Jump to content

పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలు

వికీపీడియా నుండి
పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాలు

పాకిస్తాన్ 1947లో స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అంతకు ముందు ఇది భారతదేశంలో అంతర్భాగంగా ఉండేది. వేదకాలం నుండి ఇక్కడ హిందూమతం విలసిల్లుతోంది. ముల్తాన్ ప్రముఖ హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటి. వేద సంస్కృతి పంజాబుకు చెందిన తక్షశిలలోని గాంధారం వద్ద వికసించింది. ప్రస్తుతం పాకిస్తాన్ జనాభాలో హిందువుల సంఖ్య 1.3% మాత్రమే ఉన్నా ఇక్కడ హైందవ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబించించే దేవాలయాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని దేవాలయాల వివరాలు ఇలా ఉన్నాయి.

హింగ్లజ్ మాత మందిరం

[మార్చు]

హింగ్లజ్ మాత, హింగ్లజ్ దేవి లేదా హింగుళాదేవి మందిరం 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇది బలూచిస్తాన్ జిల్లాలో హింగోల్ నేషనల్ పార్క్ మధ్యలో నెలకొని ఉంది. ఈ ఆలయం హింగోల్ నదీతీరంలోని ఒక కొండగుహలో ఉంది. పాకిస్తానీయులు ఈ ఆలయాన్ని నానీమందిరంగా పిలుస్తారు.

పురాణగాథలు

[మార్చు]
హింగ్లజ్ మాత మందిరం

ప్రజాపతి దక్షుడు తన కుమార్తె సతీదేవి తన ఆకాంక్షలకు విరుద్ధంగా శివుడిని వివాహం చేసుకుందన్న కోపంతో తాను తలపెట్టిన బృహస్పతియానికి అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు. సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. వాటిలో శిరోభాగం (బ్రహ్మరంధ్రం) ఈ హింగోళ ప్రాంతంలో పడిందని అంటారు.

మరొక స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో విచిత్రుడు అనే సూర్యవంశానికి చెందిన క్షత్రియ రాజుకు హింగోళుడు, సుందరుడు అనే కుమారులు పుడతారు. వీరు ప్రజలను, ఋషులను పీడించి హింసిస్తుంటారు. ఆ రాకుమారుల బారినుండి తమను రక్షించవలసిందిగా ప్రజలు శివుడిని ప్రార్థిస్తారు. శివుని ఆజ్ఞానుసారం గణపతి సుందరుడిని సంహరిస్తాడు. దానితో రెచ్చిపోయిన హింగోళుడు మరింత విజృంభించి ప్రజలపై ప్రతీకారం తీసుకుంటాడు. దానితో బెంబేలెత్తిన ప్రజలు పరాశక్తిని ఆశ్రయిస్తారు. శక్తి అతడిని వెంటాడుతూ ఈ గుహలలో తన త్రిశూలంతో సంహరిస్తుంది. చనిపోయే ముందు హింగోళునికి ఇచ్చిన వరం ప్రకారం ఆ ప్రాంతంలో నెలకొని అతడి పేరుతో హింగుళాదేవిగా ప్రసిద్ధి చెందింది.

మరో ఇతిహాసం ప్రకారం పరశురాముడు క్షత్రియ సంహారం చేస్తున్నప్పుడు 12 మంది బ్రాహ్మణులు క్షత్రియులను బ్రాహ్మణ వేషం వేసి పరశురాముడికి వారిని బ్రాహ్మణులుగా నమ్మించి కాపాడతారు. ఆ క్షత్రియుల సంతతి తరువాతి కాలంలో బ్రహ్మక్షత్రియులుగా పిలువబడుతున్నారు. ఈ బ్రహ్మక్షత్రియుల కులదేవత హింగుళాదేవి. మరో కథనం ప్రకారం దధీచి మహర్షి రత్నసేనుడు అనే సింధుదేశ రాజుకు పరశురాముడి బారి నుండి రక్షించడానికి ఆశ్రయమిస్తాడు. దధీచి ఆశ్రమంలో లేని సమయం చూసి పరశురాముడు రత్నసేనుడిని సంహరిస్తాడు. రత్నసేనుడి కుమారులను బ్రాహ్మణ వటువులుగా భావించి వదిలివేస్తాడు. వారిలో జయసేనుడు సింధురాజ్యానికి మరలి వెళ్లి పరిపాలన కొనసాగించాడు. పరశురాముడు అతడిని మట్టుపెట్టడానికి వచ్చినప్పుడు దధీచి మహర్షి ప్రసాదించిన హింగుళా దేవీ మంత్ర ప్రభావంతో కాపాడబడతాడు. ఈ దేవి జయసేనుడిని కాపాడటమే కాక పరశురాముని క్షత్రియవధను నిలిపివేయమని ఆజ్ఞాపిస్తుంది.

జాతర

[మార్చు]

ప్రతియేటా ఏప్రిల్ మాసంలో నాలుగు రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో సాధువులు, హఠయోగులు ఈ దేవిని కొలుస్తారు. అనేక మంది భక్తులు ఉత్సవాల సందర్భంగా ఈ దేవతను కొలిచి మొక్కుబడులు చెల్లించుకుంటారు. స్థానికి ముస్లీములు ఈ దేవతను బీబీ నానీగా కొలుస్తారు. ఈ ఉత్సవాలను నానీకీ హజ్ అని పిలుస్తారు.

సినిమా

[మార్చు]

హింగ్లాజ్ దేవి ఆలయం కథనాంశంగా, టి.గోపిచంద్ కథానాయకుడిగా సాహసం అనే తెలుగు చిత్రం, చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చింది. భారత్-పాకిస్తాన్ విభజన అనంతరం, భారతదేశానికి వచ్చిన హిందువుల, కుటుంబంలో పుట్టిన కథానాయకుడు, తన వారసత్వ ఆస్తికోసం, పాకిస్తాన్ కి వెళ్ళే నేపథ్యంలో, సినిమా కథ సాగుతుంది.

ఆదిత్య మందిరం

[మార్చు]

ముల్తాన్ సూర్యదేవాలయం లేదా ఆదిత్య దేవాలయం పాకిస్తాన్ లో పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ నగరంలో ఒకప్పుడు నెలకొని వున్న పురాతన దేవాలయం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణునికి జాంబవతి వలన కలిగిన కుమారుడు సాంబుడు తనకు వచ్చిన కుష్ఠురోగాన్ని పోగొట్టుకోవడానికి నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయం ఉన్న మూలస్థానం ఆధారంగా ఈ ప్రాంతానికి ముల్తాన్ అని పేరు వచ్చిందని ఒక కథనం.

స్వామీ నారాయణమందిరం

[మార్చు]

దేవాలయాన్ని 1849లో కరాచీ నగరంలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని హిందువులే కాకుండా ముస్లీములు కూడా దర్శిస్తారు. ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్న ధర్మశాలను ప్రస్తుతం పాకిస్తానీ స్థానిక జిల్లా కార్యాలయంగా మార్చివేశారు. 1947లో ఈ మందిరం హిందూ నిరాశ్రయులకు శిబిరంగా ఉపయోగపడింది. ఈ మందిరంలోని మూల విగ్రహాలను 1947 తర్వాత భారతదేశానికి తరలించారు. 1947 తరువాత 1989లో మొదటిసారి కొంతమంది సాధువులు ఈ మందిరాన్ని దర్శించారు. ఆ తరువాత ఈ దేవాలయానికి భక్తుల సందడి పెరిగింది. ఈ ఆలయంలో స్వామీ నారాయణ జయంతి, శ్రీరామనవమి, జన్మాష్టమి, దసరా మొదలైన పండుగలను హిందువులు పాటిస్తారు. 2008లో ఈ దేవాలయంలో 20 పేదజంటలకు సామూహిక వివాహాలు జరిపారు.

శివహర్కరే

[మార్చు]

శివహర్కరే లేదా కరివిపుర్ 51 శక్తిపీఠాలలో ఒకటి. మహిషాసురమర్ధిని ఈ దేవాలయంలోని దేవత. ఈ శక్తిస్థలంలో పడిన సతీదేవి శరీరఖండాలు ఆమె కన్నులు. శివుడు ఈ పుణ్యక్షేత్రంలో క్రోధీశుడిగా వెలిశాడు. ఈ దేవాలయం కరాచీ నగరానికి సమీపంలో పర్కాయి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉంది. ఏప్రిల్ నెలలో నాలుగురోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.

కటాసరాజ మందిరం

[మార్చు]
కటాసరాజ దేవాలయం

కటాసరాజ ఆలయం పాకిస్తాన్‌లోని పంజాబురాష్ట్రానికి చెందిన చక్వాల్ జిల్లాలోని కటాస్ గ్రామంలో ఉంది. ఇది ఒక శివాలయం. మహాభారతకాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపినట్టు భావిస్తారు. దక్షయజ్ఞసమయంలో, సతీదేవి ప్రయోప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రాలాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాసక్షేత్రంలోని అమృతకుండ్ తీర్థంగానూ, రెండవది భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని అజమేరు (అజ్మీర్)లోని పుష్కరరాజ్ తీర్థంగానూ మారాయి అని స్థలపురణం చెబుతోంది. ఈ ఆలయక్షేత్రాన్ని ప్రపంచవారసత్వ సంపదగా గుర్తింపజేయాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. 2006-07లో ఇక్కడి ఏడు ఆలయాలలో విగ్రహాలను పునఃప్రతిష్ఠించేందుకు నిర్ణయించి 51.06 మిలియన్ రూపాయలను కేటాయించింది. భారతదేశంనుండి ఈ విగ్రహాలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకొంది.ఈ పని మీద, ముగ్గురు పురాతత్వవేత్తల జట్టు భారతదేశంతోపాటు, శ్రీలంక, నేపాల్‌లలో కూడా సందర్శించింది. 2005 సంవత్సరంలో భారత మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఈ ఆలయాన్ని సందర్శించారు.

శారదా పీఠం

[మార్చు]

శారదా పీఠం, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులో నీలం నది ఒడ్డున గల సరస్వతీ దేవి శక్తిపీఠం వద్ద ఉండేది. నీలం నదిని భారతదేశంలో కిషన్‌గంగ అని పిలుస్తారు. అయితే, ప్రస్తుతం ఆలయ శిథిలాలు తప్ప మరేమీ లేవు. ఈ ప్రాంతం వాస్తవాధీన రేఖకి చేరువలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులోని నీలం జిల్లాలో ఉంది. ఇక్కడ షీనా, కాశ్మీరీ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ ఆలయం వల్లనే కాశ్మీరుని శారదాదేశంగా కూడా పిలుస్తారు.

ఇది ఒకప్పుడు కాశ్మీరీ పండితుల విద్యాకేంద్రంగా విరాజిల్లినది. ఇక్కడే ఆది శంకరుడు సర్వజ్ఞానపీఠాన్ని అధిష్టించాడు. ఒకప్పుడు సంస్కృత పండితులకు, కాశ్మీరీ పండితులకు; హిందూ, బౌద్ధ ధర్మాలకూ నిలయంగా ఉండేది.

ఇక్కడి శారదా దేవినే, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన సరస్వతీ దేవిగా కొలుస్తారు. ఇక్కడి శారదాదేవి లేదా సరస్వతీ దేవికి చెందిన స్తోత్రం

జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ

ప్రస్తుత స్థితి

[మార్చు]

ప్రస్తుతం ఈ పీఠం, ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది కాశ్మీరీ పండితులు ఆలయ సందర్శనకీ, మరమ్మత్తులకీ అనుమతినివ్వమని ఇటు భారతదేశానికీ, జమ్మూ ‍కాశ్మీరుకీ; అటు పాకిస్తాన్ కీ, ఆజాదు కాశ్మీరుకీ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు.[1]

మరికొన్ని దేవాలయాల జాబితా

[మార్చు]

పైన పేర్కొన్న హిందూ దేవాలయాలే కాక పాకిస్తాన్‌లో ఉన్న మరికొన్ని హిందూ దేవాలయాలజాబితా:

  • కరాక్ ఆలయం:పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్‌టుంట్వా రాష్ట్రం, కరాక్ జిల్లాలో ఉన్న పురాతన హిందూ దేవాలయాన్ని, పరమహంస మహారాజ్ సమాధిని స్థానిక ముస్లిం అల్లరి మూకలు 2020 డిసెంబర్ నెలలో ధ్వంసం చేశాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రం కలకలం సృష్టించింది. అక్కడి హిందువులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించారు
  • ఆర్య మందిరం, నవన్‌షెహర్, అబొత్తాబాద్ (శిథిలం)
  • శివాలయం, అబొత్తాబాద్ (శిథిలం/ పాక్షికంగా నిర్మూలించబడింది)
  • సయీద్ పూర్ దేవాలయం, సయీద్ పూర్, ఇస్లామాబాద్
  • కృష్ణదేవాలయం, అబొత్తాబాద్ (పూర్తిగా నిర్మూలించబడింది)
  • బరేరి మాత మందిరం, మన్‌సెహరా (ప్రస్తుతం లేదు, నిర్మూలించబడింది)
  • వాల్మీకి మందిరం, పెషావర్
  • జగన్నాథమందిరం, సియాల్‌కోట్
  • వరుణదేవాలయం, కరాచి
  • పంచముఖ హనుమాన్ మందిరం, కరాచి
  • కలిబారి మందిర్ (పాకిస్థాన్)

బయటి లింకులు

[మార్చు]
  • [1] Archived 2010-06-06 at the Wayback Machine హింగ్లజ్ మాత గురించిన వెబ్‌సైట్
  • [2] Hindu Temples in Pakistan

మూలాలు

[మార్చు]
  1. "Discuss opening of Sharda Peeth in PaK during talks: APMCC". greaterkashmir. Srinagar, India. June 18, 2011. Retrieved June 18, 2011.[permanent dead link]

ఇంగ్లీషు వికీపీడియాలో హింగ్లజ్ మాత వ్యాసం ఇంగ్లీషు వికీపీడియాలోస్వామీ నారాయణమందిరం వ్యాసం