Jump to content

రుద్రపట్నం బ్రదర్స్

వికీపీడియా నుండి
రుద్రపట్నం బ్రదర్స్
వ్యక్తిగత సమాచారం
మూలంఅరకలగూడు, హసన్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం
సంగీత శైలి కర్ణాటక శాస్త్రీయ సంగీతం
క్రియాశీల కాలం1956 (1956) – ప్రస్తుతం
సభ్యులుఆర్.ఎన్.త్యాగరాజన్ & ఆర్.ఎన్.తారానాథన్

రుద్రపట్నం బ్రదర్స్ పేరుతో పిలువబడే ఆర్.ఎన్.త్యాగరాజన్, ఆర్.ఎన్.తారానాథన్‌లు జంట కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసులు. ఈ జంట విద్వాంసులకు 2018లో భారత ప్రభుత్వం మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని ఇచ్చి గౌరవించింది.

ఆరంభ జీవితం

[మార్చు]

రుద్రపట్నం ఎన్. త్యాగరాజన్ 1943, జూలై 15వ తేదీన[1], రుద్రపట్నం ఎన్.తారానాథన్ 1946, నవంబరు 11వ తేదీన[1] కర్ణాటక రాష్ట్రం, హసన్ జిల్లా, అరకలగూడ్ గ్రామంలో జన్మించారు. వీరి తాత ఆర్.కె.కృష్ణశాస్త్రి సంగీతకారుడు, హరికథకుడు, నాటక రచయిత, సంస్కృత, కన్నడ పండితుడు. వీరి తండ్రి ఆర్.కె.నారాయణస్వామి ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ శిష్యుడు. ఇతని బాబాయిలు ఆర్.కె.వెంకటరామ శాస్త్రి, ఆర్.కె.రామనాథన్, ఆర్.కె.శ్రీకంఠన్ అందరూ సంగీత విద్వాంసులే.

వీరు తమ కర్ణాటక సంగీతాన్ని తమ తండ్రి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నారు.

విద్య, ఉద్యోగం

[మార్చు]

త్యాగరాజన్ గణిత శాస్త్రంలో ఎం.ఎస్.సి చదివాడు. పలు సంవత్సరాలు గణితాధ్యాపకునిగా పనిచేశాడు. 1976లో ఆకాశవాణిలో ఉద్యోగంలో చేరాడు. ఇతడు చెన్నై దూరదర్శన్ కేంద్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2003లో బెంగళూరు దూరదర్శన్ కేంద్రానికి డిప్యుటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ పదవీవిరమణ చేశాడు.

తారానాథన్ రసాయన శాస్త్రంలో ఎం.ఎస్.సి, పి.హెచ్.డి చేశాడు. ఇతడు కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేసి మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సి.ఎఫ్.టి.ఆర్.ఐ) బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్ విభాగాలలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేశాడు. ఇతడు తన పరిశోధన ప్రాజెక్టుల నిమిత్తం అనేక పర్యాయాలు జర్మనీ సందర్శించాడు.

సంగీత వృత్తి

[మార్చు]

వీరు తమ పూర్వీకుల నుండి ప్రేరణ పొంది అనూచానంగా వస్తున్న కర్ణాటక సంగీతాన్ని స్వీకరించారు.[2] వీరి సంగీతంపై సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, జి.ఎన్.బాలసుబ్రమణియం, రామనాథ్ కృష్ణన్, తంజావూరు ఎస్.కల్యాణరామన్‌ వంటి సంగీతకారుల ప్రభావం ఉంది. వీరు త్యాగరాజస్వామి శిష్యపరంపరకు, వాలాజపెట వెంకటరమణ భాగవతార్ శిష్యపరంపరకు చెందినవారు. మైసూర్ సదాశివరావు శిష్యులు. నాయకి, వరాళి, బేగడ, ముఖారి, సహన, మధ్యమావతి, హనుమతోడి రాగాలలో వీరు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.

కచేరీలు

[మార్చు]

ఈ సోదరులు 1956లో మొదటి కచేరీ చేశారు. తరువాత క్రమం తప్పకుండా దేశవిదేశాలలో ఆరు దశాబ్దాలకుపైగా అనేక ప్రదర్శనలు చేశారు.[3] వీరు లాల్గుడి జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, వి.వి.సుబ్రమణ్యం, ఎం.చంద్రశేఖరన్, రామనాథపురం సి.ఎస్.మురుగభూపతి, టి.కె.మూర్తి, పాల్గాట్ ఆర్.రఘు, ఉమయల్పురం కె.శివరామన్, వెల్లూర్ జి.రామభద్రన్, కారైకుడి మణి, వి.కమలాకరరావు, త్రిచ్చి శంకరన్, శ్రీముష్ణం వి.రాజారావు, కె.ఎస్.మంజునాథన్, వి.హరిశంకర్, టి.హెచ్.వినాయకరం వంటి వాద్య కళాకారుల సహకారంతో అమెరికా, బ్రిటన్, సింగపూర్, మలేషియా, అరబ్బు దేశాలతో పాటు భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో అనేక కచేరీలు నిర్వహించారు[3].

అవార్డులు

[మార్చు]
సంవత్సరం పురస్కారం/బిరుదు ప్రదానం చేసినవారు
1961, 1963, 1964 & 1965 ఆల్ ఇండియా రేడియో శాస్త్రీయ, లలిత సంగీత పోటీలు అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ సోదరులు విడివిడిగా శాస్త్రీయ సంగీత, లలిత సంగీత విభాగాలలో గెలుపొందారు.
1979 గాన సుధాకర కర్ణాటక సంగీత నృత్య అకాడమీ, బెంగళూరు
1992 కర్ణాటక రాజ్యోత్సవ ప్రశస్థి కర్ణాటక ప్రభుత్వం
1995 గానకళా తిలక కర్ణాటిక్ మ్యూజిక్ సొసైటీ, గోవా
2003 సంగీత కళాతపస్వి వాగ్గేయకార ఆరాధనోత్సవ సమితి, మైసూరు
2003 కర్ణాటక కళాశ్రీ కర్ణాటక సంగీత నృత్య అకాడమీ, బెంగళూరు
2005 త్యాగరాజ ప్రశస్తి బెంగళూరు నాగరత్నమ్మ ట్రస్ట్
2005 సంగీత విద్యానిధి జె.ఎస్.ఎస్.సంగీతసభ, మైసూరు
2006 ఆర్టిస్ట్స్ ఆఫ్ ది ఇయర్ బెంగళూరు గాయన సమాజ
2006 గాయక కళాభూషణ శ్రీ త్యాగరాజ గానసభ ట్రస్ట్, బెంగళూరు
2007 స్వరాలయ శృంగ సుస్వరాలయ సంగీత కళాశాల, బెంగుళూరు
2008 స్వరమూర్తి వి.ఎన్.రావు మెమోరియల్ జాతీయ అవార్డు వి.ఎన్.రావు మెమోరియల్ ట్రస్టు, బెంగళూరు
2008 ఆస్థాన విద్వాంసులు కంచి కామకోటి పీఠం
2011 కళాజ్యోతి నాదజ్యోతి శ్రీ త్యాగరాజ భజన సభ, బెంగళూరు
2014 గాన వారిధి ఎం.ఎ.నరసింహాచార్ మ్యూజిక్ ఫౌండేషన్, బెంగళూరు
2015 సంగీత నాటక అకాడమీ అవార్డు కేంద్ర సంగీత నాటక అకాడమీ, న్యూఢిల్లీ
2016 సంగీత కళాచార్య అవార్డు మద్రాసు సంగీత అవార్డ్, చెన్నై
2017 సంగీత కళారత్న అవార్డు బెంగళూరు గాయన సమాజ, బెంగళూరు
2018 పద్మశ్రీ పురస్కారం భారత ప్రభుత్వం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 web master. "R. N. Thyagarajan & R. N. Tharanathan". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 1 మార్చి 2021. Retrieved 1 March 2021.
  2. Srikanth, Venkatesan. "Perfect melodies". The Hindu. Archived from the original on 2012-10-25. Retrieved 2011-06-18.
  3. 3.0 3.1 Meghana Choukkar (14 July 2016). "A tribute to six decades of musical journey". Deccan Herald. Retrieved 1 March 2021.