వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2009 45వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారత గణతంత్ర రాజ్యము నూటపది కోట్లకు పైగా జనాభా తో ప్రపంచం లో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యము లో ప్రపంచం లో ఏడవది. భారత దేశ ప్రాముఖ్యత గత రెండు దశాబ్దాలలో గణనీయంగా పెరిగింది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి( పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచం లోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తి] ఆవిర్భవించినది.

దక్షణాసియా లో ఏడు వేల కిలోమీటర్లకు పైగా సముద్రతీరము కలిగి ఉండి, భారత ఉపఖండము లో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య రహదారుల పైన ఉన్నది. పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు ఆఫ్ఘానిస్తాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. శ్రీలంక, మాల్దీవులు మరియు ఇండోనేసియా భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని పురాతన నాగరికతలకు పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ మతాలకు (హిందూ మతము, బౌద్ధ మతము, జైన మతము మరియు సిక్కు మతము) జన్మనిచ్చినది.


మధ్య ప్రదేశ్‌ లోని భింబెట్కా వద్ద లభ్యమైన రాతియుగపు శిలాగృహాలు, కుడ్యచిత్రాలు భారతదేశంలో మానవుని అతి ప్రాచీన ఉనికికి ఆధారాలు. మొట్టమొదటి శాశ్వత నివాసాలు 9,000 సంవత్సారాల కిందట ఏర్పడ్డాయి. ఇదే క్రీ.పూ.26 వశతాబ్దం మరియు క్రీ.పూ.20వ శతాబ్దం మధ్య కాలంలో వర్ధిల్లిన సింధులోయ నాగరికత. క్రీ.పూ.5 వ శతాబ్దం నుండి, ఎన్నో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతంలో, మౌర్య సామ్రాజ్యం, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి విలువైన సేవ చేసింది. తరువాతి వచ్చిన గుప్తులకాలం స్వర్ణ యుగం గా వర్ణించబడింది. దక్షిణాన, వివిధ కాలాల్లో చాళుక్యులు, చేర, చోళులు, పల్లవులు, పాండ్యులు మొదలగువారు పాలించారు. విజ్ఞాన శాస్త్రము, కళలు, సారస్వతం, భారతీయ గణితం, భారతీయ ఖగోళ శాస్త్రం, సాంకేతిక శాస్త్రం, భారతీయ మతములు, భారతీయ తత్వ శాస్త్రం మొదలైనవి ఈ కాలంలో పరిఢవిల్లాయి. రెండవ సహస్రాబ్దిలో తురుష్కుల దండయాత్రలతో, భారతదేశంలో ఎక్కువ భాగాన్ని ఢిల్లీ సుల్తానులు, తరువాత మొగలులు పాలించారు.


రెండవ సహస్రాబ్ది మధ్యలో, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండు వంటి ఐరోపా రాజ్యాలు వ్యాపారం చేసే తలంపుతో భారతదేశం వచ్చి, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఇక్కడి పరిస్థితి గమనించి, ఆక్రమించుకున్నారు. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీపై 1857లో జరిగిన విఫల తిరుగుబాటు (ఇదే, ప్రఖ్యాతి గాంచిన ప్రథమ స్వాతంత్ర్య సమరం) తరువాత, భారతదేశంలోని అధిక భాగం బ్రిటిషు సామ్రాజ్యం కిందకు వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర్య సమరం ఫలితంగా 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వతంత్రం సిద్ధించింది. 1950 జనవరి 26న సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పడింది.

ఇంకా....పూర్తివ్యాసం: పాతవి