పాలనా తత్త్వశాస్త్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కౌటిల్యుడు, ప్రాచీన భారతదేశ రాజనీతి నిపుణుడు.

పాలనా తత్త్వశాస్త్రం లేదా పాలనా సిద్ధాంతం అనేది "వివిధ పాలనా సమస్యలను పరిష్కరించడంలో అధికారుల అనుభవాలు, వ్యవస్థల పరిశీలన ద్వారా రూపొందించిన పద్ధతులు, విజ్ఞుల, మేధావుల తాత్త్విక భావాలను అన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించడం" అని పాలనా తత్త్వవేత్తలు అనే పుస్తకం నిర్వచనమిస్తోంది.[1] స్థూలంగా చెప్పాలంటే పాలనా సిద్ధాంతం వీటి అధ్యయనం : రాజనీతిశాస్త్రం, స్వేచ్ఛ, న్యాయం, సొత్తు, హక్కులు, చట్టం, అధికారం ద్వారా ఆ చట్టాల అమలు; అవి ఏమిటి, అవి (అసలు) ఎందుకు కావాలి, ప్రభుత్వానికి అధికారాన్ని ఎవరు కట్టబెట్టారు, ఆ ప్రభుత్వం ఏం-ఏం అంశాల్లో ప్రజల స్వేచ్ఛను, వారి హక్కులను కాపాడాలి, ఎందుకు కాపాడాలి, ప్రభుత్వం ఎలాంటి పరిధిని ఏర్పరుచుకోవాలి, ఎందుకు అలా చేయాలి, చట్టమంటే ఏమిటి, ఒక సమ్మతమైన ప్రభుత్వానికి ప్రభుత్వాధీన ప్రజలు ఎలాంటి బాధ్యతలు (అసలుంటే) కలిగి ఉండాలి, (ఒకవేళ) ఎలాంటి పరిస్థితులలో ప్రభుత్వాన్ని ప్రజలు దింపేయవచ్చు.

ప్రభుత్వ కార్యకలాపాల పరిధి విస్తృతం కావడంతో పందొమ్మిదవ శతాబ్దంలో ఒక స్వతంత్ర, ప్రత్యేక అధ్యయనంగా ప్రభుత్వ పాలన మొదలయింది. ప్రభుత్వ పాలన విస్తృతమౌతున్న కొద్దీ, ఏర్పడుతున్న సమస్యల పరిష్కారం కోసం వివిధ అంశాలపై రాజకీయ తత్త్వవేత్తలు పరిశోధనలు చేపట్టారు. వివిధ పరిశోధకులు, అధికారులు, వృత్తిపర అనుభవజ్ఞులు వివిధ సమస్యలను పరిష్కరించి, తద్వారా నూతన అన్వేషణలకు మార్గాలు వేసారు. ఈ క్రమంలో వెలువడిన వివిధ పరిష్కారాలు, భావనలే పాలనా సిద్ధాంతానికి పునాదులు వేసి పాలా తత్త్వశాస్త్ర వికాసానికి తోడ్పడ్డాయని ప్రభుత్వపాలనాశాస్త్ర ఆచార్యులు డి. రవీంద్రప్రసాద్ ప్రతిపాదించారు.[2]

చాలా మార్లు పాలనా తత్త్వశాస్త్రమంటే రాజకీయ వ్యవస్థ పట్ల సాధారణ దృక్కోణం లేదా ఒక విశిష్ట నీతి లేదా ఒక రాజకీయపరమైన విశ్వాసంగా చెప్పుకొస్తారు. దీనిని రాజకీయ ఆలోచనా ధోరణికి నానార్ధంగా వాడత్తారు కూడా.

పాలనా తత్త్వశాస్త్రమనేది తత్త్వశాస్త్రంలోని ఒక శాఖ. కొందరి ప్రకారం పాలనా తత్త్వశాస్త్రమనేది రాజకీయ వ్యవస్థ అధ్యయనం లో ఒక భాగం. ఐతే, అలాంటి సందర్భాలలో పాలనా తత్త్వశాస్త్రం అనే పదం బదులు పాలనా సిద్ధాంతం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలాంటి సందర్భాలలో ఈ శాస్త్రం కేవలం సైద్ధాంతిక శాస్త్రంగా మిగిలిపోతుంది. అలాంటి సందర్భంలో ఈ శాస్త్రం తన తాత్త్విక గుణాన్ని కోల్పోతుంది.

చరిత్ర[మార్చు]

పాలనాతత్త్వశాస్త్ర చరిత్ర రాజనీతి, రాజతంత్రం, రాచరికపు ఆలోచనలతో ముడిపడిన అంశం కాబట్టి మానవజాతి మొదటి నాళ్ళ నుండే ఇది అస్తిత్వంలో ఉండి తీరాలి. రాజనీతి చరిత్ర మన ప్రాచీన భారతదేశ గ్రంథాలలో ఉన్నప్పటికీ, పాశ్చాత్యుల ప్రకారం ఇది ముఖ్యంగా అంధకార యుగం నుండి పునరుజ్జీవం చెందిన కాలంలో బాగా అభివృద్ధి చెందిందని నమ్ముతారు. రాచరికం నుండి ప్రజాపరిపాలన, కమ్యూనిస్ట్ భావజాలాలకు పునాది పడింది ఆ కాలంలోనే గనుక అలా నమ్ముతారు. అలానే రాజకీయ వ్యవస్థలు కూడా సరిగా గీసుకోని సరిహద్దుల నుండి నేటి అడుగు భూమి కోసం దేశాల మధ్య యుద్ధాలు జరిగే పరిస్థితికి చేరుకుంది. తరచూ పాలనా తత్వశాస్త్ర చరిత్ర, తాత్త్విక చరిత్రతో పెనవేసుకుంది.[3]

ప్రాచీన సంప్రదాయాలు[మార్చు]

ప్రాచీన భారతదేశం[మార్చు]

భారత పాలనా తాత్త్వికత ప్రాచీన కాలం నుండే వృద్ధిచెందుతూ వస్తోంది. దేశానికి-రాష్ట్రానికి, రాష్ట్రానికి-మతానికి నిర్దిష్టమైన భేదాన్ని పురాతన కాలం నుండే భారతీయులు నమ్ముతూ వచ్చారు. హిందూ రాజ్యాల స్థాపన, వాటి పనితీరు, ఆయా కాలాలలో నిర్ణయించుకున్న ధర్మశాస్త్రాలు, నీతిశాస్త్రాల ప్రకారం నడిచాయి. ప్రభుత్వ పాలన స్పష్టంగా పాలనారంగం, ప్రభుత్వపాలన, సైన్యం, చట్టం, సామాజిక వ్యవస్థ మొ|| విభాగాలుగా పనిచేసేది. ఈ పనులను చక్కబెట్టేందుకు రాజుకొక మంత్రాంగం ఉండేది. ఇందులో భాగంగా రాజు, ప్రధానమంత్రి, సైన్యాధిపతి, రాజుకు అనంగు పూజారి (ధార్మిక/రాజగురువు) ఉండేవారు. ప్రధానమంత్రి అమాత్యుల కొలువుకు ముఖ్యుడుగా ఉంటూ మహా అమాత్యుడనే పదవిని నెరవేర్చేవాడు.

క్రీ.పూ. 4వ శతాబ్దానికి చెందిన కౌటిల్యుడు, భారతదేశ రాజకీయ తత్త్వవేత్త. ఇతను అర్థశాస్త్రాన్ని రచించాడు. ఇందులో రాజకీయ శాస్త్రాన్ని విస్తృతంగా పరిచయం చేస్తూ, దానిని ఏ విధంగా సజావుగా రాజ్యాన్ని ఏలేందుకు ఉపయోగించుకోవాలి, యుద్ధాల్లో, పరదేశీయులతో చేసే మంతనాల్లో ఎలాంటి విధానాన్ని చేపట్టాలి,వేగులు, గూఢచారుల వ్యవస్థను ఎలా నడపాలి, వివిధ అవసరాలకు నిఘా వ్యవస్థను ఎలా అమర్చుకోవాలి, రాజ్య ఆర్ధికస్థిరత్వానికి ఏం చేయాలి - మొదలగు అంశాలను విశదీకరించాడు. కౌటిల్యుడు తన ధర్మ-నీతి-అర్థ శాస్త్రాలకు ఆధారం బృహస్పతి, ఉషణసుడు, ప్రాచేతస మనువు, పరాశరుడు, అంబి మొదలగు వారు ప్రతిపాదించిన పాలనా తత్త్వశాస్త్రగ్రంథాలని చెప్పుకున్నాడు. తనను తాను పాలన తత్త్వ శాస్త్రవేత్తల వంశానికి చెందిన వాడిగా చెప్పుకుంటూ, తన తండ్రి చణకుడు కూడా గొప్ప పాలనాతత్త్వశాస్త్రవేత్త అని పేర్కొన్నాడు.

ప్రాచీన భారత దేశంలో కనిపించే ఇతర పాలనాతాత్త్విక శాస్త్రాలలో శుక్రనీతి, మనుస్మృతి మొదలగు గ్రంథాలు ఉన్నాయి.

ప్రాచీన చైనా[మార్చు]

చైనాలో రాజకీయతాత్త్వికత చాలా పురాతనమైనది క్రీ.పూ. 6వ శతాబ్దం నాటి కన్‌ఫ్యూషియస్ కాలమని చెప్పుకోవచ్చు. చైనీయ పాలనాతత్త్వశాస్త్రపు ఆలోచనలు ఆ దేశంలో జరిగిన సామాజిక, రాజకీయ పతనాలకు పర్యవసానంగా పెరిగాయి. కన్‌ఫ్యూషియనిజం, లీగలిజం, మొహిజం, అగ్రేరియనిజం, టాఓఇజం ముఖ్యంగా చైనాలో కనిపించే తాత్త్విక పంథాలు. వీటన్నిటికీ ఒక రాజకీయ కోణం ముడిపడి ఉంది. కన్‌ఫ్యూషియస్, మెన్‌షియస్, మొజి లాంటి తత్త్వవేత్తలు చైనా రాజకీయ ఐక్యతమరియు రాజకీయ స్థిరత్వం వైపుగా తమ పాలనా తాత్త్వికతలను రూపొందించారు. కన్‌ఫ్యూషియనిజం అంచెలంచెలుగా పని చేసే గుణప్రధాన ప్రభుత్వాన్ని సమర్ధించింది. ఆ ప్రభుత్వానికి సహానుభూతి, రాజ్యవిధేయత, పరస్పర సంబంధాలే పునాదులు. లీగలిజం పద్ధతిలో పూర్తి నియంతృత్వ ప్రభుత్వానికి పెద్దపీట వేసారు. అలాంటి పాలనలో కఠినమైన చట్టాలు, అంతకన్నా కఠినమైన శిక్షలు ముఖ్యంగా ఉండేవి. మొహిజం మతతత్త్వ, వికేంద్రీకృత ప్రభుత్వాన్ని సమర్ధించింది. ఈ పాలనా వ్యవస్థ మితవ్యయాన్ని, సన్యసించడాన్ని సమర్ధించింది. అగ్రేరియనిజం రైతే రాజు సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. రైతులు పాలకులుగా ఉండే ఒక సమసమాజాన్ని ఈ సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. టాఓఇజం అరాజకవాదాన్ని సమర్ధించింది. కిన్ రాజయుగంలో లీగలిజం గుణాలు, హన్ రాజయుగంలో కన్‌ఫ్యూషియనిజం గుణాలు కనిపిస్తాయి. ప్రస్తుత కమ్యూనిస్ట్ పాలనకు ముందు దాకా ఈ పంథా కొనసాగింది.[4]

ప్రాచీన గ్రీకు[మార్చు]

పాశ్చాత్య పాలనాతత్త్వశాస్త్రపు పుట్టుక ప్రాచీన గ్రీకు తాత్త్వికతతో ముడిపడి ఉంది. ప్లేటో కాలం నాటికి ఈ అంశాన్ని చరిత్రలో నిర్ధారించవచ్చు. ప్లేటో కాలానికి ప్రాచీన గ్రీకు నాగరికత నగర ప్రభుత్వాల అధీనంలో ఉండేడి. రాజకీయ వ్యవస్థలలో పలు విధానాలను మార్చి మార్చి అమలు పరచడం ద్వారా ప్రజాపాలనను జరిపేవారు. ప్లేటో వీటిని ప్రముఖంగా నాలుగు విధాలుగా చెబుతాడు - అవి భూస్వామ్య ప్రభుత్వము, నిరంకుశపాలన, ప్రజాస్వామ్యం, కొద్దిమంది శక్తి గల పెద్దలు పాలించే రాజ్యము. ప్లేటో రచించిన రిపబ్లిక్ పాలనాతత్త్వశాస్త్రంలో వచ్చిన రచనల్లో మొదటివాటిలోది. ఇది చాలా ముఖ్యమైనది కూడా. ఈ రచన అనుసరణలో అరిస్టోటుల్ నికమేషియన్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్ పుస్తకం వచ్చింది. రోమనుల పాలనా తాత్వికత స్టాయిక్స్, సిసెరోల ఆలోచనల ప్రభావంతో నడిచింది.

ప్రముఖ పాలనా తత్త్వవేత్తలు[మార్చు]

 • కౌటిల్యుడు
 • ఉడ్రోవిల్సన్
 • హెన్రీ ఫెయల్
 • ఫ్రెడరిక్ టేలర్
 • మాక్స్ వెబర్
 • లూథర్ గలిక్
 • లిండాల్ ఉర్విక్
 • మేరీ పార్కర్ ఫాలెట్
 • జార్జ్ ఎల్టన్ మేయో
 • ఛెస్టర్ బర్నార్డ్
 • హెర్బర్ట్ సైమన్
 • అబ్రహాం మాస్లో
 • డగ్లస్ మెక్‌గ్రెగర్
 • క్రిస్ ఆర్గరిస్
 • ఫ్రెడరిక్ హెర్జ్‌బర్గ్
 • రెన్సిస్ లైకర్ట్
 • ఫ్రెడ్ రిగ్స్
 • ఎజ్‌కెల్ డ్రార్
 • కార్ల్ మార్క్స్

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
 • పాలనా తత్త్వశాస్త్రం at PhilPapers
 • పాలనా తత్త్వశాస్త్రం at the Indiana Philosophy Ontology Project
 • "Political philosophy". Internet Encyclopedia of Philosophy.
 • దృశ్యక పాఠాలు(ఆడించడానికి అడోబె ఫ్లాష్ అవసరం): పాలనా తత్త్వశాస్త్ర పరిచయం ఆంగ్లంలో సమర్పకులు : స్టీవెన్ బి. స్మిత్, యేల్ విశ్వవిద్యాలయం.

మూలాలు[మార్చు]

 1. ప్రసాద్, డి. రవీంద్ర. ప్రవేశిక. కొత్త ఢిల్లీ: స్టెర్లింగ్ పబ్లిషర్స్. p. 1. ISBN 9788120720718.
 2. పాలనా తత్త్వవేత్తలు పుస్తకంలోని రచయితల పరిచయ పేజీ
 3. పాలనా తత్త్వశాస్త్ర చరిత్రను తెలిపే బొమ్మ
 4. ది పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ కన్‌ఫ్యూషియనిజం