దింసా నృత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అరకు లోయలో దింసా నృత్యం చేస్తున్న గిరిజన స్త్రీలు

అరకు లోయలోని గిరిజనుల సాంప్రదాయ నృత్యాలలో దింసా నృత్యం ప్రసిద్ధమైనది. ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులు సామూహికంగా నర్తించే దింసా నృత్యం దేశంలో విశేషాదరణ పొందింది. వాల్మీకులు, బగతలు, కోటియా, ఖోండ్, కొలాములు, మూఖ దొరలు లాంటి సుమారు 18 తెగలకు చెందిన గిరిజనులు ఈ సంప్రదాయ నృత్యంలో పాల్గొంటారు.

మూల ప్రాంతం[మార్చు]

ఒరిస్సా లోని కోరాపుట్ జిల్లా లోని గిరుజన పల్లెలలో ఈ దింసా నృత్యం ప్రారంభమైనదిగా భావిస్తారు. కోరాపుట్ జిల్లా ఖోండ్ తెగ గిరిజనులకు సొంతభూమి వంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలలోని, చెదురుమదురుగా విజయనగరం ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజన తెగలన్నిటిలోను ఈ నృత్యం వ్యాపించివుంది. ముఖ్యంగా ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయ గిరిజన సంస్కృతికి దింసా నృత్యం ఒక పర్యాయపదంగా మారిపోయింది.

సామూహిక నృత్యం[మార్చు]

పండగలు, జాతరలు లోను, పెళ్ళిళ్ళు వంటి శుభ కార్యాలలోను, సంప్రదాయ వేడుకలలోను ఆడా, మగా, చిన్న, పెద్ద తేడాలు లేకుండా గిరిజనులందరూ సామూహికంగా ఈ దింసా నృత్యంలో పాల్గొంటారు. చైత్రమాసంలో పెద్దదేవర పండుగ, ఆగస్టులో బాలిదేవర పండగ, నవబరులో దీపావళి పండగ, జనవరి నెలలో సంక్రాంతిలో పంటల పండగ, ఆ తదుపరి నందిదేవుని పండగ. మద్య మద్యలో వచ్చే పెళ్ళి పండగలు, సంప్రదాయ వేడుకలు ఇలా ఏడాదంతా గిరిజనులకు పండగలే. పండగ అంటే నృత్యాలే. నృత్యమంటే ధింసానే. దింసా నృత్యం చేసే వారికి వయస్సుతో పట్టింపు ఉండదు. గిరిజన బాలబాలికలు, యువతీ యువకులు, స్ర్తిలు, పురుషులు కలిసి మెలసి సామూహికంగా ఆడతారు. ఈ ఆట వారి జీవన లాలస. ఇలాగే నర్తించాలనే నియమిత నియమం ఉండదు. సామూహికంగా ‘జట్టు’ కట్టడం అనేది ఆనవాయితీ. పండగ సందర్భం ఈ జట్లని నిర్ణయిస్తాయి.

నృత్య శైలి[మార్చు]

సాధారణంగా 15 నుంచి 20 మంది గిరిజన స్త్రీ పురుషులు కలసికట్టుగా వలయాకారంలో తిరుగుతూ, చేతులు, పాదాలు లయబద్దంగా కదుపుతూ ఈ నృత్యం చేస్తారు. సుమారు 10 నిమిషాలపాటు ఈ నృత్యం కొనసాగుతుంది. నృత్యంలో పాల్గొనే గిరిజన స్త్రీ పురుషులు పొడుగాటి వరుసలో బారులు తీరి, వీపు వెనుక నుంచి చేతులు పోనిచ్చి ఒకరి నడుమును ఇంకొకరు పట్టుకొంటూ లయబద్దంగా అడుగులు వేస్తుంటే, మరో పక్క బారు లోని రెండు కొనలలో వున్న వ్యక్తులు అడుగులు ముందుకు వేస్తూ కలుసుకొంటూ, విడిపోతుంటారు. మిగిలిన ఆడా మగా కలసి లయబద్దంగా వలయాలు చుడుతూ, మెలికలు తిరుగుతూ నర్తిస్తారు. ఈ నృత్యం చేస్తున్న గిరిజనులను జోడు కొమ్ము బూరలను ఊదుతూ, డప్పు మోగిస్తూ సంగీతంతో ఉత్తేజపరుస్తారు. ఎంతో శోభాయమానంగా, లయబద్దంగా సాగే దింసా నృత్యాన్ని తిలకిస్తున్న దేశ విదేశీయులు సైతం ఆ నర్తించే జట్టుతో కలిసి అడుగులు వేయాలని ఉబలాటపడతారు.

సంగీత వాద్యాలు[మార్చు]

దింసా నృత్యాలలో పాట తప్పనిసరి కాదు. కాని సంగీతం మాత్రం తప్పని సరి. ఈ సంగీతం లేకపోతే నృత్యం లేదు. ప్రతీ దింసా నృత్య భేదానికి ఒక ప్రత్యేకమైన సంగీత వాదన ఉంటుంది. ఈ సంగీతం గిరిజన సమాజం, జీవితం, భౌగోళిక స్థితులపై ఆధారపడి రూపొందింపబడింది. డప్పు, గిరిజన డోలు, మోరి, కిరిది, తుడుము, జోడు కొమ్ములు మొదలైనవి ధింసా నృత్యానికి సంగీత వాద్యాలుగా ఉంటాయి. ఉదాహరణకు ఆరుగురితో వున్న ఒక జట్టు చేసే దింసా నృత్యంలో ఆరు సంగీత వాద్యాల్ని ఏక కాలంలో వాయిస్తారు. సాధారణంగా సంగీతవాద్యాలను పురుషులు వాయిస్తుంటే స్త్రీలు నర్తించడం జరుగుతుంది.

దుస్తులు[మార్చు]

నృత్యంలో పాల్గొనే గిరిజన స్త్రీ పురుషులు ఇరువురూ సాంప్రదాయకమైన ఆభరణాలను, పసుపు, ఎరుపు, ఆకుపచ్చ వంటి విలక్షణమైన రంగు రంగుల దుస్తులను ధరిస్తారు. స్త్రీలు చీరలను మోకాలి క్రింద వరకూ మాత్రమే ధరిస్తారు. నృత్యంలో ప్రధాన నాయికా, నాయకులు నెమలి ఈకలను చేతులలో ధరిస్తారు.

దింసా నృత్యంలో రకాలు[మార్చు]

ఈ ధింసా నృత్యం బయటినుంచి చూసేవారికి ఒకేలా కనుపిస్తుంది. కాని అందులో పదిహేను రకాల ఆట ఇమిడి ఉంది. ఒకొక్క రకం నృత్యానికి ఒకొక్క ప్రత్యేక ప్రయోజనం, అవసరం ఉంది. ప్రధానంగా దింసా నృత్యంలో ఎనిమిది రకాల భేదాలను పరిశోధకులు గుర్తించారు.

బోడా దింసా (పెద్ద నృత్యం)[మార్చు]

గిరిజన గ్రామ దేవత (నిసాని దేవత) లను పూజిస్తూ సామూహికంగా ఈ నృత్యం చేస్తారు. ఉధృతమైన వాయిద్య హోరుతో బోడా దింసా నృత్యం ప్రారంభమవుతుంది. కుడివైపు మగవాళ్ళు, ఎడమవైపు ఆడవాళ్ళు ఒక పెద్ద వరుసలో బారులు తీరి, వీపు వెనుక నుంచి చేతులు పోనిచ్చి ఒకరి నడుమును ఇంకొకరు పట్టుకొంటారు. కుడి వరుస లోని చివరికొసలో వున్న పురుషుడు (నెమలి ఈకల పించాన్ని పట్టుకొన్న కథా నాయకుడు), ఎడమ వరుసలోని చివరికొసలో వున్న స్త్రీ (కథానాయకి) లయబద్దంగా అడుగులు వేస్తూ ముందుకు వచ్చి కలుసుకొంటారు. అప్పుడు మిగిలిన నృత్యకారులంతా పాముల వలె మెలికలు తిరుగుతూ, వర్తులాకారంగా తిరుగుతూ మద్య మద్యలో హుయ్, హేయ్ మని ఆనందాతిశయంతో అరుస్తూ తిరిగి మళ్ళీ తమ తమ వరుసలలో చేరిపోతారు. గిరిజన పల్లెలలో జనవరి నెలలో సంక్రాంతి సమయంలో ఈ నృత్యం చేయడం ఎక్కువగా కనిపిస్తుంది. విశేషాదరణ పొందిన గిరిజన నృత్యం ఇది.

గుండేరి దింసా (పక్షి నృత్యం)[మార్చు]

దీనినే ఉస్కు దింసా అని కూడా పిలుస్తారు. గుండేరి అనేది ఒక స్త్రీ పేరు. ఒక వరుసలో వున్న పురుషులు, మరో వరుసలో వున్న స్త్రీలను తమతో కలసి నృత్యం చేయమని పిలుస్తున్న అర్ధంలో ఒక పాటను పాడుతూ స్త్రీ వరుసలో వున్న వాళ్ళను ఆహ్వానిస్తారు. అందువల్లనే ఈ నృత్యాన్ని గుండేరి దింసా నృత్యం అంటారు. స్త్రీ పురుషులిద్దరూ కలసి పక్షులను అనుకరిస్తూ లయబద్దంగా వలయాలు చుడుతూ, ఉద్రేకపూరితంగా చేసే నృత్యమిది.

గొడ్డి బేటా దింసా (రాళ్ళను ఏరే నృత్యం)[మార్చు]

ఒరియా భాషలో గొడ్డి అంటే చిన్న రాళ్ళు. బేట అంటే ఏరుట అనే అర్థం. తలలు క్రిందకు దించి పైకి ఎత్తుతూ, రాళ్ళు, రెమ్మలు ఏరుతున్నట్లు అనుకరించే నృత్యం ఇది. మంచి వూపుతో ముందుకు వంగుతూ లేస్తూ సుమారు 25 అడుగుల దూరం ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి, అలా నాలుగైదు సార్లు ఆవర్తించడం ఈ నృత్యంలో విశేషం.

పోతర్ తోలా దింసా (ఆకులను సేకరించే నృత్యం)[మార్చు]

పోతార్ అంటే ఆకులు, తోలా అంటే సేకరణ. అడవిలో ఆకుల్ని కోస్తున్నట్లు, ఏరుతున్నట్లు అనుకరించే నృత్యం. ఇది అరకు లోయలో గిరిజనుల అడ్డ ఆకులను సేకరించే వృత్తిని సూచిస్తుంది. రెండు వరుసలలో ఒకదాని వెంట మరొకటిగా సాగుతుంది. ముందు వరుస మనుష్యుల భుజాలమీద వెనుక వరుస మనుష్యులు చేతులు వేసి తలల్ని పక్కలకు కదుపుతూ, ముందుకూ వెనక్కూ అడుగులు లయబద్దంగా కదపడం ఈ నృత్యం లోని విశేషం.

భాగ్ దింసా (బెబ్బులి నృత్యం)[మార్చు]

భాగ్ అంటే ఒరియాలో బెబ్బులి అని అర్థం. అడవిలో సంచరించడం గిరిజనుడికి ఎంత సహజమో, గిరిజనుడికి పులి ఎదురుపడటం కూడా అంతే సహజం. అలాంటి సందర్భంలో పులి ఎదురుపడినప్పుడు ఒక వేటగాడు ఎలా తప్పించుకొని పోవాలి అన్న విషయాన్ని తెలుపుతూ పులి-మేకను అనుకరిస్తూ చేసే నృత్యం ఇది. బృందంలో సగం మంది ఒకరి చేతులు మరొకరు పట్టుకుని గుండ్రంగా మూగుతారు. తలను పై కెత్తుతూ ముని వేళ్ళ మీద నిలిచి వుంటారు. మిగతా సగం మంది చకచకా చుట్టు తిరుగుతూ లోపల ప్రవేశించి, పాము చుట్ట ఆకారంలో అంతా పరుచు కుంటారు. ఇలా అనేక సార్లు చేస్తారు. జంతువుల వేట వంటి అంశాలను నేర్వడం కోసం, వాటి సాధన కోసం ఈ నృత్యాలను రూపొందినట్లు తెలుస్తుంది. సామాజిక అవసరాల వ్యక్తీకరణలో భాగంగా ఇటువంటి నృత్యాలను గిరిజనులు సాధన చేస్తారు.

నాటికారి దింసా (నాట్య కార్యం)[మార్చు]

దీపావళి రోజున ఒకే ఒక వ్యక్తి చేసే నృత్యం ఇది. ముఖ్యంగా వాల్మీకులు దీనిని చేస్తారు. ఇతర తెగలు కూడా ఇతర పండుగ సందర్భాలలో దీనిని చేస్తారు.

కుండా దింసా (భుజాల తోపుడు)[మార్చు]

కుండా అంటే ఒకరి నొకరు భుజాలతో తోసుకోవడం అని అర్ధం ఈ నృత్యంలో నర్తించే వాళ్ళు పక్కలకు ఊగుతూ, తమ భుజాలతో పక్క వాళ్ళను తోయడం ప్రత్యేక లక్షణంగా వుంటుంది.

బాయా దింసా (అతీత భావన నృత్యం)[మార్చు]

బాయా అంటే పూనకం. గిరిజన పల్లెలోని పూనకం పట్టిన గణాచారి చేసే నృత్యం ఇది. మతపరమైన ఈ గిరిజన నృత్యంలో గణాచారి తనను దేవతలు పూనటాన్ని సూచిస్తూ లయాత్మకంగా ఊగుతూ ఈ నృత్యం చేస్తాడు. ఈ పూనకపు నృత్యం జరుగుతున్నంతసేపు అతని చుట్టూ మూగిన గిరిజనులు తలలు వంచి వినమ్రులై వుంటారు.

ఇవేకాక ఆయా ప్రత్యేక సందర్భం బట్టి పోతార్ తోటి (పులి నృత్యం), సాంబారీ ధింసా (కణుజు నృత్యం), పోషీచశానా ధింసా (యువతీ యువకుల నృత్యం), రంగోబోతి ధింసా (ఆనంద నృత్యం), చోటీ ధింసా (హాస్య నాట్యం), సోలారి దింసా (ఆత్మీయ నృత్యం), బీబా ధింసా (వివాహ నృత్యం) కమ్మర చెక్కి ధింసా (కమ్మరిపని నృత్యం) మొదలగు రకాలతో కూడిన దింసా నృత్యాలు చేస్తారు.

ఈ గిరిజన నృత్యం ఏక సామాజిక లక్షణం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, జనమంతా ఒకే సమాజానికి చెందిన వాళ్ళు అనే ఉదాత్త భావనను వెలికితెచ్చే విధంగా, గిరిజన తెగ ప్రజల మధ్య సౌభ్రాతత్వాన్ని పెంపొందించే విధంగా ఈ దింసా నృత్యం తీర్చిదిద్దబడింది.

నేటి కాలంలో దింసా నృత్యం[మార్చు]

మారుతున్న కాలానికి అనుగుణంగా గిరిజన జీవనవిధానంలో క్రమేణా మార్పులు వస్తున్నప్పటికీ వారి సంస్కృతికి చెందిన ఈ దింసా నృత్య విధానంలో ఏ మార్పు రాలేదు. ఒకప్పుడు గిరిజనులు శ్రమైకజీవనంలో వినోదకారకంగా, పండుగలలో వేడుకగా, తమ పల్లెలలో తామై జీవన లాలసతో దింసా నర్తించేవారు. కాగా ఇప్పుడు పట్టణ యాత్రికుల కోసం అరకులోయలో మధ్యాహ్నం సమయాలలో పురుషులు సంగీత వాద్యాలు వాయిస్తే, స్త్రీలు జట్టుగా ధింసా నృత్యం చేస్తున్నారు. ఈ జట్లనే వివిధ ప్రాంతాలకు పిలిపించి ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. అంటే సాంప్రదాయకమైన ధింసా నృత్యం తన మూలల నుండి పరాయిదై కొత్త పరాయి ప్రేక్షకుల కోసం కొత్త రూపం ఎత్తింది.ఈ కొత్త రూపానికి ఆర్థిక కోణం తోడైంది. ఒక సామాజిక సమూహకళ ప్రస్తుతం ఒక జట్టు గుర్తింపునకు పరిమితమైంది. ఈ నృత్యానికి మూల ప్రాంతమైన కోరాపుట్ జిల్లాలో ఒరిస్సా ప్రభుత్వం ప్రతీ ఏటా మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయి దింసా నృత్య ఉత్సవాలను నిర్వహిస్తుంది.

ఇవికూడా చూడండి[మార్చు]

ఆదిమ వాసుల గిరిజన కళా రూపాలు

మూలాలు[మార్చు]

  • ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్యము, సంస్కృతి – డాII బి. రామరాజు, ( అనువాదం: నాయని కృష్ణకుమారి) నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా, 2001,
  • జానపద కళారూపాలు ఆర్కీవ్.ఆర్గ్ లో పుస్తకపు మూలప్రతి, మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 1992

బయటి లంకెలు[మార్చు]

  • శిష్ట సమాజానికి దూరమైన ఆదిమ నృత్యకళ [1][permanent dead link], ఆంధ్రభూమి డైలీ పత్రిక, 06, April, 2012
  • Dhimsa by discoveredindia.com [2]