కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్
కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ బోర్డు
రకంపార్కు
స్థానంమహబూబ్ నగర్, తెలంగాణ
విస్తీర్ణం2087 ఎకరాలు
నవీకరణతెలంగాణ ప్రభుత్వం
సందర్శకులుతెలంగాణ అటవీ శాఖ
తెరుచు సమయం2020 జూలై 13

కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న పార్క్.[1] 2087 ఎకరాలలో సుమారు 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడిన ఈ పార్కు దేశంలోనే అతిపెద్ద అర్బన్‌ ఎకో పార్కుగా నిలిచింది.[2]

చరిత్ర

[మార్చు]

మొదట్లో మయూరి నర్సరీగా ఉన్న ఈ ప్రాంతాన్ని 2016లో మయూరి పార్కుగా మార్చారు. 80 కోట్ల రూపాయలతో 232 ఎకరాల్లో ‘మయూరి ఎకో అర్బన్​ పార్కు’గా తీర్చిదిద్దారు. దాంతోపాటు మహబూబ్​నగర్, హన్వాడ, నవాబుపేట, జడ్చర్ల మండలాల సరిహద్దుల్లోని రిజర్వ్​ ఫారెస్ట్​ భూములన్నింటినీ కలుపుకొని 2,087 ఎకరాల్లో పార్కును అభివృద్ధి ​చేశారు.

మహబూబ్ నగర్ - జడ్చర్ల రహదారి మధ్య ఉన్న ఈ పార్కు పేరును కేసీఆర్ ఎకో అర్బన్ పార్కుగా పేరు మార్చారు. ఈ పార్కును 2020 జూలై 13న తెలంగాణ రాష్ట్ర ఐటీ-మున్సిపల్‌ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖమంత్రి ఈటెల రాజేందర్, రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక శాఖమంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

ప్రత్యేకతలు

[మార్చు]

అనేక వృక్షాలు, వందల సంఖ్యలో జింకలు, నెమళ్ళు, వివిధ రకాల పక్షులు, రంగురంగుల సీతాకోక చిలుకలు, చిరుతలు, హైనాలు, అడవి పందులు, నక్కలు, అడవి కుక్కలు, పాములు మొదలైన జీవరాసులకు ఇది నిలయంగా మారింది. ఇందులో బట్టర్‌ఫ్లై గార్డెన్‌, రాశీవనం, హెర్బల్‌ గార్డెన్‌, నవగ్రహ వనం మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ ట్రెక్కింగ్‌ చేసేందుకు అనువుగా ఉండటంతో సాహస క్రీడలకు అడ్డాగా మారింది. కేబుల్‌ సైక్లింగ్‌, బాంబో బ్రిడ్జి, వాల్‌ క్లెంబింగ్‌, బోటింగ్‌, నైట్‌ క్యాంపింగ్‌, బ్యాటరీ వెహికిల్స్‌ వంటివి కూడా ఉన్నాయి.[2]

100 ఏళ్ళ చెట్లు

[మార్చు]

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​, వాటా ఫౌండేషన్​ సహకారంతో 2022 ఏప్రిల్ 17న రోడ్లు, భవనాల గెస్ట్ హౌస్ నుండి కేసీఆర్ అర్బన్ ఎకో పార్కుకు 100 సంవత్సరాల వయస్సు గల నాలుగు చెట్లను ట్రాన్స్​లొకేట్​ చేశారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో సమీకృత మాంసం, కూరగాయల మార్కెట్‌ను నిర్మిస్తుండడంతో ఈ పురాతన చెట్ల ట్రాన్స్​లొకేట్ తప్పనిసరి కావడంతో ఈ ట్రాన్స్​లొకేట్, ప్లాంటేషన్‌ జరిగింది.[3]

మినీ జూ

[మార్చు]

ఈ పార్కులో మినీ జూ ఏర్పాటుచేయడానికి రాజ్యసభ సభ్యుడు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ 50 లక్షల రూపాయలు మంజూరు చేశాడు.[4]

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్

[మార్చు]

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ వేదికగా 2021 జూలై 12న జిల్లాకు చెందిన మహిళ సమాఖ్య ప్రతినిధులు 10 రోజుల్లో తయారుచేసిన 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను పార్కు మైదాన ప్రాంతాల్లో వేదజల్లారు. 81 అక్షరాలను 81 మంది మహిళలు ఉదయం పదిన్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల వరకూ పేర్చారు. అనంతరం ఎన్ని విత్తన బంతులతో ఆ వాక్యాన్ని రూపొందించారో లెక్కించారు. ఈ ప్రక్రియను గిన్నిస్ బుక్ ప్రతినిధులు రిశినాథ్, భారత ప్రతినిధి నిఖిల్ శుక్లా, లండన్ నుంచి ఆండ్రూఫ్ ఆన్​లైన్​లో పర్యవేక్షించారు. అనంతరం మహబూబ్ నగర్ రైల్వే కమ్యూనిటీ హాల్ లో గిన్నిస్ వర్దల్డ్ రికార్డ్ అటెంప్ట్, లార్జెస్ట్ సీడ్ బాల్ సెంటెన్స్ కార్యక్రమం జరిగింది. దీనినంతటిని పరిశీలించిన గిన్నిస్ సంస్థ ప్రతినిధి రిశినాథ్, 73 వేల 918 విత్తన బంతులతో అతిపెద్ద వాక్యానికి రూపకల్పన చేసి ప్రపంచ రికార్డు సృష్టించినట్లు ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు కల్పిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, ఎంపీ సంతోష్ కుమార్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్లు తేజస్‌ నందలాల్‌ పవార్‌, సీతారామారావు, మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు, డీ సీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, డీఆర్డీవో యాదయ్య, మెప్మా పీడీ శంకరాచారి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు శారద, నాగమల్లిక, పాలమూరు జిల్లా మహిళా సమాఖ్య, డీఆర్డీఏ, మెప్మా, హెటెరో గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.[5][6]

పక్షుల సంరక్షణ కేంద్రం

[మార్చు]

ఈ పార్కులోని ఎకరం స్థలంలో రూ.1.65 కోట్లతో పక్షుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుననట్లు రాష్ట్ర అటవీశాఖ పరిపాలన ఉత్తర్వులను జారీ చేసింది. మకావోస్ ఫించ్, కాక్టల్, రెయిన్బో లోరీకీట్, లవ్ బర్డ్స్, రోసెల్లా, బడే రీగర్, పారాకీట్, కోక్కాటో, టర్కీ, పీజియన్ వంటి 11 రకాల జాతులకు చెందిన 100కు పైగా పక్షులను ఉంచనున్నారు.[7]

సదుపాయాలు

[మార్చు]

ఈ పార్కులో 8.71 లక్షల రూపాయలతో నిర్మించిన పెర్క్యులేషన్ ట్యాంక్, 3.70 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన సోలార్ పంప్ సెట్, 1.86 లక్షల రూపాయలతో ఏర్పాటుచేసిన బటర్ ఫ్లై సెల్ఫీ పాయింట్, జిల్లాకు చెందిన స్వయం సహాయక మహిళా సంఘాలు ఏర్పాటుచేసిన ‘మహా బ్రాండ్’ స్టాల్ ను 2022 జూన్ 24న మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ప్రారంభించారు. సెల్ఫీ పాయింట్ వద్ద మంత్రులు సెల్ఫీలు దిగారు.[8]

మూలాలు

[మార్చు]
  1. "మయూరి హరిత వనం (ఏకో పార్క్ ) | మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ | India". Retrieved 2022-06-18.
  2. 2.0 2.1 telugu, NT News (2021-10-08). "పాలమూరుకు పచ్చని తివాచీ". Namasthe Telangana. Archived from the original on 2021-10-11. Retrieved 2022-06-18.
  3. "అద్భుతం: కేసీఆర్ ఎకోపార్కుకు 100 ఏండ్లనాటి చెట్లు.. పాలమూరులో ట్రాన్స్ లొకేషన్ సక్సెస్". Prabha News. 2022-04-17. Archived from the original on 2022-04-17. Retrieved 2022-06-18.
  4. "మినీ జూ ఏర్పాటుకు రూ. 50 లక్షలు మంజూరు: ఎంపీ సంతోష్". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2022-03-22. Archived from the original on 2022-04-12. Retrieved 2022-06-18.
  5. "SEED BALLS: విత్తన బంతులతో పాలమూరు యంత్రాంగం గిన్నిస్ రికార్డు". ETV Bharat News. 2021-07-12. Archived from the original on 2022-06-18. Retrieved 2022-06-18.
  6. telugu, NT News (2021-07-13). "సీడ్ బాల్స్ గిన్నిస్ రికార్డ్". Namasthe Telangana. Retrieved 2022-06-18.
  7. "మయూరిలో పక్షుల సంరక్షణ కేంద్రం". EENADU. 2022-06-04. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-18.
  8. telugu, NT News (2022-06-24). "నాడు ఒక్క పార్కు లేదు.. నేడు ఎటు చూసినా పార్కులే : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్". Namasthe Telangana. Archived from the original on 2022-06-24. Retrieved 2022-06-25.