Jump to content

బొబ్బిలి యుద్ధం (సినిమా)

వికీపీడియా నుండి
బొబ్బిలి యుద్ధం
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.సీతారాం
నిర్మాణం సి.సీతారాం
తారాగణం నందమూరి తారక రామారావు (రంగారాయుడు),
భానుమతి (మల్లమ్మ),
జమున (సుభద్ర),
సీతారాం,
ఎస్.వి. రంగారావు (తాండ్ర పాపారాయుడు),
రాజనాల (విజయరామరాజు),
ముక్కామల (బుస్సీ దొర),
బాలయ్య (ధర్మారాయుడు),
చిలకలపూడి సీతారామాంజనేయులు (లక్ష్మన్న),
చిత్తూరు నాగయ్య,
ఎల్. విజయలక్ష్మి,
జయంతి (విజయరామరాజు భార్య),
గీతాంజలి (గొల్లపిల్ల),
ధూళిపాల (నరసరాయలు),
పద్మనాభం,
బాలకృష్ణ (విజయరామరాజు వేగు),
సురభి బాలసరస్వతి,
చిడతల అప్పారావు
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
పి. సుశీల,
పి.బి. శ్రీనివాస్,
మాధవపెద్ది,
భానుమతి
గీతరచన శ్రీశ్రీ
ఛాయాగ్రహణం కమల్ ఘోష్
నిర్మాణ సంస్థ రిపబ్లిక్ ప్రొడక్షన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బొబ్బిలి యుద్ధం సినిమాను సి. సీతారామ్ నిర్మించి దర్శకత్వం వహించారు. ఎన్.టి.ఆర్, ఎస్వీఆర్, భానుమతి, రాజనాల, ఎమ్.ఆర్.రాధా, జమున మొదలైన తారాగణంతో భారీగా నిర్మితమైనది. శ్రీకర కరుణాలవాల, మురిపించే అందాలే వంటి హిట్ గీతాలున్నాయి. శ్రీశ్రీ పాటలు, ఎస్.రాజేశ్వరరావు సంగీతం సినిమా విలువను పెంచాయి.[1]

రెండు ప్రధాన రాజవంశాలు, బొబ్బిలి, విజయనగరం ఇరుగుపొరుగు సంస్థానాలు. విజయనగర ప్రభువు విజయరామరాజు (రాజనాల) భార్య చంద్రాయమ్మ (జయంతి) కుమారునితో కలిసి బొబ్బిలిరాజు (రంగారావు నాయుడు (ఎన్.టి.ఆర్) రాణిమల్లమాంబ (భానుమతి)ల కుమారుడు వెంకటరాయల పుట్టినరోజు వేడుకలకు బొబ్బిలి వస్తాడు. ఆనాడు జరిగిన కుస్తీ పోటీల్లో, కోడిపందేల్లో, బలప్రదర్శనలో విజయనగరం వారిపై, బొబ్బిలివారు సాధించిన విజయాలకు, అసూయపడతాడు. రామరాజు వారినేవిధంగానైనా అణగద్రొక్కాలని సమయంకోసం ఎదురుచూస్తుంటాడు. రాజాం ప్రభువు తాండ్రపాపారాయుడు (యస్.వి.రంగారావు) బొబ్బిలికి అండ. అతని చెల్లెలు సుభద్ర (జమున)కు, రంగారావు నాయుడు, తమ్ముడు వెంగళరాయుడు (సీతారాం)కు వివాహం నిశ్చయిస్తారు. ఈలోపు ఫ్రెంచి గవర్నరు తరఫున బుస్సీ (ముక్కామల) కప్పాలు కట్టవలసినదిగా తాఖీదులు పంపుతాడు. తామెవరికి సామంతులు కామని, కప్పాలు కట్టమని బొబ్బిలిరాజులు తిరస్కరిస్తారు. ఈ అవకాశం తీసికొని విజయరామరాజు, బుస్సీ అనుచరుడు హైదర్‌జంగ్ (ఎం.ఆర్.రాధ) సహాయంతో బుస్సీకీ బొబ్బిలిపై చాడీలుచెప్పి, ఆ కోటను జయించి తనకిస్తే మొత్తం పరగణాల మాన్యంతానే చెల్లిస్తానంటాడు. వెంగళరాయుడు పెళ్ళి జరిగిన వెంటనే, బుస్సీ బొబ్బిలిపై దాడికి సిద్ధపడతాడు. రాజాం వైపునుంచి వచ్చే సైన్యాన్ని అటకాయిస్తానని అక్కడ విడిదిచేస్తాడు తాండ్ర పాపారాయుడు. కాని అడవి మార్గం గుండా బొబ్బిలిని ఆక్రమిస్తారు బుస్సీ సైనికులు. యుద్ధంలో బొబ్బిలి వీరులెందరో రంగారావునాయుడుతో సహా వీరమరణం పొందుతారు. తాండ్ర పాపారాయుడు బొబ్బిలి వచ్చి, విజయరామరాజును బాకుతో గుండెల్లో పొడిచి, చంపి, తానూ, ఆత్మత్యాగం చేసుకుంటాడు. ఇరు రాజ్యాల కుమారులు స్నేహంగా సాగుతుండగా కథ ముగుస్తుంది. చివరలో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించటం. ఆ స్వాతంత్ర్య వేడుకలు చూపటంతో చిత్రం పూర్తవుతుంది.

నట, సాంకేతిక వర్గం

[మార్చు]

ఇంకా ఈ చిత్రంలో నరసారాయుడుగా ధూళిపాళ, అడిదం సూరకవిగా, కె.వి.యస్.శర్మ, దుబాసీ లక్ష్మయ్యగా సి.యస్.ఆర్, మొరాసిందొరగా (ప్రభాకర్‌రెడ్డి) హర్కొరులుగా (రాజ్‌బాబు, డా.శివరామకృష్ణయ్య) వరహాలుగా పద్మనాభం, వెంకటలక్ష్మిగా బాలసరస్వతి, చారులుగా బాలకృష్ణ, గీతాంజలి, మల్లయోధునిగా నెల్లూరు కాంతారావు నటించారు. తగిర్చి హనుమంతురావు నిర్మాతగా, దొప్పలపూడి వీరయ్యచౌదరి దర్శకుడిగా ఈ చిత్రం టైటిల్స్ లో కనబడుతుంది. వీరు ఇద్దరూ కంకటపాలెం వాస్తవ్యులు . పెళ్ళిసందడి’, ‘రక్తసింధూరం’ చిత్రాలు నిర్మించిన రిపబ్లిక్ ప్రొడక్షన్స్‌వారు నిర్మించిన చారిత్రాత్మక చిత్రం ‘‘బొబ్బిలియుద్ధం’’. 1964లో విడుదలయింది. ఈ చిత్రానికి మాటలు- గబ్బిట వెంకట్రావు, పర్యవేక్షణ సముద్రాల సీనియర్, నృత్యం- వెంపటి సత్యం, పసుమర్తి వేణుగోపాల్, ఫొటోగ్రఫీ- కమల్‌ఘోష్, కూర్పు- కందస్వామి, సంగీతం- యస్.రాజేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత- సీతారాం. పాటలు- శ్రీశ్రీ, సి.నా.రె, కొసరాజు, ఆరుద్ర, సముద్రాల జూ., గబ్బిట వెంకటరావు.

చిత్ర విశేషాలు

[మార్చు]

‘బొబ్బిలియుద్ధం’ చిత్రంలో నటీనటులందరూ అఖండులు కావటంతో, ఎంతో సమర్ధవంతంగా పరిపూర్ణంగా నటించి, తమ పాత్రలకు న్యాయం చేశారు. వెంగళరాయుడుగా ఉద్రిక్తతను, ఆవేశాన్ని, పరాక్రమాన్ని సమపాళ్ళలో సీతారాం, తమ్ముని ఆవేశాన్ని అడ్డుకట్టవేసే సోదరునిగా, ప్రజాసంక్షేమంకోరే ప్రభువుగా, పరాక్రమవంతునిగా సామ, దాన, ధీర గంభీరంగా ఎన్.టి.ఆర్. ఆయా సన్నివేశాలకు వనె్నతెచ్చారు. తాండ్ర పాపారాయునిగా, యస్.వి.ఆర్. మల్లయుద్ధంలోనూ, విజయరామరాజును సంహరించే సమయంలో, ‘నీ పేరాశకిదే నా బహుమతి, ఒక్కొక్క ప్రాణానికి ఒక్కొక్కపోటు’ అంటూ అతని గుండెలపై కూర్చొని బాకుతో పొడుస్తూ చెప్పే డైలాగులు, తన్నుతాను పొడుచుకున్నాక ‘‘మాతృభూమికోసం, ఈనాడు వీరులు కార్చిన రక్తబిందువులు ఏనాటికైనా విదేశీపాలన అంతానికి కారణం కాకపోవు’’ దర్శకునిగా సీతారాంకు, రచయితగా గబ్బిటవారికి నటునిగా ఎస్.వి.రంగారావును అభినందించాల్సిందే. మరో పాత్ర ధర్మరాయుడుగా (బాలయ్య) సంధికోసం బుస్సీవద్దకు వెళ్ళిన సన్నివేశం, వీరోచితంగా సంభాషణలు పల్కటంలో, సైన్యాన్ని ఎదిరించి, తిరిగివచ్చి వెంగళరాయునిచే ఎగతాళికి, దాంతో ఆవేశానికి గురైన పాత్రను నటనలో బాలయ్య ఎంతో సంయమనాన్ని, వీరాన్ని ప్రదర్శించటం, గుర్తుండిపోయేలా చిత్రీకరణ మరో విశేషం.

పౌరుషానికి ప్రతీక అయిన బొబ్బిలి గాథ తరతరాలుగా కథల రూపంలో, బుర్రకథల రూపంలో తెలుగువారినుత్తేజ పరుస్తూనే వుంది. చిత్ర రూపంలో మరింత వనె్నకెక్కింది, ఈ గాథ జయాపజయాలతో సంబంధం లేకుండా ఆనందించదగ్గ వీరోచిత చిత్రం (కృష్ణంరాజు) ఇదే కథతో ‘‘తాండ్ర పాపారాయుడు’’గా) గోపి కృష్ణామూవీస్ వారు దాసరి దర్శకత్వంలో 1986లో నిర్మించారు.

పాటల విశేషాలు

[మార్చు]

ఇక ఈ చిత్ర గీతాలు పెళ్ళికి సిద్ధంచేసిన వంటకాలు, రుచితో ఊహల్లోకి వెళ్ళిన రంగారావునాయుడు తమ తొలి రేయిని స్మరిస్తూ చిత్రీకరించబడిన గీతం, ఎన్.టి.ఆర్, భానుమతిల అభినయంతో మనసును ఊయల లూగిస్తుంది. ‘‘ఊయల లూగినదోయి మనసే తీయని ఊహల తీవెలపైనా’’ (భానుమతి- సి.నా.రె) జమున, చెలికత్తెలపై చిత్రీకరించబడిన గీతం ‘‘ముత్యాల చెమ్మచెక్కా, రతనాలా చెమ్మచెక్క’’ సాంప్రదాయపు ఆటతో, పొడుపుకథలతో రమ్యంగా సాగింది. (పి.సుశీల బృందం- ఆరుద్ర) భానుమతిపై చిత్రీకరించిన భక్తిగీతం- ‘‘శ్రీకరకరుణాలవాల వేణుగోపాలా’’ (భానుమతి- సముద్రాల జూ.) గీతాంజలిపై చిత్రీకరించిన నృత్య గీతం ‘‘ఏమయా రామయా ఇలా రావయా’’ (స్వర్ణలత- బి.వసంత. వి.సత్యారావు- రచన కొసరాజు) యల్.విజయలక్ష్మిపై చిత్రీకరించిన జావళి ‘‘నినుచేర మనసాయెలా’’ (పి.సుశీల- శ్రీశ్రీ) రాజనాలపై చిత్రీకరించిన పద్యం ‘‘పర వీర రాజన్య భయద ప్రతాపుడు ఆరంగరాయ’’ (మాధవపెద్ది- గబ్బిట) బుస్సీ, హైదరుజంగులన్ (మాధవపెద్ది- గబ్బిట) యస్.వి.ఆర్.పై ‘‘చెల్లిలా నీ అన్న జీవించి యుండగా (మాధవపెద్ది- ఆరుద్ర) కె.వి.యస్.శర్మపై పద్యం ‘‘రాజు కళింకమూర్తి రతిరాజు శరీర విహీనుడు’’ (మాధవపెద్ది- అడిదం సూరకవి) అందాల నటి జమునతో జంటగా సీతారాం నటించిన ఈ చిత్రంలో వారిపై చిత్రీకరించిన గీతాలు, ఎంతో ముచ్చటగా, పరవళ్ళుత్రొక్కే సంగీతంతో కూడిన గీతం ‘‘అందాల రాణివే, నీవెంత జాణవే’’(పి.సుశీల, ఘంటసాల) వారిద్దరిపై చిత్రీకరించిన తొలిరేయి గీతం ‘‘సొగసుకీల్జెడదానా’’ వజ్రాల వంటి పలువరుస దానా అని వర్ణన జమునకు సరిపోయేలా సాకీ వ్రాయటం పాట ‘‘మురిపించే అందాలే అవి ననే్న చెందాలే’ (ఘంటసాల, పి.సుశీల) ఈ రెండూ గీతాలు శ్రీశ్రీ వ్రాయటం ముదావహం. చిత్ర ప్రారంభంలో గోపాలకుడు నాగయ్యపై చిత్రీకరించిన గీతం ‘‘సిరినేలు రాయుడా, శ్రీమన్నారాయణ’’ (ఆరుద్ర రచన ఈ గీతాన్ని చిత్ర సంగీత దర్శకులు యస్.రాజేశ్వరరావు, నాగయ్యకు ప్లేబాక్ పాడడం ఎన్న దగినది). చిత్ర సంగీత, సాహిత్యాలు ఈనాటికీ శ్రోతలను అలరిస్తూనే వున్నాయి.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
అందాల రాణివే, నీవెంత జాణవే కవ్వించి సిగ్గుచెంద నీకు న్యాయమా శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల
ఏమయ్య రామయ్యా ఇలా రావయ్యా కొసరాజు సాలూరు రాజేశ్వరరావు వి.సత్యారావు, స్వర్ణలత, వసంత
మురిపించే అందాలే అవి నన్నే చెందాలె నాదానవు నీవేలే నీవాడను నేనేలే శ్రీశ్రీ సాలూరు రాజేశ్వరరావు ఘంటసాల, పి.సుశీల

మూలాలు

[మార్చు]
  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (6 December 1964). "బొబ్బిలి యుద్ధం చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 28 November 2017.[permanent dead link]
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు

[మార్చు]