Jump to content

ఉమర్ ఆలీషా

వికీపీడియా నుండి
ఉమర్‌ అలీషాహ్‌
1911లో ఉమర్ అలీషా
జననం(1885-02-28)1885 ఫిబ్రవరి 28
మరణం1945 జనవరి 23(1945-01-23) (వయసు 59)
నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా
సమాధి స్థలంశ్రీవిశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం (పాత ఆశ్రమం), పిఠాపురం
17°6′25″N 82°15′16″E / 17.10694°N 82.25444°E / 17.10694; 82.25444
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఉమర్ ఆలీ సాహబ్
వృత్తి6వ పీఠాధిపతి, శ్రీవిశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత, కవి, 50కి పైగా పుస్తకాల గ్రంథకర్త
బిరుదుమౌల్వీ, పండిట్, డాక్టర్
అంతకు ముందు వారుమొహియుద్దీన్ బాద్‌షా - I
తరువాతివారుబ్రహ్మర్షి హుసేన్ షా
జీవిత భాగస్వామిఅక్బర్ బీబీ
పిల్లలుబ్రహ్మర్షి హుసేన్ షా
తల్లిదండ్రులుమొహియుద్దీన్ బాద్‌షా - I, చాంద్ బీ
వెబ్‌సైటుwww.sriviswaviznanspiritual.org

ఉమర్ ఆలీ షా (ఆంగ్లం: Dr Umar Alisha) (1885 - 1945) సూఫీ వేదాంత వేత్త, తెలుగు సాహితీ వేత్త, సంఘ సంస్కర్త, గ్రాంధికవాది. కవిరాజు డాక్టర్‌ ఉమర్‌ అలీషా మాతృభాష తెలుగు కాదు. తెలుగులో అద్భుత సాహిత్య సంపదలను సృష్టించి మహాకవిగా అతను ఖ్యాతిగాంచారు. అతను ఆధ్యాత్మిక పీఠాధిపతి అయినప్పటికీ కేవలం ఆధ్యాత్మిక తత్వానికే కట్టుబడకుండా సామాజానికి రుగ్మతల విూద కలాన్ని కొరడాలా ఝళిపించారు. స్వాతంత్ర్య సమరయోధునిగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భారత శాసనసభలో ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. అభ్యుదయ రచయితగా, ప్రగతి నిర్దేశకునిగా, మహోన్నత వక్తగా, మానవతావాద ప్రవక్తగా బహుముఖ ప్రజ్ఞావంతుడిగా ఖ్యాతి గడించారు. అజ్ఞానం, మూఢనమ్మకాలు, మత మౌడ్యం, పేదరికం, బానిసత్వం, అవిద్య లాంటి సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించేందుకు అనన్యసామాన్యమైన కృషి సాగించి ధన్యులైన తెలుగు గడ్డకు చెందిన కవులు, రచయితలలో ఉమర్‌ అలీషా గారిది ప్రత్యేక స్థానం. బహుముఖ లక్ష్య సాధన కోసం శరపరంపరగా సాహిత్య సంపద సృష్టించి తెలుగు సాహిత్య చరిత్ర పుటలలో ప్రత్యేక స్థానం పొందిన తెలుగు గడ్డకు చెందిన ముస్లిం కవులలో ఆచార్య ఉమర్‌ అలీషా అగ్రగణ్యులు.మౌల్వీ ఉమర్‌ అలీషా పూర్వీకులు శతాబ్దాల క్రితం పర్షియా (ఇరాన్‌) నుండి ఢిల్లీ వచ్చి, అటునుండి హైదరాబాద్ చేరి, చివరకు పిఠాపురంలో స్థిరపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఉమర్‌ అలీషా ఈ పద్యంలో వివరించారు.[1]

... ... ... మహా ప్రభాత
గరిమగాంచిన మా వంశమరయ పార
సీకమును బాసి ఢిల్లీకి చేరి హైద్ర
బాదు నుండి పిఠాపురి వచ్చి నిలచె

జీవిత విశేషాలు

[మార్చు]

ఉమర్‌ అలీషా పూర్వీకులంతా, వేదాంత పండితులుగా, తత్త్వవేత్తలుగా, కవులుగా, గురువులుగా సుప్రసిద్ధులు. గురు-శిష్య సాంప్రదాయ అనురక్తులైన ఉమర్‌ అలీషా పూర్వీకులు, అధ్యాత్మిక జ్ఞాన ప్రచారం కోసం 1472లో "శ్రీ విజ్ఞాన విద్యాథ్యాత్మిక పీఠం" స్థాపించారు. ఈ పీఠం ద్వారా ధార్మిక విజ్ఞాన ప్రచారం గావిస్తూ, అధ్యాత్మిక సేవకు తమ జీవితాలను అంకితం చేసారు. మౌల్వీ మొహిద్దీన్‌ బాద్షాకు అగ్రనందనుడుగా ఉమర్‌ అలీషా 1885 ఫిబ్రవరి 28న, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు. తల్లి పేరు చాంద్‌బీబి. సాహిత్య, సారస్వత, ధార్మిక సేవా కార్యక్రమాలలో తల్లితండ్రులు నిమగ్నమైయున్న ప్రత్యేక వాతావరణం నడుమ జన్మించిన ఉమర్‌ అలీషా, పూర్వీకుల శక్తి సామర్థ్యాలను, ప్రజ్ఞాపాటవాలను చిన్ననాటనే సంతరించుకున్నారు. ఎనిమిదవ ఏటనే అశువుగా కవిత్వం చెప్పి పండితులను, గురువులను ఆశ్చర్యచకితులను చేశారు. పిఠాపురంలోని ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసిన తరువాత ప్రముఖ సంస్కృతాంధ్ర భాషా పండితుల వద్ద అతను శిష్యరికం చేసారు. తండ్రి వెంట ఉంటూ అరబ్బీ, పర్షియన్‌, ఉర్దూ భాషలను నేర్చుకున్నారు. చిన్నతనంలో పలు భాషలతో పరిచయం సంపాదించిన ఉమర్‌ అలీషా 14 సంవత్సరాల వయస్సులో చంధోబద్ధంగా చక్కని తెలుగులో పద్యాలు రాయటం, ధారాళంగా కవిత్వం చెప్పటం ప్రారంభించి, తమ వంశ గురువైన శ్రీ అఖైలలీషాను స్తుతిస్తూ, బ్రహ్మవిద్యా విలాసం అను శతకాన్ని రచించారు. నూనూగు మీసాల ప్రాయంలోనే అతను ప్రజల చేత కవిగారు అని పిలిపించుకున్నారు. చిన్నతనంలోనే మంచి విద్వత్తును సాధించిన అతను పద్యాలను ధారాళంగా అల్లగల నేర్పు సునాయాసంగా అబ్బటంతో 18వ ఏటనే నాటకాలు రాయటం ఆరంభించాడు. 1905 ప్రాంతంలో గద్య, పద్యాత్మకమైన మణిమాల నాటకాన్ని రాసారు. ఈ నాటకానికి ముందుగానే అతను మరో రెండు నాటకాలను రాసారు. ఈ నాటక రచనతో అతను పాండితీ ప్రతిభ నలుదిశలా వ్యాపించింది. ప్రముఖ ఆంగ్ల రచయిత షేక్స్‌స్పియర్‌ నాటకాల స్థాయిలో మణిమాల నాటకం సాగిందని ఆనాడు పండిత ప్రముఖులు అభినందించగా, పత్రికలు బహుదా ప్రశంసించాయట.

ఉమర్‌ అలీషా విద్యాభ్యాసం ఉన్నత పాఠశాలతో ముగిసింది. డిగ్రీల చదువు విూద అతను దృష్టి సారించలేదు. ఆనాటి పండితులు సృజియించిన అపార సాహిత్య సంపద అతనుకు ఉపాధ్యాయ వర్గమైంది. తండ్రి అతను మార్గదర్శకులయ్యారు. తాతలు-తండ్రులు సృష్టించిన సాహిత్యం అతనుకు పాఠ్యగ్రంథాలయ్యాయి. ఆ గ్రంథాలు మాత్రమేకాకుండా ప్రపంచ భాషలలోని పలు అధ్యాత్మిక, సాహిత్య గ్రంథాలను అథ్యయనం చేశారు. సాహిత్య ప్రక్రియాల విూద గట్టిపట్టు సంపాదించారు.

పండితుడిగా ప్రసిద్ధి చెందిన ఉమర్‌ అలీషా సరే అంటే చాలు తమ సంస్థానాలలో ఉన్నత ఉద్యోగాలను కల్పించగలమని పలుప్రాంతాల సంస్థానాల నుండి ఆహ్వానాలు వచ్చినా అతను కాదన్నారు. ధనార్జన విూద ఏమాత్రం ఆసక్తిలేని ఉమర్‌ అలీషా తన గడప తొక్కిన ఆహ్వానాలను తిరస్కరించారు. భాషా సేవ, సారస్వత సేవ, వేదాంత సేవలో గడపాలని, సమాజ సేవ చేయాలని అతను నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ఉపక్రమించిన ఉమర్‌ అలీషా అతికొద్ది కాలంలోనే, అసమాన ప్రతిభను చూపుతూ పలు సాహితీ ప్రక్రియలలో అపూర్వమైన సారస్వత సంపదను సృష్టించారు. ఈ విషయాలను అతను స్వయంగా ఒక పద్యంలో సృష్టీకరించారు.

రచియించినాడ విభ్రాజితదివ్య ప్ర
బంధముల్‌ పది కావ్య బంధములుగ
వ్రాసినాడను కల్పనాసక్త మతిపది
నాటకంబులను కర్నాటఫక్కి
కూర్పినాడను కళాకోవిదుల్‌ కొనియాడ
నవలలు పది నవ నవలల లనగ
తెలిగించినాడ సుద్ధీపితాఖండ పా
రసికావ్యములు పది రసికులలర
రసము పెంపార నవధానక్రమములందు
ఆశువులయందు పాటలయందు కవిత
చెప్పినాడ నుపన్యాస సీమలెక్కి
యవని ఉమ్రాలిషాకవి యనగ నేను.

ఈ విధంగా రచనా వ్యాసంగంలో నిమగ్నమైన ఉమర్‌ అలీషా మొత్తం విూద 50 పుస్తకాలు రాసారు. 1926-28లలో ఉమర్‌ అలీషా తెలుగులోకి అనువదించిన ప్రముఖ పారశీక కవి ఉమర్‌ ఖయ్యాం రుబాయీల అనుశీలన అను అంశం మీద 1980లో నాగార్జున విశ్వవిద్యాలయంలో సిద్దాంత వ్యాసం సమర్పించిన డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా (కడప) అరవై ఎళ్ళల్లో దాదాపు 50 కృతులు...రచించార ని వెల్లడించారు. ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయం ఉంది. డాక్టర్‌ ఉమర్‌ అలీషా మొత్తం 108 గ్రంథాలు రాశారని ఆంధ్ర విశ్వవిద్యాయలం హిందీ విభాగానికి చెందిన ఆచార్య యస్‌.యం ఇక్బాల్‌ ప్రకటించారు. 1970లో డాక్టర్‌ ఉమర్‌ అలీషా విూద పరిశోధనా పత్రం సమర్పించేందుకు, సమాచార సేకరణ జరుపుతున్న సమయంలో, అతను చేతిరాతలో ఉన్న పలు గ్రంథాలను తాను చూచినట్టు 2005 ఆగస్టు 6న వ్యాసకర్తతో ప్రోఫెసర్‌ ఇక్బాల్‌ స్యయంగా చెప్పారు. అతను చాలా గ్రంథాలు రాసారని, కొన్నిటి గురించి మాత్రమే ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయని పిఠాపురం నివాసి ప్రముఖ కవి డాక్టర్‌ అవత్సం సోమసుందర్‌ 2005 ఆగస్టు 9న వ్యాసకర్తతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. వివరించారు. ప్రస్తుతం ఉమర్‌ అలీషా రాసిన మొత్తం పుస్తకాలలో 23 గ్రంథాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఈ విషయంలో మాత్రం ఏ విధమైన భిన్నాభిప్రాయం లేదు. ఉమర్‌ అలీషా ఏ సాహితీ ప్రక్రియలో ఎటువంటి రచన చేసినా, ఆ రచనలతో అటు పండితుల ప్రశంసలతోపాటుగా ఇటు ప్రజల అభిమానాన్ని మెండుగా అందుకున్నారు. అతను అందించిన ప్రతి రచన ద్వారా ఏదోక సామాజిక-ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఆశించి, ఆ లక్ష్యసాధనా దృష్టితో, ఆ దిశగా సాగింది. జాతీయ భావం, సమానత్వం, సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమత సమభావనలతో పాటుగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా, మహిళాభ్యుదయాన్ని, ప్రజా చైతన్యాన్ని కాంక్షిస్తూ అతను రచనలు చేసారు.

సంఘ సంస్కర్తగా...

[మార్చు]

బాల్య వివాహాలు, సతీ సహగమనం, కన్యాశుల్కం, వరకట్నం లాంటి దురాచారాలను తునుమాడాలన్నారు. స్త్రీ విద్యను ప్రోత్సహించారు. స్త్రీ విద్యకోసం, స్త్రీ గౌరవం కోసం స్త్రీలు స్వయంగా పాటుపడాలని తన గ్రంథాలలోని పాత్రల చేత, తన అభిమతాన్ని చాలా బలంగా చెప్పించారు. ప్రధానంగా అతను ప్రతి రచనలో స్త్రీ పక్షపాత వైఖరి కన్పిస్తుంది. సమాజంలో అతను ఆశించిన మార్పులను తన రచనలలోని పాత్రల ద్వారా చాలాబాగా వ్యక్తం చేశారు. అతను రాసిన కళ అను నాటకంలో కుటుంబ జీవితంలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను-నష్టాలను వివరంగా పేర్కొన్నారు. గృహ బాధ్యతలను మోసే ఇల్లాలి కంటే మంచి నెచ్చలి ఎవరుంటారంటూ, భార్యను స్నేహితురాలిగా గౌరవించాలని పురుషులను ఆదేశించారు. ఈశ్వర తత్త్వము నామె హృదయంతరబునన్‌ పరిణితమైన ప్రేమయును పాఠము లోపల చేర్చుకొమ్ము! గురువునేల కొల్పెదవు! అంటారు. భార్య నుండి ప్రేమ తత్వమును, ఈశ్వర తత్త్వమును నేర్చుకో, భార్య కంటే గురువు మరెవ్వరూ లభించరని హితవు పురుషులకు హితవు చెబుతారు. స్త్రీ స్వాతంత్ర్యం గురించి మాట్లాతూ, లింగభేదంతో పని లేకుండా అర్హతలు, యోగ్యతను బట్టి స్వతంత్రం ఇవ్వాలంటారు. సమాజంలోని ప్రతి మహిళ విద్యసభ్యసించాలని వాంఛించారు. ఆనాడు స్త్రీ విద్య మీద విధించబడియన్న ఆంక్షలు అతనులో క్రోధాన్ని పెంచాయి. స్త్రీ విద్యను వ్యతిరేకించేవాళ్ళ విూద అక్షర రూపంలో ఆగ్రహాన్ని వ్యక్తుం చేస్తూ, తరుణీ వివేకమన్‌ జదవ ధర్మము జ్ఞానముతత్వ దీక్షలన్‌-గురువుల చెంగటన్‌ బడయ గోరిన వారల మాన్పువారునూ-సూకరులై పుట్టు చుంద్రు.. అని శపించారు. స్త్రీ విద్య మాన్పించేవారు, అమెను చదువుకోనివ్వనివారు సుకరాలై పుడతారని అత్యంత తీవ్ర పదజాలంతో శపించటం ఆనాడు సాహసమే, అయినా ఉమర్‌అలీషా ఏమాత్రం ననెనుకాడలేదు.

మన వివాహ వ్యవస్థ సంసారిక జీవనంలో పడతులు పడుచున్న బాధల గాథలను గమనించిన అతను అనసూయ అను నాటకంలో ఆ విషయాలను ప్రస్తావించారు. ఈ నాటకంలో దేవతాలోకం నుండి భూలోకం విచ్చేసిన నర్మద అను పాత్ర భూలోకంలో స్త్రీలు పడుతున్న వెతలను వివరిస్తాడు. భర్తకు సేవలు చేయడం ద్వారా మాత్రమే భార్యకు స్వర్గం ప్రాప్తిస్తుందన్న ప్రచారాన్ని ఖండిస్తూ, యీ.. ప్రపంచక మహా మాయా సంపారమున నొక పురుషవ్యక్తికి దాసియో సేవ సలుపకున్న సతికి స్వర్గము లేదట! ఆహా!.., అంటూ మహిళల పరిస్థితికి నర్మద పాత్ర ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. స్త్రీ అబలకాదు సబలని, యాచన ద్వారా వచ్చే స్వర్గం తనకు అక్కరలేదని ప్రకటిస్తూ.... నేను సర్వతంత్ర స్వతంత్రను గానా, నా యంతరాత్మ మహా తపశ్శక్తిచే మార్తాండ మండలమువల తేజో విరాజితమై ప్రదీపించుట లేదా! నేను మహా వీరాధివీరులవలె స్వర్గ ద్వారము బ్రద్దలు చేసికొని వెళ్ళలేనా ? సరే! ఇంక నాకు యాచింపగ వచ్చెడు తుచ్చ స్వర్గము నా కాలి గోరునకైనా వలదు.., అని ఆత్మవిశ్వాసంతో నర్మద చేత ప్రకటింపచేస్తారు. స్త్రీ పురుషుల మద్యన గల అంతరాల పట్ల ఆగ్రహించిన నర్మద మరింత ముందుకు వెళ్లి, .. నా అంతట నేను శుచినై, నాయంతట నేను పరిశుద్ధనై, నాయంతటనేనే స్వర్గము, నా మోక్షము నేనే కట్టుకుని నేనే యానందించెదను...నాకీ యుపాథియక్కరలేదు. నాకీ మృత రూపకమైన స్త్రీత్వమక్కర లేదని విప్లవాత్మక ధోరణిని ప్రదర్శిస్తుంది. భూలోకంలో అయినవాళ్ళు, ఆస్తిపాస్తులు లేకపోతే అటువంటి యువతుల వివాహాలు కావడం గగనమేనంటూ, తల్లిదండ్రులు లేని తమ్ములులేని యనాధనయ్యనాకు నాధుడెట్లు వచ్చు, సొమ్ములియ్య వచ్చిన వారికే పెండ్లిగాని నాకు పెండ్లి యగునే , అంటూ వరకట్న దురాచార పర్యవసానాన్ని ఉమర్‌ అలీషా నర్మద పాత్రచేత చెప్పిస్తారు. దుష్టుడైన పతిదేవుని సేవెంత కష్టమో వివరిస్తూ, ... తపముసేయుట కంటె నుపవాసములకంటె, ..పేదరికము కంటె, బిక్షమెత్తుటకంటె, బండిలాగుటకంటె బానిస పనికంటే, కూలిసేయుట కంటె నాలగాచుటకంటె-గాంతుని సేవ కరినతరము.. అటువంటి భార్యభర్తల సంబంధాన్ని నర్మద ద్వారా అతను వ్యతిరేకిస్తారు. ఆనాడు అత్తింట ఆడపడుచులు పడుతున్న వెతలను గమనించి, అటువంటి అత్తవారింట కాపురం చేయటం పడతులకు ఎంత కష్టమో, నర్మద పాత్ర చేత ఈ విధంగా చెప్పిస్తారు.

ఈ విధంగా 80 సంవత్సరాల క్రితం అప్పటి సమాజ రీతి-రివాజులకు, ఆలోచనలకు వ్యతిరేకంగా స్త్రీజన పక్షం వహిస్తు ఉదాత్త భావాలను ఉమర్‌ అలీషా ప్రకటించటం విశేషం. స్త్రీ జన సముదాయాల కడగండ్లను వివరించి, విమర్శించిన ఉమర్‌ అలీషా అంతటితో ఊరు కోలేదు. అతను రాసిన విచిత్ర బిల్హణీయం నాటకంలో బాల్య వివాహాలను, కన్యాశుల్కం లాంటి దురాచారాలను ఖండిస్తూ, ఆనాటి విపత్కర పరిస్థితుల నుండి స్త్రీలే విముక్తి పొందడానికి తీసుకోవాల్సిన చర్యలకు ఈ నాటకంలోని, యామిని పూర్ణ తిలక, బిల్హణీయుడు అను పాత్రల చేత సూచించారు. కన్యాశుల్కానికి బలైన సత్యవతి అను పాత్ర తన వృత్తాంతాన్ని సహాధ్యాయిని యామిని పూర్ణ తిలకతో చెబుతూ, ..నడువన్‌ బాదములైన లేని మగనిన్‌ నాల్గేండ్ల ప్రాయంబున ముడివైచెన్‌ జనకుండు నకటకటా...ననీ బడుగన్‌ చేరి సుఖించుటెట్లు? ...కాసుల కాసజేసి కనుగానని వృద్ధుని నాకు తండ్రియే చేసెను పెండ్లి, బంధువులు చెప్పరొవద్దని పెండ్లి పెద్దలీ మోసం మెఱుంగరో, జనని పోరదో నా కురివెట్టి గొంతుకన్‌ గోసిరి.. అంటూ ఈ పరిస్థితులలో తాను భూమిలో కలసి పోవటం కంటే, ఈ సమస్యకు పరిష్కారం లేదని సత్యవతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ వృత్తాంతం విన్న యామినీ పూర్ణతిలక, ఈ సమస్యలకు పరిష్కారం స్త్రీలు చైతన్యవంతులు కావటమే మార్గం తప్ప భూమి తల్లి వడిలో చేరటం ఎంత మాత్రం కాదంటుంది. స్త్రీ లోకాన్ని చైతన్య వంతులను చేయాలంటే, స్త్రీలలో అక్షరాస్యత పెంచాలని, ఆ తరువాత లోకజ్ఞానం కోసం గ్రంథాలు, వార్తా పత్రికలు, చదవాలని సూచిస్తుంది. సామాన్య స్త్రీలకు కూడా చదువుకునే అవకాశాలను కల్పించాలని ఆమె ప్రయత్నిస్తుంది. .. మననారీ లోకం బున విద్య యొక్కటి కడు కొఱంతగానున్నది. అందేచేతనే యిన్ని దురాగతములు తటస్థించినవి ... అని ఆమె ప్రకటిస్తుంది. ఈ నాటకంలోని మరో పాత్ర బిల్హణుడు పలు స్త్రీ జనసంక్షేమ కార్యక్రమాలను చేపడతాడు. ... స్త్రీ విద్యలేని దేశమునకు క్షేమము రానేరాడు.. అంటూ ి స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తాడు. స్త్రీ విద్యావ్యాప్తి కోసం మహిళా విద్యాలయాలు, అనాథ శరణాలయాలు ప్రారంభించి మహిళాభ్యుదయానికి కృషి యామిని పూర్ణతిలక, బిల్హణీయుడు చేపడతారు. ఈ దిశగా ఆ స్త్రీ జన బాంధవులు తమ కాలం కంటే చాలా ముందుగా ఆలోచిస్తారు. ఆరాధనాలయాల కంటే బాలికా పాఠశాలలు అవసరమంటారు. సత్రముల కంటే అనాథ శరణాలయాలు కావాలంటారు. వనాలు తటకాల కంటే మహిళలకు సర్వ విద్యలు గరిపె కళాశాలను స్థాపించాలని ఆ పాత్రల ద్వారా ఉమర్‌ అలీషా ఆనాటి సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచిస్తారు.

బాల్య వివాహాల వలన స్త్రీ జాతికి కలుగుతున్న కడగండ్లను వివరిస్తూ, .. కడు దరిద్రతచేత నిడుములు బడయవచ్చు బాలవైధవ్యంబు బడయరాదు - హాలాహలము ద్రావియగ్ని గూలగవచ్చు బాలుధ్యంబు పడయరాదు - దాస్య సజీవనము దగుల మొందగవచ్చు బాల వైధవ్యంబు పడయరాదు... అని అంటారు. అంతే కాదు ..సహగమనమైన గావించి చావవచ్చు బాల వైధవ్య దుఖంబు పడయరాదు..., అని ఈ రుగ్మతను నివారించ కదలి రావల్సిందిగా మాన్యులను అతను ప్రజలను వేడుకుంటారు. ఈ రకంగా సాగే బాల్య వివాహాల వలన చిన్న వయస్సులోనే వైధవ్యం పొందిన బాలికలలో ఆత్మస్థైర్యం కలుగ చేసేందుకు వారిని సమావేశ పర్చి సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలని యామిని పూర్ణ తిలక, బిల్హణుడు పాత్రల ద్వారా నిర్మాణాత్మక ఆలోచనలు చేస్తారు కవి ఉమర్‌ అలీషా. స్త్రీ విద్య, బాల వైధవ్య బాధలు, కుటుంబ సమస్యల వరకు మాత్రమే అతను పరిమితం కాకుండా ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం, అగ్రహారాలను నిచ్చేకంటే పదిమందికి ఉపాధిని కలిగించే యంత్ర కర్మాగారాలను స్థాపించాలని అంటారు. ఈ విషయాన్ని ఉమర్‌ అలీషా ఓ పద్యంలో ఈ విధంగా ప్రస్తావించారు. .. ప్రథిత సత్రంబుల బదులనాథ శరనాలయంబులు నల్పి జాలికొల్పి, మహిని దేవళముల మాఱుగా బాలికా పాఠశాలలు కట్టి వన్నె బెట్టి, వన తటాకం బుల బదులుగా సర్వ కళాళాలలుంచి లీలల రచించి, బహుళాగ్రహరాళి బదులుగా యంత్ర కర్మాగారములు పెంచి ఖ్యాతి గాంచి, నతపురాణ కథావిధానముల బదులుతొంటి నిర్భంవైధవ్య దు:ఖ జలధి సమయజేయనుపన్యాస సభలు దీర్చి యామిని పూర్ణతిలక బిల్హణునియట్లే..., అంటూ నాటకంలోని పాత్రలు చేసిన కృషి వివరిస్తూ, ఆ ప్రయత్నాలను మరొక పాత్ర చేత ప్రశంసింప చేస్తారు. ఈ మేరకు సమాజ అనుమతిని తన గ్రంథాలలో పరోక్షంగా సాధిస్తారు డాక్టర్‌ ఉమర్‌ అలీషా.

మనం నిష్పాక్షికంగా ఆలోచిస్తే, స్త్రీలు పురుషులకంటే యోగ్యులని ఉమర్‌ అలీషా తీర్మానిస్తూ, తనను స్త్రీజన పక్షపాతిగా ఏమాత్రం సంశయం ప్రకటించుకుంటారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, నిష్పాక్షిక బుద్ధితో నూహించినచో పురుషులకన్న స్త్రీలత్యంత యోగ్యులని చెప్పవలెనని తీర్మానిస్తారు. ఈ నాటకంలోని ఒక పాత్ర మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఆ పాత్ర ద్వారా ఆనాడు సమాజంలో మహిళలకు వ్యతిరేకంగా ప్రజలి ఉన్న అహేతుక అభిప్రాయాలను వివరిస్తూ, ఆ వాదనలను ఉమర్‌ అలీషా చాలా బలంగా పూర్వపక్షం చేస్తారు. ఈ నాటకంలో ఒక పాత్ర మహిళలు అవినీతి పరులంటూ, శాస్త్రజ్ఞులు చెప్పారు కదా?..శాస్త్రజ్ఞులు పొరపడ్డారా? అంటూ ప్రశ్నించగా, ఆ ప్రశ్నకు ప్రతిస్పందిస్తూ, మరొక పాత్ర చేత సమాధానంగా, .. సతుల వినీతలంచు దమశాస్త్రము లందుకు లిఖించవరలా సతులకు బుట్టరోసతుల-సంగతి గూడి సుఖింపరో సమున్నతి! తమ సోదరీసుతలు నారులు గారో! ప్రసన్న బుద్ధిలే కితరుల నింద సేయదమకే యదిలజ్జా యటంచెఱంగరో.. అంటూ ఆ అహేతుక అభిప్రాయాల విూద విరుచుకు పడతారు.

ఈ నాటకంలో స్త్రీ విద్యను, మహిళలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను సదా విమర్శించే ఓ పాత్ర ద్వారా, ..ఓహో! ఇదియా! భరత ఖండము నుద్దరించుటకు యనగా మావంటి బ్రహ్మణోత్తములకు నన్నదాన భూదాన కన్యాదానములు సమర్పించి ఆగ్రహారములిచ్చి లెస్సగా బిండివంటలతో భోజనము పెట్టించడమను కున్నాము. అట్లు గాదట! స్త్రీ విద్యట! భరత ఖండబునకు కొరతంట!.. తగినట్లు బుద్ధి చెప్పి గోబ్రాహ్మణ సమారాధనము మోక్షదాయకమని యొప్పించవలయును.. అని చెప్పించి, ఆనాటి ప్రతీపశక్తుల కుయుక్తులను, పరాన్నభుక్కుల కుళ్ళు బుద్ధులను ఉమర్‌ అలీషా బట్ట బయలు చేస్తారు. చదువుకున్న స్త్రీ మగని నెత్తికెక్కి పెత్తనం చేస్తుందని వచ్చిన వాదనలను దృష్టిలో వుంచుకుని, ఒక పాత్ర, విద్యా బుద్ధులు నేర్చిన స్త్రీలు అధిపత్యం కోసం పాకులాడుతారని, పెనిమిటిని గౌరవించరని, మాట వినరని ఆరోపించగా ...విద్యచే వివేకము వచ్చును గావున వివేకవంతు దాధిపత్యమునకు నర్హుడైయ్యే యుండును.. అంటూ ఆ వాదనను అతను పూర్వపక్షం చేస్తారు. కులం కాదు ప్రధానం గుణం ప్రధానమంటూ, బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన ఎవ్వరూ బ్రహ్మగారని, .. బ్రహ్మణుండైన గడజాతి - శ్వపచుడైనా విద్యయున్న మహాబ్రహ్మ... యగునని సాధికారంగా ప్రకటిస్తారు. ఉమర్‌ అలీషా కాలం నాటి సమాజ స్థితి, అభిప్రాయాలు, అభిమతాలతో బేరీజు వేసుకుని, అతను రచనలను పరిశీలిస్తే అతను విప్లవాత్మక దృష్టి విదితమౌతుంది.

సమాజంలో నెలకొనియున్న సామాజిక అంతరాల పట్ల ఉమర్‌ అలీషా తన అభ్యంతరాలను చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. అంటరానితనం, అసృశ్యత, సామాజిక వెలివేతల మీద అతను అక్షరాయుధంతో దండయాత్ర సాగించారు. మానవులలో జన్మతా: ఉచ్ఛనిచాలను నిర్ణయించడాన్ని విమర్శించారు. 1921 మార్చి మాసం 18వ తేదీన ఏలూరులో అదిమాంద్ర అంటుదోష నివారణ సభ జరిగింది. ఆ సభలో ఉమర్‌ అలీషా ప్రసంగిస్తూ, అంటరానితనం నిర్మూలనకు తగు సూచనలు చేశారు. కులాధిపత్యాన్ని విమర్శించారు. ఏకులం వారైనా తమ శక్తి సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా, విద్యా బుద్ధుల ద్వారా అగ్ర స్థానాలను అలంకరించవచ్చని అతను అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఆ విధంగా మేధా సంపత్తిని సంతరించుకోవాలని సూచించారు. ..పందిని, కుక్కను, నక్కను, పిల్లిని గూడా ముట్టుకొను వారలకు మనిషిని ముట్టుకొనుట దోషములోనిది కాదు కావున, యీ యీషద్భేదములను సరకుచేయక వెంటనే దానిని (అంటరానితనం) సంస్కరించుటకు అందరు తోడుపడవలెను.., అని డాక్టర్‌ ఉమర్‌ అలీషా అంటారు.

అధ్యాత్మిక-సాహిత్య రంగాలలో నిమగ్నమైన ఉమర్‌ అలీషా, తన చుట్టూ గిరి గీసుకుని కూర్చోలేదు. సమకాలీన రాజకీయ పరిణామాలకు అతను వ్యక్తిగా, పీఠాధిపతిగా, దేశభక్తునిగా అతను స్పందించారు. డాక్టర్‌ ఉమర్‌ అలీషా విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే పరాయిపాలన సృష్టిస్తున్న ఇక్కట్లను గ్రహించారు. బ్రిటీష్‌ పాలకుల చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు వ్యక్తం చేస్తున్న స్వేచ్ఛా- స్వాతంత్ర్యకాంక్షకు కవిగా స్పందించి తోడ్పాటునందించారు. 1916లో జాతీయ కాంగ్రెస్‌ సభ్యత్వం స్వీకరించారు. ప్రముఖ కవిగా అప్పటికే బహుళ ఖ్యాతి గడించిన ఉమర్‌ అలీషాకు ప్రముఖ జాతీయ నాయకులు శ్రీ బిబిన్‌ చంద్ర, శ్రీ చిత్తరంజన్‌ దాస్‌, శ్రీ అరవింద ఘోష్‌లతో మంచి స్నేహం ఏర్పడింది. ఈ నాయకుల ప్రభావంతో అతను జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మాతృభూమి పట్ల అపారమైన ప్రేమ, అభిమానాలు గల అతను మాతృదేశ ఘనతను తన చంద్రగుప్త నాటకంలో అలెగ్జాండర్‌ పాత్రచే ఈ విధంగా ప్రస్తుతింపచేశారు.

ఏ మహారాజ్ఞికి హిమవన్నగంబులు
కులగిరుల్‌ పెట్టని కోటలొక్కొ
ఏ లతాతన్వికి హిందు గంగానదుల్‌
దరిలేని మంచి ముత్యాల సరులొ
ఏ సరఓజాస్యకు నా సింహళ ద్వీప
మత్యంత రత్న సింహాసనంబొ
ఏ రమారమణికి భారత యోధుల
గాళిదాసాదుల గన్న కడుపొ
అట్టి సుగుణ రత్నాకరమైన జగాన
నసదృశ విలాసినిగ నలరారుచుండ
భారత వర్ష వధూటిని బడయవలయు

స్వాతంత్ర సమరయోధునిగా

[మార్చు]

జాతీయ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి పార్టీ పిలుపు మేరకు సాగిన ఉద్యమ కార్యక్రమాలలో అతను పాల్గొన్నారు. మహాత్మాగాంధీ, అలీ సోదరులు, మహమ్మద్‌ అన్సారి లాంటి ప్రముఖులు విజయవాడ వచ్చినప్పుడు వారిని కలసి సమకాలీన పరిస్థితుల మీద చర్చించారు. పశ్చిమగోదావరి జిల్లాలో స్వాతంత్ర్య సంగ్రామం మీద పరిశోధన జరిపిన చరిత్రోపన్యాసకులు డాక్టర్‌ జి.గోపాలస్వామి (అత్తిలి) వ్యాసకర్తతో మాట్లాడుతూ గోదావరి జిల్లాలలో అలీషా సుడిగాలి పర్యటనలు చేసారని, ప్రజలలో దేశ భక్తిని, త్యాగాన్ని ప్రోదిచేస్తూ అతను చేసిన ప్రసంగాలు ప్రజలను చాలా బాగా ప్రభావితం చేసాయన్నారు. ఉమర్‌ అలీషా ప్రసంగం ఉందంటే సభికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు. జాతీయోద్యమంలో భాగంగా అతను రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పర్యటించి తన అనర్ఘళ ప్రసంగాలతో ప్రజలను కార్యోన్ముఖులను చేశారు. డాక్టర్‌ ఉమర్‌ అలీషా అలీపూర్‌ జైలులో అరవిందుడిని కలసి జాతీయోద్యమం గురించి చర్చించారని, ఆ తరువాత అరవిందుడితో మంచి స్నేహం నెరపారని ప్రొఫెసర్‌ యస్‌. యం. ఇక్బాల్‌ వివరించారు. అనాడు అరవిందునితో కలిగిన ఈ పరిచయం వలన కాబోలు ఉమర్‌ అలీషా తాత్విక ఆలోచనలు మీద అరవిందుడి ఛాయలు తారాడుతూ కన్పిస్తాయి.

1924లో అఖిల భారత ఖిలాఫత్‌ కమిటి ప్రధాన కార్యదర్శిగా, ముస్లిం లీగ్‌ మద్రాసు శాఖకు ఉపాధ్యకక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా నాయకత్వం వహించారు. జాతీయోద్యమ కాలం నాటి ప్రజా పోరాటాలకు స్పందిస్తూ, దేశభక్తి ప్రపూరితమైన పలు పద్యాలను రాసారు. అటువంటి పద్య రత్నాలలో ఒకటి ఈ విధంగా సాగింది. .. యూరపు దేశ మట్టిటు నూనగ శౌర్య పరాక్రమంబున్‌ భారత వీరకోటి రణపొండితి వైరుల జీల్చి రక్త సిక్తారుణ మూర్తులైన ప్రజ జయ్‌జయ ద్వానముల్‌ నెలకొల్పినప్పుడే ధారుణి మెచ్చె దయ్ర థిరథారలు భోరును పొర్లిపారగన్‌... 1928వ సంవత్సరంలో ఉమర్‌ అలీషా తండ్రి శ్రీ మొహిద్దీన్‌ బాద్షా కన్నుమూయటంతో అతను నిర్వహిస్తున్న అథ్యాత్మిక పీఠం బాధ్యతలు భారం వలన, ఖిలాఫత్‌ ఉద్యమం తరువాత జాతీయోద్యమ కార్యక్రమాలలో అతను అంత చురుగ్గా పాల్గోనప్పటికీ, క్రియాశీల రాజకీయాలకు మాత్రం దూరం కాలేదు. 1935లో అఖిల భారత శాసనసభకు ఉత్తర మద్రాస్‌ నియోజకవర్గం రిజర్వుడ్‌ స్థానం నుండి సభ్యునిగా ఎన్నికయ్యాడు. భారత శాసనసభలో పది సంవత్సరాల పాటు అనగా 1945లో కన్నుమూసే వరకు అతను ప్రజా ప్రతినిధిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. ప్రజాప్రతినిధిగా అతను శాసనసభలో ప్రజల సంక్షేమం కోరుతూ, అవసరాన్ని బట్టి ప్రభుత్వాన్ని వాదనా పటిమతో విమర్శిస్తూ ఆచరణాత్మక సూచనలతో, అనర్ఘళంగా ప్రసంగాలు చేసి సభికులను అకట్టుకున్నాడు. ప్రజల పక్షాన ప్రభుత్వం లోటు-పాట్లను అతను విడమర్చి విమర్శించే తీరు సభాసదుల ప్రశంలనే కాకుండా ప్రభుత్వాధినేతలనే ప్రశంసలను అందుకున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా, చూపించితి రాజ్య లోపంబు లాంగ్ల ప్ర- భుత్వంబు ముంగర మోపి మోపి అని ఉమర్‌ అలీషా చెప్పుకున్నారు. భారత శాసనసభలో హిందూ లా సంబంధించి ధార్మిక అంశాల మీద ఉత్పన్నమైన సందేహాల నివృత్తి కోసం డాక్టర్‌ భగవాన్‌ దాస్‌ లాంటి ప్రముఖులు స్వయంగా ఉమర్‌ అలీషాను పలుమార్లు సంప్రదించటాన్ని బట్టి, సంస్కృత భాష మీదనే కాకుండా హిందూ మతానికి చెందిన అధ్యాత్మిక-వేదాంత గ్రంథాల మీద అతనుకు ఉన్న పట్టు ఏపాటిదో తెలియజేస్తుంది. ఉమర్‌ అలీషా భారత దేశమంతటా పర్యటించి పలు పండిత సభలలో పాల్గొని పాహిత్య-అధ్యాత్మిక ఉపన్యాసాలిచ్చి, అద్భుతమైన ధారణతో ప్రతిభను ప్రదర్శించి పలు సన్మానాలు, సత్కారాలను పొందారు. భారతభూమి నేనుప న్యాసము లిచ్చుచున్‌ దిరిగి నాడను ఉమ్రాలిషా కవీంద్రుడన్‌ అంటూ, ...నవరించితిని పెద్ద సారస్వతంబును-శబ్ద శాస్త్రంబులు జదివి చదివి... అని అతను ప్రకటించుకున్నారు.

ఉమర్‌ అలీషాను సత్కరించటమే మహా భాగ్యంగా ఆనాటి సంస్థానాధీశులు, సంపన్న కుటుంబీకులు భావించారు. విశ్వ విద్యాలయాలు అతనుకు గౌరవ బిరుదులను ఇవ్వడానికి ఉత్సాహ పడ్డాయి. 1924 లో జు పండిట్‌ బిరుదుతో అతనును సత్కరించింది. అలీఘర్‌ విశ్వ విద్యాలయం అతనుకు మౌల్వీ బిరుదునిచ్చి గౌరవించింది. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆర్యన్‌ విశ్వ విద్యాలయం అవార్డును ప్రసాదించి గౌరవించింది. 1933లో సభ్యుడిగా కార్యక్రమాలకు మార్గదర్శకత్వం నెరపమని అతనును ఆంధ్ర విశ్వ విద్యాలయం ఆహ్వానించింది. కాశీలోని హిందూ విశ్వ విద్యాలయం కూడా అతనును విద్యాభివృద్ధి కమిటీలో సభ్యునిగా నియమించుకుంది. ఉమర్‌ అలీషా విద్వత్తును గుర్తించి 1936లో అతనును గౌరవించింది. ఏ విశ్వ విద్యాలయం నుండి ఎటువంటి కనీస డిగ్రీ లేని వ్యక్తికి, అంతర్జాతీయ స్థాయి విశ్వ విద్యాలయం డాక్టరేట్‌ను ప్రకటించడం చాలా అరుదైన సంఘటన. ఉమర్‌ అలీషా తన సాహిత్య సంపదతో, ఆంగ్లేయులకు షేక్‌ స్పియర్‌, ఇటాలియన్‌లకు డాంటే, ఉర్దూ మాట్లాడే ప్రజలకు డాక్టర్‌ ఇక్బాల్‌ ఎలాగో తెలుగు మాట్లాడే ప్రజలకు డాక్టర్‌ ఉమర్‌ అలీషా అటువంటి వారని ప్రముఖ పండితుల చేత బహువిధాల కీర్తించబడ్డారు.

ఉమర్‌ అలీషాకు బహు సత్కారాలు, సన్మానాలు జరిగాయి. మౌల్వీ, బ్రహ్మఋషి, అశుకవి, మహాకవి లాంటి పలు బిరుదులే కాకుండా, పూల కిరీటాలు, సింహతలాటాలు, గజారోహణలు, కనకాభిషేకాలు తదితర గౌరవాలతో ఉమర్‌ అలీషా సాహిత్యవేత్తగా జయభేరిని మ్రోగించారు. పలు గ్రంథాలను రచించి, పండితుల ప్రశంసలు పొంది, పామర జనుల హృదయ పీఠాలను అలంకరించిన ఉమర్‌ అలీషా ఏ రంగాన్ని ఎన్నుకున్నా అద్వితీయమైన ప్రతిభతో ఆ రంగాలలో రాణించారు.

శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధాత్మిక పీఠాచార్యునిగా అసంఖ్యాకులైన శిష్యుల మనస్సులను చూరగొన్నారు. సర్వమత సమభావనా కేంద్రంగా తమ పీఠాన్ని తీర్చిదిద్దారు. అతను బోధించిన వేదాంత తత్వం అసంఖ్యాక శిష్యగణాన్ని సమకూర్చి పెట్టింది. అతను మతపరంగా ముస్లిం అయినప్పటికి, అయనలో మతాభిమానం ఉన్నా మత దురహంకారం మాత్రం తగదన్నారు. సర్వ మత సామరస్యం బోధించారు. ..ఆదర్శ గురువుగా అంతేవాసుల ఆరాధ్యదైవంగా... అతను గౌరవ మర్యాదలందుకున్నారు . మతాల ప్రసక్తి లేకుండా, మతాచారాలతో సంబంధం లేకుండా ఉమర్‌ అలీషా పీఠాధిపత్యం లోని ' జ్ఞానసభ ' అందర్ని ఆహ్వానించింది. ఈ జ్ఞాన సభలో కులమత జాతి భేదాలు లేవు. జ్ఞానార్జనే ఇక్కడ ప్రధానం. ఈ విషయాన్ని సభామందిర ద్వారమెపుడు తెఱిచి యుండు పూత చరిత్రులై యుండు వారు వచ్చి జ్ఞానంబు నేర్చుకోవచ్చు సతము మంచి నీళ్ళను కలశాల ముంచినట్లు అని అతను స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు ఆచరించిన చూపారు. ఆ కారణంగా అతనుకు అన్ని మతాలకు చెందిన ప్రజలు అతనును గురువుగా స్వీకరించారు. డాక్టర్‌ ఉమర్‌ అలీషా ప్రతీ ఏడాది శిష్యులకు వేదాంతబోద చేసేందుకు పర్యటనలు చేయటం ఆనవాయితీ. శిష్యగణమే అతను సర్వస్వమని భావించి, ప్రేమించే వేదాంతి మనసులోని తన మాటకు అతనులోని కవి ఈ విధంగా అక్షర రూపం కల్పించాడు.

[2]

బ్రహ్మఋషి ఉమర్‌ అలీషా మిధ్యా భావనకు బహుదూరం. ప్రాంపంచిక జీవిత చర్యలు పరలోక జీవితానికి పునాది కాగలుగుతాయని అతను ప్రభోధం. ఇహలోక జీవనాన్ని ఏమాత్రం విస్మరించరాదన్నారు. భక్త జనుల ఆరాధనా మార్గాలు వేరైనప్పటికీ, అన్ని మతాలు భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకునేందుకు మార్గం చూపుతాయన్నారు. సర్వజనుల సర్వేశ్వరుడు ఒక్కడేనన్న భావన ద్వారా వసుదైక కుటుంబం ఏర్పడుతుందని అతను ప్రవచించారు. ఈ విషయాన్ని మానవుని మానవునిగా మార్చుటయే యీ ధర్మము యొక్క లక్ష్యమ ని ఆ మానవతా వాది ప్రకటించారు. ఆ లక్ష్య సాధనకై, సూఫీ సాధువుల వేదాంత బాటలో నడిచిన ఉమర్‌ అలీషా చుట్టూ అసంఖ్యాకంగా శిష్య గణం చేరింది. అతను సర్వమత సమభావన ఆధ్యాత్మి-వేదాంత భావాలు ప్రముఖ పండితుడు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను కూడా ప్రభావితం చేసాయి. ఉమర్‌ అలీషా ధార్మిక చింతనా ధోరణులను శ్రీ రాధాకృష్ణన్‌ బహుదా కొనియాడారు.[3] ఈ రకమైన ధార్మిక తత్వ చింతన కారణంగానే ఈనాటికి పిఠాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠం ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. డాక్టర్‌ ఉమర్‌ అలీషా పూర్వీకులు స్థాపించిన పీఠం ప్రధానంగా ధార్మిక విషయలకు పరిమితం కావడం వలన ఉమర్‌ అలీషాలోని కవికి సాహిత్య చరిత్రలో, ప్రజలలో లభించాల్సినంత ప్రాచుర్యం లభించలేదు. విద్యాధ్యాత్మిక పీఠంగాని, అతను తరువాత వచ్చిన పీఠాధిపతులు గాని ఆ దిశగా తగిన స్థాయిలో కృషి సల్పలేదు. ఉమర్‌ అలీషా తెలుగు సాహితీ ప్రక్రియలన్నిటిలోనూ అత్యంత ప్రతిభను చూసేందుకు డాక్టర్‌ ఉమర్‌ అలీషా మునిమనుమడు, నవమ పీఠాధిపతి, యువకుడు డాక్టర్‌ ఉమర్‌ అలీషా ఈ లోటును గ్రహించి ' డాక్టర్‌ ఉమర్‌ అలీషా సాహితీ సమితి ', ' శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి ' అను సంస్థలను ఏర్పాటుచేసి ఆనాడు ఉమర్‌ అలీషా పోషించిన బహుముఖ పాత్రలను సమాజం అవసరాలను గమనిస్తూ, ప్రజల ఆకాంక్షలను విస్మరించకుండా, సమాజహితం కోరుతూ, మహాకవి ఉమర్‌ అలీషా బాటన వినూత్న కార్యక్రమాలకు రూపొందించి నిర్వహిస్తున్నారు.

రచనలు

[మార్చు]

మహా కవిగా, విద్యా వేత్తగా, రాజనీతి జ్ఞుడిగా, జాతీయవాదిగా, బహుభాషా విశారదుడుగా, బహుముఖ ప్రజ్ఞాదురీణుడుగా, దయార్ధ్ర హృదయుడుగా, ఆధ్యాత్మక విద్యా పీఠాధిపతిగా సమత-మమత-మానవతలకు ప్రతీక...గా వెలుగొందిన డాక్టర్‌ ఉమర్‌ అలీషా తన జీవితకాలంలో పలు గ్రంథాలను రాశారు. అందులో

నాటకాలు

[మార్చు]
  1. అనసూయాదేవి,
  2. కళ,
  3. చంద్రగుప్త
  4. ప్రహ్లాద లేక దానవవధ,
  5. మణిమాల,
  6. మహాభారత కౌరవరంగము,
  7. విచిత్ర బిల్హణీయము,
  8. విషాద సౌందర్యము

ఏకాంకిలు

[మార్చు]
  1. నరకుని కాంతాపహరణ,
  2. బాగ్దాదు మధువీధి,
  3. విశ్వామిత్ర (అసంపూర్ణము)

ప్రహసనం

[మార్చు]
  • వరాన్వేషన్‌ అను ప్రహసనం

పధ్య గ్రంథములు

[మార్చు]
  1. ఖండకావ్యములు,
  2. తత్త్వ సందేశము,
  3. బర్హిణి దేవి,
  4. బ్రహ్మ విద్యావిలాసము,
  5. మహమ్మద్‌ రసూల్‌ వారి చరిత్ర,
  6. సూఫీ వేదాంత దర్శనము,
  7. స్వర్గమాత,
  8. హాలీలాంటి

గధ్యములు

[మార్చు]
  1. ఈశ్వరుడు,
  2. మహమ్మద్‌ వారి చరిత్ర,
  3. సాధన పథము

నవలలు

[మార్చు]
  1. తారామతి,
  2. పద్మావతి,
  3. శాంత అనునవలలు

కధా సంగ్రహం

[మార్చు]
  1. ప్రభాత కథావళి అను కథల సంగ్రహము

అనువాదాలు

[మార్చు]
  1. ఉమర్‌ఖయ్యమ్‌,
  2. ఖురాన్‌ - ఏ - షరీఫ్‌,
  3. గులిస్తా

వైద్య గ్రంథాలు

[మార్చు]
  1. ఇలాజుల్‌ గుర్‌భా

ఈ గ్రంథాలలో అన్ని ప్రస్తుతం లభ్యం కావటంలేదు.

ఈ రచనలే కాకుండా వందకు పైగా వ్యాసాలు గల సంపుటి, హిందీ ఉపన్యాసాల సంగ్రహం, ఆం గ్ల ఉపవ్యాసాల సంగ్రహం వేర్వేరుగా ఉన్నాయని, ఇవికాక మదాల, మనద్ధాస్‌ అలీ, ఉరుమత్తూరు చక్రవర్తి, శ్రీ మద్వాల్మీకి రామాయణము కూడా అతను రచించినట్టు డాక్టర్‌ మహమ్మద్‌ ముస్తఫా, డాక్టర్‌ యస్‌.యం ఇక్బాల్‌ లాంటి పరిశోధకులు పేర్కొంటున్నారు. అతను సృష్టించిన సాహిత్య సంపదలో 34 గ్రంథాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉండగా 23 రచనలు ముద్రితమయ్యాయి. ప్రఖ్యాతి చెందిన అతను రచనలు విశ్వ విద్యాలయాల్లోని విద్యార్థుల పాఠ్య గ్రంథాల స్థానాన్ని పొందాయి. ఆనాడు అలీషా రచనల గురించి చర్చించని సాహితీ సభగానీ, అతను రచనలేని గ్రంథాలయం గాని ఉండేది కాదట. మాతృభాష తెలుగు కానప్పటికీ, తెలుగులో ఛందోబద్ధమైన సాంప్రదాయ కవిత్వం చెప్పి ఆంధ్ర భారతిని ఆరాధించిన తొలి, తుది కవి ఈయనే కావచ్చు, నని పండిత ప్రముఖులు అతనుకు కితాబునిచ్చారు.

అతను తెలుగు భాషకు మాత్రమే పరిమితం కాకుండా బహుభాషలలో కవిత్వం రచించగల ప్రతిభావంతుడిగా, తత్త్వవేత్తగా, వేదాంతిగా, విజ్ఞాన గనిగా ప్రజలు-పండితులు గౌరవించారు. డాక్టర్‌ ఉమర్‌ అలీషా రాసిన గ్రంథాలన్నీ ప్రస్తుతం లభ్యం కావడం లేదు. అతను సాహిత్యం మీద ఇప్పటికే పలువురు పరిశోధనలు జరిపి డాక్ట రేట్లు తీసుకున్నారు. పలువురు ప్రస్తుతం పరిశోధనలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, డాక్టర్‌ ఉమర్‌ అలీషా ముని మనుమడు, నవమ పిఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, తమ తాతగారి సాహిత్య సంపదను సేకరించి పుస్తకాలను ప్రచురించి ప్రజలకు, పరిశోధకులు, పాఠకులకు అందుబాటులో ఉంచాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ విధంగానే ఉమర్‌ అలీషా సాహిత్య-ఆధ్యాత్మిక సంభాషణలు, రచనలను మాత్రమే కాకుండా, అతను రాజకీయ అభిప్రాయాలు, స్వాతంత్ర్య సమరయోధునిగా పలు ప్రాంతాలలో అతను చేసిన ప్రసంగాలు, సమాజ సంస్కరణలకు అతను అనుసరించి విధానాలు, చేసిన సూచనలు అతను అభిప్రాయాలు, భారత శాసనసభలో ప్రజా ప్రతినిధిగా పది సంవత్సరాల పాటు పనిచేసినప్పుడు చర్చకు వచ్చిన వివిధాంశాల మీద అతను చేసిన ఉపన్యాసాలను సేకరించి ఉమర్‌ అలీషా వ్యక్తిత్వాన్ని, మేథో సంపత్తిని సమగ్రంగా ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథ మండలి అను సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ కృషి ఫలించి, డాక్టర్‌ ఉమర్‌ అలీషా రాసిన రచనలన్నీ ప్రజలకు, సాహిత్యాభిలాషులకు, పరిశోధకులకు అందుబాటులోకి వచ్చినట్టుయితే, మహాకవి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని దర్శించేందుకు ప్రతి ఒక్కరికి అవకాశం లభిస్తుంది. చరిత్ర పుటలలో నిక్షిప్తమైయున్న ఆ మేధావి అసమాన ప్రతిభ వెల్లడికాగలదు. జీవితాంతం వరకు భారత శాసన సభలో ప్రజా ప్రతినిధిగా రాజకీయగా బాధ్యతలను నిర్వహిస్తూ స్వజనుల స్వేచ్ఛా-స్వాతంత్ర్యాలు కోరుకుంటున్న స్వాతంత్ర్య సమరయోధుడుగానూ, ఆధ్యాత్మిక రంగాన శిష్యకోటికి ధార్మిక జ్ఞానబోధ చేయు పీఠాధిపతిగాను, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీవేత్తగా, వేదాంతిగా చిరస్మరణీయమైన ఖ్యాతి గడించిన డాక్టర్‌ అలీషా జీవిత పరిసమాప్తి వరకు పర్యటనలు చేసారు. సమకాలీన సాహిత్య సౌరభాలను అఘ్రాణించుటకు, శిష్యపరంపరకు అధ్యాత్మిక మార్గదర్శకం చేయుటకు ప్రతి క్షణాన్ని వినియోగించిన అతను అవిశ్రాంతంగా భారతదేశమంతా పర్యటించినా అలసిపోవడం ఎరుగరు. పండిత ప్రముఖులు ఆహ్వానం మేరకు పలు పర్యటనలు చివరి వరకు సాగించారు. మహా మహోపాధ్యాయులు ఉమర్‌ అలీషా ఎక్కడకు వెళ్ళినా తండోపతండాలుగా శిష్యులు అతను ఆధ్యాత్మిక బోధలు వినడానికి విచ్చేస్తుంటే, అతను సాహితీ ప్రసంగాలను వినడానికి, అతనుతో సాహిత్య చర్చలు జరిపేందుకు సాహితీ ప్రియులు, పండిత ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా హాజరయ్యేవారు. మౌల్వీ ఉమర్‌ అలీషా రాక కోసం పండితులతో పాటుగా శిష్యులు ఎంతో ఆశగా ఎదురు చూసేవారు.

అస్తమయం

[మార్చు]

1945 జనవరి మాసంలో ఢిల్లీ నుండి స్వస్థలానికి విచ్చేస్తూ, శిష్యుల ఆహ్వానం మేరకు ఆచార్య ఉమర్‌ అలీషా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వెళ్ళారు. అక్కడ కొంతకాలం గడిపాక తిరిగి పిఠాపురం చేరుకో సంకల్పించి, ఆ ప్రయత్నంలో వుండగా జనవరి 23 న మహాకవి కన్నుమూసారు.

ఉమర్ అలీషా వంశీకులు

[మార్చు]

విశ్వవిజ్ఞానా విద్యా ఆధ్యాత్మిక పిఠం (పిఠాపురం), నవమ పీఠాధిపతి ప్రస్తుత ఉమర్ ఆలీషా గురువర్యులు. వీరుమొహిద్దిన్ బాద్షా సత్గురు వర్యుల ప్రథమ పుత్రులు. వీరు 9 -9 -1989 న జన్మిచారు. వీరు హోమియోపతి వైద్యులు సంగీతములో ప్రావీణ్యము కలవారు. వీరు ఉమర్ ఆలీషా రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్ అను ఒకదానిని స్థాపించి దాని ధ్వారా ప్రజలకు తమ శక్తీ కొద్ది సేవ చేస్తున్నారు వీరు ఈ ట్రస్ట్ ద్వారా ఉమర్ ఆలీషా అక్షర జ్యోతి వంటి వాటి ద్వారా ప్రజలలో అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేస్తున్నారు. వీరు తమ ఆధ్యాత్మిక శక్తీ ద్వారా తమ శిష్యులకు జ్ఞాన మార్గాన్ని ఈశ్వర తత్త్వాన్ని ప్రభోదిస్తున్నారు. వైద్యశిబిరాలను నిర్వహించి ప్రజలకు ఆవసరమైన హోమియోపతి మందులను అందచేస్తున్నారు .వీరు తమ ఆశ్రమంలో సంగీతమును ఉచితముగా నేర్పిస్తున్నారు.అంతేకాక వీరు ఈ ట్రస్ట్ ద్వారా ఆనెకమైన ప్రజ కర్యక్రమలను అనగా బట్టల పంపిణి .కుట్టు మిషన్ల పంపిణి మొదలైనవి నిర్వహిస్తున్నారు. వీరు నివేదిక, కాస్మిక్ వైస్ డం, మొదలయనటువంటి గ్రంథాలను రచించారు. తత్వజ్ఞానమనే మాస పత్రికను ప్రారంబించి ప్రజలకు అందించారు.వీరికి మన దేశంలోనే కాక విదేశాలలో ఉన్న తమ శిష్యులను జ్ఞాన మర్గన్ని ప్రభొధిస్తున్నారు.

గ్రాంధిక వాదం

[మార్చు]
"వ్యాకరణంబు వలదట,వాక్యములంగల సౌష్టవంబు వి
ద్యా కలనంబు పేశల సుధామధురోక్తుల నర్ధగౌరవ
ప్రాకటమైన శ్లేషయును ద్వర్ధి వృధాయట పెంట పాటలే
నీకిక దిక్కటాంధ్ర రమణీమణీ ఎంత నికృష్ట వైతివే?"

ఉమర్ అలీషా గ్రంథాలు

[మార్చు]
  • అనసూయా దేవి
  • ఉమర్ ఖయ్యాం
  • కళ
  • ఖండకావ్యాలు
  • చంద్రగుప్త
  • తత్వసందేశము
  • దానవ వధ
  • బర్హిణీ దేవి
  • బ్రహ్మవిద్యా విలాసము
  • మహా భారత కౌరవ రంగము
  • శ్రీ ముహమ్మద్ వారి చరిత్ర
  • సూఫీ వేదాంత దర్శనము

మూలాలు

[మార్చు]
  1. "మనకో విశ్వకవి!". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-03-28. Archived from the original on 2022-03-28. Retrieved 2022-03-29.
  2. అతి పవిత్రతతో మహాప్రేమ గరిమతో గ్రాలెడు వీరె చుట్టాలు మాకు ప్రాణార్థములనైన ప్రాభవంబులనైన నిచ్చెడు వీరె స్నేహితులు మాకు జ్ఞాన సాధనచేత ధ్యాన నిష్టలచేత దనరెడు వీరె సోదరులు మాకు వీరె చేదోడు వాదోడు వీరె మాకు వీరె భక్తులు బిడ్డలు వీరె మాకు మా మహాజ్ఞానసభ జగన్మందిరముగ
  3. (ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధం 03-04-1994)

ఆధార గ్రంథాలు

[మార్చు]
  1. డాక్టర్‌ ఉమర్‌ అలీషా గారి ఉమర్‌ ఖయ్యాం రుబాయాల అనుశీలన, షేక్‌ ముహమ్మద్‌ ముస్తఫా, నవ్యసాహితి సమితి, ప్రొద్దుటూరు, 1987.
  2. సూఫి వేదాంత దర్శము, ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురం, 1987.
  3. మహమ్మద్‌ రసూల్‌వారి చరిత్ర, ఉమర్‌ అలీషా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠము, పిఠాపురము, 1955.
  4. బర్హిణీ దేవి, శ్రీ ఉమ్రాలీషా కవిసంహిత, రాజమండ్రి, 1970,
  5. మా పిఠాపురం, శ్రీ కురుమెళ్ళ వేంకట రావు, పిఠానురం, 1978
  6. మణిమాల (నాటకము) బ్రహర్షి ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురము, 1978,
  7. ఉమర్‌ ఖయ్యూమ్‌, డాక్టర్‌ ఉమర్‌ అలీషా చే అనువాదం, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురము, 1987.
  8. ఆంధ్ర రచయితలు, సంకలన కర్త ః శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, శీర్షిక ' ఉమర్‌ అలీషా (1885-1945) ' .
  9. అనసూయ (నాటకము), డాక్టర్‌ ఉమర్‌ అలీషా శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురం, 2001.
  10. విచిత్ర బిల్హణీయము, డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురం.2002.
  11. ఆంధ్ర సచిత్రవార పత్రిక వజ్రోత్సవ సంచిక, 16-9-1983.
  12. చంద్రగుప్త, నాటకం, ఉమర్‌ అలీషా,
  13. తెలుగు వైతాళికులు, మహాకవి ఉమర్‌ అలీషాగారి జీవిత సంగ్రహము, వ్యాసకర్త ః షేక్‌ దావూద్‌, సంపుటం-3, ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడవిూ, హైదరాబాదు, 1979.
  14. శ్రీ ఉమర్‌ అలీషా జీవిత చరిత్ర, రచన ః మౌల్వి హూస్సేన్‌ షా, అ ముద్రిత రచన, సమర్పణ ః శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురము.
  15. ఖండకావ్యములు, బ్రహ్మర్షి డాక్టర్‌ ఉమర్‌ అలీషా కవి కృతసంహిత, శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠము, పిఠాపురము, 1998.
  16. మహాభారత కౌరవరంగము (నాటకము) డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురము, 1988.
  17. విషాద సౌందర్యము, ఉమర్‌ అలీషా, తృతీయ ముద్రణ, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురం, 2004
  18. సూఫి వేదాంత దర్శనము, ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురము, 1987.
  19. ఆంధ్ర ప్రభ ఆదివారం అనుబంధం, 20-03-1994, సాహితీలత, వ్యాసకర్త ః పి.వి.యస్‌ పాత్రో.
  20. పద్మావతి, డాక్టర్‌ ఉమర్‌ అలీషా కవి కృతసంహిత, పిఠాపురం, 1945.
  21. నూరు శరత్తులు, డాక్టర్‌ ఆవత్స సోమసుందర్‌, కళాకేళి నికేతన్‌, పిఠాపురం, 1996
  22. తెలుగు కే ఆధునిక్‌ కవి ః డాక్టర్‌ ఉమర్‌ అలీషాకా వ్యక్తిత్వ వ కృతిత్వ (హింది), డాక్టర్‌ యస్‌.యం. ఇక్బాల్‌, ఆంధ్రవిశ్వవిద్యాలయం, అముద్రితం, విశాఖపట్నం, 1970.
  23. ఆంధ్ర కే ముసల్మాన్‌ సంత్‌ కవి ః డాక్టర్‌ ఉమర్‌ అలీషా (వ్యాసం), డాక్టర్‌ యస్‌.యం. ఇక్బాల్‌, ' ఆధ్యేయ్‌ ' హింది మాససత్రిక, 1971 ఫిబ్రవరి, హింది ప్రచార సభ, సికింద్రాబాద్‌.
  24. ఆంధ్రాభ్యుదయం, చారిత్రక పద్యకావ్యం (పూర్వభాగం), శ్రీ పాదకిష్ణమూర్తి శాస్త్రి, 1951.
  25. ఉమర్‌ అలీషా కవి రచనల్లో స్త్రీజనాభ్యుదయం, డాక్టర్‌ ఉమర్‌ అలీషా (విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం, ప్రస్తుత పీఠాధిపతి), చతుర్ధ ప్రపంచ తెలుగు మహాసభలు, సావనీర్‌, 2000.
  26. డాక్టర్‌ ఉమర్‌ అలీషా-ఏక్‌ పరిచయ్‌ (వ్యాసం), డాక్టర్‌ యస్‌. యం. ఇక్బాల్‌, ' యుగప్రభాత్‌ ', హింది మాసపత్రిక, 1971, కేరళ.
  27. తెలుగు సాహిత్య కోశం ః ఆధునిక సాహిత్యం, పేజీలు 124-126, 622.
  28. తొలి వెలుగు ముస్లిం కవిరాజు ః డాక్టర్‌ ఉమర్‌ అలీషా, న్రజాపత్రిక 77వ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక, వ్యాసకర్త ః సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌,
  29. ఉభయ మత సజాతీయత, బుర్రా శేషగిరిరావు, శ్రీ వేదవ్యాస ముద్రాక్షరశాల, విజయనగరం, 1933.
  30. బ్రహ్మర్షి ఉమర్‌ అలీషా వ్యాసాలు-ఉపన్యాసాలు, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురం,2005.
  31. తత్వ సందేశము, బ్రహ్మర్షి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురం,2001.
  32. ప్రభాత కథావళి, బ్రహ్మర్షి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యాపీఠము, పిఠాపురము, 1988.
  33. స్వర్గమాత, బ్రహ్మర్షి డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ ఉమర్‌ అలీషా గ్రంథమండలి, పిఠాపురము, 2001.
  34. శాంత (నవల), డాక్టర్‌ ఉమర్‌ అలీషా, శ్రీ విజ్ఞాన విద్యా పీఠము, పిఠాపురం, 1988.
  35. సమగ్ర ఆంధ్రసాహిత్యం, అరుద్ర, 12వ సంపుట, ప్రజాశక్తి బుక్‌హౌస్‌, విజయవాడ,1991.
  36. భారత స్వాతంత్ర్యోద్యమం ః ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లింలు, సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌, అజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, ఉండవల్లి సెంటర్‌, 2001
  37. ఆంధ్ర ప్రదేశ్‌లో గాంధీజీ, సం|| శ్రీ కొడాలి ఆంజనేయులు, తెలుగు అకాడవిూ, హైదరాబాదు, 1978.
  38. పశ్చిమగోదావరి జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర, మంగళంపల్లి చంథ్రేఖర్‌, రమ్యసాహితి, పెనుగొండ, 1992.
  39. ఆంధ్రపత్రిక, 20-12-1917, 26-07-1919, 18-11- 1920, 12-02-1920, 09-02-1921, 23-04-1921, 10-05-1922, 20-05-1922, 22-08-1922, 22- 12-1922, 06-01-1923, 10-12-1934,06-04- 1935, 26-01-1945, 26-01-1945 27-01-1945 తదితర సంచికలు.
  40. భారతి మాసపత్రిక, పూర్వ సంచికలు.
  41. కృష్ణ పత్రిక, దినపత్రిక పూర్వ సంచికలు.
  42. ఆంధ్రోద్యమ చరిత్ర, మాదాల వీరభద్రరావు, ఆంధ్ర ప్రభుత్వ ప్రచురణ, హైదరాబాదు‌, 1982.

వెలుపలి లింకులు

[మార్చు]