మెంతులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెంతులు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
T. foenum-graecum
Binomial name
Trigonella foenum-graecum

మెంతులు (ఆంగ్లం: Fenugreek)

మనం ఆహారంలో ఉపయోగించే మసాలా దినుసులు. మెంతి ఆకులు ఆకుకూరగా ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతి రోజూ మన ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులను వాడుతుంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారు, పులుసు, పోపులోనూ వాడతాం. మెంతి ఆకులను పప్పుకూరగా, కూరల తయారీలోనూ వాడడం తెలిసిందే. మెంతులలో ఔషధగుణాలనున్నాయని చాలా మందికి తెలుసు. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో మధుమేహ వ్యాధి నియంత్రణకు మెంతులు ఉపయోగపడతాయని నిర్ధారణ అయ్యింది. మెంతులను ఆయుర్వేదంలో దీపనీ, మిత్రి అని అంటారు. హిందీలో మెథీ అని పిలుస్తారు. ముదురు పసుపు రంగులో ఉండి, గింజలలోని ఘాటైన సుగంధ తైలాలు, ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయి. గింజలలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయి. గింజల్లోని జిగురు, చేదు రుచి కూడా ఈ రసాయనాల వల్లనే. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.

మెంతుల గురించి కొన్ని ప్రాథమిక నిజాలు[మార్చు]

  • శాస్త్రీయ నామము: ట్రెగోనెల్ల ఫోఎనుం-గ్రీసియం (Trigonella foenum -graecum)
  • కుటుంబం: ఫాబేసి (బఠాణి కుటుంబం)
  • సాధారణ పేర్లు: మెంతులు, మెంతికూర, మేథీ, గ్రీక్ హే, గ్రీక్ క్లోవర్
  • సంస్కృత నామం: బహుపర్ణి
  • ఉపయోగించే భాగాలు: విత్తనాలు, ఆకులు
  • శక్తి శాస్త్రం: వేడి

మెంతి ఆకుల ఔషధ గుణాలు[మార్చు]

  • ‌ ఆకులు గుండెకు, పేగులకు మంచి ఔషధం.
  • ‌ పైత్యం అధికంగా ఉన్నప్పుడు ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి, ఒక చెమ్చాడు తేనె కలిపి తీసుకుంటే త్వరగా తగ్గుతుంది.
  • ‌ కామెర్లు వచ్చిన వారికి, లివర్‌ సిర్రోసిస్‌ ( కాలేయ క్షయం) తో బాధపడుతున్న వారికి ఆకుల దంచి కాచిన రసం తేనె కలిపి తాగిస్తే ఆకలి పెరిగి త్వరగా కోలుకుంటారు. (అయితే డాక్టర్‌ సలహా మేరకు మందులు కూడా వాడాలి)
  • ‌ ఆకులను రసంగా చేసి రాత్రి భోజనానికి ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
  • ‌ ఆకుల రసాన్ని పిప్పితో సహా నిమ్మకాయ పిండి భోజనానికి ముందు తాగితే స్థూలకాయులు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొంత గుణం కనిపిస్తుంది.
  • ‌ ఆకును దంచి పేస్ట్‌గా చేసి తలకు రాస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి.
  • ‌ ఆకులను దంచి పేస్ట్‌గా ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. పొడి బారడడం తగ్గుతుంది.
  • 2-3 చెంచాల మెంతి గింజలను ఒక జార్ నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం మీ జుట్టును షాంపూతో కడిగిన తర్వాత, విత్తనాలను తీసేసి మీ జుట్టును మెంతి నీటితో కడడగండి. ఇది మీ జుట్టుకు మృదుత్వం, మెరుపును పెంచుతుంది.

కంటి నుండి అదే పనిగా నీరు కారతుంటే ఆకులను శుభ్రమైన వస్త్రంతో కట్టి రాత్రి పూట కంటికి కట్టాలి. వైట్‌హెడ్స్ నివారణలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఔషధం మెంతి ఆకుల మిశ్రమం. తాజాగా ఉండే గుప్పెడు మెంతి ఆకులను తీసుకుని రోట్లో వేసి మెత్తగా నూరి, ఆ పేస్టును ముఖంమీద వైట్‌హెడ్స్ అధికంగా ఉండే చోట బాగా అప్లయ్ చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. తెల్లారగానే లేచి గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజులకు వైట్‌హెడ్స్ బారినుంచి విముక్తి అవ్వచ్చు.

మెంతి గింజలు[మార్చు]

మెంతికూర కట్ట
  • ‌ రెండు చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటలు నీటిలో నానబెట్టి వాటిని ఈ నీటితో సహా ఉడకబెట్టి వడగట్టి తేనెతో తీసుకుంటే ఉబ్బస రోగం, క్షయ రోగులు, అధిక మద్యపానం వల్ల కాలేయం చెడిపోయిన వారు, కీళ్ల నెప్పులు, రక్తహీనతతో బాధపడేవారు త్వరగా కోలుకుంటారు. (మందులు వాడడం మానరాదు)
  • ‌ నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు అవుతున్నవారు, మూలశంక (పైల్స్‌) వాంతులు ఉన్నవారు వేయించిన మెంతిపొడిని 1-2 చెంచాలు మజ్జిగతో తీసుకోవాలి.
  • ‌ కడుపులో మంట, పైత్యంతో బాధపడుతున్నవారు వేయించిన మెంతుల పొడిని మజ్జిగ (పులవని) తో తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
  • ‌ పేగు పూతకు మెంతులు మంచి ఔషధం. 2-4 చెంచాలు గింజలను రాత్రి నానబెట్టి ఉదయం భోజనానికి ముందు తీసుకుంటే ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం అదుపులోకి వస్తుంది. చాలా రోజుల పాటు మధుమేహాన్ని నియంత్రించొచ్చు.
  • ‌ మెంతి గింజల పచ్చిపిండిని పాలలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం నున్నగా తయారవుతుంది. మెంతి పొడి పట్టించి స్నానంచేస్తే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి పిండి మంచి కండీషనర్‌గా పనిచేస్తుంది.
  • ‌ మలబద్దకంగా ఉంటే 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది.
  • ‌ మెంతి గింజల పొడి, పసుపు సమాన భాగాలుగా నీళ్లలో మరగకాచి శుభ్రమైన వస్త్రం సాయంతో వడపోయాలి. తెల్ల బట్ట సమస్య ఉంటే జననేంద్రియాలను ఈ నీళ్లతో శుభ్రం చేసుకుంటే గుణం కనపడుతుంది. నీళ్లను వడపోయడం చేయాలి. ప్రతీ రోజూ అర చెంచాడు మెంతి పొడిని భోజనానికి ముందు తీసుకుంటే మధుమేహం వచ్చే సూచనలున్న వారు కొన్నేళ్ల వరకు రాకుండా నివారించొచ్చు.
  • మనము మెంతులును హెయిర్ మాస్క్‌గా కూడా జుట్టుకు ఉపయోగించవచ్చు. 1 నుండి 2 టేబుల్ స్పూన్ల మెంతి గింజలను రాత్రిపూట నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం దీన్ని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌లో ఒక చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. పేస్ట్‌ని మీ తలకు, జుట్టుకు ఉదారంగా రాయండి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మనం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు, జుట్టు పెరుగుదలను గుర్తించగలము.

100 గ్రాముల మెంతి గింజల్లో పోషక విలువలు[మార్చు]

పిండిపదార్థాలు 44.1 శాతం ప్రోటీన్లు 26.2 శాతం కొవ్వు పదార్థాలు 5.8 శాతం పీచు పదార్థం 7.2 శాతం తేమ 13.7 శాతం

కాల్షియం, పాస్పరస్‌, కెరోటిన్‌, థయమిన్‌, నియాసిన్‌ కూడా ఉంటాయి. అరగడానికి రెండు గంటలు పడుతుంది. 333 కిలో కేలరీల శక్తి విడుదలవుతుంది. మెంతి ఆకుల్లో ఏ విటమిన్‌ అధికంగా ఉంటుంది.

మెంతులు

మెంతులనుండిమెంతుల ఆవశ్యక నూనెను ఆవిరి స్వేదన క్రియ ద్వారా సంగ్రహిస్తారు.

100 గ్రాముల ఆకుల్లో పోషక విలువలు[మార్చు]

పిండి పదార్థాలు 60 శాతం ప్రోటీన్లు 4.4 శాతం కొవ్వు పదార్థాలు 1 శాతం ఖనిజ లవణాలు 1.5 శాతం పీచు పదార్థం 1.2 శాతం

మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. Courtesy with—డా|| పెద్ది రమాదేవి, ఆయుర్వేదిక్‌ ఫిజిషియన్‌, సురక్ష ఆయుర్వేదిక్‌ క్లినిక్‌, హైదరాబాద్‌.

మెంతులు వలన ఆరోగ్యానికి చాలా మంచి కలుగుతుంది.[మార్చు]

మెంతికూర

మెంతులు, మావన శరీరంలోని విషాలను (టాక్సిన్లు) బయటకు పంపించి, మానవ శరీరం ఎల్ల వేళలా ఆరోగ్యంగా ఉంచడంలో బాగా ఉపయోగ పడతాయి. వేల సంవత్సరాలుగా, వాడుకలో ఉన్న ఆయుర్వేదం, మెంతులు, మెంతి కూరను ప్రతి రోజూ వాడమంటుంది.

  • మెంతి ఆకులను నేరుగా లేక చపాతీలోకి కర్రీగా తీసుకోవచ్ఛును. ఇది లాలాజల గ్రంథులు పనితీరును పెంచుతుంది.
  • రోజూ రెండు చెంచాల మెంతి పొడిని నీటితో గానీ, పాలతో గానీ తీసుకోవడంవల్ల చక్కెరవ్యాధి, కొలెస్టరాల్ తగ్గుతాయి.
  • నీటిలో నానబెట్టిన మెంతులను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తీసుకుంటే అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.
  • శ్వాస సంబంధిత సమస్యలకు తొలిదశలోనే మెంతులు ఉపయోగించినట్లయితే సులభంగా తగ్గించుకోవచ్చును. బ్రాంకైటిస్, సైనసైటిస్, ఇన్‌ఫ్లుయంజా, న్యూమొనియా, వంటి జబ్బులకు మంచి మందుగా మెంతులు పనిచేస్తాయి.
  • మెంతి టీ (మెంతులతో తయారుచేసిన తేనీరు) తీసుకోవడంవల్ల శ్వాస సంబంధ సమస్యలను అడ్డుకోవచ్చును.
  • మెంతులతో చేసిన పానీయాన్ని, నీటితో పుక్కిలిస్తే, గొంతులో ఉన్న గర గర తగ్గిపోతుంది. పాటలు పాడేవారికి, ఉపాధ్యాయులకు, ఉపన్యాసకులకు ఈ మెంతుల పానీయం వర ప్రసాదమే. చాలా తక్కువ సమయంలో, మెంతి పానీయాన్ని తయారుచేసుకోవచ్చును. మిరియాలు వేసి, కాచి తాగుతారు గాత్ర శుద్ధికి. కానీ దీనిక్ చాలా సమయం పడుతుంది.
  • కిడ్నీ, మూత్రనాళ సంబంధిత సమస్యలకు మెంతులు చక్కని మందు. రక్తనాళాలను, శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో వీటికివే సాటి. అందుకని మెంతికూర రోజూ మన ఆహారంతో పాటు తీసుకుంటే, మన ఆరోగ్యానికి తిరుగులేదు.[2]
  • కడుపు, కడుపులోని పేగులను మెంతులు శుద్ధి చేస్తాయి.
  • మెంతులు ప్రోటీన్, అమైనో ఆమ్లాలకు గొప్ప మూలం, ఇది డీహైడ్రేషన్, హీట్ స్టైలింగ్, రసాయనాలు, సూర్య నష్టం, లేదా రంగు చికిత్సల కారణంగా దెబ్బతిన్న హెయిర్ షాఫ్ట్ రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. మెంతికూర రోగ నిరోధక లక్షణాలను కలిగి ఉంది, ఇది మీ జుట్టు మూలాల్లో మంట, నొప్పిని తగ్గిస్తుంది. ఇది సమృద్ధిగా పోషణను అందించడం ద్వారా మీ జుట్టును మూలాల నుండి బలంగా చేస్తుంది. అందువలన, ఇది జుట్టు రాలడాన్ని సమర్ధవంతంగా నియంత్రిస్తుంది.

మెంతులు అంటే ఏమిటి , ఆరోగ్య ప్రయోజనలు[మార్చు]

మెంతి పంటను సంవత్సరానికి ఒకసారి పండిస్తారు. ఈ మొక్కల యొక్క ఎత్తు రెండు లేదా మూడు అడుగులు ఉంటుంది. దీని కాయలు పెసళ్ళు లాగా ఉంటాయి. దీని విత్తనాలు చాలా చిన్నవిగా ఉంటాయి. వీటి రుచి చూసుకున్నట్లయితే చేదుగా ఉంటుంది. మెంతుల మొక్కల ఆకులను చూస్తే లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి.[3]

మూలాలు[మార్చు]

  1. "Trigonella foenum-graecum information from NPGS/GRIN". www.ars-grin.gov. Archived from the original on 2009-01-05. Retrieved 2008-03-13.
  2. మెంతులు వాలా కలిగే దుష్ప్రభావాలు తెలుసా?
  3. మెంతుల యొక్క అనేక ఆరోగ్య ఉపయోగాలు Archived 2021-08-20 at the Wayback Machine
  • 2011 ఏప్రిల్ 26 ఆంధ్రభూమి దినపత్రీక ఆధారంగా
"https://te.wikipedia.org/w/index.php?title=మెంతులు&oldid=4074917" నుండి వెలికితీశారు