Jump to content

సహాయ నిరాకరణోద్యమం

వికీపీడియా నుండి
(సహాయ నిరాకరణ ఉద్యమం నుండి దారిమార్పు చెందింది)
1921 సెప్టెంబర్‌లో మద్రాస్‌లో డాక్టర్ అన్నీ బెసెంట్‌తో మహాత్మా గాంధీ. మదురైలో గాంధీ భారతదేశంలోని పేదలతో తన గుర్తింపుకు గుర్తుగా తొలిసారిగా నడుము వస్త్రాన్ని స్వీకరించారు.

సహాయ నిరాకరణోద్యమం భారత స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఒక ప్రధాన ఉద్యమం. బ్రిటిషు ప్రభుత్వపు వెన్ను విరిచిన ప్రజా ఉద్యమం. 1920 సెప్టెంబరు 4 న మొదలై 1922 ఫిబ్రవరిలో "12"న ముగిసింది. 1919 మార్చి 21 నాటి రౌలట్ చట్టానికి, 1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలా బాగ్ ఊచకోతకూ నిరసనగా సంపూర్ణ స్వరాజ్యం కోసం మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ (INC) బ్రిటిషు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చెయ్యాలని పిలుపునివ్వడంతో ఉద్యమానికి బీజం పడింది.[1] [2] ఇది గాంధీ పెద్ద ఎత్తున ప్రజలను సేకరించి చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం. ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని పోషించే అన్ని రకాల పనులనుంచీ భారతీయులను తప్పుకోమని గాంధీజీ ప్రజానీకాన్ని కోరాడు. ఇందులో బ్రిటీష్ పరిశ్రమలు, విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. అహింసా పద్ధతిలో భారతీయులు ఆంగ్లేయుల వస్తువులు వాడటం మానేసి, ప్రాంతీయంగా ఉత్పత్తులు వాడటం ప్రారంభించారు .

కారణాలు

[మార్చు]

1919 మార్చిలో రౌలట్ చట్టం, దేశద్రోహ విచారణలలో ప్రతివాదుల హక్కులను నిలిపివేసింది.[1] భారతీయులు దాన్ని "రాజకీయ మేల్కొలుపు" గాను బ్రిటిషు వారు "ముప్పు" గానూ భావించారు. [3] రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 13వ జలియన్ వాలాబాగ్లో భారతీయులు ఆందోళనకు దిగారు. బ్రిటిషర్లు ఆందోళన కారులపై సాముహిక హత్యాకాండకు పాల్పడ్డారు. ఆ సంఘటనకు సంబంధించి బ్రిటిషు ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యతీసుకొనే బదులు విచారం వ్యక్తం చేసింది. మొదటి ప్రపంచయుద్ధంలో ఇస్లామిక్ దేశమైన టర్కీ ఇంగ్లాండ్ ను వ్యతిరేకించడంతో ఖలీఫా పదవిని రద్దు చేశారు. దాన్ని తిరిగి పునరుద్దరించాలని భారతీయులు కోరారు. సహాయ నిరాకరణోద్యమం ప్రారంభం అయ్యేటప్పటికి నైతికంగా దెబ్బతిని వెనుకబడి, కుంగి ఉన్న భారతీయులు అకస్మాత్తుగా నిలబడి, తలెత్తి జాతీయ స్థాయిలో సాముహిక ఉద్యమంలో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారని జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయపడ్డాడు.

ఈ చట్టాన్ని ఒక్కసారి కూడా అమలు చెయ్యలేదు. కొన్ని సంవత్సరాల తరువాత దాన్ని రద్దు చేసారు, [2] ఈ చట్టం గాంధీలో సత్యాగ్రహ (సత్యం) ఆలోచనకు బీజం వేసింది. సత్యాగ్రహాన్ని స్వాతంత్ర్యానికి పర్యాయపదంగా అతడు భావించాడు.మరుసటి నెలలో జవహర్‌లాల్ నెహ్రూ కూడా ఈ ఆలోచనను ఆమోదించాడు.ఈ ఊచకోత అతడిలో "స్వాతంత్ర్యాని కంటే తక్కువైన దేదీ ఆమోదయోగ్యం కాదు" అనే నిశ్చయాన్ని కలిగించింది. [1]

ఉద్యమం

[మార్చు]

సహాయ నిరాకరణోద్యమం గురించిన గాంధీ ప్రణాళికలో, బ్రిటిషు పరిశ్రమలు, విద్యా సంస్థలతో సహా "భారతదేశంలో బ్రిటిషు ప్రభుత్వానికీ, ఆర్థిక వ్యవస్థకూ దన్నుగా ఉండే" [4] కార్యకలాపాలన్నిటి నుండి భారతీయులందరూ పనినుండి బయటికి వచ్చేయాలని ఒప్పించడం ఉంది. [4]ఖద్దరు వడకడం ద్వారా "స్వావలంబన"ను ప్రోత్సహించడంతో పాటు, భారతీయులు తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనడం, ఆంగ్లేయ దుస్తులను తొలగించడం మొదలైనవాటితో పాటు, టర్కీలో ఖిలాఫత్ పునరుద్ధరణకూ, అంటరానితనం ముగింపుకూ గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం పిలుపునిచ్చింది.ఫలితంగా బహిరంగ సమావేశాలు సమ్మెలు (హర్తాల్స్) జరిగాయి. 1921 డిసెంబరు 6 న జవహర్‌లాల్ నెహ్రూ, అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ ఇద్దరూ మొదటిసారి అరెస్టయ్యారు. [5]

బ్రిటిషు పాలన నుండి స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాల్లో ఇది ఒకటి. [6] నెహ్రూ తన ఆత్మకథలో వివరించినట్లుగా, 1922 ఫిబ్రవరిలో చౌరీ చౌరా సంఘటనతో "అకస్మాత్తుగా" ముగిసింది.[7]తదుపరి స్వాతంత్ర్య ఉద్యమాలు శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం.[6]

అహింసా మార్గాల ద్వారా నిరసనకారులు బ్రిటిషు వస్తువులను కొనడానికి నిరాకరిస్తారు, స్థానికంగా తయారైన వస్తువులను వాడతారు. మద్యం దుకాణాల వద్ద పికెట్ చేస్తారు. అహింసా ఉద్యమ పద్ధతి, భారత స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది సాధారణ పౌరులను సమీకరించగల గాంధీ యొక్క సామర్థ్యం 1920 వేసవిలో ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కనిపించాయి.ఈ ఉద్యమం హింసకు దారితీస్తుందని గాంధీ భయపడ్డారు.

రౌలట్ చట్టం, జలియన్‌వాలా బాగ్ ఊచకోత వంటి బ్రిటిషు భారత ప్రభుత్వ అణచివేత విధానాల పట్ల ప్రతిస్పందనగా వచ్చినదే సహాయ నొరాకరణోద్యమం.సైఫుద్దీన్ కిచ్లూ, డాక్టర్ సత్యపాల్ అరెస్టులకు నిరసన తెలియజేస్తూ అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ సమీపంలో ఉన్న జలియన్ వాలా బాగ్ వద్దకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. బ్రిగేడియర్-జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఆధ్వర్యంలో సైనికులు పౌరులపై కాల్పులు జరిపారు. ఫలితంగా వేలాది మంది నిరసనకారులను హతమార్చారు.ఈ ఊచకోత పట్ల పెల్లుబికిన ఆగ్రహం వేలాది ఉద్యమాలకు, పోలీసుల చేతుల్లో మరిన్ని మరణాలకూ దారితీసింది.ఈ ఊచకోత భారతదేశంలో బ్రిటిషు పాలనలో అత్యంత అపఖ్యాతి పాలైన సంఘటనగా మారింది.

అహింసా బోధకుడైన గాంధీ నిర్ఘాంతపోయాడు.అతను బ్రిటిషు ప్రభుత్వపు మంచితనంపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయాడు. ఈ "సాతాను" ప్రభుత్వానికి సహకరించడం "పాపం" అని ప్రకటించాడు.

ఖలీఫా హోదాను పునరుద్ధరించడానికి ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్న భారత ముస్లింలుసహాయ నిరాకరణోద్యమానికి తమ మద్దతు ఇచ్చారు.జలియన్ వాలా బాగ్ ఊచకోతతో పాటు పంజాబులో జరిగిన ఇతర హింసలకు ప్రతిస్పందనగా భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని ఉద్యమం కోరింది.తనసహాయ నిరాకరణ కార్యక్రమం పూర్తిగా అమలు చేస్తే సంవత్సరం లోగా స్వాతంత్ర్యం వస్తుందని గాంధీ హామీ ఇచ్చాడు.సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించడానికి మరొక కారణం ఏమిటంటే, గాంధీ రాజ్యాంగ పద్ధతులపై అతడు విశ్వాసం కోల్పోవడం. బ్రిటిషు పాలనకు సహకారిగా ఉండేవాడుసహాయ నిరాకరణవాదిగా మారాడు.

సామాన్యులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, భారతీయ సంపదంతా బ్రిటన్‌కు ప్రవహించడం, చేతితో తయారు చేసిన వస్తువుల స్థానంలో బ్రిటిషు ఫ్యాక్టరీల్లో తయారైన వస్తువులను తీసుకురావడంతో భారతీయ చేతివృత్తులవారిని నాశనం చేయడం, మొదటి ప్రపంచ యుద్ధం బ్రిటిషు సైన్యంలో భాగంగా పోరాడుతూ భారత సైనికులు చనిపోవడంపై బ్రిటిషు ప్రభుత్వం పట్ల ఆగ్రహం - వగైరాలన్నీ కూడా ఉద్యమానికి ఇతర కారణాలు.

గతంలో బాల గంగాధర్ తిలక్ (కాంగ్రెస్ అతివాదులు) వంటి తొలి రాజకీయ నాయకులు ఇలాంటి పిలుపులు ఇస్తే, బహిరంగ సమావేశాలు జరిగేవి. వాటి వలన శాంతి భద్రతలకు ఆటంకం కలిగేది.ప్రభుత్వ సేవలకు ఆటంకం కలిగించేవి.బ్రిటిషు వారు వాటిని చాలా తీవ్రంగా పరిగణించేవారు. తిలక్‌ను బర్మా లోని మాండెలే జైలులోఖైదు చేసారు. వి ఓ చిదంబరం పిళ్ళైకు 40 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. సహాయ నిరాకరణఉద్యమం, వలసరాజ్యపు ఆర్థిక నిర్మాణాన్ని సవాలు చేయడమే లక్ష్యంగా ఉంది. బ్రిటిషు అధికారులు స్వాతంత్ర్య ఉద్యమం యొక్క డిమాండ్లను గమనించకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది.

రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని గాంధీ పిలుపునిచ్చారు.అన్ని కార్యాలయాలు, కర్మాగారాలు మూసివేయాలి.రాజ్ నడిపే పాఠశాలలు, పోలీసు సేవలు, మిలటరీ, సివిల్ సర్వీసుల నుండి వైదొలగాలని భారతీయులను ప్రోత్సహించారు. న్యాయవాదులు రాజ్ కోర్టులను విడిచిపెట్టమని కోరారు.ప్రజా రవాణా, ఆంగ్ల తయారీ వస్తువులు, ముఖ్యంగా దుస్తులను బహిష్కరించారు.భారతీయులు ప్రభుత్వం ఇచ్చిన గౌరవాలు, బిరుదులను వెనక్కి ఇచ్చేసారు. ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వివిధ పౌర, సైనిక వంటి పదవులకు రాజీనామా చేశారు. [8]

అనుభవజ్ఞులు బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, మహ్మద్ అలీ జిన్నా, అన్నీ బెసెంట్ ఈ ఆలోచనను పూర్తిగా వ్యతిరేకించారు.ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కూడా ఈ ఆలోచనను విమర్శించింది.కానీ యువతరం భారతీయ జాతీయవాదులు ముగ్ధులయ్యారు, గాంధీకి మద్దతు ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ అతడి ప్రణాళికలను స్వీకరించింది. ఆయనకు ముస్లిం నాయకులు మౌలానా ఆజాద్, ముక్తార్ అహ్మద్ అన్సారీ, హకీమ్ అజ్మల్ ఖాన్, అబ్బాస్ త్యాబ్జీ, మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్, మౌలానా షౌకత్ అలీల నుండి విస్తృతమైన మద్దతు లభించింది.

భారత స్వాతంత్ర్యం కోసం ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన ప్రముఖ హిందీ రచయిత, కవి, నాటక రచయిత, పాత్రికేయుడు, జాతీయవాది రాంబ్రిక్ష్ బేనీపురి ఇలా రాశారు:

ప్రభావం, సస్పెన్షన్

[మార్చు]

తిరుగుబాటు ప్రభావం బ్రిటిషు అధికారులకు పూర్తిగా షాక్ ఇచ్చింది. లక్షలాది మంది భారతీయ జాతీయవాదులకు భారీ ఊపు నిచ్చింది.దేశంలో ఐక్యత బలపడింది. అనేక భారతీయ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటయ్యాయి.భారతీయ వస్తువులను ప్రోత్సహించారు. [6]

1922 ఫిబ్రవరి 5 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని చౌరీ చౌరా అనే చిన్న పట్టణంలో ఊచకోత జరిగింది. మద్యం దుకాణం ఎదుట నిరసన తెలుపుతున్న కొంతమంది వాలంటీర్లపై ఒక పోలీసు అధికారి దాడి చేసాడు. అక్కడ గుమిగూడిన రైతులు అందరూ పోలీసు స్టేషనుకు వెళ్ళింది. 22 మంది పోలీసులు లోపలుండగా ఈ గుంపు స్టేషనుకు నిప్పంటించింది.

తిరుగుబాటు గాడి తప్పిందని మహాత్మా గాంధీ భావించాడు. దాని అహింసా స్వభావాన్ని కోల్పోవడం పట్ల నిరాశ చెందాడు. హింసకు ప్రతిహింసగా ఈ ఉద్యమం దిగజారడం ఆయనకు ఇష్టం లేకపోయింది. పోలీసులు, కోపంతో ఉన్న గుంపులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూంటే, మధ్యలో పౌరులు బాధితులౌతున్నారు. అన్ని ప్రతిఘటనలు ముగించాలని గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.3 వారాల పాటు ఉపవాస దీక్షచేసాడు. చివరికి సహాయ నిరాకరణోద్యమాన్ని విరమించుకున్నాడు.

సహాయ నిరాకరణ ముగింపు

[మార్చు]

చౌరి చౌరా సంఘటన కారణంగా సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపేసాడు. జాతీయ తిరుగుబాటును గాంధి ఒంటిచేత్తో ఆపివేసినప్పటికీ, 1922 మార్చి 10 న, అతడిని అరెస్టు చేశారు. 1922 మార్చి 18 న, దేశద్రోహ పూరిత రచనలను ప్రచురించినందుకు అతనికి ఆరు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఇది ఉద్యమాన్ని అణచివేయడానికి దారితీసింది. తరువాత ఇతర నాయకులను అరెస్టు చేసింది.

చాలా మంది కాంగ్రెస్ నాయకులు గాంధీ వెనుక గట్టిగా ఉన్నప్పటికీ, పట్టుదలగా ఉన్న నాయకులు విడిపోయారు. అలీ సోదరులు త్వరలోనే గాంధీకి తీవ్ర విమర్శకు లయ్యారు. గాంధీ నాయకత్వాన్ని తిరస్కరించి మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్లు స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఎక్కడో ఒకటీ అరా సంఘటనల కారణంగా సహాయ నిరాకరణోద్యమం ఆపి ఉండకూడదని చాలా మంది జాతీయవాదులు భావించారు. చాలా మంది జాతీయవాదులు గాంధీపై విశ్వాసం నిలుపుకున్నా, నిరుత్సాహపడ్డారు.

సమకాలీన చరిత్రకారులు, విమర్శకులూ ఈ ఉద్యమం బ్రిటిషు పాలన యొక్క వెన్ను విరిచేంతగా విజయవంతమైందని చెప్పారు. బహుశా ఇది 1947 లో స్వాతంత్ర్యానికి దారితీసిన ఉద్యమానికి ఉత్ప్రేరకం అని కూడా అన్నారు. కానీ చాలా మంది చరిత్రకారులూ అప్పటి భారత నాయకులూ కూడా గాంధీ నిర్ణయాన్ని సమర్థించారు.అయితే, గాంధీ తన వ్యక్తిగత ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో ఉద్యమాన్ని విరమించుకున్నారనే వాదనలు ఉన్నాయి. చౌరీ చౌరా సంఘటనకు అతడే కారణమని ఆరోపిస్తే అది అతడి ఇమేజికి దెబ్బ. అయితే 1930 లో ఇలాంటి తరహా ఉద్యమాన్నే - శాసనోల్లంఘన ఉద్యమం - మొదలుపెట్టినప్పటికీ ప్రధాన వ్యత్యాసం చట్టాన్ని ఉల్లంఘించే విధానాన్ని ప్రవేశపెట్టడం.

లాభాలు

[మార్చు]

1930 - 1934 మధ్య, ఉప్పు సత్యాగ్రహంలో కోట్ల మంది తిరుగుబాటు చేసినప్పుడు అహింస పట్ల గాంధీ యొక్క నిబద్ధత వెల్లడైంది. అహింసకు కట్టుబడి ఉండటం వలన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సత్యాగ్రహం విజయవంతమైంది. భారతీయుల డిమాండ్లు నెరవేరాయి, కాంగ్రెస్ పార్టీని భారత ప్రజల ప్రతినిధిగా గుర్తించారు. భారత ప్రభుత్వ చట్టం 1935 కూడా ప్రజాస్వామ్య స్వపరిపాలనలో భారతదేశానికి తొలిరుచి చూపించింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Tharoor, Nehru: The Invention of India (2003) p.26-36
  2. 2.0 2.1 Wagner, Kim. Amritsar 1919 (2019) p.243
  3. Wagner, Kim. Amritsar 1919 (2019) p.59
  4. 4.0 4.1 Ghosh, Durba (July 2017). "The Reforms of 1919: Montagu–Chelmsford, the Rowlatt Act, Jails Commission, and the Royal Amnesty" (in ఇంగ్లీష్).
  5. Tharoor, Nehru: The Invention of India (2003) p.41-42
  6. 6.0 6.1 6.2 Essay on Non-Cooperation Movement : Data Points
  7. Nehru. An Autobiography (1936). p.81
  8. Titles, Medals and Ribbons