Jump to content

రాయలసీమ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(రాయలసీమ విశ్వవిద్యాలయము నుండి దారిమార్పు చెందింది)
రాయలసీమ విశ్వవిద్యాలయం
స్థాపితం2008
వైస్ ఛాన్సలర్ప్రొ. వై. నరసింహులు
స్థానంకర్నూలు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం

రాయలసీమ విశ్వవిద్యాలయం భారతదేశపు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో ఉంది. దీనిని 2008 లో స్థాపించారు.[1][2]

చరిత్ర

[మార్చు]

2008, సెప్టెంబరు 24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చేత అమలు చేయబడి, 2008 ఆంధ్రప్రదేశ్ గెజిట్‌లో 29వ చట్టం అనుసరించి 2008లో రాయలసీమ విశ్వవిద్యాలయం ఏర్పాటయింది. ఉన్నత విద్యలోని సమగ్రతను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రాయలసీమ విశ్వవిద్యాలయం స్థాపించింది.

రాయలసీమలోని కరువు పీడిత ప్రాంతంలో వెనుకబడిన కర్నూలు జిల్లా గ్రామీణ యువతకు ఉన్నత విద్యను అందించే ఉద్దేశంతో 1977లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రెండు కోర్సులతో కర్నులులో పోస్ట్‌గ్రాడ్యుయేట్ సెంటర్‌ను ప్రారంభించింది. ఒకటి ఎకనామిక్స్‌లో ఏరియా ప్లానింగ్, రీజినల్ డెవలప్‌మెంట్‌లో స్పెషలైజేషన్, మరొకటి పరిశ్రమల అవసరాలను తీర్చడానికి ఆపరేషన్స్ రీసెర్చ్, స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్. అప్పుడు చిన్న భవనంలో ఈ సెంటర్‌ను ప్రారంభించారు. తరువాత, 1979లో పాత మున్సిపల్ కార్యాలయ భవనంలోకి మార్చబడింది. భారతీయ స్టేట్ బ్యాంక్ 1983లో దామోదరం సంజీవయ్య జ్ఞాపకార్థం ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ పదవికి విరాళం ఇచ్చింది, తరువాత దీనిని 1985లో తెలుగు శాఖగా స్థాపించారు. 1990లో కర్నూలు సమీపంలోని బి.తండ్రపాడు అనే చిన్న గ్రామంలోని విశ్వవిద్యాలయ సొంత భవనంలోకి ఈ సెంటర్ మార్చబడింది.

కోర్సులు

[మార్చు]

1979లో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం కోర్సులు చేర్చబడ్డాయి. 1993లో ఈ కేంద్రాన్ని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి బదిలీ చేశారు. 1998లో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ ప్రారంభమైంది. తరువాత 2001లో మేనేజ్మెంట్, ఎంసిఎ, మ్యాథమెటిక్స్ ప్రారంభించబడ్డాయి. 2006లో వృక్షశాస్త్రం, కర్బన రసాయన శాస్త్రం, జంతుశాస్త్రం కోర్సులు ప్రారంభించబడ్డాయి. రాయలసీమ విశ్వవిద్యాలయం స్థాపనతో, 2008-09 విద్యా సంవత్సరంలో ఆంగ్లంలో ఎంఏ, ఎంఇడి కోర్సులు ప్రారంభించబడ్డాయి; 2009-10 విద్యా సంవత్సరంలో బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ; 2012 -13లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో ఎంకామ్, ఎంఎస్‌సి ప్రారంభించబడ్డాయి.

కంప్యూటర్ సైన్స్ విభాగం

[మార్చు]

1998లో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, తరువాత 2001 లో ఎంసీఏతో ఈ విభాగం ప్రారంభమైంది. ఈ కేంద్రంలో ఒక కంప్యూటర్ ప్రయోగశాల, అనేక పుస్తకాల గల గ్రంథాలయం ఉంది. కంప్యూటర్ సైన్స్, అప్లికేషన్స్ విభాగాలకు చెందిన చాలామంది విద్యార్థులకు మేజర్ ఐటి కంపెనీలు, ఎంఎన్‌సిలలో ఉద్యోగాలు లభించాయి. ఎమ్మెస్సీ (సిఎస్), ఎంసీఏ కోర్సుల నుండి 350+మంది విద్యార్థులు విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు.

ఇంజనీరింగ్ కళాశాల

[మార్చు]

రాయలసీమ విశ్వవిద్యాలయం 2019-2020 విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ కళాశాలని కూడా ప్రారంభించింది. కర్నూలు జిల్లాలో ఇది మొదటి, ఏకైక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల.

ప్రాంగణం

[మార్చు]

300+ ఎకరాల విస్తీర్ణంలో గ్రామీణ పరిసరాల్లో ఉన్న ఈవిశ్వవిద్యాలయ ప్రాగణంలో కంప్యూటర్ సెంటర్, హెల్త్ సెంటర్, వ్యాయామశాల, ఆటస్థలం, ఆడిటోరియం, ప్రయోగశాలలు, వసతి గృహాలు, సిబ్బంది గృహాలు ఉన్నాయి.


మూలాలు

[మార్చు]
  1. "Rayalaseema University". www.4icu.org. Retrieved 2013-04-22.
  2. "Andhra Pradesh State University". University Grants Commission (India). Retrieved 2020-09-05.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]