బులుసు అపర్ణ
బులుసు అపర్ణ ద్విశతావధాని, రచయిత్రి. ఆమె అవధాన విద్యాప్రదర్శన చేస్తున్న అతి కొద్దిమంది మహిళలలో ఒకరు.[1] ఆమె పుల్లాభట్ల నాగశాంతిస్వరూపతో కలిసి జంటగా కొన్ని అవధానాలు, ఆకెళ్ళ నాగవెంకట ఉదయచంద్రిక తో కలిసి కొన్ని అవధానాలు, ఒంటరిగా కొన్ని అవధానాలు చేశారు.[2]
బులుసు అపర్ణ గారు సాహితీకౌముది అనే యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించారు.ఈ ఛానల్ ద్వారా తెలుగు, సంస్కృత సాహిత్యాలలో గల విశేషాలను, భగవద్గీత వివరణము సులువైన రీతిలో సవివరంగా అందిస్తున్నారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె 1987, ఆగస్టు 5వ తేదీకి సరియైన ప్రభవ నామ సంవత్సర, శ్రావణ శుద్ధ ఏకాదశినాడు బులుసు అచ్యుతరామమోహన్, నాగపద్మ మీనాక్షి దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణంలో జన్మించారు. ఈమె ప్రాథమిక విద్య వేలివెన్ను గ్రామంలో గడచింది. రాజమండ్రిలోని ఆంధ్ర యువతీసంస్కృత కళాశాలలో బి.ఎ.డిగ్రీని పూర్తి చేసి తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో ఎం.ఎ. (సంస్కృతం), శిక్షాశాస్త్రి పూర్తి చేశారు. అదే విశ్వవిద్యాలయం నుండి సంస్కృతం లో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి దూరవిద్య ద్వారా తెలుగు లో ఎం.ఎ పూర్తి చేశారు.
ప్రస్తుతం(2026) జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల జి కొత్తపల్లి, ద్వారకాతిరుమల మండలం నందు సంస్కృత ఉపాధ్యాయురాలిగా పనిచేయుచున్నారు.
అవధానాలు
[మార్చు]ఈమెకు అవధాన గురువు ధూళిపాళ మహదేవమణి. ఈమె రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కావలి, కర్నూలు, బందరు, పిఠాపురం, హైదరాబాదు, బెంగుళూరు, ఖమ్మం, అశ్వాపురం మొదలైన చోట్ల 300 కు పైగా అష్టావధానాలను చేశారు.[3] ఏడు శతావధానాలు, రెండు ద్విశతావధానాలు, ఒక చతుర్గుణిత అష్టావధానం చేశారు. ఇవి అన్ని స్వీయ అవధానాలు. ఖతార్ దేశంలో దోహా నగరంలో చేసిన అష్టావధానం తో ఈమె మధ్య ప్రాశ్చ దేశాలలో మొదట అష్టావధానం చేసిన వ్యక్తిగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు.
మచ్చుకు ఈమె పూరించిన ఒక పద్యం:
- దత్తపది: సచిన్ - ద్రవిడ్ - గంగూలి - గంభీర్ అనే పేర్లతో భారతార్థంలో ఒక పద్యం.
పూరణ:
ఆస చిన్నది ఐదూళ్ళు అడుగ భీతి
ముద్ర విడనాడి కౌరవ మోహ మతులు
అనిని జొచ్చి వేగం గూలిరధము లౌచు
క్రౌర్య గంభీరు లవ్వారి కర్మమదియే
రచనలు
[మార్చు]- గురు ప్రస్తుతి శతకం (పుల్లాభట్ల నాగశాంతి స్వరూపతో కలిసి)
- ద్వారకాగిరి నాయక శతకం
పురస్కారాలు, బిరుదులు
[మార్చు]- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2014లో దూరదర్శన్ వారిచే మహిళా సాధికారత పురస్కారం
- శతావధాన శారద బిరుద ప్రదానం
- అవధాన రాజహంసిని బిరుదము
- అవధాన విద్యాకోకిల
- అవధాన విద్వాన్ మణి
- అవధాన విద్యాసురభి
- అవధాన విద్యాసరస్వతి
- నోరి నరసింహ శాస్త్రి గారి యువ రచయిత ప్రోత్సాహక పురస్కారం (2023)
- శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం వారి అవధాన కవి పురస్కారం (2024)
- తెలంగాణ గవర్నర్ గారి నుండి HM TV వారి మాతృ శక్తి పురస్కారం అందుకున్నారు.(2025)
- తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం (2023వ సంవత్సరానికి గాను 2025 ప్రకటించి, అందించినారు)[4]
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుండి ఉగాది పురస్కారం (2025)
మూలాలు
[మార్చు]- ↑ రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 905–906.
- ↑ "On the Everest of Satavadhanam". The Hindu (in Indian English). 2014-06-05. ISSN 0971-751X. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-05-05.
- ↑ యినుగంటి రఘు, శ్రీకాకుళం, వెలిచేటి జ్యోతిప్రసాద్, విజయనగరం (2 March 2016). "అతివనైనా అవధాని అయ్యాను". ఆంధ్రజ్యోతి. ఒరిజినల్ నుండి 14 సెప్టెంబరు 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 14 September 2016.
{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link) - ↑ "తెలుగు భాష అస్తిత్వానికి ప్రతీక తెలుగు వర్సిటీ". NT News. 3 September 2025. the original నుండి 4 September 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 September 2025.