Jump to content

వాకాటకులు

వికీపీడియా నుండి
(వాకాటక సామ్రాజ్యం నుండి దారిమార్పు చెందింది)
వాకాటక సామ్రాజ్యం

సా.శ. 250 – సా.శ. 500
రాజధానివత్సగుల్మ (నేటి వాశిమ్)
సామాన్య భాషలుసంస్కృతం
ప్రాకృతం
మతం
హిందూమతం
బౌద్ధం
జైనమతం
ప్రభుత్వంరాచరికం
మహారాజ 
• 250–270
వింధ్యశక్తి
• 270–330
మొదటి ప్రవరసేనుడు
• 475–500
హరిసేనుడు
చారిత్రిక కాలంClassical India
• స్థాపన
సా.శ. 250 
• పతనం
 సా.శ. 500
Preceded by
Succeeded by
పశ్చిమ క్షాత్రపులు
శాతవాహనులు
ఆభీరులు
కాలచూరి రాజవంశం
విష్ణుకుండినులు
చాళుక్యులు
రాజర్షితుల్యాకుల
Today part ofభారతదేశం

వాకాటక రాజవంశం సా.శ. 3వ శతాబ్దం మధ్యలో దక్కనులో ఉద్భవించిన పురాతన రాజవంశం. వారి రాజ్యం ఉత్తరాన మాల్వా, గుజరాత్‌ల దక్షిణపు అంచుల నుండి దక్షిణాన తుంగభద్ర నది వరకు, పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తూర్పున ఛత్తీస్‌గఢ్ అంచుల వరకు విస్తరించి ఉందని భావిస్తున్నారు. వారు డెక్కన్‌లోని శాతవాహనుల వారసుల్లో అత్యంత ముఖ్యమైన వారు. ఉత్తర భారతదేశంలోని గుప్తులకు సమకాలికులు. వాకాటక వంశీకులు బ్రాహ్మణులు. [2] [3] [4]

ఈ వంశ మూలపురుషుడైన వింధ్యశక్తి గురించి చాలా తక్కువగా తెలుసు (సుమారు సా.శ. 250 –  270). అతని కుమారుడు మొదటి ప్రవరసేన పాలనలో రాజ్య విస్తరణ ప్రారంభమైంది. మొదటి ప్రవరసేనుడి తర్వాత వాకాటక రాజవంశం నాలుగు శాఖలుగా విడిపోయిందని భావిస్తున్నారు. వీటిలో రెండు శాఖల గురించి తెలియగా, ఇంకో రెండింటి గురించి తెలియదు. తెలిసిన శాఖలు ప్రవరపుర-నందివర్ధన శాఖ, వత్సగుల్మ శాఖ. గుప్త చక్రవర్తి రెండవ చంద్రగుప్తుడు తన కుమార్తెను వాకాటక రాజకుటుంబంలోకి వివాహం చేసాడు. తరువాత వారి మద్దతుతో సా.శ. 4వ శతాబ్దంలో గుజరాత్‌ను శక సాత్రపుల నుండి స్వాధీనం చేసుకున్నాడు. వాకాటకుల తరువాత దక్కన్‌లో బాదామి చాళుక్యులు అధికారంలోకి వచ్చారు. [5] వాకాటకాలు కళలు, వాస్తుశిల్పం, సాహిత్యాలకు పోషకులుగా ప్రసిద్ధి చెందారు. వారు ప్రజోపయోగ పనులు చేపట్టారు. వారు నిర్మించిన కట్టడాల్లో వారి వారసత్వం కనిపిస్తుంది. అజంతా గుహలలోని బౌద్ధ విహారాలూ, చైత్యాలు (యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం) వాకాటక చక్రవర్తి హరిషేన ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి.

వింధ్యశక్తి

[మార్చు]

రాజవంశ స్థాపకుడు వింధ్యశక్తి (250-270). ఇతని పేరు వింధ్యవాసిని దేవత పేరు నుండి వచ్చింది. ఈ రాజవంశం అక్కడే ఆవిర్భవించి ఉండవచ్చు. వింధ్యశక్తి గురించి దాదాపుగా ఏమీ తెలియదు. అజంతా గుహ XVI శాసనంలో అతను వాకాటక కుటుంబపు స్థాపకుడిగా, ద్విజుడిగా వర్ణించబడ్డాడు. అతను గొప్ప యుద్ధాలు చేసి తన శక్తిని పెంచుకున్నాడని, అతనికి పెద్ద అశ్వికదళం ఉండేదనీ ఈ శాసనంలో పేర్కొనబడింది. కానీ ఈ శాసనంలో అతని పేరుకు ఎలాంటి రాజకీయ శీర్షిక లేదు. 96 ఏళ్లు పాలించాడని పురాణాలు చెబుతున్నాయి. అతని గురించి దక్షిణ దక్కన్, మధ్యప్రదేశ్, మాల్వాలో వివిధ స్థానాల్లో వివిధ రకాలుగా వర్ణించారు. KP జయస్వాల్ ఝాన్సీ జిల్లాలోని బగత్ అనే గ్రామాన్ని వాకాటకుల నివాసంగా ఆపాదించాడు. కానీ VV మిరాషి, వాకాటకులు అంత ఉత్తరానికి చెందినవారనే సిద్ధాంతాన్ని తోసిపుచ్చి, వాకాటక అనే పేరు యొక్క మొట్టమొదటి ప్రస్తావన అమరావతిలోని ఒక స్తంభపు శకలం మీద ఉన్న ఒక శాసనంలో ఉందని చెప్పాడు. ఇది వాకాటక ఇచ్చిన గృహపతి (గృహస్థుడు) అనే బహుమతిని నమోదు చేస్తుంది. ఈ గృహపతి బహుశా విద్యాశక్తికి మూలపురుషుడు అయి ఉంటాడు. వింధ్యాశక్తి విదిషా (ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో) పాలకుడని పురాణాలలో కనిపిస్తుంది, కానీ అది సరైనది కాదు.

డాక్టర్ మిరాషి, సముద్ర గుప్తుని అలహాబాద్ స్థూప శాసనంలో ప్రస్తావించబడిన రుద్రదేవుడే మొదటి రుద్ర సేనుడు అనడాన్ని తిరస్కరించాడు. వింధ్యకు ఉత్తరాన వాకాటకుల నాణేలు దొరకలేదని, వారి శాసనాలు కూడా లేవనీ అతను ఎత్తి చూపాడు. అందువల్ల, వాకాటకుల స్థానం దక్షిణాది అనడమే సరైనది. అయితే, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో శాసనాలు అందుబాటులో ఉన్నందున, అక్కడ కొన్ని చోట్ల వారు పాలించిన మాట వాస్తవమే. 

మొదటి ప్రవరసేనుడు

[మార్చు]

తదుపరి పాలకుడు మొదటి ప్రవరసేనుడు (270-330). అతను రాజ్యాన్ని బలోపేతం చేసాడు. తనను తాను సామ్రాట్ (సార్వత్రిక పాలకుడు) అని పిలుచుకున్న మొదటి వాకాటక పాలకుడతడు. నాగ రాజులతో యుద్ధాలు చేసాడు. బహుశా ఈ రాజవంశంలో అతడే ఏకైక చక్రవర్తి. అతని రాజ్యం ఉత్తర భారతదేశంలోని ఎక్కువ భాగానికీ, మొత్తం దక్కనుకూ విస్తరించింది. ఉత్తరాన నర్మద వరకూ దండయాత్రలు చేసాడు. శిశుక అనే రాజు పాలిస్తున్న పూరిక రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఏది ఏమైనప్పటికీ, అతను ఖచ్చితంగా ఉత్తరాన బుందేల్‌ఖండ్ నుండి (అతను నర్మదను దాటినట్లు డాక్టర్ మిరాషి అంగీకరించనప్పటికీ) దక్షిణాన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వరకు పాలించాడు. అతను 60 సంవత్సరాల పాటు పాలించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

వి.వి. మిరాషి ప్రకారం, మొదటి ప్రవరసేనుడు ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ లేదా కొంకణ్‌లో ఎలాంటి విజయం సాధించలేదు. కానీ, మహారాష్ట్రలోని కొల్హాపూర్, సతారా, షోలాపూర్ జిల్లాలతో కూడిన ఉత్తర కుంటాల భాగాలను జయించి ఉండవచ్చు. తూర్పున, అతను తన రాజ్యాన్ని దక్షిణ కోసల, కళింగ, ఆంధ్ర ప్రాంతాల వరకు విస్తరించి ఉండవచ్చు. అతను వైదిక మతాన్ని అనుసరించాడు. అగ్నిష్టోమ, ఆప్తోర్యామ, ఉక్త్య, షోడశ, అతిరాత్ర, వాజపేయ, బృహస్పతిసవ, సద్యస్క్ర లతో పాటు నాలుగు అశ్వమేధ యాగాలు చేసాడు. పురాణాల ప్రకారం వాజపేయ యాగం సమయంలో అతను బ్రాహ్మణులకు భారీగా దానం చేశాడు. సామ్రాట్‌తో పాటు ధర్మమహారాజు అనే బిరుదు కూడా అందుకున్నాడు. తనను తాను హరితీపుత్ర అని చెప్పుకున్నాడు. అతని ప్రధాన మంత్రి దేవా, చాలా భక్తిపరుడు, బ్రాహ్మణ పండితుడు. ప్రవరసేనుడికి నలుగురు కొడుకులు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. అతను తన కుమారుడు గౌతమీపుత్రను శక్తివంతమైన భరశివ కుటుంబానికి చెందిన రాజు భవనాగ కుమార్తెతో వివాహం చేసుకున్నాడు. అయితే, గౌతమీపుత్రుడు తండ్రి కంటే ముందే మరణించడంతో, మొదటి ప్రవరసేనుడి తర్వాత గౌతమీపుత్రుని కుమారుడు, తన మనవడూ అయిన మొదటి రుద్రసేనుడు రాజు అయ్యాడు. ప్రవరసేనుడి రెండవ కుమారుడు సర్వసేన, తన రాజధానిని వత్సగుల్మ (ప్రస్తుత వాశిమ్‌) లో స్థాపించాడు. మిగిలిన ఇద్దరు కుమారులు స్థాపించిన రాజవంశాల గురించి ఏమీ తెలియదు. [6] [7]

వాకాటక వంశపు శాఖలు

[మార్చు]

మొదటి ప్రవరసేనుడి తర్వాత వాకాటక కుటుంబం నాలుగు శాఖలుగా విడిపోయిందని భావిస్తున్నారు. వీటిలో ప్రవరపుర-నందివర్ధన శాఖ, వత్సగుల్మ అనే రెండు శాఖల గురించి తెలియగా, మిగతా రెండింటి గురించి తెలియదు.

ప్రవరపుర-నందివర్ధన శాఖ

[మార్చు]
నందివర్ధన కోట శిథిలాలు

ప్రవరపుర-నందివర్ధన శాఖ వార్ధా జిల్లాలోని ప్రవరపుర (పౌనార్), నాగ్‌పూర్ జిల్లాలోని మన్సార్, నందివర్ధన్ (నాగర్ధన్) వంటి వివిధ ప్రాంతాలను పాలించింది. ఈ శాఖ గుప్తులతో వైవాహిక సంబంధాలను కొనసాగించింది.

మొదటి రుద్రసేనుడు

[మార్చు]

రామ్‌టెక్ కొండకు సమీపంలో ఉన్న నందివర్ధన రాజధానిగా (నాగపూర్ నుండి సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది) పాలించిన గౌతమీపుత్ర కుమారుడు మొదటి రుద్రసేనుడి గురించి పెద్దగా తెలియదు. అలహాబాద్ స్తంభ శాసనంలో ఆర్యావర్తం లోని ఇతర పాలకులతోపాటు ఒక రుద్రదేవుని ప్రస్తావన కూడా ఉంది. AS అల్టేకర్ వంటి అనేకమంది పండితులు ఆ రుద్రదేవుడే ఈ మొదటి రుద్రసేనుడు అనే విషయాన్ని అంగీకరించరు. ఎందుకంటే మొదటి రుద్రసేనుని సముద్రగుప్తుడు సంహరించి ఉంటే, అతని కుమారుడు మొదటి పృథ్విసేనుడు గుప్త యువరాణి (ప్రభావతిగుప్త)ని తన కోడలిగా అంగీకరించే అవకాశం లేదు. రెండవది, నర్మదా నదికి ఉత్తరాన మొదటి రుద్రసేనుడు వేయించిన శాసనం ఏదీ కనబడలేదు. ఇప్పటి వరకు కనుగొనబడిన మొదటి రుద్రసేనుడీ పాలన కాలానికి చెందిన ఏకైక రాతి శాసనం ప్రస్తుత చంద్రపూర్ జిల్లాలోని దేవటెక్‌లో లభించింది. కాబట్టి అతన్ని ఆర్యావర్తానికి చెందిన అలహాబాద్ స్తంభ శాసనంలోని రుద్రదేవునితో పోల్చలేము. [8]

మొదటి పృథ్విసేనుడు

[మార్చు]

రుద్రసేన I తర్వాత అతని కుమారుడు పృథివిషేన I (355-380), అతని తర్వాత అతని కుమారుడు రుద్రసేన II లు పాలనకు వచ్చారు

రుద్రసేన II, దివాకరసేన, ప్రవరసేన II

[మార్చు]
మాన్సార్ వద్ద రెండవ ప్రవరసేనుడు నిర్మించిన ప్రవరేశ్వర శివాలయపు అవశేషాలు

రెండవ రుద్రసేనుడు (380–385) గుప్త రాజు రెండవ చంద్రగుప్తుడి (375-413/15) కుమార్తె ప్రభావతిగుప్తను పెళ్ళి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది రామ్‌టెక్‌లో లభించిన కేవల-నరసింహ శాసనాల ద్వారా ఇది ధృవీకరించబడింది. రాణి ప్రభావతిగుప్త కుమార్తె యైన (చా)ముండాను యువరాజు ఘటోత్కచగుప్త (అతను బహుశా రెండవ చంద్రగుప్తుని కుమారుడై ఉండవచ్చు) కు ఇచ్చి వివాహం చేసినట్లు ఇందులో ప్రకటించారు. [9]

రెండవ రుద్రసేనుడు చాలా తక్కువ పాలించి సా.శ. 385 లో మరణించాడు, దాని తర్వాత ప్రభావతిగుప్తా (385 - 405) తన కుమారులైన దివాకరసేన, దామోదరసేన (ప్రవరసేన II) ల తరపున 20 సంవత్సరాల పాటు రాజప్రతినిధిగా పాలించింది. ఈ కాలంలో వాకాటక రాజ్యం గుప్త సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. చాలా మంది చరిత్రకారులు ఈ కాలాన్ని వాకాటక-గుప్త యుగంగా పేర్కొంటారు. 30 సంవత్సరాల క్రితం దీన్ని ఎక్కువగా ఆమోదించినప్పటికీ, ఈ వాదనకు సరైన ఆధారాలు లేవు. ప్రభావతి గుప్తా వేయించిన శాసనంలో ఆమె తండ్రి "దేవ గుప్త" గురించిన ప్రస్తావన ఉంది. చరిత్రకారులు అతనే రెండవ చంద్ర గుప్తుడని అన్నారు. అయితే, దేవగుప్తుడే రెండవ చంద్ర గుప్తుడని నిరూపించడానికి వేరే ఆధారమేమీ లేదు. రెండవ ప్రవరసేనుడు మహారాష్ట్రీ ప్రాకృతంలో సేతుబంధాన్ని రచించాడు. గహ సత్తసాయిలోని కొన్ని పద్యాలు కూడా ఆయనకు ఆపాదించబడ్డాయి. అతను రాజధానిని నందివర్ధన నుండి తాను స్థాపించిన కొత్త నగరం ప్రవరపురానికి మార్చాడు. తన కొత్త రాజధానిలో రాముడికి ఆలయాన్ని నిర్మించాడు. [10]

వాకాటక వంశీకులు వేయించిన మొత్తం 17 తామ్ర శాసనాల్లో అత్యధికం వేయించినది రెండవ ప్రవరసేనుడు. పురాతన భారతదేశంలో అశోక చక్రవర్తి తర్వాత అత్యధికంగా శాసనాల్లో కనిపించిన పాలకుడు బహుశా అతడే.

నరేంద్రసేనుడు, రెండవ పృథివీసేనుడు

[మార్చు]

రెండవ ప్రవరసేనుడి తర్వాత వచ్చిన నరేంద్రసేన (440-460) పాలనలో వాకాటక ప్రభావం కొన్ని మధ్య భారత రాష్ట్రాలకు వ్యాపించింది. రెండవ పృథివీసేనుడు, ఈ వంశానికి చెందిన చివరి రాజు. అతను తన తండ్రి నరేంద్రసేన తర్వాత సి. 460 లో అధికారానికి వచ్చాడు. అతను విష్ణుకుండిన రాజు మాధవ వర్మ II చేతిలో ఓడిపోయాడు. 480లో అతని మరణం తరువాత, అతని రాజ్యాన్ని బహుశా వత్సగుల్మ శాఖకు చెందిన హరిసేన స్వాధీనం చేసుకున్నాడు.

వత్సగుల్మ శాఖ

[మార్చు]

మొదటి ప్రవరసేనుని మరణానంతరం అతని రెండవ కుమారుడు సర్వసేన, వత్సగుల్మ శాఖను స్థాపించాడు. సర్వసేన రాజు మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఉన్న వత్సగుల్మను తన రాజధానిగా చేసుకున్నాడు. [11] వీరి సామ్రాజ్యం సహిరి శ్రేణికి గోదావరి నదికీ మధ్య ఉంది. వారు అజంతాలోని కొన్ని బౌద్ధ గుహలను పోషించారు.

సర్వసేన

[మార్చు]

సర్వసేన (సా.శ. 330 - 355) ధర్మమహారాజు అనే బిరుదును పొందాడు. కృష్ణుడు స్వర్గం నుండి పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చిన కథ ఆధారంగా అతడు ప్రాకృతంలో రచించిన హరివిజయ గ్రంథానికి కూడా అతడు ప్రసిద్ధుడు. తరువాతి కాలపు రచయితల ప్రశంసలందుకున్న ఈ రచన అందుబాటులో లేదు. ప్రాకృత రచన గహ సత్తసాయిలోని అనేక పద్యాల రచయితగా కూడా అతను ప్రసిద్ధి చెందాడు. అతని మంత్రి పేరు రవి. అతని తరువాత అతని కుమారుడు వింధ్యసేనుడు రాజయ్యాడు. [11]] [12]

వింధ్యసేన

[మార్చు]

వింధ్యసేన (సా.శ. 355 - 400) ను రెండవ వింధ్యశక్తి అని కూడా అంటారు. తన 37వ పాలనా సంవత్సరంలో నందికట (ప్రస్తుతం నాందేడ్) ఉత్తర మార్గ (ఉప-విభాగం)లో ఉన్న ఒక గ్రామాన్ని దానం చేసినట్లు పేర్కొన్న వాషిమ్ ఫలకాలకు గాను అతను ప్రసిద్ది చెందాడు. ఆ శాసనం లోని వంశప్రశస్తి భాగం సంస్కృతంలోను, అధికారిక భాగం ప్రాకృతంలోనూ ఉంది. వాకాటక పాలకుడికి చెందిన మొట్టమొదటి భూదాన శాసనం ఇది. అతను ధర్మమహారాజు అనే బిరుదు అందుకున్నాడు. [13] వింధ్యసేనుడు దక్షిణ పొరుగున ఉన్న కుంతల పాలకుని ఓడించాడు. అతని మంత్రి పేరు ప్రవర. అతని తరువాత అతని కుమారుడు రెండవ ప్రవరసేనుడు రాజ్యానికి వచ్చాడు. [11]

రెండవ ప్రవరసేనుడు

[మార్చు]

రెండవ ప్రవరసేనుడు (సా.శ. 400 - 415) తదుపరి పాలకుడు. తన అద్భుతమైన, శక్తివంతమైన, ఉదారవాద పాలన ద్వారా అతను ఉన్నత స్థాయికి చేరుకున్నాడని అజంతా లోని గుహ XVI శాసనంలో ఉంది. అది తప్ప అతని గురించి తెలిసినది చాలా తక్కువ. అతను చాలా తక్కువ కాలం పాలించి, మరణించాడు. అతని మరణ సమయానికి 8 సంవత్సరాల వయసున్న అతని కుమారుడు అతని అనంతరం పాలనకు వచ్చాడు. ఈ పాలకుడి పేరు గుహ XVI శాసనం నుండి పోయింది. [13]

దక్షిణాసియా
సా.శ. 480 లో
అల్కోన్ హూణులు
ససానియన్ హింద్
పితృభక్త వంశం (కళింగ)
ససానియన్ సామ్రాజ్యం
వాకాటక సామ్రాజ్యం, దాని చుట్టుపక్కల రాజ్యాల పటం -సా.శ. 480. లో వాకాటక పాలన అంతాన, హరిసేనుడి పాలనా కాలంలో. అజంతా గుహలు (ఎర్ర చుక్క) చాలావరకు నిర్మించినది ఈ కాలం లోనే.[1]

హరిసేనుడు

[మార్చు]

దేవసేన తర్వాత అతని కుమారుడు హరిసేనుడు (సా.శ. 475 - 500) రాజయ్యాడు. అతను బౌద్ధ వాస్తుశిల్పం, కళ, సంస్కృతిని బాగా పోషించాడు. ప్రపంచ వారసత్వ స్మారక చిహ్నమైన అజంతా గుహలు అతని పోషణకు ఉదాహరణ. అజంతా లోని గుహ-XVI శాసనంలో అతను ఉత్తరాన అవంతి ( మాల్వా ), తూర్పున కోసల ( ఛత్తీస్‌గఢ్ ), కళింగ, ఆంధ్ర, పశ్చిమాన లత (మధ్య, దక్షిణ గుజరాత్ ), త్రికూట ( నాసిక్ జిల్లా ), దక్షిణాన కుంతల (దక్షిణ మహారాష్ట్ర) లను జయించాడని పేర్కొంది. [13] [14] హరిసేనుడి మంత్రి, హస్తిభోజుని కుమారుడూ అయిన వరాహదేవుడు, అజంతాలోని గుహ XVI లోని విహారాన్ని చెక్కించాడు. [11] అజంతాలోని మూడు బౌద్ధ గుహలు, రెండు విహారాలు - గుహలు XVI, XVII, చైత్య - గుహ XIX హరిసేనుడి పాలనా కాలంలో చెక్కడం, రంగులు వెయ్యడం, శిల్పాలంకరణ చేసారు. [13] కళా చరిత్రకారుడు, వాల్టర్ M. స్పింక్ ప్రకారం, అజంతా లోని రాతిలో తొలిచిన స్మారక చిహ్నాల్లో గుహల సంఖ్యలు 9,10,12,13, 15A మినహా మిగతా గుహలన్నీ హరిసేనుడి కాలం లోనే నిర్మించబడ్డాయి. [15] అయితే అతని ఈ అభిప్రాయం విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందలేదు.

హరిషేణ తర్వాత పేర్లు తెలియని ఇద్దరు పాలకులు వచ్చారు. రాజవంశం ఎలా అంతరించి పోయిందో ముగింపు తెలియదు. వారు బహుశా మాహిష్మతికి చెందిన కాలచుర్యుల చేతిలో ఓడిపోయి ఉండవచ్చు. [11]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Schwartzberg, Joseph E. (1978). A Historical atlas of South Asia. Chicago: University of Chicago Press. p. 145, map XIV.1 (i). ISBN 0226742210.
  2. Indian Costume By Govind Sadashiv Ghurye, Popular Prakashan Publications, Page 43
  3. Dynastic History of Magadha, Cir. 450-1200 A.D. By Bindeshwari Prasad Sinha, Page 28
  4. | Rabindranath Tagore: The Poet of India By A. K. Basu Majumdar, Indus Publishing, Page 50 (Vakatakas and Chalukyas-both of Brahmin origin)
  5. Ancient India, A History Textbook for Class XI, Ram Sharan Sharma, National Council of Educational Research and Training, India, pp 211
  6. Mahajan V.D. (1960, reprint 2007) Ancient India, New Delhi: S. Chand, ISBN 81-219-0887-6, p.588
  7. The Vakataka Gupta age (Circa 200-550 A.D.) by Majumdar, Ramesh Chandra; Altekar, Anant Sadashiv, 1954
  8. "History-Ancient Period, Chapter 3" (PDF). Government of Maharashtra website. Archived from the original (PDF) on 15 June 2011.
  9. . "The Ramtek Inscriptions II: The Vākāṭaka Inscription in the Kevala-Narasiṃha Temple".
  10. Mahajan V.D. (1960, reprint 2007) Ancient India, New Delhi: S. Chand, ISBN 81-219-0887-6, p.589
  11. 11.0 11.1 11.2 11.3 11.4 Mahajan V.D. (1960, reprint 2007) Ancient India, New Delhi: S. Chand, ISBN 81-219-0887-6, pp.590-91
  12. Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century. New Delhi: Pearson Education. p. 484. ISBN 978-81-317-1677-9.
  13. 13.0 13.1 13.2 13.3 Nashik district e-gazetteer - History, ancient period Archived 27 సెప్టెంబరు 2007 at the Wayback Machine
  14. The Vakataka Gupta age (Circa 200-550 A.D.) by Majumdar, Ramesh Chandra; Altekar, Anant Sadashiv, 1954 - Page No. 110
  15. Spink, Walter, M. (2009).