వెన్నెల సత్యం
వెన్నెల సత్యం | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | నాగల్‌కడుమూర్ , అమరచింత మండలం,వనపర్తి జిల్లా | 1976 మే 6
వృత్తి | కవి, ఉపాధ్యాయుడు |
పౌరసత్వం | భారతీయుడు |
జీవిత భాగస్వామి |
|
సంతానం | ఇద్దరు కుమారులు
|
వెన్నెల సత్యం తెలంగాణ ప్రాంతానికి చెందిన వర్తమాన తెలుగు కవి. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. ప్రధానంగా వచన కవిత్వం రాసినా, నానీలు, మణిపూసలు, రెక్కలు, నానోలు, దోహ, శతకం, రుబాయీలు గజల్స్ వంటి వివిధ సాహిత్య ప్రక్రియల్లోనూ కవిత్వం రాశారు. నానీలు వీరికి పేరు తీసుకవచ్చాయి. వీరు 1976 మే నెల 6 వ తేదిన వనపర్తి జిల్లా అమరచింత మండలం నాగల్‌కడుమూర్ లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు మోనమ్మ , వెంకట్రాములు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ లో నివసిస్తున్నారు. మొదట కండక్టర్ గా దాదాపు పదకొండేళ్లు పనిచేశారు. 2009 లో ఉపాద్యాయ వృత్తిలోకి వచ్చారు. అప్పటి (2009) నుండే కవిత్వం రాయడం మొదలు పెట్టినా, వివిధ రకాల మనుష్యులను, సమాజం స్థితిగతులను అర్దం చేసుకొని కవిత్వం రాయడానికి కండక్టర్‌గా పని చేసిన అనుభవం ఉపయోగపడింది.
కుటుంబ నేపథ్యం
[మార్చు]వనపర్తి జిల్లా,అమరచింత మండలంలోని నాగల్ కడుమూర్ వీరి స్వగ్రామం. తల్లి వడ్లమోనమ్మ, తండ్రి వెంకట్ రాములు. తండ్రి వడ్రంగం పని చేసేవారు. సత్యం భార్య మంజుల. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి సాయి వసంత్, చిన్నబ్బాయి సాయి సుమంత్.
చదువు
[మార్చు]ఏడో తరగతి వరకు సొంతూరు నాగల్ కడుమూర్ లో.. ఉన్నత పాఠశాల విద్య వనపర్తి జిల్లాలోని ఆత్మకూరులోను,ఇంటర్ మహబూబ్ నగర్, డిగ్రీ(బి.కాం) జడ్చర్ల, ఎం.ఏ.,(తెలుగు) ఉస్మానియా (దూరవిద్య),బి.ఎడ్.,షాద్‌నగర్‌లో పూర్తి చేశారు. యుజీసి నెట్, టిఎస్ సెట్ ఉత్తీర్ణులు.
వృత్తిజీవితం
[మార్చు]వెన్నెల సత్యం 1998 నుండి 2009 వరకు ఆర్టీసి కండక్టర్‌గా షాద్‌నగర్ డిపోలో పనిచేశారు. 2009 నుండి 2012 వరకు భాషాపండితుడు(తెలుగు)గా బూర్గుల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పనిచేశారు. 2013 జనవరి- 2013 జూన్ వరకు జడ్పీహెచ్చెస్ బొంరాస్ పేట్ లో... 2013 జూన్ నుండి 2016 జూన్ వరకు తెలంగాణ మోడల్ స్కూల్, పాలమాకుల లో పిజిటి గా...2016 నుండి 2021 జనవరి వరకు పాఠశాల సహాయకులు(తెలుగు)గా బొంరాస్ పేట్ మండలం చౌదర్ పల్లి ఉన్నతపాఠశాలలో, ప్రస్తుతం వికారాబాద్ జిల్లాపూడూర్ మండలంలోని పూడూర్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు.
రచనలు
[మార్చు]- నానీల వెన్నెల ( మే-2017)[1][2]
- ప్రేమ నానీలు ( అక్టోబర్ - 2017)[3][4]
- వెన్నెలమ్మ శతకం ( మే - 2018)[5]
- వెన్నెల మణిపూసలు ( డిసెంబర్ - 2018)[6]
- బతుకు చెట్టు (వచన కవిత్వం, నవంబర్-2019)[7]
- వెన్నెల తొడిగిన రెక్కలు (డిసెంబర్-2019)
- పుప్పొడి ( 2019- సహ సంపాదకత్వం - సర్ఫరాజ్ అన్వర్ ; వి.జయ ప్రకాశ్ లతో కలసి)
- గడ్డిపూలు ( 2020 సంపాదకత్వం - బడి పిల్లల కవితా సంకలన)
- అమ్మ నానీలు (2020)
- వాసంతిక గజల్ సంపుటి (2021)
- నాన్న నానీలు ( 2022)
- స్వప్నవీణ (2023)
- గుల్‌మొహర్( గుల్జార్ హిందీ కవితల అనువాదం) అముద్రితం
నానీల వెన్నెల
[మార్చు]కవిత్వం పరంగా అభివ్యక్తిలో బలమైన భావుకత గల సత్యం తొలిసారిగా నానీలతో సాహిత్య లోకానికి పరిచయం అయ్యారు. వీరి తొలి రచన నానీల వెన్నెల. ఇందులో 500 నానీలు ఉన్నాయి. దీనిలో మనిషి పై, వృత్తులపై, మనసుపై, ప్రేమపై, ఆరోగ్యంపై, పల్లెపై, బాల్యంపై ఇలా అనేకానేక అంశాలపై నానీలు ఉన్నాయి. అవి వేటికవే విభిన్నమైనవి. నానీల వెన్నెల లోని కొన్ని నానీలు...
గడియారానికి
గర్వమెక్కువ
తన చుట్టూ లోకం
తిరుగుతోందని
మీ ఇంట్లో
ఆత్మీయతలు ఎక్కువా
అయితే
టీవి లేదన్న మాట
మేము చేస్తే ఏదైనా
ఉద్యమమైతది
ఇంకెవరు చేసినా
ద్రోహమైతది
ఒక చేతిలో కత్తి
మరో చేతిలో యాసిడ్
వీడండి
నేటి ప్రేమికుడు
అతడు
చెయ్యి తిరిగిన వడ్రంగి
అతనింట్లోనూ
ప్లాస్టిక్ కుర్చీలే!
ప్రేమ నానీలు
[మార్చు]ప్రేమను వస్తువుగా తీసుకుని ఈ పుస్తకంలోని నానీలను రాశారు సత్యం. ప్రేమంటే స్వర్గం కాదు అది నరకంలో కూడా బతకనివ్వాలి అంటారు సత్యం. దీనిలో ఎక్కువ భాగం తన శ్రీమతిపై ప్రేమను తెలియజేస్తూ రాసిన నానీలు ఉన్నాయి. ప్రేమలో ఆకర్షణ వికర్షణ సుఖదుఃఖాల ప్రస్తావనలు వీరి నానీలలో కనిపిస్తాయి. ఈ పుస్తకంలోని కొన్ని నానీలు
మనసున మనసైన
శ్రీమతి ఉన్నోడి కన్నా
లోకంలో
శ్రీమంతుడెవరు!
నువ్వు దగ్గరుంటే
నే కవిత్వాన్నవుతా
దూరమైతే
కన్నీటి కావ్యమౌతా!
నీ కోసం
ఎక్కడెక్కడో వేతికాను
చివరికి
నాలోనే దొరికావు!
నీ గురించి
కావ్యం రాయాలనుకుంటా
నువ్వేమో
నానీలో ఒదిగిపోతావు
వెన్నెలమ్మ శతకం
[మార్చు]వచన కవిగా పేరొందిన ఈ కవి ఒక శతకం రాయడం ప్రత్యేకతే. నేటి కాలపు విద్యార్దులకు స్వచ్ఛమైన వ్యవహరిక భాషలో సత్యం ఈ శతకం రాశారు. దీనిలోని 100 పద్యాలలో దాదాపు 50-55 పద్యాలు చెట్టు గురించే ఉన్నాయి. కవికి చెట్టు మీద ఉన్న ప్రేమ, పర్యావరణం పట్ల బాధ్యత ఈ శతకంలోని పద్యాలు తెలియజేస్తున్నాయి. కొన్ని పద్యాలు...
నీడలోకి బిలిచి ఆడుకొమ్మని చెప్పి
అలసటంత దీర్చు అమ్మవోలె
అనునయమ్ము జూపు ఆ చెట్టు నాన్నోలే
వెన్నెలమ్మ మాట వెలుగు బాట
కోట్ల సంఖ్యలోన కోరి మొక్కలు నాటి
రక్ష జేయకున్న రాళ్ళ పాలు
బాట వెంట చెట్లు బతుకుకే దీపాలు
వెన్నెలమ్మ మాట వెలుగు బాట
వెన్నెల మణిపూసలు
[మార్చు]మణిపూసలు అతి తక్కువ కాలంలో మంచి ఆదరణ తో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రక్రియ ఇది. దీనిని వడిచర్ల సత్యం రూపొందించారు. మణిపూసలు లో నాలుగు పాదాలు ఉంటాయి. 1-2-4 పాదాలలో అంత్య ప్రాస వుండాలి. మణిపూసలు ప్రక్రియలో వెలువడిన రెండవ రచన వెన్నెల మణిపూసలు. దీనిలో శీర్షికల పరంగా 22 మణిపూసలు కలవు. దీనిలో ఎన్నికలు, రాజకీయాలు, కేరళ వరద, తెలుగు భాష, రైతు వంటి అంశాలపై మణిపూసలు ఉన్నాయి. దీనిలో జీవితం పైన రాసిన మణిపూసలు చూస్తే..... ఒంటరివే ప్రతి రేయి/తోడు రాదు ఏ చేయి/నిరాశను వదిలిపెట్టి/ముందుకే కదలవోయి వంటి మణిపూసలు చూస్తే గురజాడ గారి ముత్యాల సరాలను గుర్తుకు తెస్తుంది. మణిపూసల పాదాలు/ఎదను నింపెను మోదాలు/సాహిత్య లోకంలో/దొరికెను ఆమోదాలుఇలా సత్యం మణిపూసలకు తన ద్వారా కవులపక్షాన అంగీకారం తేలిపారు. సహజంగా చాలా ప్రక్రియలలో ముక్తకాలు ఎక్కువ . ఉదాహరణకు నానీలు, రెక్కలు, హైకూలు. కానీ వీరి మణిపూసలు శీర్షిక పరంగా వుండడం విశేషం. మైత్రి ని గురించి వీరు రాసిన మణిపూసలు చూస్తే.. స్నేహం ఓ తపస్సు/తొలగించును తమస్సు/ఎడారంటి జీవితాన/స్నేహమే ఒయాసిస్సు!ఇక్కడ నిజమైన స్నేహం దొరకడం కష్టం అంటారు కవి. స్నేహం అంటే చీకటి ని తొలగించేలా వుండాలి అంటారు. కానీ నేటి కాలం లో అలాంటి స్నేహాలు ఎండమావి లాంటిదే అని కవి భావన. ఈ మణిపూసలలో వ్యంగరూపంలో సాగిన మణిపూసలు 'భజన' శీర్షికన ఉన్నాయి. ఎలినోరి భజన చేసి/పాలకులకు పూజ చేసి/కవితలెన్నొ రాసేస్తాం/సిగ్గు యెగ్గు వదలివేసి ,అన్నిటికీ ఆహాయని/అంతటా ఓహోయనిఅలుపెరుగక పొగిడెదము/పాలకులను సాహోయని నేటి పాలకులు ఏది చేసినా వారిపై స్వార్థప్రేమ ఒలకబోసే భజన కవులను తమ మణిపూసలలో నిరసిస్తాడు సత్యం. వెన్నెల మణిపూసలలో ఎక్కువ రాజకీయాల పైనే సాగినవి. ఇందులో పెట్రోల్ భాధలు, స్వాతంత్య్రం, భజన, ఓట్ల నా డు, నేతలు, ఎన్ని'కల'లో ఇవన్నీ నాయకులపై వ్యంగ్యంగా విమర్శనాత్మకంగా సాగినవే. మరికొన్ని మణిపూసలు...
పెట్రోల్ ధరలు
పెరుగుతున్న ఈ ధరలు
ఆపలేరు మన దొరలు
కంపెనీల ముసుగు వేసి
కప్పుతారు మాయపొరలు
ఓటు కోసం
రంగు రంగు జెండాలు
రహస్యపు ఎజెండాలు
ఎన్నికలయ్యే దాక
వొంగి వొంగి దండాలు
కపిలవాయి
పాలమూరు కపిలవాయి
పరిశోధనకతడు వాయి
కన్నీళ్లును పెట్టించెను
స్వర్గానికి చేరిపోయి
బతుకు చెట్టు
[మార్చు]సత్యం రాసిన వచన కవితా సంపుటి బతుకుచెట్టు[8] మనిషి బతకడం కోసం వృత్తులను నమ్ముకున్న విధానాన్ని కవి ఈ పుస్తకంలో తెలియజేశాడు. వెన్నెల సత్యం కవిత్వంలో అక్కడక్కడ హేతువాద ధోరణి ; దైవ తిరస్కారణ ; సంప్రదాయ నిరసన ఎక్కువగా కనిపిస్తుంది. బతుకుచెట్టులో తొలి కవిత ఈ పుస్తక శీర్షిక. దీనిలో శ్రమైక జీవన సౌందర్యాన్ని చెబుతారు....
కార్మికుడి కష్టాల్ని బాధల్ని
దాచుకున్నందుకేమో
దాని దేహానికి అన్ని గరుకు గాట్లు
ఎడారి పరిస్థితులను తట్టుకుంటూ
ఎదిగే ఈతచెట్టు మనిషికి
బతుకు పాఠాలెన్నో నేర్పుతుంది.
అంటూ ఈత చెట్టును గురించి చెబుతూ ఆ చెట్టే కార్మికుడికి బతుకుచెట్టయి నిలబెడుతుంది అంటారు. ఇలా బతుకు చెట్టుతో మొదలైన ఈ సంపుటి సకల వృత్తులను గుర్తుకు చేస్తుంది.
బతుకుచెట్టు లోని మరికొన్ని కవితా పంక్తులు...
అమ్మ రొట్టెలు కొడుతున్నప్పుడు
జాకీర్ హుస్సేన్ సంగీతాన్ని తలదన్నే
ఆ శబ్దాల్ని వింటూ
తాను కాలుతున్న సంగతే మరచిపోయేది!
(నల్లని చందమామ)
కొత్త బండ్ల విడి భాగాలన్నీ
మా వాకిట్ల పడి ఉన్నప్పుడు
అదొక దారు శిల్పశాలలా తోచేది!
(ఏడ్ల బండి)
నా అస్తిత్వం గుర్తించని
గుడ్డి లోకం కోసం
నా కడుపు మలినం చేసుకోను
పురిటి నొప్పులు పంటి బిగువున
భరించడం మానుకుంటా!
(గర్భశోకం)
వెన్నెల తొడిగిన రెక్కలు
[మార్చు]పుప్పొడి
[మార్చు]అవార్డులు
[మార్చు]వీరి కవితలకు అనేక సంస్థలు పురస్కారాలను, బహుమతులను ప్రకటించాయి. వాటిలో కొన్ని...
- నల్ల చందమామకవిత కు (2018) - మల్లెతీగ ఆత్మీయ పురస్కారం
- గర్భశోకం కవితకు (2019) - అరసం ప్రోత్సహక బహుమానం
- ఎడ్లబండి కవితకు ఎక్స్ రే ఉత్తమ కవితా పురస్కారం[9]
- గ్రంథాలయం కవిత కు రంజని కుందుర్తి పురస్కారం[10]
- సంచిక వెబ్ పత్రిక కవితల పోటీలో ద్వితీయ, తృతీయ బహుమతులు.
- కలానికి ఏమైంది కవితకు బాలనాగయ్య పురస్కారం[11]
- మహాకవి సినారె కళాపీఠం వారి # సినారె సాహిత్య పురస్కారం-2022
చిత్రమాల
[మార్చు]-
అమ్మనానీలు ఆవిష్కరణ
మూలాలు
[మార్చు]- ↑ "కినిగెలో వెన్నెల సత్యం పుస్తకాలు". Archived from the original on 2021-12-08. Retrieved 2021-06-17.
- ↑ నానీల వెన్నెల-వెన్నెల సత్యం, వెన్నెల ప్రచురణలు, షాద్‌నగర్,మే,2017
- ↑ "కినిగెలో వెన్నెల సత్యం పుస్తకాలు". Archived from the original on 2021-12-08. Retrieved 2021-06-17.
- ↑ ప్రేమ నానీలు -వెన్నెల సత్యం, వెన్నెల ప్రచురణలు, షాద్‌నగర్, అక్టోబర్ - 2017
- ↑ వెన్నెలమ్మ శతకం-వెన్నెల సత్యం, వెన్నెల ప్రచురణలు, షాద్‌నగర్,మే,2018
- ↑ వెన్నెల మణిపూసలు -వెన్నెల సత్యం, వెన్నెల ప్రచురణలు, షాద్‌నగర్,డిసెంబర్ - 2018
- ↑ బతుకు చెట్టు-వెన్నెల సత్యం, వెన్నెల ప్రచురణలు, షాద్‌నగర్,నవంబర్-2019
- ↑ Dailyhuntలో_జీవితసత్యాల_బతుకుచెట్టు
- ↑ కళలు -2018 ఎక్స్‌రే విజేతలు[permanent dead link]
- ↑ ది హాంస్ ఇండియా - సత్యంకు రంజని కుందుర్తి పురస్కారం
- ↑ ది హాంస్ ఇండియా-సత్యంకు బాలనాగయ్య పురస్కారం