భారత న్యూక్లియర్ కమాండ్ అథారిటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
న్యూక్లియర్ కమాండ్ అథారిటీ
సంస్థ వివరాలు
స్థాపన 2003
అధికార పరిధి భారత ప్రభుత్వం
ప్రధానకార్యాలయం ఢిల్లీ
కార్యనిర్వాహకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

భారత న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (NCA), భారత అణ్వస్త్ర కార్యక్రమానికి సంబంధించి నిర్దేశన, నియంత్రణ, ప్రయోగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అథారిటీ.[1]

పరిచయం

[మార్చు]
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అథారిటీకి ఛైర్మను

1974 మే 18 న భారత్ తన మొదటి అణ్వస్త్ర పరీక్ష జరిపింది. స్మైలింగ్ బుద్ధ పేరు గల ఈ పరీక్షను రాజస్థాన్ లోని పొఖ్రాన్‌లో జరిపారు. ఆ తరువాత, 1998 లో తిరిగి పొఖ్రాన్‌లోనే రెండోసారి పరీక్షలు జరిపింది. ఈసారి థెర్మోన్యూక్లియర్ పరీక్ష కూడా జరిపారు. దీనికి ఆపరేషన్ శక్తి అని పేరు పెట్టారు. భారత్ విస్తారమైన పౌర, సైనిక అణు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కనీసం 10 అణు రియాక్టర్లు, యురేనియం గనులు, యురేనియం తయారీ క్షేత్రాలు, భారజల కర్మాగారాలు, ఒక యురేనియం శుద్ధి కర్మాగారం, ఇంధన తయారీ సౌకర్యాలు, విస్తృతమైన అణు పరిశోధన సామర్థ్యాలూ ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి.

భారత్ తన అణ్వస్త్రాల సంఖ్య గురించి వెల్లడి చెయ్యనప్పటికీ, వివిధ దేశాల అంచనాలను బట్టి, భారత్ వద్ద 150 నుండి 300 దాకా అణ్వస్త్రాలున్నాయి.[2][3]

2003 జనవరి 4 న, కేబినెట్ భద్రతా కమిటీ, NCA కు సంబంధించిన రాజకీయ మండలిని కార్యకారక మండలినీ ఏర్పాటు చేసింది. అణుదాడి అవసరమైన సందర్భాల్లో కార్యకారక మండలి ఇచ్చే సలహాల ననుసరించి రాజకీయ మండలి అణ్వస్త్ర దాడిపై నిర్ణయాన్ని తీసుకుంటుంది. కార్యకారక మండలికి జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వం వహిస్తారు. రాజకీయ మండలి ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేస్తుంది. భారత అణ్వస్త్రాలు ఎల్లప్పుడూ పౌర అధారిటీ నియంత్రణలోనే ఉండేలా చేసిన ఏర్పాటిది. అదే సమయంలో అనుకోకుండాను, అనధికారికంగానూ అణ్వస్త్రాలను వాడకుండా ఉండేందుకు గాను ఒక పరిణతి చెందిన కమాండ్, కంట్రోలు వ్యవస్థ కూడా ఉండేలా ఇది చూస్తుంది.[4]

వ్యూహాత్మక బలగాల కమాండ్

[మార్చు]

NCA నిర్ణయాలను, ఆదేశాలనూ వ్యూహాత్మక బలగాల కమాండ్ అమలు చేస్తుంది. ఎయిర్ మార్షల్ స్థాయి హోదా గల కమాండర్-ఇన్-ఛీఫ్ దీన్ని నియంత్రిస్తారు. వ్యూహాత్మక అణు బలగాల నిర్వహణ, పరిపాలన ఈ అధికారి నేతృత్వంలో జరుగుతుంది.[1][4]

భారత వ్యూహాత్మక అణు బలగాల కోసం ఒక కట్టుదిట్టమైన కమాండ్ కంట్రోలు వ్యవస్థ, ఇండికేషన్స్ అండ్ వార్నింగ్ వ్యవస్థనూ ఏర్పాటు చేసే క్రమంలో NCA ఏర్పాటును మొదటి దశగా భావిస్తారు.

ఆయుధాల ప్రయోగం

[మార్చు]

భారత్ వద్ద ఉన్న అణ్వాయుధ ప్రయోగ వ్యవస్థల గురించి పెద్దగా వివరాలు తెలియదు. అది బాగా రహస్యం. పృథ్వి,  అగ్ని క్షిపణుల ద్వారా ప్రయోగించ గలిగే అణ్వాయుధాలను భారత్ తయారుచేసి, పరీక్షించింది. అయిటే వాటి సంఖ్య గురించిగానీ, ఈ విషయంలో భారత సన్నద్ధత గురించిగానీ వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి.

భారత్ 1988 లో 150 కి.మీ. పరిధి గల తన పృథ్వి-1 క్షిపణి మొదటి పరీక్షా ప్రయోగాన్ని నిర్వహించింది. 1996 లో 250 కి.మీ. పరిధి గల పృథ్వి-2 ను పరీక్షించింది. 1990 తొలి అర్ధ భాగంలో వీటిని తన సాయుధ బలగాల్లో మోహరించింది. అగ్ని క్షిపణుల అభివృద్ధి కార్యక్రమం మందకొడిగా సాగింది. మొదటి అగ్ని సాంకేతికత ప్రదర్శన 1989 లో చేసింది. 2000 కి.మీ. పరిధిగల రెండు దశల అగ్ని-2 ను 1999 లోను, 700 కి.మీ. ల ఒకేదశ అగ్ని-1 ని 2001 లోనూ పరీక్షించింది. 3000 కి.మీ., పరిధిగల మూడు దశల అగ్ని-3 ను 2006 లో పరీక్షించింది. 

ఈ క్షిపణులను అభివృద్ధి చెయ్యడానికి ముందే భారత్ వద్ద కొన్ని అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి, ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న అణ్వస్త్రాల్లో కొన్ని, విమానాల ద్వారా ప్రయోగించే రకానివి కూడా ఉండి ఉండవచ్చు, భారత్ వద్ద ఏయే విమానాలకు అణ్వస్త్ర ప్రయోగ ఏర్పాట్లు ఉన్నాయో వెల్లడి కానప్పటికీ, ఈ విమానాలకు ఈ సామర్థ్యం ఉండి ఉండవచ్చు: మిగ్-27, జాగ్వార్ యుద్ధ విమానాలు, నేలపై నున్న లక్ష్యాలను ఛేదించేందుకు డిజైను చెయ్యబడ్డాయి కాబట్టి, అణ్వాయుధాలను మోసుకువెళ్ళేందుకు వాటికి కొద్దిపాటి మార్పుచేర్పులు చేస్తే సరిపోతుంది. భారత వాయుసేన వద్ద మరికొన్ని పాత రకం విమానాలు కూడా ఉన్నాయి. వీటి ద్వారా అణ్వాయుధాలను ప్రయోగించే వీలు అంతగా లేదు. మిగ్-29, సుఖోయ్ Su-30 MKI, మిరాజ్ యుద్ధ విమానాలు గాల్లోంచి గాల్లోకి చేసే దాడుల కోసం డిజైను చెయ్యబడ్డాయి. వాటిని కూడా అణ్వాయుధాల కోసం తగువిధంగా మార్పులు చెయ్యవచ్చు అరిహంత్ శ్రేణి జలాంతర్గాముల నుండి కె శ్రేణి క్షిపణుల ద్వారా కూడా అణ్వాయుధాలను ప్రయోగించే వీలు ఉంది.

ఢిల్లీ-ఇస్లామాబాద్ న్యూక్లియర్ హాట్‌లైన్

[మార్చు]

2004 జూన్ 20 న భారత్, పాకిస్తాన్‌లు న్యూక్లియర్ హాట్‌లైన్‌ను నెలకొల్పుకున్నాయి.[5] అమెరికా సైనికాధికారుల సహకారంతో ఈ ఏర్పాటు చేసుకున్నారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "ఇండియన్ ఆర్మీ వాంట్స్ సోల్ రైట్ ఓవర్ పోస్ట్ ఆఫ్ స్ట్రటీజిక్ ఫోర్సెస్ కమాండర్". Zee News. 29 July 2013. Retrieved 30 July 2013.
  2. రాబర్ట్ నోరిస్, హాన్స్ ఎమ్‌ క్రిస్టెన్సెన్
  3. ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రాం - ప్రజెంట్ క్యాపబిలిటీస్
  4. 4.0 4.1 "న్యూక్ కమాండ్ సెటప్, బటన్ ఇన్ పిఎమ్‌స్ హ్యాండ్". టైమ్స్ ఆఫ్ ఇండియా. Jan 4, 2003. Archived from the original on 2013-05-11. Retrieved 27 June 2012.
  5. "ది ఇండిపెండెంట్ — సోమవారం, జూన్ 21, 2004--"ఇండియా అండ్ పాకిస్తాన్ టు హ్యావ్ న్యూక్లియర్ హాట్‌లైన్":". Archived from the original on 2011-09-04. Retrieved 2016-11-09.