Jump to content

వాస్కోడ గామా

వికీపీడియా నుండి
(వాస్కోడగామా నుండి దారిమార్పు చెందింది)
వాస్కో డ గామా
జననంజ.1469
సైనెస్, అలెంతెహో, పోర్చుగల్
మరణం1524 డిసెంబరు 24
కొచ్చిన్
వృత్తిఅన్వేషకుడు, నావికాదళ సైన్యాధ్యక్షుడు
భార్య / భర్తకాటరీనా దె అటైదే

వాస్కో డ గామా (Vasco da Gama) సా.శ.15వ శతాబ్దానికి చెందిన ప్రముఖ పోర్చుగీసు నావికుడు. ఇతడు పోర్చుగల్ దేశస్థుడు. 1498లో ఐరోపా నుండి భారతదేశానికి నేరుగా సముద్రమార్గాన్ని కనుగొన్నాడు. వాస్కోడగామా బృందము మొట్టమొదట కాలికట్లో కాలుమోపింది.

ఆరంభ జీవితం

[మార్చు]
పోర్చుగల్ నుండి బయలుదేరుతున్న వాస్కో డ గామా

వాస్కో డ గామా 1460లో[1] లేదా 1469లో[2], పోర్చుగీసు ఈశాన్య తీరంలో చిన్న గ్రామమైన సైనెస్‌లో బహుశా నొస్సా సెన్యోరా దస్ సాలాస్ చర్చి ప్రక్కనున్న ఇంట్లో జన్మించాడు. అలెంతెహో తీరంలోని అతికొద్ది రేవుల్లో ఒకటైన సైనెస్‌, ప్రధానంగా బెస్తవారు నివాసముండే కొన్ని వెల్లవేసి, ఎర్రటి పెంకులతో కప్పబడిన పెంకుటిళ్ల సముదాయము. వాస్కోద గామా పోర్చుగల్ లో, రాజధాని లిస్బన్ కి అరవై మైళ్ల దూరంలో ఉన్న సీన్స్ అనే ఓ చిన్న ఊళ్లో పుట్టాడు. ఈ సీన్స్ సముద్ర తీరం మీద ఉంది. అతడు పుట్టింది 1460 ల దశకంలో అని చారిత్రకులు అభిప్రాయపడుతున్నారు. వాస్కో తండ్రి పేరు ఎస్టేవాయో ద గామా. ఇతడు కూడా నావికుడే. పోర్చుగీస్ రాజు కొలువులో పని చేసేవాడు. తల్లి పేరు ఇజబెల్. వాస్కోకి పాలో, ఆయ్రెస్ అని ఇద్దరు అన్నలు, తెరేసా అని ఓ చెల్లెలు ఉన్నారు.

వాస్కో డ గామా తండ్రి ఎస్తేవో డ గామా 1460 లలో డ్యూక్ ఆఫ్ విసూ, డామ్ ఫెర్నాండో యొక్క కుటంబములో నైట్‌గా ఉండేవాడు.[3] డామ్ ఫెర్నాండో, ఎస్తేవోను సైనెస్‌కు అల్కైదే-మోర్ (గవర్నరు) గా నియమించి, ఎస్త్రెమోజ్‌లో సబ్బుల తయారీపై పన్నులు వసూలు చేసుకునేట్టు కొంత ఆదాయం కల్పించాడు.

ఇండియాకు కొత్త దారుల వేట

[మార్చు]

అసమాన సాహసాన్ని ప్రదర్శిస్తూ కొలంబస్ నాలుగు గొప్ప యాత్రలు చేసి, ఇండియాకి దారి కనుక్కోలేకపోయినా, పశ్చిమ ఇండీస్ దీవులని, దక్షిణ అమెరికా ఖండాన్ని కనుక్కున్నాడు. కాని చివరి వరకు తను కనుక్కున్న ప్రాంతం ఇండియానే అన్న భ్రమలో ఉన్నాడు. అయితే తన తదనంతరం ఆ ప్రాంతం ఇండియా కాదని, అదేదో కొత్త భూమి అని క్రమంగా యూరొపియన్ ప్రజలకి తెలిసొచ్చింది. సిల్కు దారులు మూసుకుపోయాయి కనుక ఇండియా కోసం కొత్త దారుల వేట మళ్లీ మొదలయ్యింది.

ఆఫ్రికా దక్షిణ కొమ్ము చుట్టూ ప్రయాణించి ఇండియా చేరుకోవచ్చన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉన్నా ఆఫ్రికా ఖండం దక్షిణంగా ఎంత దూరం విస్తరించి ఉందో పదిహేనవ శతాబ్దపు తొలిదశల్లో ఐరోపాలో ఎవరికీ తెలీదు. 1415 దరిదాపుల్లో ఐరోపాలో అన్వేషణల యుగం మొదలయ్యింది చెప్పుకుంటారు. సముద్ర దారుల వెంట ఆ కాలంలోనే పోర్చుగల్ రాజ్యాన్ని పాలించే హెన్రీ మహారాజు ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరాన్ని పర్యటించి రమ్మని వరుసగా కొన్ని నౌకా దళాలని పంపాడు. నౌకా యాత్రలలో అంత శ్రధ్ధ చూపించాడు కనుక హెన్రీ రాజుకి ‘హెన్రీ ద నావిగేటర్’ (నావిక రాజు హెన్రీ) అన్న బిరుదు దక్కింది. హెన్రీ రాజు పంపిన నౌకా దళాలు అంచెలంచెలుగా ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని పర్యటిస్తూ పోయాయి. 1460 లో హెన్రీ రాజు మరణానంతరం కూడా ఈ నౌకా యాత్రలు కొనసాగాయి. 1488 లో బార్తొలోమ్యూ దియాజ్ నేతృత్వంలో బయల్దేరిన నౌకలు ఆఫ్రికా దక్షిణ కొమ్ము వద్ద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ నగరాన్ని చేరుకున్నాయి. కాని అంత కన్నా ముందుకి పోవడానికి ఆ దళంలోని నావికులు ఒప్పుకోలేదు. కనుక విధిలేక దియాజ్ పోర్చుగల్ కి తిరిగి వచ్చేశాడు. అంతకన్నా ముందుకి పోడానికి వీలుపడలేదని అప్పటికి పోర్చుగల్ ని పాలించే మహారాజు జాన్ – 2 తో విన్నవించుకున్నాడు.

ఆఫ్రికా దక్షిణ కొమ్ము జయించబడ్డాక ఇక ఇండియాని చేరుకునే ప్రయత్నంలో ఓ ముఖ్యమైన అవరోధాన్ని జయించినట్టే. కాని ఆ కొమ్ముకి అవతల ఇండియా ఇంకా ఎంత దూరంలో ఉందో ఎవరికీ తెలీదు. పైగా దియాజ్ బృందం దారిలో పడ్డ కష్టాల గురించి, ఎదుర్కున్న భయంకరమైన తుఫానుల గురించి నావికుల సంఘాలలో కథలు కథలుగా చెప్పుకున్నారు. కనుక కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాటి పోవడానికి నావికులు మొరాయించారు. కనుక ఇండియా దాకా విజయవంతంగా ఓ నౌకా దళాన్ని నడిపించడానికి సమర్ధుడైన నావికుడు దొరకడం కష్టమయ్యింది. పైగా ఈ కొత్త సముద్ర మార్గాన్ని జయించడానికి కేవలం ఓడలు నడిపించడం వస్తే చాలదు. అతడు గొప్ప యోధుడు కూడా కావాలి. ఎందుకంటే పోర్చుగల్ ఆఫ్రికా తీరం వెంట ఇండియాకి దారి కనుక్కోవడం ఇష్టం లేని వారు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో ఈజిప్ట్ని ఏలే సుల్తాను, వెనీస్ నగరాన్ని ఏలే రాజు ఉన్నారు. పోర్చుగల్ ఓడలు ఆ దారిన వస్తే అటకాయించి ఓడలని ముంచడానికి వీళ్లు సిద్ధంగా ఉన్నారు. కనుక మంచి నావికుడు, మంచి యోధుడు అయిన అరుదైన వ్యక్తి కోసం గాలింపు మొదలెట్టిన మహారాజు జాన్ -2 కి త్వరలోనే అలాంటి వాడు ఒకడు దొరికాడు. అతడి పేరు వాస్కోద గామా.

సాహసాలు

[మార్చు]

పడవలన్నా, సముద్రం అన్నా వాస్కోకి చిన్నప్పట్నుంచి వల్లమాలిన అభిమానం. అన్నలు తనకి పడవ ఎలా నడపాలో, వల వేసి మేలు జాతి చేపలని ఎలా పట్టాలో నేర్పించారు. తండ్రి నావికుడు కావడంతో తమ కుటుంబానికి నావికులతో సాన్నిహిత్యం ఉండేది. అన్నదమ్ములు ముగ్గురూ నావికులు చెప్పే సాహస గాథల గురించి వింటూ ఉండేవారు. పెద్దయ్యాక ఎలాగైనా సముద్ర యానం చేసి ఎన్నో గొప్ప సాహసాలు చెయ్యాలని కలలు కనేవారు.

సీన్స్ లో కొంత వరకు చదువుకుని పై తరగతులు చదువుకోడానికి వాస్కో ఎవోరా అనే నగరానికి వెళ్లాడు. సీన్స్ లాగ కాక ఈ ఎవోరా పెద్ద పట్టణం. ఈ నగరానికి ఇరుగు పొరుగు దేశాల నుండి జనం వస్తుండేవారు. అలా నానా రకాల సంస్కృతులకి, భాషలకి చెందిన వ్యక్తులతో వాస్కోకి పరిచయం ఏర్పడింది. లోకంలో మనుషులు ఎన్ని రకాలుగా జీవిస్తారో, ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారో వాస్కోకి అర్థం కాసాగింది. పదిహేనవ ఏటికే వాస్కో మంచి నావికుడిగా ఎదిగాడు. పశ్చిమ ఆఫ్రికా తీరం వద్దకి ప్రయాణించే ఓడలలో స్థానం సంపాదించి నౌకా యానంలో తొలిపాఠాలు నేర్చుకోవడం మొదలెట్టాడు. తుఫాను సమయంలో సముద్రం అల్లకల్లోగంగా ఉన్నప్పుడు, పొగ మంచు వల్ల దారి అయోమయం అయినప్పుడు, కరకు శిలలు పొంచివున్న ప్రమాదకరమైన మార్గాలలో ఓడలు ప్రయాణించవలసి వచ్చినప్పుడు నావికులు ఎలాంటి కౌశలాన్ని ప్రదర్శించాలో నేర్చుకున్నాడు.

అలాంటి దశలో రాజుగారి నౌకా దళాలలో పని చేసే అవకాశం దొరికింది. 1492 లో ఒక సారి వాస్కోకి రచకార్యం మీద సేతుబల్ అనే ఊరికి వెళ్ళే పని పడింది. ఆ ఊరి సమీపంలో ఫ్రెంచ్ ఓడలు పోర్చుగల్ ఓడలని అటకాయించాయి. ఫ్రెంచ్ ఓడలకి తగిన గుణపాఠం నేర్పమని పోర్చుగీస్ రాజ్యంలో బేజా ప్రాంతానికి డ్యూక్ గా పని చేసే డామ్ మిగ్యుయెల్ అనే అధికారి వాస్కోని పంపాడు. వాస్కో ద గామా తనకి ఇచ్చిన పనిని సమర్ధవంతంగా పూర్తి చేసుకుని, దురగతాలకి ఒడిగట్టిన ఫ్రెంచ్ నావికులకి సంకెళ్ళు వేసి డామ్ మిగ్యుయెల్ కి అప్పజెప్పాడు. వాస్కో చూపించిన సత్తా చూసి డామ్ మిగ్యుయెల్ సంతొషించాడు. ఇండియాకి దారి కనుక్కోగల మహాకార్యాన్ని సాధించగల శూరుడు వాస్కో ద గామాలో తనకి కనిపించాడు. సేతుబల్ లో వాస్కో ద గామా సాధించుకు వచ్చిన ఘన విజయం చూశాక బేజా ప్రాంతానికి డ్యూక్ అయిన డామ్ మిగ్యుయెల్ కి వాస్కో సామర్థ్యం మీద నమ్మకం బలపడింది. ఇండియాకి దారి కనుక్కోగల సత్తా ఈ వ్యక్తిలో ఉందని మనసులో అనుకున్నాడు. ఇండియాకి నౌకాదళాన్ని పంపితే దాన్ని శాసించగల సమర్ధుడు ఈ వాస్కో ఒక్కడే అంటూ వాస్కోని సిఫారసు చేస్తూ రాజైన జాన్-2 కి డామ్ మిగ్యుయెల్ జాబు రాశాడు. ఆ సిఫారసుని రాజు ఆమోదించాడు. ఇండియాకి దారి కనుక్కునే బాధ్యతని వాస్కో భుజాల మీద ఉంచాడు. రాజు తనపై పెంచుకున్న నమ్మకానికి తగినట్టుగానే వాస్కో ద గామా కూడా ఒక సమర్ధుడైన కెప్టెన్ గా మంచి పేరు తెచ్చుకోసాగాడు. ఒక ఓడని నడిపించాలంటే, ఓ నౌకాదళాన్ని శాసించాలంటే ఆ నౌక లోని సిబ్బంది కెప్టెన్ ని గౌరవించాలి. కెప్టెన్ మాటని శిరసావహించాలి. కాని ఆ రోజుల్లో కెప్టెన్ పని అంత సులభం కాదు. నావికులని శాసించడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో నావికులు, మోటుగా, కరుగ్గా, మహాబలిష్టులై ఉండేవారు. ఎన్నో సందర్భాల్లో జైల్లోని బందీలని విడిపించి నౌకా యాత్రల మీద పంపేవారు. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన నౌకాయాత్రల్లో సామాన్యులు ప్రయాణించడానికి ముందుకి వచ్చేవారు కారు. అలాంటి గట్టిపిండాలని శాసించగల కెప్టెన్ కూడా గొప్ప నేతృత్వం, బలమైన వ్యక్తిత్వం, వ్యతిరేకతని సులభంగా ఎదుర్కుని అణచగల సత్తా ఉన్నవారు అయ్యుండాలి. వాస్కో ద గామాలో అలాంటి లక్షణాలన్నీ అప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇండియా యాత్రలో తనకి సహకరించగల నౌకాదళాన్ని ఎన్నుకునే పనిలో మునిగాడు వాస్కో ద గామా. మొదటగా వాస్కో తన అన్నల్లో ఒకడైనా పాలోని ఎంచుకున్నాడు. ఇతగాడు అంటే వాస్కోకి ఎంతో గౌరవం, అభిమానం. అయితే పాలో ఆ యాత్రలో పాల్గొనడానికి అడ్డుపడే చిన్న చిక్కు ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ పాలో సేతుబల్ ప్రాంతానికి చెందిన ఓ న్యాయమూర్తితో గొడవ పడ్డాడు. ఆ గొడవలో న్యాయమూర్తి గాయపడ్డాడు. ఆ నేరానికి పెద్ద శిక్షే పడేలా ఉండడంతో అప్పట్నుంచి పాలో రాజభటులకి అందకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు పాలోని యాత్ర మీద తనతో తీసుకెళ్ళాలంటే ముందు రాజుగారి క్షమాభిక్ష పొందాలి. అన్నని క్షమించమని అర్థిస్తూ వాస్కో రాజుకి లేఖ రాశాడు. క్షమాపణ ప్రసాదించిన రాజు ఓ షరతు పెట్టాడు. వాస్కో, పాలో సోదరులు ఇండియాకి విజయవంతంగా దారి కనుక్కుని వస్తేనే శిక్ష పూర్తిగా రద్దవుతుంది. ద గామా సోదరులు షరతుకి సంతోషంగా ఒప్పుకున్నారు.

యాత్ర కోసం వాస్కో ద గామా మూడు ఓడలని ఎంచుకున్నాడు. అన్నిట్లోకి పెద్దదైన సావో గాబ్రియెల్ ఓడని ప్రధాన ఓడగా ఎంచుకున్నాడు. దానికి కెప్టెన్ గా గొన్సాలో ఆల్వారెజ్ అనే వాణ్ణి నియమించాడు. ఈ ఆల్వారెజ్ కి గొప్ప నావికుడిగా పేరు ఉంది. అదే ఓడకి పైలట్ గా పెరో దలెంకర్ అనే వాడు నియమించబడ్డాడు. ఈ దలెంకర్ గతంలో బార్తొలోమ్యూ దియాజ్ తో పాటు ఆఫ్రికా యాత్రలో పాల్గొని కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకా ప్రయాణించినవాడు. తన అనుభవం ఈ యాత్రలో ఉపయోగపడుతుందని తనని ఎంచుకున్నాడు వాస్కో. ఆ రోజుల్లో కెప్టెన్ ఉద్యోగం చాల వరకు వంశపారంపర్యంగా వచ్చే ఉద్యోగం. కాని పైలట్ ఉద్యోగం మరింత కీలకమైనది. అసలు పని భారం అంతా పైలట్ మీద ఉంటుంది. రెండవ ఓడ అయిన సావో రఫాయెల్ కి కెప్టెన్ గా వాస్కోకి అన్న అయిన పాలో ద గామా నియమించబడ్డాడు. ఇక మూడవది, కాస్త చిన్నది అయిన బెరియో అనే ఓడకి కెప్టెన్ గా నికొలావ్ కోయిలో నియమించబడ్డాడు.

కెప్టెన్ ల నియామకం జరిగాక 140 నుండి 170 మంది దాకా నౌకా సిబ్బందిని పోగు చేశాడు. ఒక్కొక్క వ్యక్తిని, వారి పుట్టు పూర్వోత్తరాలని క్షుణ్ణంగా పరిశీలించి, ఆచి తూచి ఎన్నుకున్నాడు. అంత ముఖ్యమైన యాత్రలో ప్రతి ఒక్కడు సమర్ధుడు, నిజాయితీ పరుడు అయ్యుండాలి. ఒక్క విషపురుగు ఉన్నా యాత్ర విఫలం అయ్యే ప్రమాదం ఉంది. బార్తొలోమ్యూ దియాజ్ తో పాటు ప్రయాణించిన నావికులలో ఎంతో మందిని తన దళంలో చేర్చుకున్నాడు వారి అనుభవం పనికొస్తుందని. అంత సుదీర్ఘమైన యాత్రలో నౌకలు ఎన్నో రేవుల వద్ద ఆగాల్సి వస్తుంది. ఎన్నో రకాల సంస్కృతులతో సంపర్కం తప్పదు. కనుక వివిధ భాషల యొక్క, సంస్కృతుల యొక్క అవగాహన కలవారు కావాలి. కనుక ఆఫ్రికా తెగలు మాట్లాడే భాషలు తెలిసిన మార్టిన్ అఫోన్సోని చేర్చుకున్నాడు. అరబిక్ భాష తెలిసిన ఫెర్నావో మార్టిన్స్ ని, జో న్యూన్స్ ని కూడా ఎంచుకున్నాడు. వీరు కాక వంట వాళ్లు, సిపాయిలు, వండ్రంగులు, తెరచాప తయారీ తెలిసిన వాళ్లు, ఒక వైద్యుడు కూడా సిబ్బందిలో చేరారు.

ఇంత ముఖ్యమైన యాత్రలో విజయం సాధించాలంటే కేవలం సమర్ధులైన సిబ్బంది మాత్రం ఉంటే సరిపోదు. అంత కఠినమైన యాత్రకి తట్టుకోగల బలమైన ఓడలు కూడా కావాలి. 15 వ శతాబ్దంలో పోర్చుగల్ లో కారవెల్ అనే కొత్త రకం ఓడల నిర్మాణం మొదలయ్యింది. గతంలో వాడబడ్డ ఓడల కన్నా ఇవి మరింత వేగంగా ప్రయాణించగలగడమే కాక మరింత కఠినమైన సముద్ర పరిస్థితులకి తట్టుకోగలిగి ఉండేవి. వీటి తెరచాపలు చదరపు ఆకారంలో కాక, త్రికోణాకారంలో ఉండేవి. ఆ కారణం చేత ఇవి గాలికి ఎదురుగా కూడా ప్రయాణించగలిగేవి. వీటి దేహం కూడా మరింత బలమైన, దళసరి అయిన చెక్కపలకలతో నిర్మించబడేది. ఇండియా యాత్ర కోసం ఈ కారవెల్ ఓడలని ఎంచుకున్నాడు వాస్కో ద గామా.

ఇంత సుదీర్ఘమైన యాత్ర పూర్తి కావడానికి మూడేళ్లు అయినా పట్టొచ్చని అంచనా వేశాడు. కనుక మూడేళ్లకి సరిపోయే ఆహార పదార్థాలు ఓడల పైకి ఎత్తించారు. వీటితో పాటు తగినంత మందుపాతర, విల్లంబులు మొదలైన యుద్ధ సామగ్రి కూడా ఎక్కించుకున్నారు.

సన్నాహాలన్నీ పూర్తయ్యాక ఇక ఇండియాకి బయల్దేరే సుముహూర్తం కోసం ఎదురుచూడసాగారు. ఇండియా యాత్రకి సన్నాహాలు పూర్తయ్యాయి. ఎప్పుడెప్పుడు బయల్దేరుదామా అని నావికులంతా తహతహలాడుతున్నారు. రాజుగారి ఆనతి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భంగా మాంటెమో ఓ నోరో అనే ఊళ్లో రాజుగారు విందు ఏర్పాటు చేశారు. వేడుకలో పాల్గొనడానికి ఎంతో మంది ప్రభుత్వ అధికారులు, చర్చిఅధికారులు, సంఘంలో గొప్ప పరపతి గల వారు ఎంతో మంది విచ్చేశారు. “అసమాన నావికుడు, విశ్వాసపూరితుడైన ప్రభుత్వ సేవకుడు అయిన వాస్కో ద గామాని ఈ మహాయాత్రకి సారథిగా ఈ సందర్భంలో ప్రకటిస్తున్నాను,” అంటూ రాజుగారు వాస్కో గురించి ఎంతో పొగుడుతూ మాట్లాడారు. “మహారాజా! ఇండియా కి దారి కనుక్కునే లక్ష్య సాధన కోసం నేటి నుండి నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటున్నాను,” అంటూ వాస్కో కూడా తన విశ్వాసాన్ని, దృఢసంకల్పాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడాడు. విందు ఘనంగా జరిగింది.

జులై 8, 1497, నాడు ఆ మహాయత్ర మొదలయ్యింది. మూడు ఓడలూ లిస్బన్ రేవు నుండి బయల్దేరాయి. నగర వాసులంతా రేవుకి విచ్చేసి ఆ వీర నావికులకి వీడ్కోలు చెప్పారు. నెమ్మదిగా తీరం కనుమరుగు కాసాగింది. ఓడ డెక్ మీద నించుని వాస్కో ద గామా తన ఎదురుగా విస్తరించి ఉన్న అనంత సాగరం కేసి రెప్ప వేయకుండా చూస్తున్నాడు. తాను తలకెత్తుకున్న కార్యభారం నెమ్మదిగా తెలిసి వస్తోంది. ఇన్నేళ్ల తన అనుభవంలో తన నేతృత్వంలో ఉన్న ఒక్క ఓడ కూడా పోలేదు. ఈసారి కూడా అలాగే అన్ని ఓడలని, అందులోని సిబ్బందిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలి. తన పట్టుదలకి ప్రకృతి కూడా మద్దతు తెలపాలని సంకల్పించింది కాబోలు! అంతలోనే ఓ బలమైన గాలి వీచగా తెరచాపలు పొంగి ఓడలు వడిగా నీటికి కోసుకుంటూ ముందుకి దూసుకుపోయాయి.

ఓ వారం తరువాత ఆ నౌకాదళం ఆఫ్రికా పశ్చిమ తీరం వద్ద ఉన్న కానరీ దీవులని చేరుకున్నాయి. గతంలో కొలంబస్ కూడా ఈ దీవులని సందర్శించిన విషయం మనకి గుర్తు. ఆ ప్రాంతంలో కాస్త మత్స్య సంపద సేకరించి ఆహారం నిలువలు పెంచుకుందాం అని నావికులు నీట్లోకి వలలు విసిరారు. ఆయితే ఆ రాత్రి ఓ అనుకోని సంఘటన జరిగింది. దట్టంగా పొగమంచు కమ్మింది. అంతేకాక ఆగాగి బలమైన గాలులు కూడా వీచాయి. దాంతో ఓడలు చెల్లాచెదురు అయ్యాయి. పెద్ద ఓడ అయిన సావో గాబ్రియెల్ లో వాస్కో ద గామా ఉన్నాడు. తను తమ్ముడు పాలో ఉన్న ఓడ, సావో రఫాయెల్, తప్పిపోయింది. మిగతా రెండు ఓడల కెప్టెన్లకి ఏంచెయ్యాలో అర్థం కాలేదు. తప్పిపోయిన ఓడ కోసం గాలించకుండా ముందుకు సాగిపోవాలని వాస్కో ద గామా నిర్ణయించాడు. తప్పిపోయిన ఓడ ఎప్పుడో ఒకప్పుడు తక్కిన ఓడలని కలుసుకుంటుందని తన నమ్మకం. బయటికి ధీమాగా అన్నాడే గాని లోపల తనకి ఒక పక్క గుబులుగానే ఉంది. మిగతా రెండు ఓడలు ముందుకి సాగిపోయాయి. కొన్నాళ్ళ తరువత జూలై 22 నాడు పోయిన ఓడ మళ్లీ కనిపించింది. వాస్కో మనసు తేలికపడింది. పోయిన తమ్ముడు మళ్లీ కనిపించినందుకు లోలోన సంతోషించాడు నౌకాదళంనౌకాదళం ఆఫ్రికా పశ్చిమ తీరం వెంట దక్షిణ దిశగా యత్ర కొనసాగించింది. మైళ్ల తరబడి తీరరేఖని దాటుకుంటూ ఓడలు ముందుకు సాగిపోయాయి. ఇక తదుపతి మజిలీ కేప్ వెర్దే దీవులు. దీవులు చేరగానే తీరం మీదకు వెళ్లి పెద్ద ఎత్తున వంటచెరకు, మంచినీరు, కూరలు, పళ్లు ఓడలకి తరలించమని కొంతమందిని పంపించాడు వాస్కో ద గామా. ఈ ఆదేశం నావికులకి కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఆఫ్రికా తీరం వెంట ప్రయాణం ఒక విధంగా చూస్తే పెద్ద కష్టం కాదు. ఎప్పుడూ తీరం కనిపించేలా కాస్తంత దూరంలో ఉంటూ యాత్ర కొనసాగిస్తే ఆహారం మొదలైన సరుకులు ఎప్పుడు కావలసినా ఏదో రేవు వద్ద ఆగి ఓడలకి ఎత్తించుకోవచ్చు. దీర్ఘ కాలం నడిసముద్రంలో, తీరానికి దూరంగా, జరిపే యాత్రలలో మాత్రమే ఓడలలో బాగా సరంజామా నింపుకోవలసి వస్తుంది. వాస్కో ద గామా ఉద్దేశం అనుభవజ్ఞుడైన దలెంకర్ కి మాత్రమే అర్థమయ్యింది. లోగడ కేప్ ఆఫ్ గుడ్ హోప్ ని చేరుకున్న బార్తొలోమ్యు దియాజ్ కూడా ఇదే మార్గాన్ని అవలంబించాడు.

ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని అంటిపెట్టుకుని ప్రయాణిస్తే దూరం మరీ ఎక్కువ అవుతుంది. కనుక కేప్ వెర్దే దీవులని దాటాక నేరుగా కేప్ ఆఫ్ గుడ్ హోప్ దిశగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుతూ ప్రయాణించాలి. ఆ మార్గాన్ని అనుసరించాడు కనుకనే బార్తొలోమ్యూ దియాజ్ తన గమ్యాన్ని భద్రంగా చేరుకున్నాడు. వాస్కో నౌకా దళం తమ గమన దిశని మార్చుకుంది. అంతవరకు అల్లంత దూరంలో కనిపిస్తూ భద్రతాభావాన్ని కలిగించిన తీరం క్రమంగా దూరం కాసాగింది. ఆ నాటి యాత్ర మరింత కఠినం అయ్యింది. దారిలో ఎన్నో భీకర తుఫానులు ఎదురయ్యాయి. అయినా ఏ అవాంతరం కలగకుండా యాత్ర కొనసాగింది. నవంబరు 1 వ తారీఖున ఓ నావికుడు అల్లంత దూరంలో ఏదో తీరం కనిపెట్టాడు. అది ఆఫ్రికా తీరమే అయ్యుండాలి. నావికుల సంతోషానికి హద్దుల్లేవు.

కాని ఆ సంతోషంలో పాల్గొనకుండా నిర్లిప్తంగా ఉన్నవాడు ఒక్క వాస్కో ద గామనే. ఎందుకంటే తాము చేరుకున్న తీరం ఎక్కడుందో రూఢి చేసుకోకుండా వేడుక చేసుకోవడంలో అర్థం లేదని అతడికి బాగా తెలుసు. తాము చేరుకున్న తీరం ఆఫ్రికా దక్షిణ కొమ్ముకి దగ్గరి ప్రాంతమో కాదో తేల్చుకు రమ్మని వాస్కో ఇద్దరు నావికులని తీరం మీదకి పంపించాడు. తీరం మీద ఇద్దరూ నడచుకుని వెళ్తుండగా ఒక చోట పొదల మాటున ఇద్దరు వ్యక్తులు నక్కి ఉండడం కనిపించింది. చేతుల్లో బరిసెలు, జంతు చర్మపు బట్టలు మొదలైన లక్షణాలు చూస్తే ఇద్దరూ ఆ ప్రాంతపు కోయవారిలా ఉన్నారు. నావికులు కూడా చెట్ల వెనక దాక్కున్నారు. ఉన్నట్లుండి నావికులు కనిపించకపోయే సరికి విస్తుపోయి ఆ కోయవాళ్లు పొదలమాటు నుండి బయటికి వచ్చారు. అంతలో తటాలున వెనక నుండి వెళ్ళి నావికులు వాళ్ళిద్దర్నీ పట్టుకున్నారు. వాళ్ళలో ఒకడు ఎలాగో తప్పించుకున్నాడు. రెండో వాణ్ణి తెచ్చి వాస్కో ద గామాకి అప్పజెప్పారు.

ఆఫ్రికన్ భాషలు తెలిసిన అఫోన్సో ఆ కోయవాడితో మాట్లాడడానికి ప్రయత్నించాడు. కాని ఒకరి మాటలు ఒకరికి అర్థం కాలేదు. సంజ్ఞలు చేస్తూ వాస్కో తదితరులు చాలా సేపు వాడితో తిప్పలు పడ్డాక తెలిసినది ఏంటంటే వాళ్ళ గ్రామం అల్లంత దూరంలో కనిపిస్తున్న కొండ దగ్గర ఉందని. ఆ గ్రామం వారితో సంబంధం కలుపుకుని, ఈ ప్రాంతం ఎక్కడుందో కనుక్కు రమ్మని వెలోసో అనే వాణ్ణి పంపించాడు వాస్కో. ఇలా ఉండగా ఏమీ తోచని పాలోకి తన ఓడ పక్కనుండి ఓ పెద్ద తిమింగిలం పోవడం కనిపించింది. నేలజంతువులు అన్నిట్లోకి సింహం వేటలో ఎంతో ఉత్సాహం, ఉద్వేగం ఉన్నట్టుగానే, సముద్ర చరాలు అన్నిట్లోకి తిమింగలాలని వేటాడే అవకాశం కోసం నావికులు ఉర్రూతలూగేవారు. హార్పూన్ అనబడే బలమైన ఈటె తీసుకుని దాని మీదకి విసిరాడు పాలో. ఈటె గుచ్చుకోగానే తిమింగిలం విలవిలలాడింది. నీట్లో సంక్షోభంగా కొట్టుకోవడం మొదలెట్టింది. ఈటె యొక్క అవతలి కొస ఓడకి ఓ త్రాటితో కట్టబడి ఉంది. ఉధృతంగా కదులుతున్న ఆ మహాచరం ఓడని కూడా బలంగా అటుఇటు కుదిపేయసాగింది. సకాలంలో ఎవరో వచ్చి ఆ తాడుని కోసి ఓడని రక్షించారు.

అంతలో అల్లంత దూరంలో బలంగా చేతులు ఊపుతూ, ఓడల కేసి పరుగెత్తుతూ వస్తున్న వెలోసో కనిపించాడు. బోలెడు మంది కోయవాళ్లు బరిశెలు పట్టుకుని తన వెంటపడుతున్నారు. ఈ వెలోసో అక్కడ గ్రామంలో ఏం మాట్లాడో? లేనిపోని శత్రుత్వం కొనితెచ్చుకున్నాడు. విషయం అర్థమైన వాస్కో ద గామా లంగర్లు పైకెత్తి ఓడలని బయల్దేరమన్నాడు. బ్రతుకు జీవుడా అంటూ నౌకాదళం ఆ కోయవారి నుండి తప్పించుని ముందుకి సాగిపోయింది. నౌకా దళం ఎక్కడి దాకా వచ్చారో ఇంకా తెలీదు. కాని రెండు రోజుల తరువాత మరో తీరం కనిపించింది. బార్తొలోమ్యూ దియాజ్ లోగడ అందించిన సమాచారంతో పోల్చుకుని అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని తెలుసుకున్నారు. వారి ఆనందానికి హద్దుల్లేవు. బయల్దేరిన నాటి నుండి ఐదు నెలలలో, 1497 నవంబరు 22, లో ఆఫ్రికా దక్షిణ కొమ్ముని చేరుకున్నారు. ఏ ప్రమాదమూ కలగకుండా ఒడుపుగా తమని అంతవరకు తీసుకొచ్చిన కెప్టెన్ నేతృత్వం మీద అందరికీ గురి కుదిరింది.

మరో మూడు రోజుల ప్రయాణం తరువాత మాసెల్ ఖాతం అనే ప్రాతంలో ఓడలు లంగరు దించాయి. చిన్న పడవలో వాస్కో ద గామా కొందరు నావికులతో తీరం మీదకి వెళ్లాడు. అవసరం వస్తాయేమోనని బట్టలలో తుపాకులు దాచుకున్నారు. నేల మీద కొంత ముందుకి వెళ్లగానే కొంత మంది స్థానిక కోయలు కనిపించారు. కెప్టెన్ వారికి తమ నౌకాదళం తరపున రంగురంగుల పూసల దండలు, చిరుగంటలు లాంటి వస్తువులు బహుమతులుగా ఇచ్చాడు. కోయలకి ఇలాంటి వస్తువులు ఇష్టం అని ఆ రోజుల్లో నావికులకి బాగా తెలుసు. అలాంటి చవకబారు వస్తువులు బహుకరించి స్థానిక కోయలని ఆకట్టుకోవడం వారికి పరిపాటి. అక్కడే కొన్ని రోజులు ఉండి మరింత మంది స్థానికులని కలుసుకున్నారు. వారితో కలిసి విందులు చేశారు. నాట్యాలు ఆడారు. స్థానికులతో సత్సంబంధాలు కుదిరాయన్న నమ్మకం కుదిరాక నావికులు ఇక అసలు పన్లోకి దిగారు.

నావికుల యాత్రలకి లక్ష్యాలు రెండు. మొదటిది, కొత్త ప్రాంతాల వారితో వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకుని, బంగారం, సుగంధ ద్రవ్యాలు మొదలైన అరుదైన వస్తువులని చవకగా పోర్చుగల్కి తరలించడం. రెండవది, కొత్త ప్రాంతాలని ఆక్రమించి పోర్చుగల్ సామ్రాజ్యాన్ని విస్తరించడం. తాము పాదం మోపిన ఈ కొత్త భూమిని ఇప్పుడు పోర్చుగల్ రాజుకి అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించాలి. (మన దేశంలో ప్రాచీనకాలంలో రాజులు చేసిన రాజసూయయాగం లాంటిదే ఇదీను.) ఆ ప్రకటనలో భాగంగా ‘పద్రావ్’ అని పిలువబడే రాతి స్తంభాలని పాతారు. ఇవి గాక కొన్ని చెక్క శిలువలని కూడా పాతారు. గతంలో బార్తొలోమ్యూ దియాజ్ కూడా ఇలా ఎన్నో స్తంభాలు పాతాడు. అది చూసిన కోయలకి ఒళ్ళు మండిపోయింది. ఈ స్తంభాలు పాతే కథ వారికి పాత కథే! ఆ రాతి స్తంభాలని బద్దలు కొట్టారు. శిలువలని పీకేశారు. వాస్కో ద గామా తన సిబ్బందితో పాటు అక్కణ్ణుంచి పలాయనం చిత్తగించాడు. వాస్కో ద గామా తన సిబ్బందితోపాటు అక్కణ్ణుంచి పలాయనం చిత్తగించాడు.నౌకాదళం ఇంకా ముందుకి సాగిపోయింది. వాతావరణంలో క్రమంగా మార్పులు రాసాగాయి. సముద్రంలో కూడా పోటు ఎక్కువగా ఉంది. ఉవ్వెత్తున కెరటాలు లేచి ఓడలని ఎత్తి పడేస్తున్నాయి. గతంలో దియాజ్ దళం కూడా సరిగ్గా ఇక్కడి నుండే వెనక్కి వెళ్లిపోయారని వాస్కో సిబ్బంది అర్థం చేసుకున్నారు. డిసెంబరు 16వ తారీఖుకల్లా దియాజ్ బృందం పాతిన ఆఖరు ‘పద్రావ్’ని దాటారు. క్రిస్మస్ రోజుకల్లా దియాజ్ బృందం ఎక్కడి నుండి వెనక్కు తిరిగారో ఆ స్థలాన్ని దాటి 200 మైళ్లు ముందుకి వచ్చేశారు. ఆ తీర ప్రాంతాన్ని ప్రస్తుతం ‘నాటల్’ అంటారు. పోర్చుగీస్‌లో ఆ పదానికి క్రిస్మస్ అని అర్థం.ఇక్కడితో తెలిసిన దారి పూర్తయ్యింది. ఇక ముందున్నది అంతా తెలీని దారే.

నాటల్ ప్రాంతాన్ని దాటి మరో ఎనిమిది రోజులు ప్రయాణించింది వాస్కో ద గామా నౌకా దళం. ఓడలలో మంచినీరు అడుగంటుతోంది. వంటవాళ్ళు వంటలో కూడా సముద్రపు నీరే వాడుతున్నారు. మళ్లీ తీరం మీదకి వెళ్లి మంచినీటి వేట మొదలెట్టాలి. జనవరి 25 నాడు ఓ నదీముఖం కనిపించింది. ఓడలు లంగరు వేసి తీరం మీద ఉన్న ఓ గూడెం వద్ద వాకబు చెయ్యగా ఆ నది పేరు కెలీమానె అని తెలిసింది. ఆ గూడెం నాయకులు ఇద్దరు వాస్కోని కలుసుకున్నారు. ఎప్పట్లాగే వాళ్లకి వాస్కో కొన్ని చవకబారు బహుమతులు ఇచ్చాడు. వాళ్లకి అవి అంతగా నచ్చలేదు. అంతలో వాళ్లు పెట్టుకున్న అందమైన పట్టు టోపీ వాస్కో దృష్టిని ఆకర్షించింది. అదెక్కడిది అని అడిగాడు. పోర్చుగీస్ వారిలాగానే పెద్ద పెద్ద ఓడలతో తూర్పు నుండి కొందరు వస్తుంటారని, ఇవి వాళ్లు తెచ్చిన టోపీలని వాళ్లు సంజ్ఞలు చేసి చెప్పారు. ఇండియాకి దగ్గరపడుతున్నామని వాస్కోకి అర్థమయ్యింది.

ఆ ప్రాంతంలోనే ఓడలు 32 రోజులు ఆగిపోవలసి వచ్చింది. సావో రఫాయెల్ ఓడలో తెరచాప కట్టిన గుంజ తుఫాను ధాటికి విరిగిపోయింది. దాన్ని మరమ్మత్తు కోసం అగారు. కాని అదే సమయంలో సౌకా సిబ్బంది ‘స్కర్వీ’ వ్యాధి వాత పడ్డారు. ఆ రోజుల్లో సముద్రాల మీద సుదీర్ఘ యాత్రలు చేసే నావికులు ఈ స్కర్వీ వ్యాధితో తరచు బాధపడుతుండేవారు. ఆ వ్యాధి సోకినవారికి చిగుళ్లలో నల్లని రక్తం చేరి చాలా బాధిస్తాయి. వ్యాధి ముదిరితే చేతులు, కాళ్లు వాచి కదలడం కూడా కష్టం అవుతుంది. ఆహారంలో వైటమిన్ సి లోపం వల్ల ఈ వ్యాధి వస్తుందని మనకి ఇప్పుడు తెలుసు. వైటమిన్ సి నారింజ, నిమ్మ మొదలైన పళ్లలో ఉంటుంది. ఓడలలో ఎక్కువ కాలం నిలువ ఉండే ఆహారం ఉండేది. పళ్లు తక్కువగా ఉండేవి. కాని ఆ రోజుల్లో వైటమిన్ సి గురించి తెలీకపోయినా, కొన్ని రకాల పళ్లు తింటే వ్యాధి తగ్గిపోతుందని తెలుసు. కనుక తీరం మీదే ఉండే తగిన ఫలహారం తీసుకుంటూ నావికులు తిరిగి ఆరోగ్యవంతులు అయ్యారు.

ఫిబ్రవరి 24 నాడు మళ్లీ యాత్ర మొదలయ్యింది. ఉత్తర-తూర్పు దిశలో ఓడలు ముందుకి సాగిపోయాయి. మార్చి 2 నాడు ఆఫ్రికా తూర్పు తీరం మీద ఉన్న మొజాంబిక్ దేశంలోని మొసాంబిక్ రేవుని చేరుకున్నాయి. ఆ రోజుల్లో మొసాంబిక్ రేవు ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఓ ముఖ్యమైన రేవు. ఇండియా, చైనా, అరేబియా, మలయా మొదలుకొని ఎన్నోదేశాల ఓడలు అక్కడికి వస్తుంటాయి.

ఫిబ్రవరి 24 నాడు మళ్లీ యాత్ర మొదలయ్యింది. ఉత్తర-తూర్పు దిశలో ఓడలు ముందుకి సాగిపోయాయి. మార్చి 2 నాడు ఆఫ్రికా తూర్పు తీరం మీద ఉన్న మొజాంబిక్ దేశంలోని మొసాంబిక్ రేవుని చేరుకున్నాయి. ఆ రోజుల్లో మొసాంబిక్ రేవు ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఓ ముఖ్యమైన రేవు. ఇండియా, చైనా, అరేబియా, మలయా మొదలుకొని ఎన్నోదేశాల ఓడలు అక్కడికి వస్తుంటాయి. అరేబియా, ఇండియన్ మహాసముద్రం ప్రాంతంలో అదో పెద్ద వ్యాపార కేంద్రంగా విలసిల్లేది.

ఆ ప్రాంతం వారు ఎక్కువ శాతం ముస్లిమ్లు. వీరికి ఎక్కువగా క్రైస్తవులైన యూరొపియన్లకి మధ్య ఎంతో కాలంగా వైరం ఉంది. స్థానికులతో వాకబు చేసి ఇండియాకి దారి ఎటో తెలుసుకోవాలి. కనుక తమ బృందం అంతా క్రైస్తవులు అన్న నిజం బయటపడకుండా వాస్కో ద గామా జాగ్రత్తపడ్డాడు. స్థానికుడైన ఓ షేక్ సహాయంతో ఇండియాకి దారి చూపగల ఇద్దరు అరబ్బీ నావికులని కుదుర్చుకున్నాడు వాస్కో. సాయం చేసినందుకు పారితోషికంగా 30 బంగారు ‘మాటికల్’ (4000) ఇచ్చాడు. ప్రయాణం తరువాత కన్నా ముందే ఇస్తే ఆ నావికులు కుటుంబీకులు సంతోషిస్తారని అలా చేశాడు. అయితే ఆ ధనం తమ కుటుంబాలకి ఇవ్వడానికి వాళ్లు ఊళ్లోకి వెళ్లాలి. వెళ్లిన వాళ్లు వస్తారో రారో అని ఒకణ్ణి మాత్రం పోనిచ్చి, రెండో వాణ్ణి ఓడలోనే అట్టేబెట్టుకున్నాడు.

ఆ వెళ్లినవాడు ఏం చేశాడో, ఏం అయ్యాడో తెలీదు. కొన్నాళ్ళ వరకు వాడి ఆచూకీ లేదు. వాడి కోసం ఎదురుచూస్తుండగా ఒక రోజు ఉన్నట్లుండి రెండు అరబ్బీ యుద్ధనౌకలు వారి ఓడల కేసి వస్తుండడం గమనించాడు వాస్కో. బహుశ తాము క్రైస్తవులమని స్థానికులకి తెలిసిపోయిందేమో? ఆ వెళ్లిన నావికుడు ఎలాగో ఆ రహస్యాన్ని తెలుసుకుని షేక్ కి తెలియజేసి ఉంటాడు. వస్తున్న అరబ్బీ నౌకలకి తగిన బుద్ధి చెప్పేందుకు గాను, చిన్న ఓడ అయిన ‘బెరియో’లో ఉన్న పాలో ద గామా, అరబ్బీ ఓడల కేసి గురి పెట్టి ఫిరంగులు పేల్చాడు. ఆ దెబ్బకి రెండు ఓడలలోని అరబ్బీ సైనికులు ఓడలని వొదిలేసి నీట్ళోకి దూకి పలాయనం చిత్తగించారు. జరిగిన గొడవ చాలనుకుని నౌకాదళం మొసాంబిక్ రేవుని వొదిలి ఇంకా ముందుకి సాగిపోయింది.

ఏప్రిల్ 14 నాడు నౌకాదళం కెన్యా దేశంలోని ‘మాలింది’ నగరాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతం కూడా ఓ షేక్ పాలనలో ఉంది. ఇతగాడికి పోర్చుగీస్ గురించి, సముద్రయానంలో వారి సత్తా గురించి బాగా తెలుసు. వాస్కో బృందంతో స్నేహం చేస్తే తనకే మేలని గ్రహించాడు. వాస్కోని సందర్శించడానికి స్వయంగా వాస్కో ఓడకి విచ్చేశాడు. ఎన్నో విలువైన బహుమతులు తెచ్చి ఇచ్చాడు. వాస్కో ద గామా కూడా తనకి చేతనైనంతలో మంచి బహుమతులే ఇచ్చాడు. ఇండియాకి దారి చూపగల మార్గగామిని ఇచ్చి పంపుతానని షేక్ మాట ఇచ్చాడు. ఇద్దరు నేతలూ స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకున్నారు.

ఇలా కొన్నాళ్లు వరుసగా ఇరు పక్కల వాళ్లు వేడుకలు జరుపుకుంటూ విందులు విలాసాలలో మునిగితేలారు. వాస్కో ద గామాకి ఈ ఆలస్యం నచ్చలేదు. షేక్ కావాలని జాప్యం చేస్తున్నాడేమో ననిపించింది. ఒక రోజు తమ ఓడలోకి వచ్చిన షేక్ బంటుని ఒకణ్ణి పట్టుకుని బంధించాడు వాస్కో ద గామా. తనకి ఇస్తానన్న మార్గగామిని తక్షణమే పంపిస్తే గాని ఆ బంటుని వదలనని హెచ్చరిస్తూ షేక్ కి కబురు పెట్టాడు. అనవసరంగా వీళ్లతో కలహం కొని తెచ్చుకోవడం ఇష్టం లేక షేక్ వెంటనే ఓ సమర్ధుడైన మార్గగామిని పంపాడు.

ఆ మర్గగామి రాకతో వాస్కో ద గామా బృందంలో త్వరలోనే ఇండియా చేరుకుంటాం అన్న ఆశ చిగురించింది ఇండియాకి దారి చూపగల సమర్థుడైన మార్గగామి దొరికాక వాస్కో ద గామా పరిస్థితి మెరుగయ్యింది. ఆ మార్గగామి పేరు అహ్మద్ బిన్ మజిద్. అరబ్ లోకంలో గొప్ప నావికుడిగా ఈ మజిద్ కి మంచి పేరు ఉంది. ఇతడి పూర్వీకులకి కూడా నౌకాయానంలో ఎంతో అనుభవం ఉంది. నౌకాయానం మీద ఇతడు నోరు తిరగని పేరున్న ఓ అరబిక్ పుస్తకం కూడా రాశాడు. సముద్రాల మధ్య తేడాలని వర్ణిస్తూ సముద్ర శాస్త్రం మీద కూడా ఓ పుస్తకం రాశాడు.

అంతకు ముందు వాస్కో నౌకాదళానికి దారి చూపిస్తానని వచ్చిన ఓ అరబిక్ నావికుడు ఈ బృందాన్ని ఆఫ్రికా తూర్పు తీరం వెంట పైకి కిందకి తిప్పించాడు. పెను తుఫానులలో ఇరికించాడు. కాని అహ్మద్ మజిద్ మార్గదర్శకత్వంలో అలాంటి అవాంతరాలేమీ జరగలేదు. 1498 మే 20 నాడు వాస్కో బృందం సురక్షితంగా ఇండియా పశ్చిమ తీరాన్ని చేరుకుంది. పోర్చుగల్ నుండి బయల్దేరిన పదకొండు నెలల తరువాత మూడు పోర్చుగీస్ ఓడలూ కాలికట్ రేవులోకి ప్రవేశించాయి. ఆ కాలంలో ఇండియాలో దక్షిణ-పశ్చిమ కోస్తా ప్రాంతంలో కాలికట్ ఓ ముఖ్యమైన రేవుగా, గొప్ప నాగరికత గల నగరంగా, గొప్ప వ్యాపార కేంద్రంగా వెలిగేది. ఆ ప్రాంతాన్ని ఏలే రాజు పేరు ‘జామొరిన్’. మలయాళంలో ఆ పదానికి ‘సముద్రానికి రాజు’ అని అర్థం. హిందువైన ఈ రాజు, అధికశాతం ముస్లిమ్లు ఉండే ఆ ప్రాంతాన్ని సమర్ధవంతంగా పరిపాలించేవాడు.

మాలిందిలో బయల్దేరిన ఇరవై ఆరు రోజుల తరువాత మళ్లీ తీరాన్ని చూస్తున్నారు నావికులు. కనుక ఎప్పుడెప్పుడు తీరం మీద అడుగు పెడదామా అని తహతహలాడుతున్నారు. ఓడలు రేవులోకి ప్రవేశించగానే నాలుగు చిన్న పడవలు ఓడని సమీపించాయి. ఆ పడవల్లో కొందరు స్థానిక అధికారులు వాస్కో ద గామా ఓడల లోకి ప్రవేశించి వాళ్ల గురించి వివరాలు సేకరించారు. కాని తీరం మీద అడుగుపెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. మర్నాడు మళ్లీ అలాగే ఆ పడవలు వచ్చాయి. మళ్లీ విచారణలు జరిగాయి కాని ఊళ్ళోకి వెళ్లడానికి అనుమతి లేదు. ఈ జాప్యం వాస్కోకి నచ్చలేదు. అరబిక్ భాష మాట్లాడగల ఓ దూతని ఆ వచ్చిన అధికారులతో పంపాడు. తీరం మీద కొందరు అరబ్బులు దూతతో కొంచెం దురుసుగా మాట్లాడారు. ఆ సమయంలో రాజు కాలికట్ లో లేడని, కాస్త దూరంలో ఉన్న పాననే అనే ఊరికి వెళ్లాడని చెప్పారు. దూత ఆ విషయం వచ్చి వాస్కోతో చెప్పాడు.

వాస్కో ద గామా ఆలస్యం చెయ్యకుండా ఈ సారి ఇద్దరు దూతలని పోర్చుగల్ రాచ ప్రతినిధులుగా నేరుగా జామొరిన్ వద్దకే పంపాడు. దూతల ద్వారా వాస్కో ద గామా గురించి తెలుసుకున్న జామొరిన్ సాదరంగా ప్రత్యుత్తరం పంపాడు. తను త్వరలోనే కాలికట్ కి తిరిగి వస్తున్నట్టు, వాస్కో ద గామాని కలుసుకోవడానికి కుతూహల పడుతున్నట్టు ఆహ్వానపూర్వకంగా జవాబు రాశాడు.

చివరికి మే 28 నాడు రాజు గారి దర్శనం చేసుకునే అవకాశం దొరికింది. పదమూడు మంది అనుచరులతో, వాస్కో ద గామా తీరం మీద అడుగుపెట్టాడు. తమ్ముడు పాలోని ఉన్న ఓడల బాధ్యత అప్పజెప్పుతూ, ఏ కారణం చేతనైనా తను తిరిగి రాకపోతే, వెంటనే ఓడలని తీసుకుని పోర్చుగల్ కి తిరిగి వెళ్ళిపొమ్మని ఆదేశించాడు. వాస్కో ద గామాని ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున వేడుక ఏర్పాటు చేశాడు రాజు. జామొరిన్ మనుషులు వాస్కో ద గామా బృందాన్ని కాలికట్ వీధుల వెంట బళ్లలో తీసుకెళ్లారు. పాశ్చాత్య నావికులని చూడడానికి పురవీధులకి ఇరుపక్కల జనం బారులు తీరారు. పెద్ద పెద్ద నగారాలు మ్రోగాయి. డప్పుల శబ్దం మిన్నంటింది. వాళ్లకి జరిగిన సత్కారాన్ని తలచుకుంటూ వాస్కో బృందంలో ఒకడు తదనంతరం “అసలు ఇంత గౌరవం స్పెయిన్ లో స్పెయిన్ రాజుకి కూడా ఆ దేశ ప్రజలు అందించరేమో” అంటూ రాసుకున్నాడు. దారిలో ఓ హైందవ ఆలయంలో ఆగింది బృందం. వాస్కో ద గామాకి హైందవ మతం గురించి పెద్దగా తెలీదు. ఆ గుళ్లన్నీ చర్చిలే అనుకుని అపోహ పడ్డాడు. ఒక చోట కనిపించిన దేవి విగ్రహం చూసి అది వర్జిన్ మేరీ విగ్రహం అనుకుని పొరబడ్డాడు.

చివరికి బృందం రాజుగారి కోటని చేరుకుంది. వాస్కో ద గామా రాజ సభలో అడుగుపెట్టాడు. భారతీయ పద్ధతిలో రెండు చేతులు జోడించి రాజుగారికి నమస్కరించాడు. స్థానికులు ఆ విధంగా ఒకర్నొకరు పలకరించుకోవడం అంతకు ముందే గమనించాడు. రాజు గారు సముచితాసం ఇచ్చి, అతిథులకి ఫలహారం ఏర్పాటు చేసి ఆదరించారు. ముందు కుశల ప్రశ్నలు వేసి వారు వచ్చిన కార్యం గురించి వాకబు చేశారు. పోర్చుగీస్ రాజు మాన్యుయెల్ ఇండియా గురించి, ప్రత్యేకించి కాలికట్ గురించి ఎంతో విన్నాడని, కాలికట్ తో వాణిజ్యం రెండు దేశాలకి ఎంతో లాభదాయకమని వాస్కో ద గామా విన్నవించాడు.

వాస్కో కి, తన అనుచరులకి రాజమందిరంలోనే ఆ రాత్రికి ఆతిథ్యం దొరికింది. మర్నాటి ఉదయం వాస్కో జామొరిన్ అనుచరులని తన గదికి పిలిపించాడు. జామొరిన్ కి ఇవ్వడానికి తెచ్చిన వస్తువులు చూపించి, రాజుగారికి ఇవి నచ్చుతాయా అని అడిగాడు. ఆ వస్తువులు చూసి వాళ్లు నిర్ఘంతపోయారు. అలాంటి బహుమతులు ఓ చిన్న గూడెం దొరకి ఇవ్వడానికి సరిపోతాయేమో గాని, అంత పెద్ద రాజుకి ఇవ్వడం సరికాదు అన్నారు వాళ్లు.

ఈ బహుమతుల భాగోతం రాజుగారి చెవిన పడింది. ఆయనకి ఆ సంగతి ససేమిరా నచ్చలేదు. తరువాత వాస్కో రాజుగార్ని కలుసుడానికి వెళ్ళినప్పుడు బహుమతులు నచ్చని విషయం మొహం మీదే చెప్పాడు. ఆ ముందు రోజే అంత ఆదరంగా మాట్లాడిన మనిషి ఒక్క రోజులోనే, అదీ అంత చిన్న విషయం గురించి, అంతగా మారిపోవడం వాస్కో దగామాకి కాస్త సందేహం కలిగించింది. తన సందేహం నిజమేనని తరువాత జరిగిన సంఘటనలు నిరూపించాయి. కేవలం బహుమతులు నచ్చని దానికే రాజుకి తనపై అంత కోపం రావడం వాస్కో ద గామాకి ఆశ్చర్యం కలిగించింది. తరువాత వాకబు చెయ్యగా తన గురించి, పోర్చుగీస్ గురించి రాజుకి ఎవరో బోలెడు చాడీలు చెప్పినట్టు తెలిసింది. పోర్చుగీస్ వారు కాలికట్ కి రావడం మొదట్నుంచీ కూడా స్థానికులైన అరబ్ వర్తకులకి ఇష్టం లేదు. వాళ్లకి చెందవలసిన వాణిజ్య లాభాలు పోర్చుగీస్ వారు తన్నుకు పోతారని వారి భయం. అందుకే వాస్కో ద గామా గురించి లేని పోని కథలల్లి రాజుకి చెప్పారు. వాస్కో పరమ కిరాతకుడని, ఆఫ్రికా తీరం మీద ఎదురైన ఎంతో మందిని నానారీతుల్లో చిత్రహింస పెట్టాడని చెప్పి రాజుగారి మనసు మార్చేశారు.

మర్నాడు వాస్కో, తన బృందంతో కలిసి రాజమందిరాన్ని విడిచి తన ఓడలని చేరుకోవాలని బయల్దేరాడు. కాని ఆ ప్రయత్నంలో బృందం దారి తప్పి వేరు పడిపోయారు. దారి చూపించడానికి రాజు గారి అధికారుల్లో ఒకడి సహాయం కోరాడు వాస్కో. కాని ఆ అధికారి సహాయం చెయ్యడానికి నిరాకరించాడు. వీళ్లేదో కుట్ర పన్నుతున్నారని వాస్కోకి సందేహం కలిగింది. ఒక వార్తాహరుణ్ణి పంపించి తన సోదరుడైన పాలోని జాగ్రత్తపడమని హెచ్చరించాడు.

మరో రోజు వాస్కో బృందానికి రాజ మందిరంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. మర్నాడు ఉదయం మళ్లీ వాస్కో తమ ఓడలని చేరుకోడానికి కొన్ని పడవలు కావాలని అడిగాడు. ఈ సారి నిరాకరించడమే కాకుండా వాస్కోని, తన బృందాన్ని రాజభటులు నిర్బంచించారు. దాంతో కాలికట్ రాజు అసలు రంగు బయట పడింది. వాస్కో బృందాన్ని విడుదల చెయ్యడానికి రాజుగారి అధికారులు కొత్త షరతు పెట్టారు. తమ ఓడలలో ఉన్న సరుకులన్నీ అప్పజెప్పితే విడుదల చేస్తాం అన్నారు. కొన్ని సరుకులని ఓడల నుండి దింపించి అప్పజెప్పమని వాస్కో తన తమ్ముడు పాలోకి సందేశం పంపాడు. సరుకులు అందగానే వాస్కో బృందాన్ని విడిచిపెట్టారు రాజభటులు.

వాస్కో బృందం వేగంగా తమ ఓడలు చేరుకున్నారు. వెంటనే పోర్చుగల్ కి బయల్దేరమని మూడు ఓడల కెప్టెన్లకి ఆదేశాలు ఇచ్చాడు. కాలికట్ మళ్లీ వస్తానని, పెద్ద మంది మార్బలంతో తిరిగి వచ్చి, రాజుకి బుధ్ధి చెప్తానని బెదిరిస్తూ లేఖ రాసి రాజుకి పంపాడు. పోర్చుగీస్ తో తగవు తమకి తగదని తెలుసుకున్న రాజు శాంతి సందేశం పంపాడు. కాని వాస్కో దానికి సుముఖంగా స్పందించలేదు. 1498 ఆగస్టు 29 వాస్కో బృందం పోర్చుగల్ కి పయనమయ్యారు.

ఓడలు ఆఫ్రికా తీరం దిశగా పయనం అయ్యాయి. కాని బయల్దేరిన నాటి మధ్యాహ్నమే ఓ చిన్న దుర్ఘటన ఎదురయ్యింది. కాలికట్ నుండి అప్పటికి ఓడలు ఎంతో దూరం రాలేదు. ఓ డెబ్బై స్థానిక ఓడలు వాస్కో ఓడలని సమీపించసాగాయి. అవి వస్తున్నది యుద్ధం చెయ్యడానికేనని వాస్కోకి అర్థమయ్యింది. ఫిరంగులని పేల్చమని ఓడలకి ఆదేశించాడు. ఫిరంగులని పేల్చినా కూడా శత్రు నౌకలు తమని సమీపిస్తూనే ఉన్నాయి. కాని ఇంతలో ఉన్నట్లుండి ఆకాశంలో మేఘాలు క్రమ్మాయి. అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా ముసురు క్రమ్మింది. ఉరుములు, మెరుపులతో తుఫాను విరుచుకుపడింది. ఆ ధాటికి శత్రునౌకలు చెల్లాచెదురు అయ్యాయి. పోరుకి ఇది అనువైన సమయం కాదని శత్రు నౌకలు వెనక్కి మళ్లాయి. ఈ దెబ్బతో వాస్కో ద గామాకి కూడా కాస్త వేడి చల్లారింది. అనవసరంగా కాలికట్ రాజుతో తగవు తెచ్చుకున్నానని తెలుసుకుని పశ్చాత్తాప పడ్డాడు. కాని ఇప్పుడు చేసేదేమీ లేదు.

సెప్టెంబరు చివర్లో అంగదివా అనే దీవులని చేరుకున్నారు. ఆహారం, నీరు మొదలైన సరంజామా ఓడలకి ఎత్తించుకోవడానికి బృందం అక్కడ ఆగింది. ఆ వ్యవహారం సాగుతుంటే కాస్త దూరంలో రెండు పెద్ద ఓడలు తమని సమీపించడం కనిపించింది. అవి కూడా తమని నాశనం చెయ్యడానికి వస్తున్న శత్రు నౌకలే అనుకున్నాడు వాస్కో ద గామా. వాటి మీద ఫిరంగులని ప్రయోగించమని నావికులని ఆదేశించాడు. వచ్చిన నౌకలలో ఒకటి తప్పించుకుంది. రెండో నౌకకి చుక్కాని విరిగిపోవడం వల్ల తప్పించుకోలేక పోయింది. వాస్కో మనుషులు ఆ ఓడని ఆక్రమించుకోబోయే సరికి ఆ నౌకలోని సిబ్బంది నౌకని విడిచిపెట్టి పారిపోయారు.

ఆఫ్రికా తూర్పు తీరం దిశగా ప్రయాణం కొనసాగింది. కాలికట్ కి ఆఫ్రికా తీరానికి మధ్య దూరం మరీ ఎక్కువ కాకపోయినా వాతావరణ పరిస్థితుల వల్ల, సముద్ర పరిస్థితుల వల్ల ప్రయాణం కఠినమయ్యింది. సముద్ర పవనాలు అనుకూలించలేదు. గమనం బాగా మందగించింది. ఆహారం నిలువలు వేగంగా తరిగిపోతున్నాయి. గతంలో జరినట్టే మళ్లీ నావికులు స్కర్వీ వ్యాధి వాతన పడ్డారు. ఆ దెబ్బకి ముప్పై మంది నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఒక దశలో ఇండియాకి వెనక్కి తిరిగి వెళ్ళక తప్పదని అనిపించింది. కాని అదృష్టవశాత్తు ఒక దశలో సానుకూల పవనాలు వీచాయి. ప్రయాణం మళ్ళీ ఊపు అందుకుంది. 1499 జనవరి ఏడో తారీఖున వాస్కో బృందం ఆఫ్రికా తూర్పు తీరం మీద ఉన్న మాలింది నగరాన్ని చేరుకున్నారు. మాలింది నగర వాసులు వాస్కో బృందాన్ని సాదరంగా ఆహ్వనించారు. నానా రకాల ఫలహారాలు ప్రసాదించి వారి సేద తీర్చారు. కాని అప్పటికే అరబిక్ సముద్రపు విపరీత పరిస్థితుల వల్ల బాగా అస్వస్థత పడ్డ కొందరు నావికులకి ఆ ఫలహారాల వల్ల పెద్దగా మేలు జరగలేదు. పైగా ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉండే మాలింది వాతావరణం వల్ల వారి పరిస్థితి మరింత విషమించింది. వ్యాధి వాత పడ్డ కొంతమంది నావికులు పాణాలు కోల్పోయారు.

మాలిందిలో ఐదు రోజులు బస చేశాక వాస్కో బృందం పోర్చుగల్ కి బయల్దేరింది. కొంతమంది నావికులు చనిపోవడం చేత మూడు ఓడలని నడపడానికి తగినంత మంది సిబ్బంది లేరు. కనుక ‘సాన్ రఫాయెల్’ ఓడలో ఉండే ఆహారం మొదలైన సరుకులు అన్నీ తక్కిన రెండు ఓడలలో పంపిణీ చేసి ‘సాన్ రఫాయెల్’కి నిప్పు పెట్టారు. తక్కిన రెండు ఓడలలోను వాస్కో బృందం తిరిగి పోర్చుగల్ కి పయనమయ్యింది.

మే ఇరవయ్యవ తారీఖుకి నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ ని చేరుకున్నాయి. అంటే సగం దూరం వచ్చేశాయన్నమాట. నావికులు సంతోషించారు. ఓడలు పోర్చుగల్ దిశగా ప్రయాణించాయి. ఆ సమయంలోనే వాస్కో తమ్ముడైన పాలోకి టీ.బీ. వ్యాధి సోకినట్టు తెలిసింది. ఎలాగైనా వీలైనంత త్వరగా పాలోని పోర్చుగల్ చేర్చాలి. బతికించుకోలేకపోయినా మార్గ మధ్యంలో అతడు పోవడం వాస్కోకి ఇష్టం లేదు. కాని ఓడల వేగం సరిపోలేదు. పోర్చుగల్ చేరకుండానే పాలో ప్రాణాలు వదిలాడు. దారిలో అజోర్స్ దీవుల వద్ద ఆగి వాస్కో తన తమ్ముడి అంత్యక్రియలు జరిపించాడు.

యాత్ర కొనసాగింది. కాని వాస్కో తన తమ్ముడు పోయిన విషాదం నుండి తేరుకోలేకపోయాడు.1499 ఆగస్టు నెల ఆఖరులో వాస్కో బృందం పోర్చుగల్ చేరుకుంది. వాస్కో ద గామా బృందం తమ దేశం కోసం, ఇంచుమించు శతాబ్ద కాలంగా సాధ్యం కాని ఓ ఘన విజయం సాధించుకు వచ్చింది. ఇండియాకి కొత్త సముద్ర దారులు కనుక్కోగలిగింది. అయితే తమ్ముడు పోయిన బాధలో వాస్కో ఆ విజయానందంలో పాలుపంచుకో లేకపోయాడు.

పోర్చుగల్ దేశం ఇండియాని కనుక్కుని తిరిగొచ్చిన నావిక వీరులకి ఘన స్వాగతం పలిగింది. మాన్యుయెల్ రాజు వాస్కో ద గామాని సాదరంగా ఆహ్వానించాడు. డామ్ బిరుదు ప్రసాదించి వాస్కోని సత్కరించాడు. బహుమతిగా కొంత ధనం కూడా ప్రదానం చేశాడు. వాస్కో తను చూసినది, చేసినది అంతా వివరంగా ఏకరువు పెట్టాడు. అది విన్న రాజు రెండో సారి యాత్రకి సిద్ధం కమ్మని సూచించాడు.

1500 లో రెండవ యాత్రకి ఉపక్రమించమని వాస్కోని అడిగాడు రాజు. కాని రెండేళ్లకి పైగా సాగిన యాత్ర వల్ల బాగా బడలిక చెందిన వాస్కో వెంటనే మరో యాత్ర మీద బయల్దేరడానికి సిద్ధంగా లేనన్నాడు. కనుక రాజు పెడ్రో ఆల్వారెజ్ కబ్రాల్ అనే నావికుణ్ణి ఎంచుకున్నాడు. పదిహేను ఓడలతో, బోలెడంత సాయుధులైన బలగంతో బయల్దేరాడు పెడ్రో. ఈ యాత్ర యొక్క లక్ష్యం ఇండియాతో వాణిజ్యం కాదు. దారి పొడవునా తమకి లోగడ ద్రోహం చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవడం. మొదటగా ఆఫ్రికాలోని మొంబాసా నగరాన్ని చేరుకున్నారు.పోర్చుగల్ ఓడలు ఆ ఊరి మీద ఫిరంగులతో అగ్నివర్షం కురిపించాయి. పోర్చుగీస్ సైనికులు ఊరిమీద విరుచుకుపడి విలయతాండవం చేశారు. స్త్రీలని అటకాయించి నగలు దోచుకున్నారు. అందినది అందినట్టు దోచుకుని తమ ఓడలలోకి ఎక్కించుకున్నారు. ఆఫ్రికా తీరం మీద పోర్చుగీస్ నౌకల పట్ల ద్వేషం, భయం పెరిగింది.

1502, ఫిబ్రవరి 12, నాడు వాస్కో ద గామా స్వయంగా ఇరవై నౌకలు తీస్కుని బయల్దేరాడు. దారిలో మొజాంబిక్ లో కొంత కాలం ఆగారు. మొజాంబిక్ని పాలించిన సుల్తాన్ క్వాజా లోగడ వాస్కొ ద గామాని మోసం చేశాడు. కాని ఈ మధ్య కాలంలో అతగాడు మరణించాడు. అతడి తరువాత వచ్చిన షేక్, వాస్కో ద గామా గురించి విని వుండడం చేత, వాస్కోతో సత్సంబంధాలు పెట్టుకున్నాడు. దారిలో మాలింది నగరాన్నిమళ్లీ సందర్శించారు. ఆ తరువాత అంగెదీవా దీవుల మీద కూడా ఆగారు. ఈ సమయంలో మళ్లీ ఎంతో మంది నావికులు స్కర్వీ వాత పడ్డారు. వారిలో కొంతమంది మరణించారు. వ్యాధి నుండి నావికులు మళ్లీ కోలుకున్నాక ప్రయాణం మొదలయ్యింది.

అంగెదీవాని దాటాక ఇక తదుపరి మజిలీ ఇండియానే. ఈ సారి కాలికట్ కి పోకుండా ఆ ఊరికి ఉత్తరాన ఉన్న కాననూర్ నగరాన్ని చేరుకున్నారు. ఇక ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమయ్యింది. కొన్ని రోజులు ఎదురు చూశాక ‘మేరీ’ అనే అరబ్ ఓడ పశ్చిమం నుండి రావడం కనిపించింది. ఆ ఓడ ఓ కాలికట్ నగర వాసికి చెందినది. అందులో 380 మంది ప్రయాణీకులు ఉన్నారు. మెక్కా యాత్ర చేసుకుని వారంతా కాలికట్ కి తిరిగి పోతున్నారు.

పోర్చుగీస్ నౌకలు ఆ అరబ్ నౌకని ముట్టడించాయి. నౌకలోని సరుకులని తమకి అప్పజెప్పమని ద గామా గద్దించాడు. నౌకలో పెద్దగా విలువైనవి ఏమీ లేవన్నారు నౌకలోని అరబ్బులు. వాళ్ల మాట నమ్మని వాస్కో ఇద్దరు అరబ్బులని ఓడ మీంచి నీట్లో పడేయించాడు. దాంతో ఓడలో సరుకులు ఉన్నాయని అరబ్బులు ఒప్పుకున్నారు. సరకులని ఆ ఓడ నుండి పోర్చుగీస్ ఓడలలోకి తరలించారు. అయినా అరబ్బులు ఇంకా ఏదో దాస్తున్నారన్న సందేహంతో ముక్కోపి అయిన వాస్కో ఓ ఘాతుకానికి ఒడిగట్టాడు. అరబ్బు ఓడని నిలువునా దహించమని తన సైనికులని ఆదేశించాడు. ప్రమాదాన్ని గుర్తించిన అరబ్బులు తమ వద్ద మిగిలిన ఆయుధాలని వాస్కో బృందానికి సమర్పించుకోడానికి ప్రయత్నించారు. కాని వాస్కో ప్రదర్శించిన పాశవికతను వారి చర్యలు మార్చలేకపోయాయి. నాలుగు పగళ్ళు, నాలుగు రాత్రుల పాటు ఓడ మంటల్లో రగిలింది. ఓడలోని ప్రయాణీకులలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలలేదు.

అలా ఎంతో మంది స్త్రీలు, పిల్లలు ఉన్న ఓడని నిలువునా దహించిన ఘట్టం సముద్ర యాన చరిత్రలోనే ఓ అతి చేదైన, క్రూరమైన ఘట్టంగా నిలిచిపోయింది. ఆ సందర్భంలో వాస్కో ద గామా ప్రదర్శించిన కాసాయి స్వభావం ముందు సముద్రపు దొంగలు చేసే దురాగతాలు కూడా దిగదుడుపే.

అరబ్బు ఓడలో మంటలు ఆరినా వాస్కో ద గామాలో రగులుతున్న క్రూర, ప్రతీకార జ్వాలలు మాత్రం అరలేదు. కాలికట్ ని ఏలే జామొరిన్ మీద దెబ్బ కొట్టడానికి ఓ పన్నాగం పన్నాడు.

మక్కా నుండి వచ్చిన ఓడని దగ్ధం చేశాక పోర్చుగీస్ నౌకాదళం కాననూర్ దిశగా పయనమయ్యింది. ఇండియాకి మొదటి యాత్రలో వాస్కో ఇక్కడి రాజుతో స్నేహం చేసుకున్నాడు. ఈ రాజుకి కాలికట్ ని ఏలే జామొరికి మధ్య చిరకాల శత్రుత్వం ఉంది. కాననూర్ రాజు వాస్కోదగామాని తన మందిరంలోకి ఆహ్వానించి సాదరంగా ఆతిథ్యం ఇచ్చాడు. ఇద్దరూ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. రాజు వద్ద నానా రకాల సుగంధ ద్రవ్యాలు కొనుక్కుని వాస్కో దా గామా కాలికట్ కి బయల్దేరాడు.

ఉదయభాను కిరణాలకి అడ్డుపడుతూ అల్లంత దూరంలో సముద్రం అంచులో బారులు తీరిన పోర్చుగీస్ నౌకాశ్రేణిని చూసిన జామొరిన్ కి వెన్నులో వణుకు పట్టుకుంది. అనవసరంగా ఈ తెల్లనావికుడితో కయ్యం పెట్టుకున్నందుకు పశ్చాత్తాపపడ్డాడు. గతాన్ని మరచి సత్సంబంధాలు పెంచుకుందాం అంటూ దూతలతో సందేశం పంపాడు. ఆ సందేశం వాస్కో ద గామాకి హాస్యాస్పదంగా అనిపించింది. ఉత్తిత్తి మాటలతో కరిగే మనసు కాదు వాస్కోదగామా ది. జామొరిన్ తో జట్టు కలపడానికి వాస్కో ఓ షరతు పెట్టాడు. కాలికట్ లో ఉన్న ముస్లిమ్లు అందరినీ వెళ్ళగొడితే గాని తనతో స్నేహం కుదరదని ఖండితంగా చెప్పాడు.

షరతుకి ఒప్పుకోకపోతే అందుకు పర్యవసానం కటువుగా ఉంటుందని నిరూపించదలచాడు ద గామా. తనలోని కసాయి స్వభావాన్ని మరొక్కసారి బయటపెట్టాడు. తమ ఓడలవద్ద చేపలు అమ్ముకోడానికి వచ్చిన కొందరు అరబ్బు జాలర్లని పట్టి బంధించమని తన నావికులని ఆదేశించాడు. అలా పట్టుబడ్డ అరబ్బులందరినీ ఓడలోనే ఉరి తీయించాడు. వాస్కో ద గామా లోని ప్రతీకార జ్వాల అక్కడితో ఆరలేదు. ఉరితీయబడ్డ జాలర్ల శవాలని కిందికి దింపించి, వాటిని ముక్కలుముక్కలుగా కోయించి తీరం మీద పడేయించాడు. అలా ప్రాణాలు పోగొట్టుకున్న జాలర్లకి అయినవారంతా ఆ రాత్రి తీరం వద్ద కాపుకాసి ఎదురుచూడసాగారు. నీట్లో కొట్టుకొచ్చిన దేహాంగాలని చూసి వారంతా భయంతో వొణికిపోయారు.

ఆ మారణకాండ పూర్తయ్యాక వాస్కో కొన్ని నౌకలతో కొచ్చిన్ కి పయనమయ్యాడు. ఆరు నౌకలని కాలికట్ వద్దనే ఉంచి ఆ దారిన ఏవైనా వాణిజ్య నౌకలు వస్తే అటకాయించమని ఆదేశించాడు. కొచ్చిన్ కి వెళ్ళిన వాస్కో ద గామా అక్కడి రాజుతో కూడా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాడు.

ఇలా ఉండగా 1503 జనవరి 3, నాడు కాలికట్ నుండి వాస్కో ద గామాని కలవడానికి ఒక ప్రభుత్వ అధికారి, అతడు కొడుకు కొచ్చిన్ కి వచ్చారు. వారి ద్వారా జామొరిన్ వాస్కోకి శాంతి సందేశం పంపాడు. వాస్కో చేసిన కట్టడి వల్ల కాలికట్ కి వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. జామొరిన్ ఆ కట్టడిని భేదించడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఇక కాళ్ల బేరానికి రాక తప్పలేదు.

ఈ శాంతి ప్రయత్నానికి ద గామా ఒప్పుకున్నాడు. వెంటనే కాలికట్ కి బయల్దేరాడు. కాని నిజానికి ఈ శాంతి సందేశం, అందుకు ఆహ్వానం అంతా ఓ కుట్ర. కాలికట్ లో రాజమందిరంలో వాస్కో ద గామాని హత్య చెయ్యడానికి జామొరిన్ పథకం వేశాడు. కాని ఆ పథకం పారలేదు. అక్కణ్ణుంచి తప్పించుకుని వాస్కో ద గామా తిరిగి కొచ్చిన్ చేరాడు. ద్రోహం చేసినందుకు తన వద్దకి దూతగా వచ్చిన అధికారిని శిక్షించాలనుకున్నాడు. అధికారిని విడిచిపెట్టాడు గాని తన కొడుకుని మాత్రం ఉరితీయించాడు.

“శాంతి ప్రయత్నం” విఫలమయినందుకు ఇక జామొరిన్ కి యుద్ధం తప్ప వేరే మార్గాంతరం కనిపించలేదు. పోర్చుగీస్ వారితో పోరుకి సిద్ధ పడ్డాడు. జామొరిన్ చేసుకుంటున్న యుద్ధ ప్రయత్నాల గురించి విన్న వాస్కో వెంటన తన నౌకాదళాన్ని కాలికట్ కి పోనిచ్చాడు. అతి తక్కువ కాలంలో అరబ్బు నౌకాసేనలని చిత్తుగా ఓడించాడు.

ఆ విధంగా తన రెండవ ఇండియా యాత్రలో వాస్కో ద గామా జామొరిన్ మీద అతి క్రూరంగా తన ప్రతీకారం తీర్చుకుని తన నౌకాదళంతో పోర్చుగీస్ కి తిరిగి పయనమయ్యాడు. అతి క్రూరంగా ప్రవర్తించి జామొరిన్ మీద, స్థానికుల మీద ప్రతీకారం తీర్చుకున్న వాస్కో ద గామా 1503 మార్చి 5, నాడు తిరిగి పోర్చుగల్ కి పయనమయ్యాడు. సెప్టెంబరు 1 నాడు నౌకాదళం లిస్బన్ ని చేరుకుంది. మహారాజు మాన్యుయెల్ వాస్కోకి ఘనస్వాగతం పలికాడు. పెద్ద మొత్తంలో ధనం బహుమానంగా ఇచ్చి ఆదరించాడు. ఈ డబ్బుతో వాస్కో ద గామా ఎవోరాలో ఓ పెద్ద భవంతి కట్టుకున్నాడు. అయితే ఏనాటికైనా తన చిన్ననాటి ఊరు ‘సైన్స్’ (Sines) ని సొంతం చేసుకోవాలన్న కల మాత్రం తన మదిని వీడలేదు.

కాని సైన్స్ ని సొంతం చేసుకోడానికి కొన్ని అవరోధాలు ఉన్నాయి. ఆ ఊరు ‘సావో తియాగో’ అనే మతవర్గం హయాంలో ఉంది. ఈ వర్గం వారు ఆ ఊరిని రాజుకి అమ్మడానికి ఒప్పుకోలేదు. మతవర్గంతో పేచీ పెట్టుకుని ఊరిని బలవంతంగా లాక్కునేటంత ధైర్యం లేదు రాజుకి. ఇక గత్యంతరం లేక వాస్కో ద గామా స్వయంగా సైన్స్ కి వెళ్ళి అక్కడే ఓ ఇల్లు కట్టుకున్నాడు. పుట్టి పెరిగిన ఊళ్ళో గర్వంగా, మీసం మెలేసుకుని తిరిగేవాడు. ఆ ఊరి వారికే కాక సమస్త పోర్చుగీస్ జాతికీ మరి వాస్కో ద గామా జాతి గర్వపడదగ్గ అసమాన శూరుడు. అలాంటి వాడు తమ మధ్య జీవిస్తూ, తమ ఊరి వీధుల్లో సంచరించడం సైన్స్ పుర వాసులకి కూడా సంతోషం కలిగించింది.

ఇది తెలిసిన ‘సావో తియాగో’ మత వర్గానికి చెందిన అధికారులు వాస్కోతో తల గోక్కోవడం ఇష్టం లేక నేరుగా రాజుకే ఫిర్యాదు చేశారు. వాస్కో ఆ ఊరు వదిలి వెళ్లిపోవాలని ఆజ్ఞ ఇస్తూ, నెల రోజులు గడువు ఇచ్చాడు రాజు. రాజు మాట కాదనలేక వాస్కో ఊరు వదిలి వెళ్లినా, లోగడ రాజు తనకి ఇచ్చిన మాట ఇంకా నిలుపుకోలేదని ఓ సారి గుర్తుచేశాడు. ఇండియాకి మొదటి యాత్ర తరువాత రాజు తనకి ఇస్తానన్న పారితోషికం ఇంకా ఇవ్వలేదని మరో సారి జ్ఞాపకం చేశాడు.

మొదటి సారి వాస్కో ద గామా ఇండియా నుండి తిరిగి వచ్చాక, అతడు సాధించిన అనుపమాన విజయానికి గొప్ప పారితోషికం ఇస్తానని రాజు వరం ఇచ్చాడు. కాని ఒకసారి ఇండియాకి దారి తెలిశాక ఇక వాస్కో ద గామ అవసరం అంతగా లేదు. తెలిసిన దారి వెంట నౌకలని తీసుకుని ఇండియాకి వెళ్లగల నావికులు ఎంతో మంది ఉన్నారు. రాజు వాస్కోకి ఇచ్చిన ప్రమాణం గురించి పట్టించుకోకపోవడానికి ఇది కూడా ఒక కారణం.

అందుకే మాట ఇచ్చి పదేళ్లు అయినా ఇంకా మాట నిలుపుకోకుండా తాత్సారం చెయ్యసాగాడు మాన్యుయెల్ రాజు. ఈ ఆలస్యం వాస్కో భరించలేకపోయాడు. ఒకసారి రాజు వద్దకి సూటిగా వెళ్ళిన్ నిలదీశాడు. మాట నిలుపుకోకపోతే ఇక పోర్చుగీస్ రాజు కొలువులో ఉండడం అనవసరం అని, మరో రాజుని ఆశ్రయించక తప్పదని హెచ్చరించాడు.

ఆ హెచ్చరికకి రాజు కాస్త కంగారు పడ్డాడు. ఏనాడైనా వాస్కోతో పని పడొచ్చు. కనుక తనతో ఊరికే కలహం పెట్టుకోవడం అంత శ్రేయస్కరం కాదు. కనుక ఏదో సర్దుబాటు చేస్తానని, మరొక్క ఏడాది వేచి ఉండమని సర్దిచెప్పి వాస్కోని పంపించేశాడు. వాస్కోకి బహుమతిగా ఇవ్వడానికి ఎక్కడైనా తగినంత భూమి దొరుకుతుందేమో అని రాజు నాలుగు చోట్ల వాకబు చేశాడు. రాజు మేనల్లుడు ఒకడు తన అధికారంలో ఉన్న రెండు ఊళ్ళు రాజుకి అమ్ముతాను అన్నాడు. చివరికి 1519 డిసెంబరు లో, రాజు తనకి మాట ఇచ్చిన ఇరవై ఏళ్ల తరువాత, వాస్కో ద గామాకి తనకి బహుమానంగా రావలసిన నేల దక్కింది.

వాస్కో ద గామా రెండవ యాత్ర తరువాత, ఆ దారి వెంట ఎన్నో పోర్చుగీస్ ఓడలు ఇండియాకి పయనమయ్యాయి. నావికులకి ఈ మార్గంలో పవనాలు ఏ కాలంలో ఏ దిశలో వీస్తాయో అన్నీ తెలిసిపోయాయి. కనుక ఆ పవనాలని తగు రీతిలో వాడుకుంటూ తమ యాత్రా మార్గాలని రూపొందించుకుంటూ వచ్చారు. 1500 నుండి 1504 వరకు ఎక్కువగా వాణిజ్య నౌకలే ఇండియాకి పయనం అయ్యాయి.

తొలి దశల్లో వాస్కో బృందం చేసినట్టు అందిన చోట అందినట్టు కొల్లగొట్టుకు వచ్చే పద్ధతి ఎంతో కాలం సాగదు. వాణిజ్యం సజావుగా సాగాలంటే అన్ని పక్షాల వారు ఒక చట్టబద్ధమైన వ్యవస్థకి ఒడంబడి ఉండాలి. అలాంటి వ్యవస్థ యొక్క సంస్థాపనలో మొదటి మెట్టుగా మహారాజు మాన్యుయెల్ ఇండియాలో వైస్రాయ్ అనే పదవిని స్థాపించాడు. ఎలగైనా స్థానిక ముస్లిమ్ వర్తకులకి అక్కణ్ణుంచి తరిమేయాలని రాజు పన్నాగం. అందుకోసం ముందు అక్కడ పోర్చుగీస్ అధికారంలో ఉండే ఓ మండలాన్ని స్థాపించాలి.

అలాంటి మండలాన్ని స్థపించడానికి పశ్చిమ తీరంలోనే ఉన్న గోవా నగరం అన్ని విధాలా సౌకర్యంగా అనిపించింది. పోర్చుగీస్ సామంత ప్రాంతంగా గోవా వేగంగా ఎదిగింది. అయితే ఆ విస్తరణ సామరస్యంగా సాగలేదు. మొత్తం వాడలు తుడిచి పెట్టుకుపోయాయి. ఎంతో మంది జైలుపాలు అయ్యారు. వారిలో ఎంతో మంది జైల్లోనే నానా చిత్ర హింసకీ గురై హతం అయ్యారు. కనుక ఎంత వేగంగా ఎదిగిందో, అంతే వేగంగా ఆ ప్రాంతం పతనం అయ్యింది. గోవా ప్రాంతం అరాచకం అయ్యింది. సభ్య సమాజానికి ఉండాల్సిన లక్షణాలు కనుమరుగు అయ్యాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండేవారు జనం. ప్రతి ఒక్కరూ అవతలి వారిని ఎలా దొంగ దెబ్బ తీసి ముందుకు పోదామా అనే ఆలోచనలో ఉండేవారు. “నెత్తురు, అత్తరు కలగలసిన దారుణ మిశ్రమం…” అంటాడు ఆ పరిస్థితిని వర్ణిస్తూ ఓ పోర్చుగీస్ రచయిత.

ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి దక్షుడు, నిజాయితీ పరుడు అయిన ఓ పాలకుడు కావాలి. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ వాస్కో ద గామా రంగప్రవేశం చేశాడు.

మూడవ సారి వాస్కో ద గామా ఇండియాకి పయనమయ్యాడు. కొత్తగా వచ్చిన జాన్ – III నియమించగా పోర్చుగల్ ప్రతినిధిగా. గోవాకి వైస్రాయ్ గా వెళ్లాడు. 1524 ఏప్రిల్ నెలలో 14 ఓడలతో 3000 సిబ్బందితో బయల్దేరాడు. మొసాంబిక్ దాకా యాత్ర భద్రంగానే సాగింది. మరమ్మత్తుల కోసం మొసాంబిక్ లో ఆగారు. అక్కడ ఒక్కసారిగా పరిస్థితులు తిరగబడ్డాయి. ఓ పెనుతుఫాను తీరం మీద విరుచుకుపడింది. ఆ దెబ్బకి మూడు ఓడలు నీటిపాలయ్యాయి. ఆ ఓడలలోని సిబ్బంది అంతా ప్రాణాలు కోల్పోయారు. మరొక ఓడలో సిబ్బంది తిరగబడి కాప్టెన్ ని హతబార్చి, ఓడతో పరారయ్యారు. తదనంతరం వాళ్లంతా సముద్రపు దొంగలుగా మరిపోయారు. ఇది చాలదన్నట్టు ఇంచుమించు అదే సమయంలో స్కర్వీ వ్యాధి మరి కొన్ని ప్రాణాలు బలితీసుకుంది.

సెప్టెంబరు 8 నాటికి నౌకాదళం భారతీయ పశ్చిమ తీరం మీద డాబుల్ అనే ఊరికి దరిదాపుల్లోకి వచ్చింది. అప్పుడు ఓ అనుకోని సంఘటన జరిగింది. సముద్ర గర్భంలో భూకంపం వచ్చి సముద్రం అతలాకుతలం అయ్యింది. పెద్ద పెద్ద కెరటాలు లేచిపడసాగాతయి. సమంగా, శాంతంగా ఉండే సముద్ర తలం మీద ఒక్కసారిగా కదిలే నీటి కొండలు పొడుచుకు వచ్చినట్టు అయ్యింది. ఓడలు ఆ కెరటాల మీద అస్థిరంగా సవారీ చెయ్యసాగాయి. ఓడల మీద నావికులు బంతుల్లా ఎగిరెగిరి పడుతున్నారు. నీరు కొన్ని చోట్ల సల సల కాగుతోంది. లోనుండి ఆవిర్లు తన్నుకువస్తున్నాయి. ఆ భూకంపం లేదా సముద్ర కంపం ఓ గంట సేపు సాగింది. ఇంత జరుగుతున్నా వాస్కో ద గామా మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు. అంతా అయ్యాక, పరిస్థితులు సద్దుమణిగాక మిగిలిన నౌకా సిబ్బందిని పిలిచి ఇలా అన్నాట్ట – “చూశారా మిత్రులారా! మనని చూసి సముద్రం కూడా వణికిపోతోంది. కనుక ఏం భయం లేదు. హాయిగా వేడుకలు జరుపుకోండి.”

వాస్కో ద గామా బృందం గోవా తీరం మీద కాలుపెట్టింది. వాస్కో రాకకి అక్కడి పోర్చుగల్ అధినివేశం (colony) లో ఉండే పోర్చుగీస్ వారు మహదానందం చెందారు. అడ్మిరల్ స్వయంగా రావడంతో వారికి కొండంత బలం వచ్చినట్టు అయ్యింది. మెరిసే బంగరు మాలలతో, ధగదగలాడే ఖరీదైన వస్త్రాలు ధరించి, చుట్టూ దాసదాసీ జనంతో రాజవైభవాన్ని ప్రదర్శిస్తూ వాస్కో గోవా ప్రజలకి దర్శనమిచ్చాడు. వాస్కో రాకతో గోవాలో పాలన చక్కదిద్దబడుతుందన్న విశ్వాసం బలపడింది.

అధినివేశంలో ఉండే కొందరు పోర్చుగీస్ అధికారులు కొన్ని అస్త్రశస్త్రాలని స్థానిక వర్తకులకి అమ్మేశారని తెలిసింది. అలా అమ్మబడ్డ ఆయుధాలన్నీ వెనక్కు రప్పించుకునే ప్రయత్నాలు మొదలెట్టాడు ద గామా. చాలా మంది వర్తకులు తాము కొన్న ఆయుధాలు వెంటనే తిరిగి తెచ్చి ఇచ్చేశారు. క్రమంగా పరిస్థితులు మెరుగు పడుతున్నాయని అనుకుంటుండగా వాస్కో ఆరోగ్యం పాడయ్యింది. బయట వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత, ఎడతెగని పని – ఈ రెండూ కలిసి అనారోగ్యానికి దారితీశాయి. మొదట్లో మెడలో నొప్పి మొదలయ్యింది. తరువాత మెడలో కురుపులు బయల్దేరి చిప్పిల్లసాగాయి. వైద్యులు ఎన్నో మందులు వాడారు. కాని లాభం లేకపోయింది. మెడ తిప్పడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. మంచం మీద నుండే అధికారులకి ఆదేశాలు ఇవ్వడం మొదలెట్టాడు. నానాటికి ఆరోగ్యం క్షీణించసాగింది. తన చివరి రోజులు దగ్గరపడుతున్నాయని వాస్కో ద గామాకి అర్థమయ్యింది.

కొచ్చిన్ లో ఉన్న ఓ మిత్రుడి ఇంటికి తనని తరలించమని కోరాడు. పాలనా విషయాల మీద తన చివరి ఆదేశాలు అధికారులకి తెలియజేశాడు. ఓ కాథలిక్ అర్చకుడు వచ్చి వాస్కో చేసిన పాపకర్మలకి సంబంధించిన పశ్చాత్తాప ప్రకటన తీసుకున్నాడు. తన కొడుకులని పిలిచి వీడ్కోలు మాటలు చెప్పాడు. 1524 డిసెంబరు 24, నాడో వాస్కో ద గామా కన్ను మూశాడు. ఎన్నో సముద్రాలు దాటి ఇండియాని చేరుకునే సుదీర్ఘమైన మర్గాన్ని కనుక్కున్న వాస్కో ద గామా, మరేదో లోకాన్ని వెదుక్కుంటూ, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఆయన నిష్క్రమణానికి స్థానికి పోర్చుగీస్ వారంతా కన్నీరు మున్నీరు అయ్యారు.

వాస్కోద గామా తరువాత ఇతర పోర్చుగీస్ నావికులు చేసిన యాత్రల వల్ల పోర్చుగల్ ఓ ప్రపంచ నౌకాబలంగా సుస్థిర స్థానాన్ని సాధించింది. పోర్చుగీస్ వాణిజ్య సామ్రాజ్యం చైనా, జపాన్, ఫిలిపీన్స్ మొదలైన ప్రాంతాలకి విస్తరించింది. అయితే పోర్చుగల్ చిన్న దేశం కనుక అంత దూరాలలో ఉన్న అధినివేశాలని నియంత్రించగల మంది మార్బలం లేకపోయింది. పోర్చుగీస్ అధినివేశాలు క్రమంగా చేజారిపోయాయి. మరింత పెద్ద దేశాలైన ఇంగ్లండ్, ఫ్రాన్స్ మొదలైన యూరొపియన్ దేశాల ప్రాభవం మాత్రం ఇంకా ఎంతో కాలం నిలిచింది. ఇరవయ్యవ శతాబ్దంలో యూరొపియన్ దేశాలు ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన అధినివేశాలకి స్వాతంత్ర్యం వచ్చింది. అధినివేశాలు మాయమైనా వాటి సంస్థాపన వెనుక ఉన్న అన్వేషకుల ధైర్యసాహసాలకి చెందిన గాథలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోయాయి.

ఆధారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Modern History Sourcebook: Vasco da Gama: Round Africa to India, 1497-1498 CE Archived 2011-08-28 at the Wayback Machine Retrieved June 27, 2007
  2. Catholic Encyclopedia: Vasco da Gama Retrieved June 27, 2007
  3. Ames, Glenn J. (2008). The Globe Encompassed. p. 27. ISBN 0131933884. Retrieved 2008-01-10.

ఇతర లింకులు

[మార్చు]
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.