విజయ్‌కుమార్ మల్హోత్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజయ్‌కుమార్ మల్హోత్రా

పదవులు
ఢిల్లీ శాసనసభ ప్రతిపక్షనేత
4 సార్లు లోక్‌సభ సభ్యుడు
నియోజకవర్గము గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం డిసెంబర్ 3, 1931
లాహోర్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి కృష్ణ మల్హోత్రా
సంతానము ఒక కుమారుడు, ఒక కూతురు
మతం హిందూ మతము
డిసెంబర్ 27, 2008నాటికి

భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేతలలో ఒకరైన విజయ్‌కుమార్ మల్హోత్రా (Vijay Kumar Malhotra) 1931, డిసెంబర్ 3న లాహోర్‌లో జన్మించాడు. హిందీ సాహిత్యంలో డాక్టరేట్ పట్టా పొందిన మల్హోత్రా హిందీలోనూ, ఆంగ్లంలోనూ పలు రచనలు చేశాడు. 1958లో ఢిల్లీ కార్పోరేషన్ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మల్హోత్రాకు నాలుగు సార్లు లోక్‌సభ సభ్యుడిగానూ, ఒక పర్యాయం రాజ్యసభ సభ్యుడుగానే కాకుండా అనేక పార్లమెంటరీ కమిటీలలో పనిచేసిన అనుభవం ఉంది. 2008 ఢిల్లీ ఎన్నికలకు ముందు మల్హోత్రాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అతను గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలుపొందిననూ రాష్ట్రంలో పార్టీ పరాజయం పొందింది. అయిననూ లోక్‌సభ సభ్యత్వానికి, లోక్‌సభలో పార్టీ ఉపనాయకుడి హోదాను వదిలి శాసన సభ్యుడిగానే కొనసాగాలని నిర్ణయించాడు. ప్రస్తుతం ఢిల్లీ శాసనసభ ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నాడు.

ప్రారంభ జీవితం[మార్చు]

1931, డిసెంబర్ 3న ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న లాహోర్ నగరంలో మల్హోత్రా జన్మించాడు. తండ్రి ఖాజన్ చంద్ మల్హోత్రా ఆయుర్వేద వైద్యుడు. ఆర్యసమాజ్‌కు చెందిన సంప్రదాయ కుటుంబంలో జన్మించడంతో నైతిక విలువలను బాగా అలవర్చుకున్నాడు..[1] మొత్తం 7 గురు సంతానంలో ఇతను పెద్దవాడు. ఇతనికి ఒక సోదరుడు, ఐదుగురు సోదరిమణులు ఉన్నారు. తల్లి సుశీలాదేవి ఆర్యసమాజ్‌కు చెందిన పలు సంస్థల తరఫున పనిచేసింది. చిన్న వయస్సునుంచే చదువులో ముఖ్యంగా గణితంలో మంచి ప్రతిభను కనబర్చాడు. కళాశాల చదువులు లాహోర్ లోని డిఏవి కళాశాల మరియు ఢిల్లీలోని హన్స్‌రాజ్ కళాశాలలో కొనసాగింది. ఆ తర్వాత హిందీలో ఏం.ఏ. చేసి హిందీ సాహిత్యంలో డాక్టరేట్ కూడా పొందినాడు.

రాజకీయ జీవితం[మార్చు]

1953లో శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రోద్బలంతో జనసంఘ్ పార్టీ (భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపం) లో చేరి తొలిసారిగా 1958లో ఢిల్లీ కార్పోరేషన్ సభ్యుడిగా రాజకీయ పదవిని చేపట్టి తదనంతరం అనేక ముఖ్య పదవులు చేపట్టడం జరిగింది. 1968లో గోసంక్షణ కోసం చేసిన ధర్నాలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 1962-72 మధ్య కాలంలో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్‌ సభ్యుడిగా వ్యవహరించాడు. (ఇది శాసనసభతో సమానం) అదేసమయంలో ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్‌గానూ కొనసాగినాడు (ఇది ప్రోటోకాల్ విషయంలో ముఖ్యమంత్రి పదవితో సమానం).[2] 1977లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1989, 1999 మరియు 2004లలో మొత్తం 4 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ తరఫున లోక్‌సభ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు. మధ్యలో ఒకసారి 1994లో రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగిన మల్హోత్రా పలు పార్లమెంటరీ కమిటీలలో పనిచేసిన అనుభవం ఉంది. 1977లో ఇందిరా గాంధీ ప్రభుత్వం కాలంలో ప్రముఖ ప్రతిపక్ష నాయకులతో పాటు మల్హోత్రా కూడా 19 నెలలపాటు జైలు జీవితం గడిపినాడు. రాజకీయ పదవులే కాకుండా పలు పార్టీ పదవులు కూడా నిర్వహించిన ఘనత మల్హోత్రాకు ఉంది. భారతీయ జనతా పార్టీ ఛీఫ్ విప్‌గా, అధికార ప్రతినిధిగా పనిచేసి పార్టీకి విశేష సేవలందించాడు.

క్రీడల అధికారిగా[మార్చు]

క్రీడలంటే మక్కువ కల విజయ్‌కుమార్ మల్హోత్రా ఢిల్లీలో చదరంగం మరియు ఆర్చెరీ క్లబ్‌లను నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఆర్చెరీ క్లబ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నాడు. భారత ఒలింపిక్ అసోసియేషన్‌కు ఉపాద్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నాడు. 2010లో ఢిల్లీలో జరిగే కామన్వెల్త్ క్రీడల నిర్వహణ సంస్థతోనూ సంబంధాలు కలిగిఉన్నాడు.

భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి[మార్చు]

2008లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ముందే మల్హోత్రాను పార్టీ అధికార ముఖ్యమంత్రి అభ్యర్థిగా సెప్టెంబర్ 26న భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.[3] మల్హోత్రా గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీతో గెలిచినప్పటికీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వెనుకబడటంతో ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. పార్టీ ఓడిపోయి ముఖ్యమంత్రి పదవి దూరమైననూ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి శాసనసభ్యుడిగా మరియు ఢిల్లీ శాసనసభ ప్రతిపక్షనేతగా కొనసాగుతున్నాడు.[4]

రచనలు[మార్చు]

  • కమల్ శాశ్వత్ సాంస్కృతిక్ ప్రతీక్ (హిందీ).[5]
  • లోటస్ ఎటర్నల్ కల్చరల్ సింబల్ (ఆంగ్లం).
  • హిందూత్వ శాద్యాంత్రోన్ కి ఘరో మే (హిందీ).

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]