గోపరాజు సరస్వతి
సరస్వతి గోరా (1912–2006) భారతీయ సామాజిక ఉద్యమకారిణి. ఆమె సంఘసేవిక, మతాతీత మానవతావాది. ఆమె నాస్తిక కేంద్రానికి అనేక సంవత్సరాలపాటు ప్రసిద్ధ నాయకురాలిగా యున్నారు.ఆమె అస్పృస్యత, కుల వ్యవస్థ పై అనెక కార్యక్రమాలను, ఉద్యమాలను చేసారు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె విజయనగరంలో 1912లో జన్మించింది. పదేళ్ల వయసులో గోరాతో పెళ్ళయ్యింది. గోరాతో పాటు ఆమె నాస్తిక కేంద్రాన్ని స్థాపించింది. ఈ కేంద్రంలో నాస్తికవాదం, హేతువాదం, గాంధేయవాదం వంటి వాటిపై మానవతా విలువలు పెంపొందించేవారు. గోరాతో పాటు సరస్వతీ గోరా 1928 ప్రాంతాల్లో శ్రీలంకలో ఉన్నారు. మతాచారాల్ని ధిక్కంచారు. పైగా ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు కావాలని గ్రహణం చూశారు. రాహువు, కేతువులు మానవ సమాజంలోనే ఉన్నారన్నారు. నిప్పులమీద నడవడమనేది దేవతల మహాత్మ్యం కాదని ఎవరైనా నడవవచ్చని ఆమె స్వయంగా నిప్పుల మీద నడచి ఋజువు చేసింది. దేవదాసీ వ్యవస్థ భ్రష్టాచారమంటూ దేవదాసీలకు స్వయంగా వివాహం జరిపించారు. కుల నిర్మూలన, నాస్తిక వాదాల్ని విస్తృతంగా ప్రచారం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని కొన్నాళ్లు జైలుశిక్ష అనుభవించారు. అస్పృశ్యతా నివారణ ఉద్యమం చేపట్టారు. మహాత్మా గాంధీజీ ఆమె సేవల్ని గుర్తించి సేవాగ్రామ్ ఆహ్వానించారు. ఆహార కొరత ఉన్న రోజుల్లో కూరగాయలు పండించాలని ఉద్యమించారు. ఈనాం భూముల్ని పొలాలు లేని రైతులకు పంచాలని సత్యాగ్రహం చేపట్టారు. ఆచార్య వినోబాభావే చేపట్టిన సర్వోదయ ఉద్యమాన్ని చేపట్టి దేశమంతా పర్యటించి వినోబాభావే ఆశయాలకు వ్యాప్తి కల్పించారు.మతాన్ని సూచించే ఏ ఆభరణాలు, చిహ్నాలు ఆమె ధరించే వారు కాదు. పుణ్యవతిగా బొట్టు, కాటుక, గాజులు, మంగళసూత్రాలు వంటివి ధరించలేదు. 1975 జూలై 26న గోరా మరణించినప్పుడు ఆమె అభిమతానికి అనుగుణంగా ఏ మత సంప్రదాయాన్ని పాటించకుండా సంస్కారాలు జరిపించారు.
ఆమె క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. రెండున్నర సంవత్సరాల వయస్సు గల కుమారుడు "నియంత"తో పాటు జైలు జీవితం గడిపారు
ఆమె కుమార్తె "మనోరమ" వివాహం అర్జునరావుతో జరిగింది. ఈ వివాహం 1960 లో జవహర్ లాల్ నెహ్రూ అధ్వర్యంలో జరిగింది.
అవార్డులు,గుర్తింపు
[మార్చు]- 2001 : బసవ పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం వారిచే.
- మానవతా వాదానికి "బి.డి.బిర్లా అంతర్జాతీయ అవార్డు"
- 1999 లో జమ్నాలాల్ బజాజ్ అవార్డు.[1]
- జానకీదేవి బజాజ్ అవార్డు
- పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు.
కుటుంబం
[మార్చు]గోరా, సరస్వతి గోరా దంపతులకు 9 మంది పిల్లలు. వారు మనోరమ, గోపరాజు లవణం, మైత్రి, చెన్నుపాటి విద్య, గోపరాజు విజయం, గోపరాజు సమరం, గోపరాజు నియంత, డా.మరు, నవ్. సరస్వతి గోరా 2006 ఆగస్టు 19 న అనారోగ్యంతో విజయవాడలో మరణించారు.
మూలాలు
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]- A short biography of Saraswathi Gora Archived 2006-10-02 at the Wayback Machine in Indian Skeptic by Sunanda Shet
- Obituary Archived 2012-10-21 at the Wayback Machine in The Hindu
- Obituary in Deccan Herald
- Obituary at www.newsfix.de Archived 2016-03-04 at the Wayback Machine