త్రిచ్చి శంకరన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిచ్చి శంకరన్
వ్యక్తిగత సమాచారం
జననం (1942-07-27) 1942 జూలై 27 (వయసు 81)
తిరుచిరాపల్లి, తమిళనాడు, భారతదేశం
వాయిద్యాలుమృదంగం, కంజీర
వెబ్‌సైటుwww.trichysankaran.com

త్రిచ్చి శంకరన్ లేదా తిరుచ్చి శంకరన్ ఒక భారతీయ మృదంగ వాద్య కళాకారుడు, స్వరకర్త, పండితుడు, విద్యావేత్త.[1]

ఆరంభ జీవితం

[మార్చు]

ఇతడు 1942, జూలై 27వ తేదీన తిరుచిరాపల్లిలో జన్మించాడు.[2] తొలుత తన ఐదవ యేట పి.ఎ.వెంకటరామన్ వద్ద మృదంగ విద్యను అభ్యసించాడు. తరువాత మార్దంగిక త్రిమూర్తులలో ఒకరైన పళని సుబ్రమణియం పిళ్ళై వద్ద మృదంగం నేర్చుకున్నాడు. తన 13వ యేట ఇతడు తిరుచిరాపల్లిలోని నండ్రుదయన్ వినాయక దేవస్థానంలో అలత్తూర్ బ్రదర్స్ నిర్వహించిన సంగీత కచేరీకి మొట్టమొదటి సారి మృదంగ సహకారం అందించాడు.

అప్పటి నుండి ఇతడు అరియకుడి రామానుజ అయ్యంగార్, టి.ఆర్.మహాలింగం, చెంబై వైద్యనాథ భాగవతార్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, జి.ఎన్.బాలసుబ్రమణియం, మదురై మణి అయ్యర్ వంటి అగ్రశ్రేణి విద్వాంసులకు ప్రక్కవాద్యం అందించాడు.

సంగీత బోధన

[మార్చు]

శంకరణ్ 1971 నుండి కెనడా దేశంలోని టొరంటో నగరంలో జీవిస్తున్నాడు. అక్కడి యార్క్ విశ్వవిద్యాలయంలో సంగీతం ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. టొరొంటోలో త్యాగరాజ ఆరాధన ఉత్సవాలకు ఇతడు వ్యవస్థాపకుడు. ఇతడు ప్రతియేటా డిసెంబర్ నెలలో చెన్నై వచ్చి అగ్రశ్రేణి సంగీత విద్వాంసులతో కచేరీలలో పాల్గొంటున్నాడు.[3] ఇతడు యార్క్ యూనివర్సిటీతో పాటు వెస్లియన్ యూనివర్సిటీ, బర్క్‌లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, మిచిగన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్, ఇల్లినాయిస్ యూనివర్సిటీ, మెక్‌మాస్టర్ యూనివర్సిటీ, కార్నెల్ యూనివర్సిటీ, డల్హౌసీ యూనివర్సిటీ వంటి పలు విద్యాసంస్థలలో కర్ణాటక సంగీతంపై సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించాడు.ఇతడు ఉత్తర అమెరికాలోని పేరెన్నికగన్న పత్రికలలో మృదంగం గురించి అనేక వ్యాసాలు ప్రచురించాడు. ఇతడు మృదంగంపై "ది రిథమిక్ ప్రిన్సిపుల్స్&ప్రాక్టీస్ ఆఫ్ సౌత్ ఇండియన్ డ్రమ్మింగ్", కొన్నక్కోల్‌పై "ది ఆర్ట్ ఆఫ్ కొన్నక్కోల్" అనే పాఠ్యపుస్తకాలను రచించాడు.

ఇతడు అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన వంటి వాద్యకళాకారులతో కలిసి కచేరీలు చేశాడు.

ఇతడు "కళాలయం" అనే సంస్థను స్థాపించి దాని ద్వారా పుదుక్కోటై సంప్రదాయంలో సంగీత వాద్య విద్యను దక్షిణాసియా, ఉత్తర అమెరికా విద్యార్థులకు నేర్పించాడు. ఈ సంస్థ ద్వారా ఎందరో మృదంగం, కంజీర, ఘటం, తబల వంటి వాటిల్లో విద్వాంసులుగా తయారయ్యారు. ప్రతియేటా త్యాగరాయ సంగీతోత్సవాలను నిర్వహించి, భారతదేశం నుండి అగ్రశ్రేణి విద్వాంసులను రప్పించి వారిచే కచేరీలు ఏర్పాటు చేస్తున్నాడు. ఉత్తర అమెరికాలోని ప్రతిభావంతులైన సంగీత విద్యార్థులను గుర్తించి వారికి ఉపకార వేతనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు.

అంతర్జాతీయ పర్యటనలు

[మార్చు]

ఇతడు భారతదేశంలోని అన్ని ముఖ్యమైన సంగీతోత్సవాలతో పాటు ఆగ్నేయాసియా, ఐరోపా, మధ్యప్రాచ్య, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా దేశాలలో కచేరీలు నిర్వహించాడు. 50 సంవత్సరాల అనుభవంతో ఇతడు ఐదు తరాలకు చెందిన కళాకారులకు వాద్య సహకారమందించాడు.

పురస్కారాలు

[మార్చు]

అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన కళాకారుడిగా ఇతడు అనేక గౌరవాలు, పురస్కారాలు అందుకున్నాడు.

వాటిలో కొన్ని:

 • మద్రాసు సంగీత అకాడమీ వారి సంగీత కళానిధి[3]
 • కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి సంగీత నాటక అకాడమీ అవార్డు [4]
 • భారతి కళా మన్రమ్‌, టొరంటో వారిచే తాళ కళై అరసు
 • భైరవి , క్లీవ్‌లాండ్ వారిచే లయ శిఖామణి
 • భారతీయ విద్యా భవన్, త్రిచ్చి వారిచే నాద లయ బ్రహ్మం
 • CMANA, న్యూయార్క్ వారిచే తాళ వాద్య ప్రకాశ
 • శ్రీకృష్ణ గానసభ, చెన్నై వారిచే సంగీత చూడామణి
 • భారత్ కళాకార్, చెన్నై వారిచే విశ్వకళాభారతి
 • పర్కుస్సివ్ ఆర్ట్స్ సెంటర్, బెంగళూరు వారిచే మృదంగ కళాశిరోమణి
 • కంచి కామకోటి పీఠం, కాంచీపురం వారి ఆస్థాన విద్వాంసుడు
 • ఒంటారియో కాన్ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఫాకల్టీ అసోసియేషన్, కెనడా వారిచేOCUFA టీచింగ్ అవార్డు
 • పర్కుస్సివ్ ఆర్ట్స్ సెంటర్, బెంగళూరు వారిచే పాల్గాట్ మణి అయ్యర్ అవార్డు
 • కర్ణాటక ప్రభుత్వంచే చౌడయ్య మెమోరియల్ అవార్డు
 • తమిళనాడు ప్రభుత్వంచే పళని సుబ్రమణియం పిళ్ళై అవార్డు
 • విక్టోరియా యూనివర్సిటీనుండి గౌరవ డాక్టర్ ఆఫ్ మ్యూజిక్
 • తిరుచిరాపల్లి కర్ణాటిక్ మ్యూజీషియన్స్ లైఫ్ టైమ్‌ అచీవ్‌మెంట్ అవార్డు [5]

సంగీత గోష్ఠులు

[మార్చు]

ఇతడు తన సంప్రదాయ కచేరీలతో పాటు, గేమ్‌లాన్, జాజ్, ఎలెక్ట్రానిక్, ఫ్యూషన్, ఆఫిక్రన్ సంగీత గోష్ఠులతో పనిచేశాడు. ఇతడు ఉస్తాద్ విలాయత్ ఖాన్, వి.జి.జోగ్, జాకిర్ హుసేన్, హరిప్రసాద్ చౌరాసియా, శాంతా ప్రసాద్, స్వప్న చౌదరి వంటి వారితో జుగల్‌బందీ కచేరీలు చేశాడు. స్వరకర్తగా ఇతడు గేమ్‌లాన్, జాజ్, సంప్రదాయ పాశ్చాత్య ఆర్కెస్ట్రా, వివిధ వాద్యగోష్ఠులకు సంగీత దర్శకత్వం నిర్వహించాడు. ఇతడు డేవిడ్ రోజ్‌బూం, రిచర్డ్ టైటెల్బాం, చార్లీ హెడెన్, పాలిన్ ఒలివెరస్, పాల్ ప్లిమ్‌లీ, రాజేష్ మెహతా, ఆంథొని బ్రాక్స్టన్, డేవ్ బ్రూబెక్, గ్లెన్ వెలెజ్, స్టీవ్ స్మిత్, పీటర్ ఎస్కైనె, గియోవన్ని హిదాల్గో వంటి అంతర్జాతీయ కళాకారులతో కలిసి సంగీత గోష్ఠులు నిర్వహించాడు. 1996లో కెనడియన్ భరతనాట్య కళ్శాకారిణి "లతా పాద" చేసిన నృత్యనాటకం "టైమ్స్‌స్కేప్" కు సంగీతం సమకూర్చాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఇతడు కెనడా దేశంలోని టొరంటో నగరంలో నివసిస్తుననడు. ఇతని కుమార్తె శుభా శంకరన్ గాత్ర విద్వాంసురాలు, పియానో వాద్యకళాకారిణి. ఇతడు, శుభా శంకరన్, ఎర్నీ టాలర్‌లు కలిసి "త్రిచ్చి ట్రయో" పేరుతో ప్రదర్శనలు ఇస్తున్నారు.

డిస్కోగ్రఫీ

[మార్చు]

ఇతడు అనేక మంది సంగీత కళాకారులతో కలసి చేసిన కచేరీలను ఆడియో, వీడియో సి.డి., డి.వి.డి.లరూపంలో విడుదల చేశాడు.

వాటిలో సూటబుల్ ఫర్ ఫ్రేమింగ్,విర్ల్‌డ్, ఒలివర్ స్కోయెర్ అండ్ ది స్ట్యూడ్ టొమాటోస్, ఐవరీ గణేశ్ మీట్స్ డాక్టర్ డ్రమ్స్, క్యాచ్ 21, ఇన్నొవేటివ్ మ్యూజిక్ మీటింగ్, మజా మేజ్: సీక్రెట్స్ మూన్ మ్యాజిక్, లయ విన్యాస్, సునాద, లోటస్ సిగ్నేచర్స్, ది కర్నాటిక్ వయోలిన్, ముఖారి, గజలీలా, రిథమ్‌ వైజ్ మొదలైనవి కొన్ని మాత్రమే.

గ్రంథాలు

[మార్చు]

ఇతడు ఆంగ్ల భాషలో రచించిన గ్రంథాలు

 • 1977 – ది ఆర్ట్ ఆఫ్ డ్రమ్మింగ్: సౌత్ ఇండియన్ మృదంగం
 • 1994 – ది రిథమిక్ ప్రిన్సిపుల్స్ & ప్రాక్టీస్ ఆఫ్ సౌత్ ఇండియన్ డ్రమ్మింగ్
 • 2003 – ఫ్రేమ్‌ డ్రమ్స్ ఆఫ్ సౌత్ ఇండియా: ఎ హ్యాండ్ బుక్ ఒన్ సోల్కట్టు
 • 2010 – ది ఆర్ట్ ఆఫ్ కొన్నక్కోల్ (సోల్కట్టు)

మూలాలు

[మార్చు]
 1. Prakash, K. Arun (2011). "Tributes to Trichy Sankaran". Sruti. Retrieved May 19, 2020.
 2. శంకరనారాయణ & వైజర్సు బాలాసుబ్రహ్మణ్యం (1 May 2015). నాదరేఖలు (PDF) (1 ed.). హైదరాబాదు: శాంతా వసంతా ట్రస్టు. p. 100. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2022. Retrieved 18 March 2021. {{cite book}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 3. 3.0 3.1 "Trichy Sankaran chosen for 'Sangita Kalanidhi' title". Indian Express. 18 July 2011. Retrieved 19 July 2011.
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-09. Retrieved 2021-03-17.
 5. "Tiruchirapalli Vidwan honoured". The Hindu. January 23, 2017. Retrieved May 19, 2020.

బయటి లింకులు

[మార్చు]