మేకావారిపాలెం (చల్లపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేకావారిపాలెం
రెవెన్యూయేతర గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా జిల్లా
మండలంచల్లపల్లి
గ్రామ పంచాయతీపాగోలు
Time zoneUTC+5:30 (సమయం)
పిన్ కోడ్
521126
ఎస్.టి.డి కోడ్08671
అసెంబ్లీఅవనిగడ్డ

మేకావారిపాలెం, కృష్ణా జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]
మేకావారిపాలెంలోని ప్రయాణీకుల విశ్రాంతి భవనం
మేకావారిపాలెంలోని సురక్షిత మంచి నీటి పధకం

1831లో విపరీతమైన వర్షాలు పడ్డాయి. దాని వలన ఆ సంవత్సరం పంటలు పాడయినాయి. 1832లో తీవ్రంగా తుఫాను వచ్చింది. ఆ ఏడాది కూడా పంట చేతికి రాలేదు. 1833లో బీభత్సమైన కరువు. దీనినే ‘పెద్దకరువు’, ‘డొక్కలకరువు’ అని అనేవారు. ఈ కరువు నందననామ సంవత్సరంలో వచ్చింది కనుక దీనినే ‘నందనకరువు’ అని కూడా పిలిచేవారు. వరుసగా రెండు సంవత్సరాలు పంటలు రాక, ఉన్నది పొగొట్టుకొని ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. మరల మూడవ సంవత్సరంలో కరువు రావడంతో ఆవిచ్ఛిన్నాన్ని తట్టుకోలేక కొన్ని ప్రదేశాలలో వారు తమ బ్రతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళిపోయినారు. అలా వలస వెళ్ళినవారిలో ఒకరు మేకా మూర్తియ్యగారు. అలా వలస వెళ్తున్న సమయంలో కృష్ణానది దగ్గరకు రాగానే అందులో నీరు కనపడినవి. అంతకటినమైన కరువులో కూడా ఆ నదిలో నీరు ఉండడం చూసి వారు ఆశ్చర్యపోయినారు. అప్పుడు వారు స్ధిరపడితే కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో మాత్రమే స్ధిరపడాలని అనుకుని, ఆనాటి మేకా వారి దాయాదులలో ఒకరైన మన వంశమూలకర్త మేకా మూర్తియ్యగారు, 1833లో తన ముగ్గురు కొడుకులు అయిన గురవయ్య, వెంకయ్య, లింగయ్యతో (ఆనాటి పాగోలు) మేకావారిపాలానికి వచ్చారు. వీరి సంతానం అధికంగా ఉండడంతో ఆ గ్రామానికి మేకావారిపాలెం అని పేరు వచ్చింది. ఆనాడు మూర్తియ్యగారితో వారి దాయదులు కూడా వివిధ ప్రాంతలకు వెళ్ళినారు.

భౌగోళికం

[మార్చు]
మేకావారిపాలెంలోని పాలసేకరణ కేంద్రం
మేకావారిపాలెంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం
మేకావారిపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

కృష్ణానదీ తీరాన మాగాణి భూములలో ఎంతో రమణీయంగా, ప్రకృతి సౌందర్యములతో భాసిల్లు మెట్ట వ్యవసాయ క్షేత్రాల నడుమ సంపన్నమైన గ్రామం మనది. మేకావారిపాలెం గ్రామం చల్లపల్లి మండలంలో చల్లపల్లి నుండి 2.5 కి.మీ దూరంలో నడకుదురు వెళ్ళే దారిలో ఉంటుంది.ఇది పాగోలు పంచాయితీకి శివారు గ్రామం. చల్లపల్లి మండలానికి దగ్గరగా, పాగోలు పంచాయితీకి 1 కి.మీ మాత్రమే ఉండడం, కృష్ణానదికి 4 కి.మీ ఉండడం వలన గ్రామ అభివృద్ధికి మరింత తోడ్పడినాయి. మేకావారిపాలెంలో దేవాలయము, బడి, చెరువు చాల కాలం వరకు లేవు. నలుగురూ విరామ సమయంలో కూర్చొని మాటామంతీ చెప్పుకొనుటకు ముప్పైవ దశకం చివర్లో పెంకుటి చావడి కట్టించారు. సరైన విగ్రహ ప్రతిష్ఠ లేదు. పెద్ద దీపం స్టాండుకే ఉన్న చిన్న ప్రతిమనే రాములవారిగా భావించి యువకులు చందాలు వసూలు చేసి శ్రీరామనవమి జరిపేవారు. ఈ పెంకుటి చావిడినే 'గుడి’గా వ్యవహరించేవారు. 2010 సంIIలో మేకా నరసింహరావు గారు మరితరదాతల సహకారంతో పాత గుడి స్థానంలో కొత్త్తగా ‘గుడి’ కట్టటం జరిగింది. అందులో సీతారాముల, షిరిడి సాయిబాబా విగ్రహములను ఏర్పరిచారు. పాగోలులో పాటిమన్ను దిబ్బలు, కమ్మ వారితో పాటు బ్రాహ్మణులు, కమ్మరి, చాకలి, వడ్రంగి, కంసాలి, మాదిగకులస్తులు, దేవాలయము, చెరువు ఉండటాన్ని బట్టి ఈ ఊరు చాల పురాతనమైనదని భావించవచ్చు. పాగోలులో మేకా ఇంటి పేరు గల కమ్మవారున్నారు. కానీ వారికి మేకావారిపాలెంలోని మేకా వారికి సంబందం లేదు. పాగోలు మేకా వారు కూడా బహుశ గుంటూరుజిల్లా ఇతర గ్రామాల నుండి ముందుగా వచ్చి ఉంటారు.

వలస బాట

[మార్చు]
పాగోలులోని మహాబోధి విహార్
మేకావారిపాలెంలోని గుడి

మేకా మూర్తియ్యగారు పెద్ద రైతు. సుమారు 400 ఎకరములు కొని సాగు చేసారు. మూడు తరముల తర్వాత అధిక సంతానము కారణంగా చిన్న రైతులైనారు, కొందరు మరల వలస బాట పట్టవలసి వచ్చింది. చౌకగా భూములు లభ్యమైన చోటుకు,కొత్తగా నీటి వనరులు ఏర్పడుతున్న ప్రాంతములకు తరలి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు నిజమాబాదు చుట్టుపక్కల, మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూరు, కర్నాటకలోని బళ్ళారి, సిరిగుప్ప, దావణగిరి, షిమోగ,కృష్ణాజిల్లాలోని దాలిపర్రు, కోసూరు, కొత్తూరు, అద్దంకిలో స్థిరపడ్డారు. వ్యవసాయం కోసం వెళ్ళినవారు,ఉద్యోగ,వ్యాపార నిమిత్తం వెళ్ళి విజయవాడ,హైదరాబాదు, విశాఖపట్నం, అమెరికాలో ఉన్న వారు మొత్తము సుమారు 300 కుటుంబాలు వరకు ఉండవచ్చు. ప్రస్తుతం (2015నాటికి) మేకావారిపాలెంలో 70 మంది మాత్రమే ఉన్నారు. గుత్తికొండ, కుర్రా వారి రెండు కుటుంబములు మేకా వారికి బంధుత్వము రీత్యా తర్వాత కాలంలో మేకావారిపాలెంకు వచ్చారు. ఈ రెండు కుటుంబాల సంతతికి మేకా వారి 6వ, 7వ తరాల వారితో కూడా వివాహ భాంధవ్యాలు ఏర్పడ్డవి. కుర్రా వారి అన్నదమ్ములలో పెద్దవారైన వెంకటరత్నంగారు పశువైద్యం ద్వారా సమాజసేవ చేసారు. సూడిపశువులు ఈత సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కుంటే పశువైద్యులకు కూడా అంతుపట్టని సమస్యలను ఆయన పరిష్కరించేవారు. ప్రస్తుతం మేకావారిపాలెంలో కమ్మకులస్తులతో పాటు 40 గౌడ, 30 కాపు కుటుంబాలు ఉన్నాయి. ఈ మూడు కులాల వారు మైత్రీభావంతో ఒకరిపైనొకరు ఆదారపడి జీవిస్తున్నారు. 9వ తరంలో అందరూ విద్యను అభ్యసించడం వలన మేకా వారికి ఉన్నసాగు భూములన్నిటినీ ఆ గ్రామంలో ఉన్న కాపు, గౌడ, ఇతర కులస్తులు కౌలు చేస్తునారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం, పాగోలు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

మేకావారిపాలెం దగ్గరలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రములు కూడా ఉన్నాయి. ఆంధ్రమహారాజులు పరిపాలించిన శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర మహావిష్ణువు ఆలయం, నడకుదురులోని పృధ్వీశ్వరస్వామి గుడి, పెద్దకళ్ళేపల్లిలోని నాగమల్లేశ్వరస్వామి ఆలయం,మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వరస్వామి వారి ఆలయం, హంసలదీవిలోని వేణుగోపాలస్వామి ఆలయం మొదలగున్నవి. చల్లపల్లిని పరిపాలించిన శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామకృష్ణప్రసాద్హ ద్దూర్వారి రాజకోట, రైతులకు బాసటగా ఉన్న లక్ష్మీపురంలోని చెక్కెర కార్మాగారము చూడదగినవి. చల్లపల్లికి 60కి.మీ దూరంలో ఉన్న విజయవాడలోని కనకదుర్గమ్మ వారి దేవస్తానం, ప్రకాశంబ్యారేజి ప్రసిద్ధిగాంచినవి. మన ప్రక్కన ఉన్న గుంటూరు జిల్లా వెళ్లాలంటే కృష్ణానది దాటి వెళ్ళాలి. పూర్వం పడవలను ఉపయోగించి ప్రక్క జిల్లాకు చేరేవారు. 1936లో పులిగడ్డ ఆక్వాడెక్టు నిర్మాణం జరిగింది. ఆ తరువాత 2006లో కృష్ణా-గుంటూరు జిల్లాలను కలుపుతూ సుమారు 4.0 కి.మీ కలిగి దేశంలోని అతిపెద్దవంతెనలలో ఒకటిగా పేరు గాంచిన భారీ వంతెనను పులిగడ్డ నుండి పెనుమూడి వరకు నిర్మించారు. మేకా వారి సారథ్యంలో నడుస్తున్న పాగోలులోని మహాభోధి ట్రస్టు చుట్టుప్రక్కల ఉన్న ఎంతో మంది పేద విద్యార్థులకి అండగ నిలుస్తుంది.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, చెరకు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]
  • మేకా శ్రీకాంత్ -ప్రముఖ తెలుగు చలనచిత్ర కనాయకుడు. వీరి తాతగారు ఈ గ్రామం నుండియే కర్నాటకకు వలసవెళ్ళినారు.
  • రాజులపాటి కళ్యాణి - ఈ గ్రామానికి చెందిన ఈమెకు జాతీయస్థాయిలో గౌరవం లభించినది. ఈమె తన భర్త శ్రీకాంత్‌తో కలిసి కరోనా లాక్‌డౌన్ సమయంలో విస్తృతంగా పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించినారు.ఆమె సేవలను గుర్తించి, "హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్" జాతీయ ఛైర్మన్ అయిన రవీంద్రకుమార్, "కరోనా ఆనర్" ప్రకటించినారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, గ్రామస్థులు ఈమెను అభినందించినారు.

గ్రామ విశేషాలు

[మార్చు]

మేకావారి వంశవృక్ష సేవాసమితి నిర్వహకులు, 2016, జనవరి- 15న, సంక్రాంతి సంబరాలలో భాగంగా, ఈ గ్రామంలో మేకావారి ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు శ్రీ మేకా శ్రీకాంత్, ఈ సందర్భంగా, మన తరాలు , మేకావారి వంశవృక్షం గ్రంథావిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలలో ఉన్న సుమారు 2,000 మంది మేకా వారి వంశస్థులు, కలిసి, పెద్ద యెత్తున సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 200 సంవత్సరాలనాటి మేకావారి వంశస్థుల "మన తరాలు," గ్రంథం మేకావారి వంశవృక్షాన్ని ఈ సంబరాలలో ఆవిష్కరించి, ఆ వంశ కీర్తి ప్రతిష్ఠలను పలువురికి తెలియజేసినారు. సి.డి.రూపంలో నిక్షిప్తంచేసి, డిజిటల్ వీడియో ప్రసారాలను చేసారు.

ఈ గ్రామంలోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీ గుత్తికొండ వంశీకృష్ణ, బి.టెక్ చదివిన తరువాత తన స్వంత గ్రామంలోనే సిమెంటు, ఫ్లై ఆష్, వెజిటబుల్ ఫోంలతో, అతి తక్కువ ఖర్చుతో, సిమెంటు ఇటుకరాయి ఆకారంలో, వివిధరకాల పరిమాణంలో ఇటుకలను తయారు చేసే పరిశ్రమను స్థాపించి 40 మందికి పైగా ఉపాధి కల్పించుచున్నారు. ఈ ఇటుకలను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, తదితర ప్రాంతాలలో నిర్మించే భవనాలకు గూడా, ఇక్కడినుండియే సరఫరా చేస్తున్నారు. దీనితో ఈ ప్రాంతంలో గూడా వీటి వినియోయం పెరుగుచున్నది. అంతేగాకుండా, ఎం.సి.యే.చదివిన తన సోదరుడి తోడ్పాటుతో, ఫ్యాబ్రిక్స్ తయారు చేసే పరిశ్రమను స్థాపించి, మరియొక 15 మందికి ఉపాధి కల్పించుచున్నారు. ఇంకా ప్లాస్టిక్ రహిత సంచులను తయారుచేసే పరిశ్రమను గూడా ఏర్పాటుచేసారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]