Jump to content

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

వికీపీడియా నుండి
(దుగ్గిరాల గోపాల కృష్ణయ్య నుండి దారిమార్పు చెందింది)

స్వాతంత్ర్య సమర యోధుల్లో ప్రముఖుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (జూన్ 2, 1889 - జూన్ 10, 1928) (Duggirala Gopalakrishnayya). ఆయన గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు. ఆంధ్ర రత్న బిరుదు పొందినవాడు. ఆయన నాయకత్వంలో నడచిన చీరాల పేరాల సమరం సుప్రసిద్ధం.

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
ఆంధ్ర రత్న
జననంజూన్ 2, 1889
పెనుగంచిప్రోలు
మరణంజూన్ 10, 1928
ప్రసిద్ధిచీరాల-పేరాల సమరం,
తెలుగు జానపద కళారీతుల పునరుద్ధరణ
తండ్రికోదండరామస్వామి
తల్లిసీతమ్మ

కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండరామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు.

నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. చదివాడు. తరువాత ఆనంద కుమార స్వామితో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.

తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు. 1919 లో బ్రిటిష్ ప్రభుత్వం చీరాల, పేరాల మునిసిపాలిటీలను విలీనం చేసినపుడు, అందుకు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమానికి గోపాలకృష్ణయ్య నాయకుడు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.

తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు. ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా.

గోపాలకృష్ణయ్య రామార్చనా నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు. 1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.

మరణం

[మార్చు]

జూన్ 10, 1928 లో 40వ ఏటనే గోపాలకృష్ణయ్య మరణించాడు.

వనరులు, బయటి లింకులు

[మార్చు]