Jump to content

టెలివిజన్

వికీపీడియా నుండి
(బుల్లితెర నుండి దారిమార్పు చెందింది)
1958 లో అమెరికన్ కుటుంబం టెలివిజన్ కార్యక్రమాలను వీక్షిస్తున్న దృశ్యం

'"టెలివిజన్"' (దూరదర్శన్) అనునది సుదూర ప్రాంతాలకు ఒక మాధ్యమం ద్వారా చలన చిత్రాలను, ధ్వనిని ఒకేసారి గ్రహించగలిగే సాధనం. దీనిద్వారా దృశ్య, ధ్వని సమాచారాన్ని ఒకేసారి గ్రహించవచ్చు. ఇది నలుపు-తెలుపు, రంగుల్లో చిత్రాలను చూపించే సాధనం. టెలివిజన్ అనే పదమునకు మూలం లాటిన్, గ్రీకు పదాలు. "దూర దృష్టి" అనే అర్థం వచ్చే గ్రీకు పదం tele (గ్రీకు:τῆλε) అనగా దూరం,, లాటిన్ పదం visio అనగా దృష్టి అని అర్థము.

చిత్రాలను పంపించే వ్యవస్థ

[మార్చు]

తంతి ద్వారా చిత్రాలు

[మార్చు]

ఎక్కడో సుదూర ప్రాంతాల్లో జరిగే వింతల్ని, విశేషాల్ని మన కళ్ళ ఎదుట చూడాలనే తపన మానవుని హృదయాంతరాళాలలో ప్రాచీన కాలం నుండి మొదలవుతూనే ఉంది. మాయాలాంతరు, మంత్రదండం, అంజనం డబ్బీ మొదలైన విచిత్ర సాధనాల సహాయంతో ఇలాంటివి సాధ్యమయ్యేవని పిట్ట కథల్లో, పుక్కిడి పురాణాల్లో ఎన్నోసార్లు విన్నాం. ఒకతరం ముందు కూడా మానవుడు వూహించలేని ఈ పరిణామం మన తరంలో సిద్ధింస్తుందని ఎవరు కలలుకన్నరు?

విద్యుత్ సహాయంతో వార్తల్ని పంపే టెలిగ్రాఫ్ కనుక్కోబడిన రోజుల్లోనే బొమ్మల్ని కూడా ఇలా పంపడానికి వీలవుతుందా అని అలెగ్జాండర్ బెయిన్ అనే స్కాట్‍లాండ్ మనో వైజ్ఞానిక శాస్త్రజ్ఞుడు ప్రయత్నించాడు. దీనికోసం 1842 లో ఇతడు రూపొందించిన చిన్ని యంత్రాన్ని బేక్‍వెన్ అయిదేళ్ళ తరువాత మెరుగు పరచాడు. ఈ యంత్రంలో ప్రసారిణి, రిసీవర్ అనే రెండు స్థూపాలుంటాయి. ఆ రెండూ గడియారాల సహాయంతో ఒకే వేగంతో తిరుగుతాయి. ప్రసారిణి చుట్టూ చుట్టబడిన పల్చని లోహపు రేకుపై మనం ప్రసారం చేయదలచుకున్న బొమ్మలు గీయబడి ఉంటాయి. ఈ బొమ్మల్ని విద్యుత్ వాహక ధర్మం లేనటువంటి సిరాతో గీస్తారు. స్థూపం తిరిగెటప్పుడు ఒకసూది దాన్ని తాకుతూ క్రమంగా పక్కకు జరిగే ఏర్పాటు ఉంటుంది. ఈ సూదిని బ్యాటరీ ద్వారా రిసీవర్ కి సంధిస్తారు. విద్యుత్ వాహకం కాని సిరాని సూది తాకినప్పుడు, వలయంలో ప్రవహించే విద్యుత్తుకు అంతరాయం కలుగుతుంది.

రిసీవర్ లో కూడా స్థూపం చుట్టూ ఓ కాగితం అంటించబడి ఉంటుంది. దానిపై రసాయనిక పూత ఉంటుంది. విద్యుత్ ప్రవాహంలో అంతరాయం కలిగినప్పుడు తప్ప మిగతా సమయాల్లో రసాయనిక చర్యమూలంగా బొమ్మ తాలూకు గుర్తులు కాగితంపై ఏర్పడతాయి. అంటె రంగు కాగితం పై తెల్లని బొమ్మ ఏర్పడుతుందని అర్థం.

సుమారు అర్థ శతాబ్దం తరువాత ఆర్థర్ కార్న్ అనే జర్మన్ భౌతిక శాస్త్రజ్ఞుడు ఈ పద్ధతిని మెరుగు పరిచాడు. ప్రసరిణిలో సూదికి బదులు పోటో ఎలక్ట్రిక్ సెల్ ని ఎతడు ఉపయోగించాడు. ప్రసారం చేయాల్సిన బొమ్మ వివిధ భాగలపై క్రమంగా కాంతిని పడనిస్తాడు. ఇలా చేయడాన్ని "స్కానింగ్" అంటారు. వివిధ భాగాల కాంతి తీవ్రతలకు అనుగుణంగా విద్యుత్ ప్రవాహంలో మార్పులు సంభవిస్తాయి. ఈ విద్యుత్తును రిసీవర్కి పంపిస్తారు. మారుతున్న విద్యుత్ కి అనుగుణంగా ఇక్కడ ఓ చిన్న దీపం వెలుగుతూ, దాని కాంతి తీవ్రతలో హెచ్చు తక్కువలు ఏర్పడతాయి. తిరుగుతున్న స్థూపం చుట్టూ అతికించబడిన ఫొటోగ్రాఫీ కాగితంపై ఈ కాంతి పడినప్పుడు ప్రసారిణిలో వుండే బొమ్మలాంటి ప్రతిబింబం నిర్మించబడుతుంది.

ఫోటోలు, దస్తావేజులు లాంటి ముఖ్యమైన రికార్డులను ఒకచోటు నుంచి మరొక చోటుకి ప్రసారం చేయడంలో ఇలాంటి పద్ధతి ఇప్పుడు కూడా వినియోగిస్తున్నారు. పోలీసు శాఖకీ, వార్తాపత్రికలకీ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. వార్తలకు సంబధించిన పోటోలను వివిధ నగరాల నుండి వెలువడే పత్రికల్లో ఏక కాలంలో ముద్రించటానికి ఈ పద్ధతి బాగా ఉపకరిస్తుంది.అమెరికా లోని కొన్ని పత్రికా సంషలు ఈ పద్ధతి ద్వారా మొత్తం వార్తా పత్రికలనే పేజీల వారీగా ప్రసారం చేయటం 1950 నుంచి వాడుకలో ఉంది. చందారాదు ఇంట్లో ఓ రిసీవర్ ని ఉంచుతారు. వార్తాపత్రిక తయారైన కొద్ది సెకెండ్ల లోనే దాని కాపీ చందాదారు ఇంట్లో ప్రత్యక్షమవుతుంది. వివిధ చందాదారులకి కాపీలను అందించటం క్షణాల్లో జరిగిపోతుంది. పత్రికల్ని వాహనాల్లో తీసుకెళ్ళడం, ఇంటింటికీ పంచిపెట్టడం లాంటి బాదరబందీ ఉండదు. టెలివిజన్ లో ఖాళీగాఅ ఉన్న ఛానల్ ల ద్వారా చందాదారు నిద్ర లేవక ముందే వార్తాపత్రికల్ని ప్రసారం చేయవచ్చని బ్రిటన్ ఇంజనీర్లు విశ్వసిస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున రిసీవర్‍లను చవకగా ఉత్పత్తిచేసే వీలుంటే తప్ప ఇలాంటి ప్రయోగం విజయవంతం కాదు.

ఫాక్స్ మెయిల్ పద్ధతి

[మార్చు]

1959 లో ఫేక్స్ మెయిల్ అనే కొత్త పద్ధతిని అమెరికా పోస్టల్ శాఖ ప్రవేశపెట్టింది. ప్రత్యేక కాగితాలపై రాయబడ్డ వుత్తరాల్ని నిముషానికి 1800 పదాల చొప్పున సుదూర ప్రాంతాలకి ఈ పద్ధతిలో ప్రసారం చేయవచ్చు. టెలివిజన్ ప్రసార పద్ధతినే ఇందులో వాడతారు. ఎయిర్ మెయిల్ లో ఉత్తరాల్ని పంపే ఖర్చులో పాతిక భాగంతోనే ఫేక్స్ మెయిల్ వ్యవస్థ పనిచేస్తుందని అంచనా వేశారు. పైగా ప్రసార కాలం అత్యల్పం కాబట్టి ఉత్తరాల్లోని విషయాలను అతి గోప్యంగా వుంచటానికి వీలుంటుంది.

ఫోటోలను ప్రసారం చేయగలిగినపుడు, కళ్ళ ఎదుట జరిగే దృశ్యాలను ఇదే పద్ధతిలో ప్రసారం చేయటానికి వీలుండాలి కదా అని కొందరు శాస్త్రజ్ఞులు తీవ్రంగా ఆలోచించారు. ఇలా చేయగలిగితే ఒక ఊళ్ళో జరిగే ప్రముఖ సంఘటనల్ని మరో ఊరి వాళ్ళు లేదా ఇతర నగరాల్లోని వాళ్ళు అదే సమయంలో తిలకించటానికి వీలుంటుంది.

టెలివిజన్ ఆవిష్కరణ చరిత్ర

[మార్చు]

స్కానింగ్ విధానము

[మార్చు]

ఈ దిశలో మొదటి ప్రయోగం 1883 లోనేజరిగింది. బెర్లిన్ విశ్వవిద్యాలయం లోని పోల్ నివ్ కో అనే విద్యార్థి కాస్త మొరటుగా ఉండే స్కానింగ్ సాధనాన్ని నిర్మించాడు. ముఖ్యంగా రెండు ఆవిష్క్రణలు అతని ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేశాయి. మొదటికి టెలిఫోన్. సెలేనియం అనే లోహంపై సూర్యకాంతి పడనప్పుడు దానిగుండా విద్యుచ్చక్తి మరింత సులువుగా ప్రవహిస్తుందనే విషయాన్ని కనుక్కోవడం రెండోది. దీని ఆధారంగానే ఫోటో ఎలక్ట్రిక్ సెల్ నిర్మించబడినదని ఈ సందర్భంలో మనం గుర్తుంచుకోవాలి. సెలేనియం పై పడే కాంతి తీవ్రతలలో తేడాలను బట్టి విద్యుత్ ప్రవాహం మారుతుంది. గనుక ఒక దృశ్యాన్ని ఈ సిద్ధాంతం ఆధారంగా ప్రసారం చేయాలని నివ్ కో ప్రయత్నించాడు.

నిప్కో డిస్క్ - విద్యుత్ దూరదర్శిని

[మార్చు]

ఇందుకుగాను దృశ్యాన్ని చిన్నచిన్న భాగాలుగా చేసి, వాటిని ఓ క్రమ పద్ధతిలో వేగంగా స్కాన్ చేయాలి. వాటి కాంతి తీవ్రతల తేడాను బట్టి ప్రవహించె విద్యుత్ పరిమాణంలో మార్పులు ఏర్పడతాయి. రిసీవర్ లో ఈ విద్యుత్తుని మళ్ళీ కాంతిగా మారిస్తే, తెరపై తొలిదృశ్యాన్ని నిర్మించవచ్చు. ఈ సిద్ధాంతం ఆధారంగా నిప్కో నిర్మించిన పరికరానికి విద్యుత్ దూరదర్శిని (Electric Telescope) అని పేరు పెట్టారు. అయితే తన ఆలోచనల్ని కార్యరూపంలోకి తేవటంలో అతడెన్నో సాంకేతిక సమస్యల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ప్రయత్నాల్ని అర్థాంతరంగా నిలిపివేసి రైల్వే ఇంజనీరుగా ఉద్యోగంలో చేయసాగాడు.

ఫోటో ఎలక్ట్రిక్ సెల్ నిర్మాణము

[మార్చు]

ఎలక్ట్రానిక్స్ విభాగంలో పరిశోధనలు కొంత ప్రగతిని సాధించాక టెలివిజన్ సమస్యని మరోకోణం నుంచి పరిశీలించటానికి వీలయింది. క్రూక్స్ అనే శాస్త్రజ్ఞుడు నిర్మించిన కాథోడ్ కిరణ నాళాన్ని స్ట్రాన్‍బర్గ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ బ్రాన్ మెరుగుపరిచాడు. కిరణ నాళంలో ఒక వైపున వుండే తెరని కొన్ని రసాయనిక పదార్థాలతో పూస్తే దానిపై ఎలక్ట్రాన్ లు పడినపుడు కాంతివంతమైన చుక్కలు ఏర్పడతాయని బ్రాన్ కనుగొన్నాడు. బ్రాన్ నాళం అనబడే ఈ పరికరం 1897 లో తయారైంది. ఈ సూత్రం ఆధారంగానే జూలియన్ ఎల్‍స్టర్, హాన్స్ గైటర్ అనే ఇద్దరు జర్మన్ శాస్త్రజ్ఞులు సెలేనియం కంటే అతి వేగంగా, సమర్థవంతంగా పనిచేసే ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ని నిర్మించారు.

స్థూల చిత్రాన్ని ప్రసారం చేసే మొదటి నమూనా

[మార్చు]

దృశ్యాల ప్రతిబింబాల్ని నిర్మించడంలో బ్రాన్ నాళం పాత్రని గుర్తించిన తొలి భౌతిక శాస్త్రజ్ఞుడు సెయింట్ పీటర్స్ బర్గ్ సంకేతిక సంస్థకి చెందిన బోరిన్ రోసింగ్, నిప్‍కో పరికరాన్ని ప్రసారిణిలో స్కానింగ్ చేయడానికీ, ప్రతిబింబాల్ని నిర్మించడానికీ కాథోడ్ కిరణ నాళాన్ని రిసీవర్ గానూ ఉపయోగించవచ్చునని 1907 లోనే రోనింగ్ సూచించాడు. ఇదే సమయంలో కాంవ్ బెల్ - స్వింటన్ అనే ఇంగ్లండ్ శాస్త్రజ్ఞుడు కాథోద్ కిరణ నాళాన్ని ప్రసారిణిలోనూ, రిసీవర్ లోనూ ఉపయోగించే మరో పద్ధతిని సూచించాడు ఈ అభిప్రాయాల్ని అతడు 1908 లో నేచర్ అనే వైజ్ఞానిక మాసపత్రికలో క్షుణ్ణంగా వివరించాడు. మాక్స్ డీక్మన్ అనే మ్యూనిచ్ ఇంజనీర్ ఈ అభిప్రాయాల్ని మెరుగుపరచడమే కాకుండా స్థూల చిత్రాల్ని (Silhouettes) ప్రసరం చేసే ఓ చిన్న నమూనాని కూడా తయారుచేశాడు.

జాన్ లోగీ బయర్డ్ ఆవిష్కరణ

[మార్చు]

టెలివిజన్ నిర్మాణంలోనే సాంకేతిక సమస్యల్ని చాలా వరకు పరిష్కరించినవాడు స్కాట్లండ్కి చెందిన ఓ క్రైస్తవ మతాధికారి కొడుకు జాన్ లోగీ బెయిర్డ్. అనారోగ్యం కారణంగా ఇంజనీరింగ్ విద్యని పూర్తిచేయలేక యితడు వ్యాపార రంగంలో ప్రవేశించాడు. చారింజ పళ్ళతో ప్రారంభించి సబ్బులు, బ్లేడులు అమ్మటం మొదలు పెట్టాడు. మలేరియాతో మంచం పట్టి 1922 లో కోలుకున్నాక టెలివిజన్ సమస్యలవైపు దృష్టి సారించాడు.

విసుగు చెందని విక్రమార్కుడిలా అకుంఠిత దీక్షతో ఓ ధ్యేయం కోసం అహర్నిసలూ శ్రమించిన ఉదాహరణలు సాంకేతిక శాస్త్ర చరిత్రలోనే చాలా అరుదు. ఈ శతాబ్దానికే తలమానికమైన ఆవిష్కరణని సాధించడంలో బెయిర్డ్ ఎదుర్కొన్న అవాంతరాలు అన్ని ఇన్నీ కావు. ఆరోగ్యం అంతంత మాత్రమే. అర్థబలం అసలు లేదు. టెలివిజన్ పూర్వాపరాల గురించిన పరిజ్ఞానం శూన్యం. మేడమీదున్న ఓ మురికి గది ఓ ప్రయోగశాల. ఎలక్ట్రికల్ వ్యాపారస్తుడి దగ్గర మూలపడ్డ ఓ పాత ఎలక్ట్రిక్ మోటారుని కొన్నాడు. చిన్న అట్టముక్క నుంచి నివ్‍కో ఫలకాన్ని తయారు చేశాడు. సైకిల్ షాప్ లో కొన్ని కటకాలను కొన్నాడు.మిలిటరీ స్టోర్ లో మూల పడేసిన పాత వైర్‍లెస్ టెలిగ్రాఫ్ పరికరాన్ని సంపాదించాడు. టార్చ్ బ్యాటరీలు, సూదులు, కొయ్యముక్కలు, కాస్త లక్క, దారాలు, జిగురు, గదిలో ఎక్కడ చూసినా పడిఉండే తీగలు - ఇవీ అతని ప్రయోగశాలలోని పరికరాలు!

రెండేళ్ళ నిరంతర కృషి ఫలితంగా కొన్ని ఆకారాల్ని సుమారు మూడు మీటర్ల దూరందాకా ప్రసారం చేయడంలో బెయిర్డ్ కృతకృత్యులయ్యాడు. ప్రపంచానికే వింతగొలిపే ఈ అధ్బుత పరికరాన్ని లండన్ లోని ఓ పెద్ద ఎలక్ట్రిక్ షాప్ యజమాని తిలకించి ముగ్ధుడై పోయాడు. తన షాపులో రోజుకి మూడుసార్లు ఈ పరికరాన్ని ప్రదర్శించటానికి బెయిర్డ్ ని అతడు నియోగించాడు. బతుకు తెరువు కోసం బెయిర్డ్ దీనికి అంగీకరించాడు. తన మొరటు నమూనాని ప్రదర్శిస్తూ ఇలాగే వుండెపోతే అపకీర్తి పాలవడమె కాకుండా పరిశోధనలకు స్వస్తి చెప్పాల్సి వస్తుందని అనతికాలంలోనే గ్రహించిన బెయిర్డ్ రాజీనామా సమర్పించి, మళ్ళీ తన గదిని చేరుకున్నాడు.

తరువాతి పరిశోధనల ఫలితంగా 1925 అక్టోబరు 2 వ తేదీన ఓ కంపెనీలో పనిచేసే అబ్బాయి ముఖాన్ని ప్రసారంచేశాడం, ఈ చిత్రాన్ని పక్క గదిలోని రిసీవర్లో చూడటం జరిగింది. కొన్ని నెలల తర్వాత, అతడు తన పరికరాన్ని వైజ్ఞానిక సంఘ సభ్యులకూ, పత్రికా విలేఖరులకూ ప్రదర్శించాడు.

బెయిర్డ్ పరికరంలో స్కానింగ్, ప్రతిబింబాన్ని పునర్నిర్మించటం యాంత్రిక పద్ధతిలో జరగడం మూలాన నమూనా కాస్త మొరటుగానూ, లోపభూయిష్టంగానూ ఉండేది. ప్రసారిణిని రిసీవర్ కి తీగల ద్వారా సంధించడం తొలిదశలో జరిగింది. ఒకటి రెండు సంవత్సరాల తరువాత రెండింటికీ మధ్య తీగలు లేకుండా వైర్‍లెస్ పద్ధతిని అవలంభించాడు. రిసీవర్ లో కనబదే ప్రతిబింబం మరీ స్పష్టంగా ఉండాలని, ప్రసార దూరం క్రమంగా ఎక్కువ చేయాలనీ బెయిర్డ్ కృషిచేశాడు. తన పరిశోధనల్లో బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి) భాగస్వామి కావాలని అతడెంతగానో ఆకాంక్షించాడు. మొదట అనేక విఘ్నాలు ఏర్పడినా పార్లమెంట్ వత్తిడి మూలంగా 1929 లో బి.బి.సి ప్రయోగాత్మకంగా టెలివిజన్ కార్యక్రమాల్ని ప్రసారం చేయటం మొదలుపెట్టింది.

ఎలక్ట్రానిక్స్ పద్ధతిలో టెలివిజన్

[మార్చు]
Vladimir Zworykin's patent diagram of an iconoscope, 1931, [1]

ఇది ఇలా ఉండగా అమెరికాలో ఎలక్ట్రానిక్స్ పద్ధతిలో టెలివిజన్ రూపొందించే కృషి ముమ్మరంగా జరిగింది. ఈ విభాగంలో ఫార్నన్ వర్త్, జ్యోరికిన్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు ప్రముఖంగా చెప్పుకోదగ్గవారు. జ్యోరికిన్ రష్యాలో జన్మించి బోరిన్ రోసింగ్ వద్ద విద్యాభ్యాసం చేశాడు. వీళ్ళిద్దరూ కలసి 1910 నుంచి కాథోడ్ కిరన నాళాన్ని రిసీవర్ గా ఉపయోగించి టెలివిజన్ కి సంబంధించిన ప్రయోగాలు చేశారు. నివ్ కో ఫలకంతో యాంత్రికంగా జరిగే స్కానింగ్ ని బ్రాన్ నాళంతో ముడిపెట్టడం కుదరదనీ, సంపూర్ణంగా ఎలక్ట్రానిక్స్ పద్ధతిని రూపొందిస్తే టెలివిజన్ ప్రయోగాలు ఫలిస్తాయని వారు గ్రహించారు. జ్యోరికిన్ 1919 లో అమెరికాకు వెళ్ళి పరిశోధన కొనసాగించారు. ఫలితంగా 1928 లో ఇతడు ఐకనోస్కోప్ అనే పరికరాన్ని తయారు చేయగలిగాడు. దృశ్యాల్ని అతి త్వరగానూ, సమర్థవంతంగానూ ప్రసారం చేయగల విప్లవాత్మక సాధనంగా ఇది తయారైంది. అప్పటి నుంచి ఇది టెలివిజన్ కెమెరాలో ఒక ప్రధాన భాగంగా ఉంటోంది. జ్యోరికిన్ చేసిన ఈ పరిశోధనకి రేడియో కార్పొరేషన్ ఆఫ్ అమెరికా అనే సంస్థ ఆర్థిక వనరుల్ని అందించింది.

Vladimir Zworykin demonstrates electronic television (1929).

జ్యోరికిన్ నిర్మించిన కెమెరా మౌలికంగా మనిషి కన్నులా ఉంటుంది. ప్రసారం చేయాల్సిన దృశ్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిపై ఓ క్రమ పద్ధతిలో ఎలక్ట్రాన్ ల సముదాయాన్ని సెకనుకు 24 సార్లు పడేలా చేస్తారు. విద్యుత్ ప్రవాహ పరిమాణంలో ఇక్కడ ఏర్పడే మార్పులను ప్రసారిణి వుత్పత్తి చేసే తరంగాలలో సంధించి, వాటిని విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ప్రసారం చేస్తారు. రిసీవర్ లో ఓ పెద్ద కాథోడ్ కిరణ నాళం, అందులో ఒక పెద్ద తెర వుంటాయి. ప్రసారిణిలో వుండే కెమెరాలలో ఎంత వేగంతో ఎలక్ట్రాన్ ల సముదాయం కదులుతుందో అదే వేగంతో రిసీవర్ లో కూడా కదిలినప్పుదు దృశ్యం తెరమీద నిర్మించబడుతుంది. ఈ రెండు వేగాలు సమానంగా ఉండేలా చూడడాన్ని సింక్రోనైజేషన్ అంటారు. బ్రిటిష్ పద్ధతిలో దృశ్యాల్ని 405 రేఖలుగా విభజిస్తే, అమెరికా, ఐరోపా దేశాల్లో 805 రేఖలుగా విభజించే పద్ధతి అందుబాటులో ఉంది.

ప్రసారిణి పంపే టెలివిజన్ తరంగాలు కొంత దూరం మాత్రమే ప్రయాణింప గలుగుతాయి. దేశమంతా టెలివిజన్ ప్రసారాల్ని విస్తరింపజేయటానికి గాను మొదట్లో కో ఆక్సియల్ కేబుల్ లను వాడి దృశ్య తరంగాల్ని, శబ్ద తరంగాల్ని ఒక స్టేషను నుంచి మరో స్టేషనుకు తీసుకెళ్ళే యేర్పాటు ఉండేది.

టెలివిజన్ ప్రసారాల ప్రారంభం

[మార్చు]

టెలివిజన్ ప్రసారాల్ని క్రమంగా ప్రసారం చేయడం లండన్ లో 1936 నవంబర్ 2 వ తేదీన ప్రారంభమైనది. ఒక వారం ప్రసారం బెయిర్డ్ పద్ధతిలో జరిగితే మరుసటి వారం జ్యోరికిన్ పద్ధతిలో జరిగుతుండేవి. రెండు పద్ధతుల్ని మార్చి మార్చి వాడాక జ్యోరికిన్ పద్ధతినే తుదకు ఎన్నుకున్నారు. కానీ శత్రు విమానాలు లండన్ లో చేరడానికి టెలివిజన్ తరంగాలు ఉపకరించవచ్చు. నన్న కారణంగా రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే టెలివిజన్ ప్రసారాలను బ్రిటన్ నిలివివేసి, 1946 జూన్ లో మళ్ళీ ప్రారంభించింది. తన పద్ధతిని ఆపి వేయడంతో నిరాశ చెందిన బెయిర్డ్ 58 వ యేట రంగు టెలివిజన్ లపై పరిశోధనలు చేస్తూ కన్నుమూశాడు.

ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాలో టెలివిజన్ కి అంకురార్పణ జరిగింది. యుద్ధం ముగిసిన తరువాత టెలివిజన్ రిసీవర్ ల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 1960 నాటికి దేశంలో మూడింట రెండు వంతుల జనాభా టెలివిజన్ కార్యక్రమాల్ని తిలకించటానికి వీలైంది. విన్న విషయాల కంటే కళ్లకు కట్టినట్తు చూసిన కార్యక్రమాల ప్రభావం ఎక్కువగా ఉండటం మూలాన రేడియో తెరమరుక్కి వెళ్ళడం, టెలివిజన్ విశ్వరూపం ధరించి ప్రపంచమంతటా వ్యాపించటం మొదలైంది. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఇది కీలక సాధనం. మంచికో చెడుకో ప్రజల్ని సామూహికంగా ఇది ప్రభావం చేయగలదు. జాయి భవిష్యత్తును తీర్చి దిద్దే నాయకుల్ని మన లోగిళ్ళకి లాక్కువస్తుంది. ఎన్నికల్లో నిలబడ్డ రాజకీయ వాదుల్ని నిశితంగా పరిశీలించటానికి, ప్రపంచ సంఘటనల్ని దృశ్య కళల్ని ఆఖరికి సినిమాలనీ చిన్న తెరపై చూడవచ్చు. చికాకు కలిగించే సీరియల్ కథలతోనూ, ఏవగింపు కలిగించే హాస్యాలతోను కాలం వృధా చేయవచ్చు. చిన్న తెరపై చూపించె వ్యాపార ప్రకటనల ప్రవాహంలో కొట్టుక పోయి పనికిరాని వస్తువులపై డబ్బు తగలెయ్యవచ్చు. ఆవిష్కరనకి పూర్వం మానవ కళ్యాణానికి మరో మెట్టు కాగలదని ఆశలు చిగురింపజేసిన ఈ టెలివిజన్ ఓ వ్యసనంగా, వ్యామోహంగా పరిణమిస్తుందని ఎవరూ మొదట్లో ఊహించలెక పోయారు. సాంకేతిక ప్రగతి ఎక్కువయ్యే కొద్దీ మానవత్వపు విలువలు దెబ్బతినడానికి ఆస్కార ముందని టెలివిజన్ లా మరే ఆవిష్కరనా నిరూపించలేదు.

సాంకేతిక ప్రగతి

[మార్చు]

టెలివిజన్ విభాగానికి సంబంధించిన సాంకేతిక ప్రగతి నిజంగానే మనం ఊహించలేని స్థాయికి ఎదిగింది. చేయిలో ఉంచుకోవటానికి వేలైన పరిమాణంలో టెలివిజన్ సెట్ ని 1952 లో తయారు చేశారు. ఏ ప్రాంతానికైనా వెళ్ళి మైక్రోవేవ్ సిగ్నల్ ల ద్వారా ప్రాంతీయ ప్రసార కేంద్రాలకు కార్యక్రమాల్ని పంపించి అక్కది నుంచి పునః ప్రసారం చేయటం అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. జూం కటకమనే దృశ్య సాధనం సుమారు. రెండున్నర సంవత్సరాల పరిశోధనల ఫలితంగా రూపొందించబడింది. ఫోటో తిస్తున్న దృశ్యం పరిమాణాన్ని కేవలం ఒక సెకను కాలంలో తగ్గించటానికి గానీ, పెంచటానికి గానీ దీని వల్ల వీలవుతుంది. ఫలితంగా తటాలున క్లోజప్ తీయటానికి, లేదా వనక్కి వెళ్ళినట్టుగా మొత్తం దృశ్యాన్ని ఒక్క సారిగా చూడటానికి, లేదా వెనక్కి వెళ్ళీనట్టుగా మొత్తం దృశ్యాన్ని ఒక్క సారిగా చూడటానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది.

రంగుల టెలివిజన్

[మార్చు]

టెలివిజన్ కార్యక్రమాల్ని రంగుల్లో ప్రసారం చేయటానికి వీలవుతుందని ఆటోవాన్ బ్రాంక్ అనే జర్మన్ భౌతిక శాస్త్రజ్ఞుడు 1902 లోనే నిరూపించాడు. కానీ తొలి దశలో ఆ రిసీవర్ ల ధర చాలా ఎక్కువగా ఉండేది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో జరిగిన విస్తృత పరిశోధనల మూలంగా రంగు టెలివిజన్ ప్రసారాలు అమెరికాలో 1950 దశకంలోనూ, జపాన్ లో 1960 లోనూ, బ్రిటన్ లో 1967 లోనూ ప్రారంభించబడ్డాయి. వీటికి సంబంధించిన పరిశోధనల్లో ప్రధానంగా మూడు సంస్థలు కృషి చేశాయి. - అమెరికాలో NTSC (National Television systems committee), ఫ్రాన్స్ లో S.E.C.A.M, జర్మనీలో P.A.L అనే సంస్థలు. రంగు టెలివిజన్ ప్రసారాల్లో ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగుల్లో స్కానింగ్ జరుగుతుంది. ఈ మూడు రకాల సిగ్నల్స్ లని రిసీవర్ కి ప్రసారం చేస్తారు. అక్కడ జరిగే రంగుల సమ్మేళనం ఫలితంగా రంగు బొమ్మలు తెరపై ఏర్పడతాయి.

నలుపు-తెలుపు టెలివిజన్ నిర్వహణ కంటే రంగుల టెలివిజన్ నిర్వహణ అధిక వ్యయంతో కూడుకున్న దయినప్పటికీ, రాను రాను దాని వాడకం పెరుగుతోంది. పైపెచ్చు ఈ విభాగంతో మరీ విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మామూలు టెలివిజన్ లో వుండే కాథోడ్ కిరణ నాళానికి బదులుగా చదునుగా వుండే తెర వాడుకలోకి వచ్చింది. అమెరికా RAC ప్రయోగ శాలల్లోనూ, లండన్ ఇంపీరియల్ కళాశాల లోనూ దీనికి సంబంధించిన ప్రయోగాలు రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రారంభమైనాయి. 1958 లో డాక్లర్ గ్లేజర్ లండన్ లోని ఒక నమూనాని ప్రదర్శించాడు. చదును తెర వుండే ఈ టెలివిజన్ సెట్ ని ఓ ఫోటో లాగ గోడకి తగిలించుకోవచ్చు. దీని మందం మూడు అంగుళాల కంటే ఎక్కువగా ఉండదు.

వీడియో రికార్డింగ్

[మార్చు]

టెలివిజన్ కార్యక్రమాల్ని టేప్ పై రికార్డు చేయడం మరో గొప్ప పరిణామం. టేప్ రికార్డర్ నిర్మాణం జరిగాక దృశ్య చిత్రాల్ని కూడా రికార్డు చేయాలని పరిశోధనలు నిర్వహించి RAC శాస్త్రజ్ఞుల బృందం 1953 డిసెంబరులో కృతకృత్యులయ్యారు. ఈ పద్ధతి నుపయోగించి సినిమాలని కూద టేప్ పై రికార్డు చేయడం ప్రారంబించారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ దృష్టిలో శబ్ద తరంగాలకూ, పెద్ద తేడా లేకున్నప్పటికీ దృశ్య తరంగాల్ని ప్రామాణికంగా రికార్డు చేయాలంటే 3 నుంచి 5 మిలియన్ హెర్ట్ జ్ దాకాపౌనః పున్యము వుండాలి. రంగు చిత్రాల విషయంలో దీనికి రెండింతల పౌనః పున్యము కావాల్సి వస్తుంది. సౌండ్ హెడ్ సున్నితత్వాన్ని పెంచడం, వెడల్పయిన పత్యేక టేప్ లను వాడటం ద్వారా ఈ ఇబ్బందుల్ని అధికమించి, తొలి వీడియో టేప్ రికార్డర్ ని 1958 లో తయారు చేశారు. ఇందులో ఉపయోగించిన పద్ధతిని అంపెక్స్ అంటారు. ప్రస్తుతం అన్ని టెలివిజన్ కార్యక్రమాల్నీ ప్రసారం చేసే ముందు టేప్ లో రికార్డు చేస్తారు. సినిమాలని కూడా ఇలా టేపుల్లోకి ఎక్కించటం పరిపాటే. ఈ టేప్ లలో శబ్ద తరంగాల్ని ఒక గీతగానూ, దృశ్య తరంగాలను మరో సమాంతర గీతగానూ రికార్డు చేస్తారు. దృశ్య తరంగాల్ని గ్రామఫోన్ లాగా ఓ ఫలకం (Disc) పై రికార్డు చేసే పద్ధతిని బ్రిటిష్, జర్మన్ శాస్త్రజ్ఙుల బృందం కనిపెట్టింది.

సినిమాలు తీయటంలో వీడియో రికార్డింగ్ పద్ధతి ఎంతగానో ఉపకరిస్తుంది. ఫిల్ం లాగా టేప్ ని డెవలప్ చేయటంగానీ, ముద్రించటం గాఅనీ అవసరముండదు. తీసిన సినిమా వెంటనే చూసి, కావలసిన మార్పులను దర్శకుడు వెంటవెంటనే నిర్ధారణ చేసుకోవచ్చు. మొత్తం సినిమానే టెప్ పై తీసి, ఎడిట్ చేసి, సెలులాయిడ్ ఫిల్ం పైకెక్కించవచ్చు. ఇలా చేయడం వల్ల నిర్మాణ ఖర్చులు తగ్గుతాయి. పైగా టేప్ ని తుడిచి వేసి దానిపైననే మళ్ళీ మళ్ళీ రికార్డు చేసుకోవచ్చు కూదా.

ఉపయోగాలు

[మార్చు]

వినోదాన్నందించటమే కాక విజ్ఞాన వ్యాప్తిలో కూడా టెలివిజన్ ప్రముఖ పాత్ర వహిస్తోంది. వైద్య విద్యార్థులు శస్త్ర చికిత్సల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలంటే ప్రక్క గదిలో కూర్చోపెట్టి కోజ్‍డ్ సర్‍క్యూట్ టెలివిజన్ ద్వారా వాళ్ళకు బోధించవచ్చు. పరిశ్రమల్లో, ప్రయోగశాలల్లో దూరం నుంచి పరిశీలించాల్సినప్పుదు కూడా ఈ పద్ధతిని విస్తృతంగా వాదుతున్నారు. పరమాణు రియాక్టర్లు లోనూ, పరమాణు విద్యుచ్చక్తి వుత్పాదన కేంద్రాలలోనూ ప్రవేశ ద్వారం వద్ద గదిలో ఊయల వద్ద వంట ఇంట్లో పొయ్యి వద్ద అమర్చి ఇంటి గృహిణి హాలులో తాపీగా కూర్చున్నప్పటికీ ఎక్కడ ఏం జరుగుతూ ఉందో టెలివిజన్ తెరపై వీక్షించగలిగే యేర్పాట్లు కూడా చేసుకోవచ్చు. సముద్ర గర్భంలోని దృశ్యాల్ని, వ్యోమ నౌకలో పయనించే అంతరిక్ష యాత్రీకుల్ని ఆకాశ వీధిలో ఉండే గ్రహాల్ని, నక్షత్రాల్నీ చూడడంలో టెలివిజన్ కెమెరాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.These are the uses of T.V.

టెలివిజన్ ప్రసారంలో ప్రధాన దశలు

[మార్చు]

టెలివిజన్ ప్రసారంలో ప్రధానంగా మూడు దశలుంటాయి. 1) సమాచార ఉత్పత్తి 2) సమాచార ప్రసారం 3) సమాచారాన్ని గ్రాహకం ద్వారా శోధించటం.

సమాచారం విద్యుత్సంకేతాలుగా మార్చబడతాయి. ఈ సంకేతాలను, తగిన అధిక (రేడియో) పౌనః పున్యం గల విద్యుదయస్కాంత తరంగాలపైన అధ్యారోపణ చేయబడతాయి. ఈ విద్యుదయస్కాంత తరంగాలను రేడియో పౌనఃపున్యమున్న వాహకాలు అంటారు. ఇవి సమాచారాన్ని తీసుకు వెళుతుంటాయి. రేడియో ప్రసారంలో, ఈ వాహక పౌనః పున్యం విలువ సుమారు 300 కోనె హెర్త్జ్ నుండి 30 మెగా హెర్ట్జ్ వరకు ఉంటుంది. టెలివిజన్ ప్రసారంలో వీటి విలువ 30 మెగా హెర్ట్జ్ నుండి 300 మెగా హెర్ట్జ్ వరకు ఉంటుంది.

ఆడియో (ధ్వని), వీడియో (కాంతి) సమాచార తరంగాలను r.f వాహక తరంగాలపై, ఆధ్యారోపణం చేయటాన్ని మాడ్యులేషన్ అంటారు. మాడ్యులేషన్ రెండు రకాలు (1) డోలన పరిమితి మాడ్యులేషన్, (2) పౌనఃపున్య మాడ్యులేషన్. ఈ రెండు పద్ధతులను టెలివిజన్ ప్రసారాలకు ఉపయోగిస్తారు. మాడ్యులేషన్ చేయబడిన సమాచార తరంగాలను, ప్రసారిణి సహాయంతో అంతరాళంలోకి ప్రసరింపజేస్తారు. గ్రాహకం, వాహక అరంగాలలోని మాడ్యులేషన్ చేయబడిన సమాచారాన్ని వేరు చేస్తుంది.ఈ ప్రక్రియను డీ మాడ్యులేషన్ అంటారు.

టెలివిజన్ ప్రసారంలోని ప్రాథమిక నియమాలు

[మార్చు]
  1. స్టుడియోలో ఉత్పత్తి అయిన ధ్వని లేదా ప్రతిబింబాల్ని విద్యుదయస్కాంత తరంగ సంకేతాలుగా మారుస్తారు. వీటిని ఆవర్థనం (Amplify) చేస్తారు.
  2. ఈ విద్యుత్ సంకేతాలను, ప్రసారిణి (Transmitter) ఉత్పత్తి చేసే r.f వాహక తరంగాలపై, ఆధ్యారోపణ చేయబడతాయి.
  3. మాడ్యులేషన్ అయిన తరంగాల్ని ఆంటెన్నాకి పంపబడతాయి. ఈ ఆంటెన్నాని "ప్రసార ఆంటెన్నా" అంటాం. ప్రసార ఆంటెన్నా నుండి విద్యుదయస్కాంత తరంగాలు అన్ని దిశలలో ప్రసారం చెయబడతాయి.
  4. వేరు వేరు స్టేషను ల నుండి ప్రసారమయే r.f విద్యుదయస్కాంత తరంగాలు, సుదూరాలకు ప్రయాణిస్తాయి. ఇవి రేడియో లేదా టెలివిజన్ ఆంటెన్నాల (గ్రాహక ఆంటెన్నాలు) ను తాకినపుడు, వాటిలో అవి ఏకాంతర విద్యు ఏర్పరుస్తాయి. ఈ గ్రాహక ఆంటెన్నాలు, గ్రాహకాలకు (టెలివిజన్ లో) విద్యుత్ ప్రవాహ సంకేతాలను పంపుతుంది.
  5. టెలివిజన్ లో ఉండే శృతివలయం (Tuning Circuit) వేరు వేరు స్టేషనుల ప్రసారం చేసే మాడ్యులేట్ చేయబడిన తరంగాలలో ఒకదానిని ఎంపిక చేస్తుంది.
  6. ఇలా ఎంపిక చేయబడిన తరంగాన్ని టెలివిజన్ లో ఉన్న శోధక వలయం లోకి పంపబడుతుంది. శోధక వలయంలో ఉండే ఒక స్థానిక డోలని (Local Oscillator) r.f వాహక తరంగాలనుండి, ధ్వనిని లేదా ప్రతిబింబాన్ని వేరు చేస్తుంది. ఈ ప్రక్రియని "డీ మాడ్యులేషన్" అంటాం. వేరు చేయబడిన సమాచార సంకేతం, మరో ఆవర్థన వలయం గుండా వెళ్ళి శ్రవణ యోగ్యంగా లేదా దృశ్య యోగ్యంగా మారుతుంది.

అభివృద్ది

[మార్చు]

మొదట నలుపు తెలుపు దూరదర్శినిలు మాత్రమే వచ్చాయి. కొంతకాలానికి రంగుల దూరదర్శిని (కలర్ టి.వి.) వాడకంలోకి వచ్చింది. వచినప్పుడు రెండు కొలతల్లో వచ్చిన టీవీ లు, ప్రస్తుతం చాలా సైజులలో వస్తున్నాయి.

టీ వీ రకాలు

[మార్చు]
  • ప్లాస్మా టీవీ
  • ఎల్.సి.డ్. టీవీ
  • ఎల్. ఇ. డి. టీవీ

తెలుగు టివి ఛానళ్లు

[మార్చు]

తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్

తెలుగు భక్తి చానల్స్

తెలుగు న్యూస్ చానల్స్

తెలుగు కామెడీ చానల్స్

తెలుగు మ్యూజిక్ చానల్స్

తెలుగు కిడ్స్ చానల్స్

తెలుగు మూవీస్ చానల్స్

తెలుగు హెల్త్ చానల్స్

కేబుల్ టీవీ 1985 ఇండియాలో ప్రారంబమైంది. 1995 లో ప్రాంతీయా చానల్ల రాకతో విస్తరించింది. 2015 నాటికి ఇండియాలో400 చానల్ల సంఖ్యను దాటింది.

బయటి లింకులు

[మార్చు]

వనరులు

[మార్చు]