Jump to content

వికీపీడియా:తెవికీ వార్త/2011-12-09/మాటామంతీ-సుజాత

వికీపీడియా నుండి
తెవికీ వార్త
తెవికీ వార్త
మాటామంతీ-సుజాత

మాటామంతీ-సుజాత

టి.సుజాత , డిసెంబర్,9, 2011
సుజాత తుమ్మపూడి
  • వికీపీడియా పరిచయం ఎప్పుడు, ఎలా

నాకు కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఆసక్తి ఎక్కువ. అంతర్జాలంలో అందుకొరకు శోధనా యంత్రం ద్వారా వెతకడం అలవాటు. అలా వెతికే సమయంలో ఇతర వెబ్‌పేజీలతో పాటు ప్రతిసారి వికీపీడియా పేజీకి లింకులు కనిపించేవి. కొంతకాలం నేను వాటిని తెరిచి చూడలేదు. చాలాసార్లు అలా చూసిన తరువాత ఒకసారి తెరిచి చూడాలని అనిపించింది. మొదటిసారిగా వికీపీడియా చూసిన తరువాత దానిలో ఖచ్చితమైన మరియు విస్తృతమైన సమాచారం ఉన్నట్లు గమనించాను. అప్పట్లో తెలుగు శోధనా అంతగా వాడకంలో లేనందువలన ఆంగ్లములో శోధించిన కారణంగా ఆంగ్లవికీపీడియా పేజీలను చూడడం ఆరంభించాను. ఆ పేజీలలో నీలి లింకులను ఉపయోగించి ఆసక్తి కలిగిన మరిన్ని విషయాలను చదవడం మొదలు పెట్టాను. అలా మొదలు పెట్టి తెలుగు లింకులు ఉంటాయా అని వెతకడం మొదలు పెట్టి వ్యాసాలకు ఉన్న తెలుగు లింకుల ద్వారా తెలుగు వికీపీడియాను గుర్తించాను. అది చూసి చాలా ఆనందం కలిగింది. అందులో నాకు కావలసినది వెతక సాగాను. కాని తెలుగువికీపీడియాలో అప్పట్లో అనుకున్నంత సమాచారము లభించలేదు. కాని ఎర్రలింకులను నొక్కినప్పుడు అక్కడ సమాచారం కనిపించక పోయినా దానిలో నాకు తెలిసిన సమాచారం వ్రాయవచ్చని తెలుసుకున్నాను. కాని ఏమి వ్రాయాలో మాత్రం తెలియలేదు. కాని వికీపీడియా సహాయం మూలంగా ఎలా వ్రాయాలో తెలుసుకున్నాను. తరువాత తెలుగులో వ్రాయడానికి వారిచ్చిన సహాయ సమాచారము మూలంగా లేఖినికి చేరుకున్నాను. ఆరంభంలో లేఖినిని ఉపయోగించి వ్రాసాను. అలాగే సోదర ప్రాజెక్టులు కూడా చూడసాగాను. ముందుగా సామెతలు, జాతీయాలు వ్రాయండంతో వికీలో ప్రవేశించాను. తరువాత చదువరి గారు వికీసభ్యత్వం తీసుకుని తెలుగువిక్షనరీలో వ్రాయమని సందేశం పంపించారు. అది చూసి నేను వారిని అడిగి సభ్యత్వం ఎలా తీసుకోవాలో తెలుసుకుని విక్షనరీలో పని మొదలు పెట్టాను. తరువాత చదువరి గారూ, వైజాసత్య గారూ, అన్వేషి గారూ ఇలా దాదాపు అప్పుడు చురుకుగా పాల్గొంటున్న సభ్యులందరూ నాకు కావలసిన ప్రోత్సాహం అందించి ముందుకు నడిపించారు. వారందరూ చూపించిన అభిమానం మరువలేనిది. విక్షనరీలో పని చేస్తున్నా నాకు వికీపీడియా అంటే అధికమైన ఆసక్తి ఉంటూ వచ్చింది. ఆకారణంగా వికీపీడియాలో కూడా వ్రాయడం మొదలుపెట్టాను.

  • సభ్యుడుగా/నిర్వహకులుగా ఇప్పటివరకు జరిపిన కృషి, గుర్తింపులు
    • నేను వైజాసత్య గారు ప్రతిపాదించిన తరువాత విక్షనరీ నిర్వాహకత్వం తీసుకున్న నిర్వాహకత్వంతో చేసిన కృషి ఏమీ లేదని అనుకుంటున్నాను. విక్షనరీలో అధికమైన దిద్దుబాట్లు చేసిన సభ్యులలో నేను ఒకరిని అన్న గుర్తింపు వచ్చింది.
    • విక్షనరీలో చేసిన పనిని ప్రోత్సహిస్తూ విశ్వనాధ్.బి.కె. గారూ ఇచ్చిన ప్రోత్సాహక పతకము ఒకటి. పదివేల దిద్దుబాట్లు చేసిన సందర్భంలో వైజాసత్య గారు ఇచ్చిన పతకము ఒకటి.
    • వికీపీడియాలో అనువాద వ్యాసాలు వ్రాసిన దానికి గుర్తింపుగా దేవా గారు ఇచ్చిన పతకము ఒకటి. వైవిద్యమైన వ్యాసాలను సమగ్రంగా వ్రాసినదానికి గుర్తుగా కాసుబాబు గారు ఇచ్చిన పతకము ఒకటి. 2010లో అధికంగా చేసిన పదిమంది సభ్యులలో ఒకరుగా ఇచ్చిన గుర్తింపు పతకము ఒకటి వికీలో లభించిన గుర్తింపులు.
    • ప్రతేక సభ్యత్వం :- శుద్ధిదళ సభ్యత్వం, హిందూ మత ప్రాజెక్ట్, అక్షరదోషనిర్మూలన, తెలుగు భాభాభిమాని.
    • వికీ సోర్స్‌లో అన్వేషి గారి కోరిక మీద భగవద్గీతకు తాత్పర్యం వ్రాయడం నాకు సంతృప్తిని కలిగించిన విషయాలలో ఒకటి.
    • వికీలో చికాగో వంటి విదేశీ నగరాల అనువాదాలు, జ్యోతిషం వంటి జ్యోతిషానికి సంబంధించిన వ్యాసాలు, మహాభారతం పర్వాలు అధ్యాయాల పరంగా వ్యాసాలను అభివృద్ధిచేయడం. రుక్మిణీదేవి అరండేల్ మరికొన్ని వైవిధ్యమైన వ్యాసాలు, కొన్ని. దేశాలకు సంబంధించి వ్యాసాలు, కొన్ని. దసరా వంటి పండుగలకు సంబంధించిన వ్యాసాలు, మథుర వంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించిన వ్యాసాలు, గూగుల్ వ్యాసాలను సరిదిద్దినవి కొన్ని. అనువాదవ్యాసాల శుద్ధి నేను చేసిన పనిలో ఇవి కొంత భాగం.
  • ప్రస్తుతం తెవికీలో చేస్తున్న కృషి

గ్రాండ్ కేనియన్ అనువాదవ్యాసాన్ని వ్రాస్తున్నాను. తరువాత పంచద్వారకల గురించి ఇంకా పర్యాటక ప్రదేశల గురించి వ్రాయాలని అనుకుంటున్నాను. ఇంకా మరికొన్ని వైవిధ్య్యం కలిగిన వ్యాసాలను వ్రాయాలని అనుకుంటున్నాను.

  • వికీ సమాచారానికి మీకు ముఖ్యమైన వనరులు

వికీలో నేను వ్రాసినవి అనేక వ్యాసాలు అనువాదాలే. ఇంకా చదినవి, చూసినవి, గుర్తు ఉన్నవి, తెలిసినవి వ్రాస్తుంటాను. కొన్ని వ్యాసాలు వ్రాయడానికి వారి అధికారిక వెబ్ సైట్లనుండి సమాచారాన్ని తీసుకుంటాను. బాసర, సురేంద్రపురి వంటివి. పండుగలు అలాంటివి తెలిసిన విషయాలు. రామోజీ ఫిల్మ్ సిటీ‎‎ లాంటివి చూసినవి. ఇంకా అంతర్జాల శోధనద్వారా మరికొంత సమాచారం కొరకు పరిశీలించడం.

  • వికీ కృషి లో నచ్చినవి/ నచ్చనివి/హాస్య సంఘటనలు

వికీలో నాకు నచ్చనవి అంతగా లేదు. తోటి సభ్యుల ప్రోత్సాహం, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొనడం, అనేక మంది సభ్యులు ఆచరిస్తున్న సంయమనం మెచ్చతగినవి. వికీపీడియాకు హాస్యానికి ఆమడదూరం కదా ! హాస్యపూరితమైన సంఘటనలు అరుదే. ఒకసారి మాటలబాబు గారు వైజాసత్యగారు నేను కొంత సమయము సందేశాలతో విక్షనరీ గురించి చేసిన సంభాషణ కొంత ఆసక్తి కలింగే విధంగా జరిగింది.

  • వికీ ఉపయోగపడిన విధం

వికీ నాకు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఉపయోగపడింది. నిరుపయోగంగా జరుగుతున్న నా తీరిక సమయాన్ని వికీ ఉపయోగకరంగా మార్చింది. కొన్ని ప్రదేశాలు చూసే ముందుగా వికీలో వాటి గురించి తెలుసుకుని తరువాత ఆ ప్రదేశాలు సందర్శించడం కొంత ఉపయోగకరమైనది. మథుర, రిషికేశ్ వంటివి అలాంటివే.

  • తెవికీ భవిష్యత్తుకి కలలు

తెవికీ తన పాఠకులకు మరింత సమాచారాన్ని అందించాలి. ప్రభుత్వ విధానాలు, చట్టము గురించిన వివరణలు, ప్రభుత్వప్రణాళికలు లాంటి విషయాలు తెలుగులో తెలుసుకునే అవకాశం తెలుగువారికి వికీ అందించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి విషయాలు ఎన్నో మనకు ఇంకా తెలుగులో లభ్యం కావడం లేదు. వికీ ఇంకా ఉపయోగకరంగా మారాలని కోరుకుంటున్నాను.

  • తోటి సభ్యులు నుండి మీ కోరికలు

తోటి సభ్యుల ప్రోత్సాహం, గౌరవం, అభిమానం అందుకున్న వికీసభ్యులలో నేను ఒకరిని. చురుకైన సభ్యులందరు నన్ను ప్రోత్సహించిన వారే. తెవికీకి చురుకైన సభ్యుల కొరత ఉంది. కనుక సభ్యులు ఆసక్తి పెంచుకొని నూతన వ్యాసాలను వ్రాస్తే బాగుంటుంది. భారతీయ భాషా వ్యాసాలలో తెలుగు వ్యాసాలు సంఖ్యలో వెనుకబడి ఉన్నాయి. సభ్యులు అనేకమంది చలనచిత్రాల గురించి వ్రాస్తున్నారు. వాటి స్థానంలో విజ్ఞానదాయకమైనవి, భారతీయ సంప్రదాయతను తెలియజేసేవి, శాత్రీయ విషయాలను తెలియజేసేవి అయిన వ్యాసాల వైపు దృష్టిసారించి మెరుగుపరిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మంచివ్యాసం చదివినప్పుడు మీ స్పందన తెలియజెయ్యండి. అలా స్పందిస్తే వ్యాసకర్తలకు ప్రోత్సాహం లభించి మరిన్ని మంచి వ్యాసాలను అందించి తేవికీ అభివృద్ధికి తోడ్పడే అవకాశం ఉటుంది. అలాగే మీ స్వంత ఊరు గురించిన చరిత్ర లాంటి విషయాలను వ్యాసాలలో చేర్చడం సులువు కనుక వాటిని వ్యాసాలలో చేరిస్తే అనేక ఊర్ల గురించిన విషయాలు తెలుసుకునే అవకాశం మిగిలిన సభ్యులకు లభిస్తుంది. అలాగే మీరు కొత్తగా చూసినవి, మీ ఊరి ప్రత్యేకత మీ ఊరులో మాత్రమే జరిగే జాతరలు, ఉత్సవాలు గురించిన చిత్రాలను కూడా చేర్చండి. మీకు అతి సాధారణం అనిపించేవి ఇతరులకు ఆసక్తిని కలిగించేవిగా ఉంటాయి.

నాణ్యతకలిగిన వ్యాసాల సంఖ్యలో తెలుగు వికీపీడియా బాగా వెనుకబడి ఉంది. సభ్యులు చొరవతీసుకుని తెవికీ వ్యాసాలను మెరుగుపరుస్తూ సుసంపన్నం చేసి తెవికీ అందరికంటే ముందు ఉండేలా చేసి తమ మాతృభాషాభిమానాన్ని నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను.

  • భారత కాలమానం ప్రకారం వికీ పీడియాలో కృషి చేసే రోజు(లు)/సమయం

భారతకాలమానంలో రాత్రి తొమ్మిది నుండి పన్నెండు వరకు అంతరాయం లేకుండా వీలుకలిగిన రోజులలో చేస్తుంటాను. అదికాక పనిమధ్యలో వీలున్నప్పుడు వ్రాస్తుంటాను. ఉదయం తొమ్మిది తరువాత కొంత సమయము వ్రాస్తాను. ఎక్కడ ఉన్నా నేను వ్రాసే సమయాలు మాత్రం ఇవే.

  • తోటి సభ్యులు సంప్రదించాలనుకుంటే, మీ కిష్టమైన సంప్రదింపు విధం

ఈ మెయిల్ ద్వారా సంప్రదింపులు జరుప వచ్చు. చర్చా పేజీలలో సంప్రదింపులు జరుప వచ్చు.

  • తెవికీ వార్త చదువరులకి సందేశం

అర్జునరావు గారి కృషి ఫలితంగా తెవికీ వార్త ఆవిర్భవించింది. తెవీకీ సభ్యులు తమను గురించి తెలియజేయడానికి తెవికీలో ప్రతివారం ఒక్కో సభ్యులు పాల్గొని వారిని గురించి తెలియజేస్తే బాగుంటుంది. తెవికీ వార్త చదువరులు మీ స్పందనలను తెలియజేసినట్లైతే నిర్వాహకులకు నూతనోత్సాహం లభించి మరింత మెరుగుగా ఈ పత్రిక అందించే అవకాశం ఉంది. అలాగే తెవికీ వార్తలో కావలసిన శీర్షికలను మీ కోరికగా తెలియజెయ్యండి. అలాచేస్తే మీరు కోరినవి అందరి అంగీకారాన్ని పొందిన విషయాలు తెవికీ వార్తలో చోటుచేసుకుంటాయి. వికీపీడియా గురించిన సరికొత్త విశేషాలను అందించే వ్యాసాలను చదివి తెలుసుకోండి. పోలండ్ లో జరిగిన వికీమేనియా2010 , గుంటూరు, విజయవాడలలో అర్జునరావు గారిచే నిర్వహింపబడిన అవగాహనా సదస్సులు వంటివి వీటిలో కొన్ని.

+వ్యాఖ్య చేర్చుఈ కథనాన్ని చర్చించండి
  • ముందుగా సుజాత గారికి అభినందనలు. వారు (సుజాత గారు) ఈ స్థాయికి చేరుకునేందుకు సహాయ సహకారములు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షాభి వందనములు. చాలా సంతొషము.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:49, 9 డిసెంబర్ 2011 (UTC)

  • వికీపీడియా కు మీ సేవలు ఎంతో సంతోషాన్ని కలుగ చేస్తున్నాయి. ఇందులో ఉంచిన ఛాయాచిత్రం వర్గాలు: త్వరితగతిన తొలగించవలసినవి లో ఉన్నది. సరైన విధంగా స్పందించి, ఈ హెచ్చరిక తొలగించుటకు తోడ్పడగలరు. cbrao 17:56, 9 డిసెంబర్ 2011 (UTC)
  • ప్రయోజనకరమైన వ్యాసాలను రచిస్తూ, పెద్ద దిద్దుబాట్ల ద్వారా తెవికీ అభివృద్ధికి కృషిచేస్తున్న సుజాత గారికి అభినందనలు. పురాణాలు, పట్టణాలు సంబంధిత వ్యాసాలలో సుజాత గారి కృషి మెచ్చదగినది. దిద్దుబాట్ల సంఖ్య కంటె తెవికీ నాణ్యతపై దృష్టిపెట్టిన తెవికీమణికి కృతజ్ఞతలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:17, 10 డిసెంబర్ 2011 (UTC)
స్పందన తెలుపిన సభ్యులందరికి ధన్యవాదాలు. ఇప్పుడు లభించిన గుర్తింపు సభ్యులందరి సమిష్టి కృషి ఫలితమే. ఇప్పటి వరకు తెవికీలో పని చేయడానికి సహసభ్యుల సహకారం ప్రోత్సాహం ఎంతో ఉంది . అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక మీదట కూడా ఇది కొనసాగాలని ఆశిస్తున్నాను.t.sujatha 13:43, 11 డిసెంబర్ 2011 (UTC)