షేక్ చిన మౌలానా
డా.షేక్ చిన్న మౌలానా | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1924 మే 12 |
మూలం | కరవది, ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా |
మరణం | 1999 ఏప్రిల్ 13 శ్రీరంగం, తమిళనాడు | (వయసు 74)
సంగీత శైలి | కర్నాటక సంగీతం |
వృత్తి | సంగీత విద్వాంసుడు |
వాయిద్యాలు | నాదస్వరం |
క్రియాశీల కాలం | 1944-1999 1924-1999 |
వెబ్‌సైటు | http://www.kasimbabu.org |
షేక్ చిన మౌలానా (1924 మే 12 - 1999 ఏప్రిల్ 13) భారతీయ ప్రముఖ నాదస్వర విద్వాంసులు.[1] 1977లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. నాదస్వర వాద్యంలో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి ఘడించాడు.
ఫిలింస్ డివిజన్ (గవర్నమెంట్ ఆఫ్ ఇండియా) డాక్టర్ షేక్ చిన్న మౌలానా (నాన్-ఫీచర్ ఫిల్మ్)పై ఒక చిత్రాన్ని రూపొందించింది. ఈ చిత్రం 31వ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇండియన్ పనోరమా-2000)కి, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు కూడా ఎంపికైంది.
బాల్యం
[మార్చు]ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో దూదేకుల కుటుంబంలో 1924 మే 12న షేక్ చిన మౌలానా జన్మించాడు. ఆయన పూర్వీకులు గుంటూరు జిల్లా, నరసరావుపేట తాలూకా సాతులూరు గ్రామమునకు చెందిన వారుగా చెప్తారు. చిన్నతనంలో ఆయన షేక్ ఆదమ్ సాహెబ్ వద్ద నాదస్వర వాద్యంలో శిక్షణ పొందాడు. ఆ తరువాత పది సంవత్సరాల పాటు దురై కణ్ణు పిళ్ళై వద్ద ఆయన నాదస్వరంలో ఆరితేరాడు.
కెరీర్
[మార్చు]శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయంలో ఆయన ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా విధులు నిర్వర్తించాడు. ఆయన స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు. ఆయన కొంత కాలం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఛాన్సలర్ గానూ చేసాడు.
తమిళనాడు నడిబొడ్డున ఉన్న శ్రీరంగంలో స్థిరపడిన ఆయన యువ తరానికి సంగీత విజ్ఞానాన్ని అందించాలనే ఏకైక లక్ష్యంతో శారదా నాధస్వర సంగీత ఆశ్రమం స్థాపించాడు. ఆ రంగంలో ఆయన అనేక మంది నిష్టాతులైన విద్యార్థులను తయారు చేయడంలో విజయం సాధించాడు.
వ్యక్తిగతం
[మార్చు]షేక్ చిన మౌలానాకు ఒకే కూతురు బీబి జాన్. ఆమెను తన శిష్యుడు సుభాన్ సాహెబ్ కు ఇచ్చి వివాహం జరిపించాడు. వీరి పిల్లలు ఇద్దరు నాదస్వర విద్వాంసులుగా రాణిస్తున్నారు. నాదస్వర కళాసోదరులుగా పేరుగాంచిన ఎస్.ఖాసిం, బాబులు తిరుమల బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల ముందు నాదస్వరాన్ని పలికిస్తూ స్వామివారికి రెంగు దశబ్దాలకుపైగా నాద స్వరార్చన చేస్తున్నారు.[2]
పురస్కారాలు
[మార్చు]దేశవిదేళాల్లో నాదస్వర కచేరీలు నిర్వహించిన ఆయన అమెరికా, సోవియట్ యూనియన్, హాంకింగ్ లాంటి ఎన్నో దేశాలు పర్యటించాడు. రాముణ్ణి, కృష్ణున్ని, అల్లాని, త్యాగయ్యనీ.. ఇలా నాదస్వరంతో పూజించే ఆయన మహా విద్వాంసుడు, ఒక సత్పురుషుడు, ఒక తత్త్వవేత్త. అన్నిటినీ మించి ఒక మానవతా వాది.
- 1976లో తమిళనాడు ప్రభుత్వంచే కళై మామణి
- 1977లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు
- 1977లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం
- 1980లో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీచే గానకళా ప్రపూర్న
- 1985లో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతులమీదుగా ఆయనకు కళాప్రపూర్ణ బిరుదు (గౌరవ డాక్టరేట్)
- 1987లో తెలుగు విశ్వవిద్యాలయ సత్కారం
- 1988లో మద్రాసు సంగీత అకాడమీ నుంచి సంగీత కళానిధి పురస్కారం
ఇవే కాకుండా రాజమండ్రి సంగీత రసికులచే 1981లో గాంధర్వ కళానిధి, మచిలీపట్నంలోని సరస్వతి కళాసమితిచే నాద స్వర కళానిథి, విజయవాడ త్యాగరాజ సంగీత కళా సమితిచే 1988లో సంగీత విద్వన్మణి వంటి సత్కారాలు మరెన్నో ఆయన పొందాడు.
మరణం
[మార్చు]74 ఏళ్ల వయసులో షేక్ చిన మౌలానా 1999 ఏప్రిల్ 13న శ్రీరంగంలో తుదిశ్వాస విడిచాడు.
డాక్టర్ షేక్ చిన్న మౌలానా ఫౌండేషన్
[మార్చు]షేక్ చిన మౌలానా మరణానంతరం అతని మనవళ్లు కాసిం, బాబులు తమ తాత జ్ఞాపకార్థం డా.చిన్నమౌలానా మెమోరియల్ ట్రస్ట్‌ని స్థాపించారు. నాధస్వరం సంగీతం ప్రాముఖ్యతను ప్రపంచీకరించడం ప్రధాన లక్ష్యంగా ఈ ట్రస్టు పనిచేస్తుంది. అర్హులైన విద్యార్థులకు నాధస్వరం వాయిద్యాలను అందజేయడం ద్వారా ట్రస్ట్ గొప్ప సేవను అందిస్తోంది. అలాగే ఔత్సాహికులైన నిరుపేద కళాకారులకు తోడుగా నిలుస్తోంది.
షేక్ చిన మౌలానా గురించి తనికెళ్ళ భరణి మాటల్లో..
[మార్చు]- నాదస్వరం పేరెత్తగానే ఆంధ్రులందరికీ నాదస్వర విద్వాన్ షేక్ చినమౌలా స్ఫూర్తినిస్తాడు. చినమౌలా జన్మదినం ప్రభవ వైశాఖ బహుళ చతుర్దశి!వంశపార్యంగా నాదస్వరం మౌలా వాళ్ళ ఆస్తి! ఒకటిగాదు రెండుగాదు, దాదాపు మూడు వందల సంవత్సరాల నుంచీ కరవది దేవాలయానికి ఆస్థాన విద్వాంసులు. వంశానికి మూల పురుషుడు విద్వాన్ ఆదం సాహెబ్, దేవగాంధారి రాగంలో నిపుణుడు. ఆయన పల్లవి పాడుతున్నప్పుడు చేతులతోటి కాళ్ళతోడి కూడా తాళం వేసేవాడట. వంశంలో తర్వాత చిలకలూరిపేట చినమౌలా, పెదమౌలా అనే సోదరులుండేవారు. చినమౌలా సంస్కృత విద్వాంసుడు. అమరకోశం, రామయణం ఆయనకి కంఠోపాఠం! ఆ తర్వాతి వాడు కొమ్మూరు పెంటూ సాహెబ్! ఈయన్ని ‘కళ్యాణి’ పెంటూ సాహెబ్ అనీ, ‘కేదారగౌళ’ పెంటూ సాహెబ్, ‘బిళ్హరి’ పెంటూ సాహెబ్ అని పిలిచేవారట. ఎంచేతంటే ఆ రాగాల్ని ఆయన అంత సాధికారంగా, స్వారస్యంగా వాయించే వారు. ఆ తర్వాతి తరంలో చిన పీరు సాహెబ్! ఈయన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ‘సావేరి’ రాగం వాయిస్తుంటే సుప్రసిద్ధ గాయకులు, నటులు శ్రీ జొన్నవిత్తుల శేషగిరిరావు గారు ‘చిన పీరూ నువు సావేరి వాయిస్తుంటే కనకదుర్గాంబ ప్రత్యక్షమౌ తోందయ్యా, కనక ఈ రాగాన్ని అమ్మకి అంకితమియ్యి అన్నాట్ట.
- అలాంటి వంశంలో చినమౌలా పసితనంలోనే పాలపీక బదులు సన్నాయి పీకనే నోట్లో పెట్టుకునుంటాడు. సంగీత సాగరాన్ని జుర్రేసుంటాడు.ఊపిరితిత్తులు నాదస్వరాలూ, గుండె డోలూ అయిపోయుంటుందా?సాక్షాత్తు ‘చినమౌలా నాద’ స్వర స్వరూపుడై పోయాడు! పట్టుమని పదేళ్ళుండగానే కరవది ఆలయంలో కచేరీ చేశాడు! సొగసుగా మృదంగ తాళము నాదస్వరంతో అతగూర్చి రాముణ్ణి సొక్కజేసిన ధీరుడైపోయాడు!దక్షిణ భారతదేశంలో ఆయన వెళ్ళని సంగీత సభుందా? గుళ్ళూ, గోపురాలూ ఉన్నాయా?చేయించుకోని సన్మానం ఉందా? పొందని బిరుదులున్నాయా?అయినా తనకి కొన్ని బాణీలని నేర్పిన నాచ్యార్ కోయిల్ శ్రీరాజం, దొరై కణ్డు సోదరుల్ను గురువులుగా స్మరిస్తాడు.కంచి కామకోటి పీఠం పరమాచార్య సమక్షంలో నాదస్వర కచేరీ చేసి ధనాత్ముడయ్యాడు. శృంగేరి పీఠం శంకరాచార్యుల సముఖంలో కచేరీ చేసి పుణ్యాత్ముడయ్యాడు!
- పుట్టడం ముస్లిం గానే నయినా, ఆయన ఇల్లూ, ఆచార్యవ్యవహారాలూ వైదిక సంప్రదాయాన్ని ప్రతిబింబించేవి. పట్టుబట్ట కట్టడం, కుంకుమ బొట్టుపెట్టడం, భక్తిగా రాముడికి దణ్ణం పెట్టడం, ఏమిటని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆయన నాదోపాసకులకు మతభేదమేమీలేదు అంటాడు. పర్వీన్ సుల్తానా చక్కగా కుంకుమ బొట్టు పెట్టు కునేది. బడే గులాం అలీఖాన్ పాకిస్తాన్లో కచేరీ ఇస్తూ ‘కన్హయ్యా’ (కృష్ణుడు) అనే గీతం ఆలపిస్తే అక్కడి వాళ్ళు ఆక్షేపించగా కన్నయ్య లేని సంగీతం నా కక్కర్లేదు అని వచ్చేశాడట. భగవత్ సాక్షాత్కారానికి వివిధ మార్గాలున్నా నాకు సంగీతమే శరణ్యం. దాన్లో పై స్థాయికి వెళ్ళడమే నా లక్ష్యం. అన్ని మతాల్లోనూ సంగీతానికి, భక్తికి సంబంధం ఉంది. మేము అనుదినం చేసే నమాజు అల్లాహు అక్బర్ అనే బేంగ్ (నినాదం) మాయా మాళవగౌళరాగం! సంగీతం నాకు ఎంత ప్రాణమైపోయిందంటే కరవదిలో మాకు మళ్ళూ మాన్యాలూ, ఇళ్ళూ వాకిళ్ళు ఉన్నా కేవలం సంగీతం కోసం, సంగీత వాతావరణం కోసం శ్రీవైష్ణవుల 108 దేవాలయాల్లో ప్రధానమైన ‘శ్రీరంగం’ లోనే స్థిరపడ్దాను. శ్రీరంగం కలియుగ వైకుంఠంగా విఖ్యాతమైనది. ఆళ్వారుల్లో పెక్కుమంది శ్రీరంగ వైభవాన్ని గానం చేశారు. తిరుప్పాణాళ్వారు, నాచ్యార్ రంగనాథుని పాద సన్నిధిలో లీనమయ్యారు. ఎంతోమంది సంగీత విద్వాంసులు ఈ శ్రీరంగ ద్వీపంలో జన్మించారు.ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఉంటూ నిత్యం నాదస్వరార్చన చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అంటూ కళ్ళనుండి ఆనంద బిందువులు దొర్లిస్తారు చినమౌలా!
ఇవికూడా చూడండి
[మార్చు]- http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=27182&Categoryid=10&subcatid=34
- http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/mar13/emdaromahanubhavulu.html
మూలాలు
[మార్చు]- ↑ "ఏప్రిల్ 13వ తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంట". web.archive.org. 2023-03-02. Archived from the original on 2023-03-02. Retrieved 2023-03-02.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "God Predestined Me To Glorify Him Through A Pipe Instrument Called The Nadhaswaram". www.southasianconnection.com. Archived from the original on 2008-05-18.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1924 జననాలు
- పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు
- కళాప్రపూర్ణ గ్రహీతలు
- ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం ప్రముఖులు
- ప్రకాశం జిల్లా సంగీత విద్వాంసులు
- కళైమామణి పురస్కార గ్రహీతలు