కథలను చదివి వాటిని కంఠస్థం చేసుకొని మౌఖికంగా కథలు చెబుతారు. నాటి నుంచి నేటి వరకు ఈ కళారూపం సజీవంగా ఉండటానికి కారణం ఈ తాళపత్ర గ్రంథాలు.
వీరణం
[మార్చు]యాదవుల ఉపకులం అయిన తెరచీరలు వారు ఉపయోగించే చర్మ వాద్యమే వీరణం. తెరచీరల వారిని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రం' గ్రంథంలోని పర్వత ప్రకరణంలో "భారతాది కథల చీరమరుగుల నారంగ బొమ్మల నాడించువారు" అని ఎనిమిది వందల ఏళ్ళ క్రితమే పేర్కొన్నాడు. ఈనాటికీ వీరు భారత కథలను బొమ్మలుగా చిత్రించిన తెర (పటం) కట్టి వీరణాలు వాయిస్తూ కథాగానం చేస్తారు.
ఇతర విషయాలు
[మార్చు]వీరు వాయించే వీరణం జోడు వాద్యం. సాధారణంగా ఒకటి కర్రతో, రెండోది ఇత్తడి లేదా కంచుతో తయారుచేసి ఏకవాద్యంగా వాయిస్తారు. దాదాపు మూడు జానల పొడవు, ఒక జానెడు వెడల్పు ఉండే వీరణం జోడీలో ముందుది కాస్త చిన్నగా, వెనకది కొద్దిగా పెద్దదిగా ఉంటాయి. రెండువైపులా చర్మం కప్పుతారు. ఒక దిక్కు చేతి వేళ్ళతో వాయిస్తారు. రెండోవైపు వంకర తిరిగిన తంగేడు పుల్లతో వాయిస్తారు. రెండు రకాల వాద్యంతో ఒకే తాళ గతులతో శబ్దం వెలువరిస్తారు. ఈ వాద్యం పంబ వాద్యం లాగే ఉంటుంది. దీనిపై ఐదు రకాల వాద్య ధ్వనులను వెలువరిస్తారు. ఎంతో చక్కని రాగతాళ ధ్వనులు పలికించగల నేర్పరులు ఈ వాద్యకారులు, ప్రధాన కథకుడికి ఇరువైపులా గల సహాయకులు వంత, సంగీత వాద్య సహకారం అందిస్తారు. దీనిని వాయించగల నేర్పురులు వేళ్ళ మీద లెక్కించవచ్చు. వీరణం. వాయిస్తూ ముప్పై రకాల కథలు పాడతారు.
- పై విధానపు తెర బొమ్మల గురించి క్రీడాభిరామంలో ఒక పడతి పల్నాటి వీర చరిత్రను గూర్చి పాడుతూ వున్నదనీ, అక్కడ వారి చరిత్ర ఒక చిత్ర ఫలకం మీద వ్రాయ బడెననీ, దానిని గూర్చి ఈ క్రింది విధంగా వర్ణింప బడింది.
కోల దానపు ద్రిక్కటి కూడి యున్న
గచ్చు వేసిన చిత్రంపు గద్దె పలక
వ్రాసినారదె చూడరా వైశ్యరాజ
శీల బ్రహ్మాది వీర నాసీర చరిత.
(క్రీడాభిరామం...125) పై ఉదాహరణను బట్టి పల్నాటి వీర చరిత్రను కాశీ కావడి ద్వారా, చీరల మీద చిత్రించిన బొమ్మల ద్వారా వీరి కథను చెప్పినట్లు వూహించ వచ్చును.
- అన్ని ప్రాంతాలు సంచరిస్తూ గొల్లల సహాయంతో జీవిస్తూ ఉన్న ఈ తెరచీరల వారు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. వీరు తెలంగాణతో పాటు ఆంధ్ర జిల్లాల్లోను విస్తరించి ఉన్నారు.
తెరచీరల పటం కథ
[మార్చు]తెరచీరల పటం కథ యాదవ పురాణాన్ని చెప్పేందుకు ఏర్పడిన జానపద కళా ప్రక్రియ. వృత్తి పురాణాల్లో ఉన్న 15 పటం కథల్లో తెరచీరల పటం కథ ప్రత్యేకమైనది. ఇది యాదవ వంశంలో పుట్టిన చారిత్రక వీరుడు కాటమరాజు గురించి తెలిపే కథ. యాదవ కళాకారులు యాదవ వంశాన్ని కీర్తిస్తూ కృష్ణలీలలు ఇతివృత్తంతో గానం చేస్తారు. ఈ కళాకారూపం 19వ శతాబ్ది నాటికి ఏర్పడినదని తెలుస్తుంది. ఈ కళకారులని తెరచీర భక్తులని, యాదవపటం కథాకారులని పిలుస్తుంటారు.[3]
తెరచీరల చరిత్ర
[మార్చు]తెరచీరల కళాకారులు స్థిరమందుల వంశానికి చెందిన వారని తెలుస్తుంది. చారిత్రక ఆధారాలను బట్టి వీరు యయాతి, దేవయానికి కలిగిన సంతానం అని చెప్పవచ్చు. పల్లవ రాజులకు ప్రధానులుగా పనిచేసిన వీరు, కాటమరాజు కాలం వచ్చేసరికి పల్లవుల వారసులుగానే ప్రసిద్ధిపొందారు. పూజా గొల్లల్నే తెరచీరల కథాగానం చేసే స్థిరమందుల వంశం వారుగా పేర్కొంటారు.
తెరచీరల కళాప్రదర్శన
[మార్చు]కాటమరాజు కథా వృత్తాంతాల్ని పెద్ద గుడ్డ మీద బొమ్మల రూపంలో అతికించి చిత్రపటం తయారు చేస్తారు. యాదవుల కథ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈ తెర చీరల పటంను గోడకు కట్టి కథను చెపుతారు. దానికనుగుణంగా వేప చెక్కతో, ఇత్తడితో చేసిన వీరణములు, ఇత్తడితో వంకరగా పొడుగు గొట్టాల కొమ్ములు, తాళాలు, డోలక్ లను దీనికి సహకార వాయిద్యాలుగా ఉపయోగిస్తారు. ఆరుగురు కళాకారులు ఒక బృందంగా ఏర్పడి ఊరురా తిరుగుతూ తెరచీరల పటాల ద్వారా పురాణాన్ని చెపుతారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ తెరచీరల కళాకారులు ఉన్నారు. వీరంతా యాదవుల కుల దైవమైన గంగాదేవి కథ, కృష్ణలీలలతో సహ కాటమరాజు కథను గానం చేస్తుంటారు.
కథాంశం
[మార్చు]జానపద కళారూపాల్లో ఎక్కువశాతం కృష్ణలీలలు కథాంశంతోనే ఉంటాయి. ద్వాపరయుగములో కృష్ణావతారం తరువాత, 16వ అవతారంగా కాటమరాజుగా జన్మించాడని యాదవుల ప్రగాఢ విశ్వాసం. ఈ తెరచీరల కథలో అవతార తత్వాన్ని వివరిస్తూ కృష్ణలీలలను, చిలిపి చేష్ఠలను కళ్ళకు కట్టినట్టు చెబుతారు.
మూలాలు
[మార్చు]- ↑ "తెరచీరలవారి జీవన గానం | జాతర | www.NavaTelangana.com". m.navatelangana.com. Retrieved 2022-04-02.
- ↑ జయధీర్, తిరుమలరావు; గూడూరి, మనోజ (2019). మూలధ్వని (జానపద గిరిజన సంగీత వాద్యాల సామజిక చరిత్ర).
- ↑ తెరచీరల పటం కత, పటం కథలు, నేతి మాధవి, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురణ, డిసెంబర్ 2017, పుట. 139.
యితర లింకులు
[మార్చు]- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.