ఇబ్రహీం అల్కాజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇబ్రహీం అల్కాజీ
జననం(1925-10-18)1925 అక్టోబరు 18
మరణం2020 ఆగస్టు 4(2020-08-04) (వయసు 94)
జాతీయతభారతీయుడు
వృత్తిభారతీయ నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) మాజీ డైరెక్టర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఆశాడ్ కా ఏక్ దిన్

ఇబ్రహీం అల్కాజీ (అక్టోబరు 18, 1925 - ఆగస్టు 4, 2020)[1][2] భారతీయ నాటకరంగ దర్శకుడు, నట శిక్షకుడు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) మాజీ డైరెక్టర్. అల్కాజీ క్రమశిక్షణ గలవాడు, ఒక నాటకాన్ని రూపొందించే ముందు అనేక పరిశోధనలు చేసేవాడు, దానివల్ల దృశ్య రూపకల్పనలో పురోగతి వచ్చింది. ఈ విధానం ఆ తరువాత అనేక దర్శకులను చాలా ప్రభావవంతం చేసింది.[3] 1962-1977 మధ్యకాలంలో న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా డైరెక్టర్‌గా ఉన్నాడు.[4][5][6] తన భార్య రోషన్ అల్కాజీతో కలిసి ఢిల్లీలో ఆర్ట్ హెరిటేజ్ గ్యాలరీని స్థాపించాడు.[7]

తన జీవితకాలంలో యాభైకి పైగా నాటకాలను ప్రదర్శించిన అల్కాజీ ప్రోసెనియం (ఆడిటోరియం), బహిరంగ (ఓపెన్ థియేటర్) వేదికలను ఉపయోగించాడు. రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా) లో శిక్షణ పొంది, 1950లో బిబిసి బ్రాడ్కాస్టింగ్ అవార్డును గెలుచుకున్నాడు. ఇబ్రహీం 50కి పైగా నాటకాలకు దర్శకత్వం వహించాడు, వీటిలో గిరీష్ కర్నాడ్ రాసిన తుగ్లక్, మోహన్ రాకేశ్ రాసిన ఆశాడ్ కా ఏక్ దిన్, ధరంవీర్ భారతి రాసిన ఆంధాయుగ్, అనేక షేక్స్పియర్, గ్రీక్ నాటకాలు ఉన్నాయి.[4] తొలిదశలో వేసిన నాటకాలు అనేక పాశ్చాత్య దేశాలకు చెందినవి, ఆంగ్లభాషలో ప్రదర్శించబడ్డాయి. అయినప్పటికీ, అల్కాజీ వాటిని ఇక్కడి ప్రేక్షకుల కోసం భారతీయ నేపథ్యాలను ఆయా నాటకాల్లో చొప్పించాడు.[3]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

అల్కాజీ మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు. అల్కాజీ తండ్రి భారతదేశంలోని ఒక సంపన్న సౌదీ అరేబియా వ్యాపారవేత్తకాగా, తల్లి కువైట్ దేశానికి చెందినది.[8] తొమ్మిది మంది తోబుట్టువులలో అల్కాజీ ఒకడు. 1947లో అతని కుటుంబంలోని మిగిలిన వారు పాకిస్తాన్‌కు వలస వెళ్ళగా, అల్కాజీ భారతదేశంలోనే ఉన్నాడు.[9] పూణేలోని సెయింట్ విన్సెంట్ హైస్కూల్లో తరువాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో అరబిక్, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతి భాషల్లో విద్యాభ్యాసం చేశాడు. అతను సెయింట్ జేవియర్స్ కాలేజీలో విద్యార్థిగా ఉన్నప్పుడు, అతను సుల్తాన్ "బాబీ" పదమ్సీ ఇంగ్లీష్ థియేటర్ సంస్థలో చేరాడు. ఆ తరువాత అతను 1947లో లండన్ లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా) లో శిక్షణ పొందాడు.[7] ఇంగ్లీష్ డ్రామా లీగ్, బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ లచే సత్కరించబడిన తరువాత అక్కడ అవకాశాలు లభించాయి. అయినప్పటికీ, అతను భారతదేశానికి తిరిగి రావడంకోసం ఆ ఆఫర్లను తిరస్కరించాడు. భారతదేశం వచ్చాక 1950 నుండి 1954 వరకు థియేటర్ గ్రూపులో చేరాడు.[3]

వృత్తి జీవితం[మార్చు]

తన కెరీర్ ప్రారంభంలో ఇబ్రహీం బాంబే ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూపుతో కలిసి పనిచేశాడు. ఇందులో ఉన్న ఎం.ఎఫ్. హుసేన్, ఎఫ్.ఎన్. సౌజా, ఎస్.హెచ్. రాజా, అక్బర్ పదామ్సీ, టైబ్ మెహతా వంటి చిత్రకారులు తరువాతికాలంలో ఇబ్రహీం నాటకాలకోసం సెట్లను రూపొందించారు.[7] దర్శకత్వంతోపాటు, భారతదేశంలో జరుగుతున్న నాటకరంగ కార్యక్రమాలను ప్రచురించడం కోసం 1953లో థియేటర్ యూనిట్ బులెటిన్‌ను (మాస పత్రిక) స్థాపించాడు. తరువాత, స్కూల్ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ ను స్థాపించాడు, బొంబాయి నాట్య అకాడమీకి ప్రిన్సిపాల్ గా నియమించబడ్డాడు.[3]

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా డైరెక్టర్ గా అల్కాజీ చేసిన కృషి ఫలితంగా హిందీ థియేటర్ లో విప్లవాత్మకంగా మార్పులు వచ్చాయి. ఇందులో విజయ మెహతా, ఓం శివపురి, హర్పాల్ తివాన, నీనా తివాన, ఓం పురి,(బలరాజ్ పండిట్), నసీరుద్దీన్ షా, మనోహర్ సింగ్, ఉత్తరా బాకర్, జ్యోతి సుభాష్, సుహాస్ జోషి, బి. జయశ్రీ, జయదేవ్, రోహిణీ హట్టంగడితో సహా పలు చలనచిత్ర, నాటక నటులు దర్శకులకు శిక్షణ ఇచ్చాడు.[10] అక్కడ 1964లో రిపర్టరీ కంపెనీని స్థాపించి, అతను వెళ్ళే వరకు వారి ప్రదర్శనలకు దర్శకత్వం వహించాడు. తన భార్య రోషన్ అల్కాజీతో కలిసి ఢిల్లీలో ఆర్ట్ హెరిటేజ్ గ్యాలరీని స్థాపించాడు.

అవార్డులు - గుర్తింపులు[మార్చు]

ఆల్కాజీ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాడు. నాటకరంగ శిక్షణపై అవగాహన కలిగించాడు. భారతీయ సంప్రదాయంతో ఆధునిక వ్యక్తీకరణను కలిపాడు.[3]

నాటకరంగంలో జీవితకాల సహకారం అందించినందుకు రూప్‌వేద్ ప్రతిష్టన్ తన్వీర్ అవార్డు (మొదటి గ్రహీత) 2004లో అందుకున్నాడు. 1966లో పద్మ శ్రీ, 1991లో పద్మభూషణ్, 2010లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నాడు.[11]

భారతదేశ అకాడమీ ఫర్ మ్యూజిక్, డాన్స్ అండ్ డ్రామా సంగీత నాటక అకాడమీ ఇతనికి రెండుసార్లు అవార్డు ఇచ్చింది. 1962లో దర్శకత్వ విభాంలో సంగీత నాటక అకాడమీ అవార్డు, తరువాత నాటకరంగంలో కృషికి అకాడమీ అత్యున్నత పురస్కారం సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

తన నాటకాలకు దుస్తులను రూపొందించడంతోపాటు భారతీయ వస్త్రాల చరిత్రపై రెండు పుస్తకాలు రాసిన రోషన్ అల్కాజీని (మ. 2007) వివాహం చేసుకున్నాడు. ఆమె 1977లో ఢిల్లీలోని త్రివేణి కళాసంగం వద్ద ఆర్ట్ హెరిటేజ్ గ్యాలరీని స్థాపించి, 40 సంవత్సరాలు నడిపింది.[12][13] వీరికి ఇద్దరు పిల్లలు. అమల్ అలనా (నాటకరంగ దర్శకురాలు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మాజీ ఛైర్మన్), ఫైజల్ అల్కాజీ (ఢిల్లీలోని నాటకరంగ దర్శకుడు).

మరణం[మార్చు]

గుండెపోటుతో ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇబ్రహీం అల్కాజీ 2020, ఆగస్టు 4న మరణించాడు.[14][15]

మరింత చదవడానికి[మార్చు]

  • ఆనంద లాల్, ది ఆక్స్ఫర్డ్ కంపానియన్ టు ఇండియన్ థియేటర్ , ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ (2004), ISBN 0-19-564446-8
  • ది ఆల్కాజార్ ఆఫ్ విజువల్ మెమరీ
  • "థియేటర్ ఈజ్ రివిలేషన్ (ఇంటర్వ్యూ)". ది హిందూ. 24 February 2008. Archived from the original on 2 మార్చి 2008. Retrieved 5 ఆగస్టు 2020.

మూలాలు[మార్చు]

  1. Rashtriya Sahara – Band 2, Ausgabe 2, 1991, p. 154
  2. Indian Express
  3. 3.0 3.1 3.2 3.3 3.4 Leiter, p.32 - 33
  4. 4.0 4.1 Meyer, p. 9
  5. Banham, p. 18
  6. Rubin, p. 158
  7. 7.0 7.1 7.2 "Theatre is revelation (Interview)". The Hindu. 24 February 2008. Archived from the original on 2 మార్చి 2008. Retrieved 5 August 2020.
  8. Karnad, Girish (26 December 2005). "Ebrahim Alkazi: The man who formed the concept of Indian theatre". India Today. Retrieved 5 August 2020. If we were to choose an individual who formed the concept of Indian theatre, it would almost certainly be Ebrahim Alkazi. But the fact that he is the offspring of a Saudi Arabian father and a Kuwaiti mother is one of those ironies with which theatre history bristles.
  9. Kalra, Vandana (15 October 2019). "Theatre doyen Ebrahim Alkazi remembered through an exhibition". Indian Express. Retrieved 5 August 2020. After the Partition, while the rest of his family moved to Pakistan, Alkazi decided to stay back in India.
  10. "Profile: "I Was Recognised For My Genius"". The Outlook. 18 December 1996.
  11. "This Year's Padma Awards announced" (Press release). Ministry of Home Affairs (India). 25 January 2010. Retrieved 5 August 2020.
  12. "Art Galleries in Delhi". Delhi Tourism website. Archived from the original on 2018-12-15. Retrieved 2020-08-05.
  13. "Stage presence : Ebrahim Alkazi". harmony India. Archived from the original on 21 November 2011. Retrieved 5 August 2020.
  14. నమస్తే తెలంగాణ, జాతీయం (5 August 2020). "నాటకరంగ దిగ్గజం ఇబ్రహీం అల్కాజీ కన్నుమూత". ntnews. Archived from the original on 6 August 2020. Retrieved 6 August 2020.
  15. సాక్షి, జాతీయం (5 August 2020). "థియేటర్‌ లెజెండ్‌ ఇబ్రహీం ఇకలేరు". Sakshi. Archived from the original on 6 August 2020. Retrieved 6 August 2020.

ప్రస్తావనలు[మార్చు]

ఇతర లంకెలు[మార్చు]