సంసారం ఒక చదరంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంసారం ఒక చదరంగం
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.పి.ముత్తురామన్
కథ విసు
చిత్రానువాదం విసు
తారాగణం శరత్ బాబు,
సుహాసిని,
షావుకారు జానకి,
గొల్లపూడి మారుతీరావు,
అన్నపూర్ణ,
రాజేంద్ర ప్రసాద్,
ముచ్చెర్ల అరుణ
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు గణేష్ పాత్రో
నిర్మాణ సంస్థ ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

సంసారం ఒక చదరంగం ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్ పతాకంపై యం.శరవణన్, యం. బాలకృష్ణన్ నిర్మాతలుగా ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వంలో గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ, శరత్ బాబు, సుహాసిని, షావుకారు జానకి, రాజేంద్ర ప్రసాద్, ముచ్చర్ల అరుణ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన 1987 నాటి తెలుగు చలన చిత్రం. ఈ సినిమాకి కథ, చిత్రానువాదం విసు, మాటలు గణేష్ పాత్రో రాయగా, పాటలు వేటూరి సుందరరామమూర్తి, సంగీతం కె.చక్రవర్తి అందించారు.
విశాఖపట్టణానికి చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అప్పల నరసయ్య, గోదావరి కుటంబంలో చెలరేగిన కలతలు, సమస్యలు ఎలా పరిష్కరించుకున్నారన్నది చిత్ర కథాంశం. సినిమా ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయాన్ని సాధించింది. ప్రత్యేకించి సినిమాలోని పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంసారం ఒక చదరంగంలో చిలకమ్మ పాత్రలో కనబరిచిన నటనకు షావుకారు జానకి ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం అందుకున్నది.

విశాఖపట్టణ స్టీల్ ప్లాంటులో పదవీ విరమణకు వయసు చేరువైన గుమస్తా అప్పల నరసయ్య (గొల్లపూడి మారుతీరావు), గోదావరి (అన్నపూర్ణ) దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కొడుకు ప్రకాష్ (శరత్ బాబు) ఇండియన్ ఆయిల్ కంపెనీలో అకౌంటెంట్, అతని భార్య ఉమ (సుహాసిని), ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న రెండో కొడుకు రాఘవ (రాజేంద్ర ప్రసాద్), చదువు పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్న కూతురు సరోజ (కల్పన), పదోతరగతి పరీక్షల్లో తరచు తప్పుతూండే చిన్న కొడుకు కాళిదాసు తల్లిదండ్రులతో ఒకే ఇంట్లో జీవిస్తూంటారు. వీరివి వేర్వేరు మనస్తత్వాలు, ఆశలు, ఆలోచనలు. ప్రకాష్ ఖర్చు దగ్గర ఖచ్చితంగా ఉండే మనిషి, భార్య ఉమ అందరితో కలుపుగోలుగా ఉంటూంటుంది, సరోజ కొద్దిపాలు అహంకారంతో వ్యవహరిస్తూ అప్పటికే పీటర్ అనే అబ్బాయిని ప్రేమించివుంటుంది, రాఘవ బాధ్యతలు తెలుసుకుని మసులుకుంటూండగా, కాళిదాసు బాధ్యతారాహిత్యంగా తిరుగుతూంటాడు. వీరందరి ఆశలు, ఆకాంక్షలు మధ్య సంసారాన్ని సాగిస్తూంటారు అప్పల నరసయ్య, గోదావరి. మధ్య నలభై ఏళ్ళ నుంచి ఆ ఇంటిలో పనిచేస్తూండే చిలకమ్మ (షావుకారు జానకి) ఇంటిలో మనిషిలాంటిదే.
సరోజను చూడడానికి ఓ పెళ్ళికొడుకు తండ్రి, అతని చెల్లెలు వసంత (ముచ్చెర్ల అరుణ) పెళ్ళిచూపులకు వస్తారు. ఐతే తనకి ఈ పెళ్ళి ఇష్టం లేదని, తన ఆఫీసులోనే పనిచేసే పీటర్ ని ప్రేమించుకుంటున్నానని చెప్పడంతో పెళ్ళివాళ్లు వెళ్లిపోతారు. కూతురు ప్రవర్తనకు క్షమాపణలు కోరిన అప్పల నరసయ్య ఆ పెళ్ళివాళ్ళ కూతురు వసంతను తన రెండో కొడుకు రాఘవకు సంబంధం కుదుర్చుకుంటాడు. పీటర్-సరోజల పెళ్ళి, ఆపైన రాఘవ-వసంతల పెళ్ళీ జరుగుతాయి. ఉమ గర్భవతి అయి పుట్టింటికి వెళ్తుంది. ఐతే కొత్తగా పెళ్ళి అయిన సరోజ భర్తతో గొడవపడి పుట్టింటికి వస్తుంది, ఇక్కడ రాఘవతో మనస్పర్థలు రావడంతో వసంత కూడా పుట్టింటికి వెళ్ళిపోతుంది. అయితే రాఘవ తల్లిదండ్రుల మాట విని, భార్య పుట్టింటికి వెళ్ళి ఆమెని తీసుకువస్తాడు. తన భర్త పీటర్ కూడా అలానే వచ్చి తీసుకువెళ్తాడని ఆశించి పుట్టింట ఉంటుంది సరోజ. మరోవైపు కాళిదాసు మరోమారు పరీక్ష తప్పుతాడు. కాళిదాసును పాస్ చేయించే బాధ్యత స్వీకరించి, కొత్తగా పెళ్ళైనా సరదాలు త్యాగం చేసి చదివిస్తూంటాడు రాఘవ.
ఇంటి ఖర్చు విషయంలో అప్పల నరసయ్యకి, ప్రకాష్ కి మాటపట్టింపు వచ్చి ప్రకాష్ ని అప్పల నరసయ్య ఇంట్లోంచి బయటకు వెళ్ళమనడం, తాను చెల్లెలి పెళ్ళికి సాయంచేసిన డబ్బు తిరిగి ఇచ్చేస్తే వెళ్ళిపోతానని ప్రకాష్ అనడం, వీటన్నిటి ఫలితంగా ఇంటి మధ్యలో ఓ లక్ష్మణరేఖలాంటి గీత గీసి ఇటువారు అటు అటువారు ఇటు రాకూడదనేదాకా వెళ్తుంది. పురుడు పోసుకుని బిడ్డనెత్తుకుని ఉమ ఇంటికి తిరిగివచ్చేసరికి అప్పటికే జరిగిన వివాదంలో ప్రకాష్, అతని కుటుంబంతో తమ కుటుంబంలోని వారు మాటకూడా కలపకూడదని అప్పల నరసయ్య శాసించి ఉంటాడు. ఉమ ఒక్కో సమస్యపై దృష్టిపెట్టి ముందుగా సరోజ మామ ఎడ్వర్డ్ శామ్యూల్ (నూతన్ ప్రసాద్), చిలకమ్మలతో కలిసి నాటకం ఆడి సరోజ సమస్యని పరిష్కరిస్తుంది. కాళిదాసు చదువు కారణంగా రాఘవ వసంత దంపతుల మధ్య దూరం పెరుగుతోందని గమనించి వారిద్దరికీ ఏకాంతం ఏర్పడేలా చేస్తుంది. అనుకోని విధంగా వసంతకు మసూచి రావడంతో రాఘవ చేసిన సేవల కారణంగా అనుబంధం బలపడుతుంది. రాఘవ కృషి, కాళిదాసుకు ఏర్పడ్డ పట్టుదల ఫలితంగా అతను పదో తరగతి పాస్ అవుతాడు.
ఉమ ప్రయత్నాలు ఫలించి తండ్రీ కొడుకుల మధ్య ఏర్పడిన వైషమ్యాలు తొలగిపోయి కలుస్తారు. కానీ అప్పుడు మాత్రం మళ్ళీ కలిసి ఉమ్మడి కుటుంబంలో కాపురం చేసేందుకు ఉమ ఒప్పుకోదు. నిత్యం కలిసివుండీ విడిపోయే కన్నా, విడివిడిగా ఉంటూ వారానికి ఒకసారి కలుద్దాం అని ప్రతిపాదించి వేరు కాపురానికి వెళ్లడంతో సినిమా ముగుస్తుంది.

నటీనటులు

[మార్చు]

ప్రధాన పాత్రధారులు పాత్రలు

సాంకేతిక వర్గం

[మార్చు]

సినిమా సాంకేతిక వర్గం ఇది:[1]

స్పందన, పురస్కారాలు

[మార్చు]

సినిమా మంచి విజయం సాధించింది. ప్రత్యేకించి సినిమాలోని పాత్రలు, సంభాషణలు, సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.[2] చిలకమ్మ పాత్రలో షావుకారు జానకి నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు పొందింది.[3]

సంగీతం

[మార్చు]

సంసారం ఒక చదరంగం సినిమాకి చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించగా నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల చేశారు. పాటలన్నిటినీ వేటూరి సుందరరామమూర్తి రాశారు. ప్రముఖమైన పాటలు ఇవి:

  • సంసారం ఒక చదరంగం - గానం. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • జానకి రాముల కళ్యాణానికి - గానం. పి.సుశీల
  • జగమే మాయ - గానం. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • లాలి జో జో, గానం: పి సుశీల
  • సిరికి సీమంతమంట , గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల .
  • కాలిలో ముల్లుకి కంట , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • కౌగిలే కాపురం , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. ', శ్రీనివాస్ (5 November 1986). "చిలకమ్మ ఓ వెరైటీ". చిత్ర రంజని: 6. {{cite journal}}: |last1= has numeric name (help)
  2. ', మురళి. "సంసారం ఒక చదరంగం". నెమలికన్ను. మురళి. Archived from the original on 8 జూన్ 2017. Retrieved 4 June 2017. {{cite web}}: |last1= has numeric name (help)
  3. 1986 నంది అవార్డుల విజేతల జాబితా - awards and winners website