Jump to content

కైలాస పర్వతం

అక్షాంశ రేఖాంశాలు: 31°4′0″N 81°18′45″E / 31.06667°N 81.31250°E / 31.06667; 81.31250
వికీపీడియా నుండి
(కైలాస పర్వతము నుండి దారిమార్పు చెందింది)
కైలాస పర్వతం
కైలాస పర్వతపు ఉత్తరముఖం
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు6,638 మీ. (21,778 అ.)
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్1319
నిర్దేశాంకాలు31°4′0″N 81°18′45″E / 31.06667°N 81.31250°E / 31.06667; 81.31250
భౌగోళికం
కైలాస పర్వతం is located in Tibet
కైలాస పర్వతం
కైలాస పర్వతం
పర్వత శ్రేణిహిమాలయ పర్వతశ్రేణి
అధిరోహణం
మొదటి అధిరోహణఅధిరోహణ నిషిద్ధం

కైలాస పర్వతం (టిబెట్ భాష: གངས་རིན་པོ་ཆེ, కాంగ్రింబొకె లేదా గాంగ్ రింపోచే; సంస్కృతం: कैलाश पर्वत, కైలాస పర్వత; చైనీస్: 冈仁波齐峰, గంగ్రెన్ బొకి ఫెంగ్ ) టిబెట్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన, కైలాస శ్రేణిలోని ఒక పర్వత శిఖరం. ఆసియాలోని అతి పెద్ద నదుల్లో కొన్నైన సింధు నది, సట్లేజ్ నది (సింధూ నది యొక్క ప్రధాన ఉపనది), బ్రహ్మపుత్రా నది, కర్నాలి నది (గంగా నది యొక్క ఉపనది) ఈ పర్వతపు సమీపంలోనే ఉద్భవిస్తాయి. బోన్ (ఒక టిబెట్ మతం), బౌద్ధ, హిందూ, జైన మతాలు ఈ పర్వతాన్ని పవిత్రస్థలంగా భావిస్తాయి. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి నిలయంగా భావించబడుతుంది. ఈ పర్వతం టిబెట్ లోని మానససరోవరానికి, రాక్షసతాల్ సరస్సుకి సమీపంలో ఉంది.

పదవ్యుత్పత్తి

[మార్చు]

సంస్కృతంలో కైలాశ అంటే "స్ఫటికం" అని అర్థం. సంస్కృత పదం కేలస నుండి ఈ పదం వచ్చిందని భావించబడుతుంది. కేలస అనగా సంస్కృతంలో స్ఫటికం. ఈ పర్వతపు టిబెటన్ పేరు గాంగ్స్ రిన్-పో-చే . టిబెటన్ భాషలో గాంగ్స్ లేదా కాంగ్ అంటే మంచు శిఖరం; రింపోచే అంటే "అమూల్యమైంది" అన్న గౌరవార్థక అర్థం, కనుక ఈ సంయుక్త పదాన్ని "విలువైన హిమ రత్నం"గా అనువదించవచ్చు.

"టిబెటన్ బౌద్ధులు దీనిని కాంగ్రి రింపోచే; 'విలువైన హిమ పర్వతం' అంటారు. బోన్ భాషా గ్రంథాల్లో ఈ పర్వతానికి జల పుష్పం, సాగర జల పర్వతం, తొమ్మిది దొంతరల స్వస్తిక్ పర్వతం మొదలైన అనేక పేర్లు ఉన్నాయి. హిందువులకి ఇది వన్య పర్వత దేవుడు శివుని ఇల్లు, అతని శక్తి చిహ్నం "ఓం" కు ప్రతీక. జైనులకిది మొదటి తీర్ధంకరుడు జ్ఞానం పొందిన చోటు; బౌద్దులకిది ప్రపంచపు నాభి; బోన్ అనుయాయులకి ఆకాశ దేవత సిపయిమేన్ నివాసం."[1]

ఈ పర్వతానికి ఉన్న మరొక స్థానిక పేరు టిసే పర్వతం, ఇది ఝాంగ్-ఝుంగ్ భాషలోని టిసే నుంచి పుట్టింది, దీని అర్థం "జల శిఖరం" లేదా "నదీ శిఖరం". బోన్ పౌరాణికాల్లోని సింహం, గుర్రం, నెమలి, ఏనుగు నదులకి మూలంగా భావించబడే ఈ పర్వతానికిది సముచితమైన పేరు. వాస్తవానికి సింధు, యార్లుంగ్ త్సాంగ్పో/డిహాంగ్/బ్రహ్మపుత్ర, కర్నాలి, సట్లేజ్ నదులు అన్నీ కైలాస-మానససరోవర ప్రాంతంనుండే ప్రారంభమవుతాయి.[2]

చరిత్ర

[మార్చు]
కైలాస పర్వతం హిందూ ప్రాముఖ్యతను వివరించే విధంగా శివడు, పార్వతి, గణేశుడు, కార్తికేయుడు కైలాస పర్వతంపై నివసిస్తున్నట్లు చిత్రించిన పటం

కైలాశ పర్వతం టిబెట్ హిమాలయాల్లో భాగమైన గాంగ్డిసె పర్వతాలలో ఒక శిఖరం. ఇది ఆసియాలోని పెద్ద నదులలో కొన్ని సింధు నది, సట్లేజ్ నది (సింధు నది ప్రధాన ఉపనది), బ్రహ్మపుత్ర నది, కర్నాలి నది (గంగా నది ఉపనది) మూలానికి దగ్గరగా ఉంటుంది. ఇది నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది, అవి:బోన్, బుద్ధిజం, హిందూ మతం, జైనిజం. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి నిలయంగా భావించబడుతుంది. ఈ పర్వతం టిబెట్ లోని మానససరోవరానికి, రాక్షస్తల్ సరస్సుకి దగ్గరగా ఉంటుంది. కొంతమంది యాత్రికులు కైలాష పర్వత యాత్ర అంతా ఒక్కరోజు లోనే చెయ్యాలని నమ్ముతారు. అదంత సులభం కాదు. మంచి ఆకృతి గల వేగంగా నడిచే మనిషి ఈ 52 కి.మీ. పూర్తి చెయ్యడానికి దాదాపు 15 గంటలు పడుతుంది. అస్థిర వాతావరణం, ఎత్తువల్ల వచ్చే అస్వస్థత, ఈ ప్రక్రియలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకి కొంచెం భయపడి నప్పటికీ కొంతమంది భక్తులు ఈ సాహసాన్ని పూర్తిచేస్తారు. అలాగే ఇతర యాత్రికులు ఇంకొంచెం ఎక్కువ పథ్యాన్ని పాటిస్తూ చేస్తారు, మొత్తం ప్రదక్షిణ అంతా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ చేస్తారు. యాత్రికుడు వంగి మోకాళ్ళ మీద కూర్చొని మొత్తం సాగిలపడి వేళ్ళతో గుర్తు చేసి మోకాళ్ళ మీద లేచి ప్రార్థించి చేతులతో, మోకాళ్ళతో అక్కడివరకు ప్రాకి మళ్లీ మళ్లీ ఈ పద్ధతిని పునరావృతం చేస్తారు. ఈ పథ్యాన్ని పాటిస్తూ ప్రదక్షిణ పూర్తి చేయడానికి కనీసం నాలుగు వారాల శారీరక ఓరిమి అవసరమవుతుంది. ఈ పర్వతం టిబెటన్ హిమాలయాలలో యాత్రికుల సౌకర్యార్థం కొన్ని ఆధునిక వసతులైన బెంచీలు, విశ్రాంతి ప్రదేశాలు, ఉపాహార కేంద్రాలు ఏర్పాటుచేయబడ్డాయి. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలు పెట్టటం మహా పాపం. ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలో మరణించారని చెపుతారు

1950లో చైనిస్ సైన్యం టిబెట్ లో అడుగు పెట్టిన తరువాత, చైనిస్-ఇండియన్ సరిహద్దులలో నెలకొన్న రాజకీయ, సరిహద్దు అనిశ్చితి వలన శివ భగవానుడి నివాసానికి చేసే తీర్థయాత్ర 1954 నుండి 1978 వరకు నిలిపివేయబడింది. దానితరువాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది, వీరు చైనిస్, భారతీయ ప్రభుత్వాల పర్యవేక్షణలో సుదీర్ఘమైన, క్లిష్టమైన హిమాలయాల అధిరోహణ చేస్తారు, భూమార్గం గుండా కాట్మండు నుండి లేదా లాసా నుండి విమానాల ద్వారా టిబెట్ చేరుకొని అక్కడినుండి గొప్ప టిబెటన్ పీఠభూమిని కారులో చుడతారు. ఈ ప్రయాణం నాలుగు రాత్రులు పడుతుంది, చివరికి దార్చేన్ చేరతారు,

ఇక్కడి చిన్న అవుట్ పోస్ట్ ప్రతి సంవత్సరం ప్రత్యేక సమయంలో తీర్థయాత్రికులతో నిండిపోతుంది. కనిష్ఠ సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ విదేశీ తీర్థ యాత్రికుల కోసం ఆధునిక గెస్ట్ హౌసులు అందుబాటులో ఉన్నాయి, అదే టిబెటన్ తీర్థ యాత్రికులయితే సాధారణంగా వారి సొంత టెంట్లలో నిద్రపోతారు. సుదూర-తూర్పు టిబెట్ లోని స్విస్ కోర్సం ఫౌండేషన్ నిదులన్దించే చిన్న ప్రాంతీయ వైద్య కేంద్రం 1997లో ఇక్కడ స్థాపించబడింది.

మతపరమైన ప్రాధాన్యత

[మార్చు]

హిందూ మతం

[మార్చు]

హిందూ మతం ప్రకారం దుష్ట శక్తులను, బాధలను నశింపజేసే శివుడు కైలాస పర్వతమనబడే ప్రఖ్యాత పర్వతపు శిఖరాగ్రంలో నివశిస్తాడు, ఇక్కడ ఈయన తన భార్య పార్వతితో కలిసి నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు. చార్లెస్ అల్లెన్ ప్రకారం విష్ణు పురాణంలోని కైలాస పర్వతపు వర్ణనలో, దీనికి నాలుగు ముఖాలని, అవి స్ఫటికం, రూబీ, బంగారం, లాపిస్ లజూయితో ఏర్పడ్డాయని చెప్పబడింది.[3] ఇది ప్రపంచపు పునాది స్తంభమని, తామర పువ్వు రెక్కలలాగా విస్తరించి ఉన్న ఆరు పర్వత శ్రేణులు కలిసే కేంద్రస్థానంలో ఉంది.[3] కైలాశం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి.[3]

మహారాష్ట్రలోని ఎల్లోరా గుహాలయాల్లో అతి పెద్దదైన, అత్యంత ప్రధానమైన కైలాష గుడి పేరు కైలాస పర్వతం పేరు మీద పెట్టబడింది. దీనిలోని అనేక శిల్పాలు శివుడు, పార్వతి, రావణాసురుని కథలని చిత్రించినవే. రావణుడు శివభక్తుడు. రావణుడు కైలాస పర్వతాన్ని కదిలించిన వైనం రామాయణంలో చెప్పబడలేదు. రావణుడి తల్లి వ్యాధిగ్రస్తమవుతుంది. అవసాన దశలో ఉన్న తల్లికి కైలాస దర్శనం కలుగజేసేందుకు, గుడిని తన వీపు మీద పెట్టుకొని తల్లికి దగ్గరగా తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. శివుడు అతని ధైర్యానికి మెచ్చి అతను తను పెట్టిన భక్తి పరీక్షలో నెగ్గినందున అతనికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు.[4]

బౌద్ధంలో

[మార్చు]
టిబెటన్, నేపాలీ థంకా కళాశైలిలో చిత్రించిన కైలాస పర్వతం
కైలాస పర్వతపాదంలో బౌద్ధ స్థూపాలు

తాంత్రిక బౌద్ధులు కైలాసాన్ని చక్రసంవర (డెంచోక్) బుద్ధుని ఆవాసంగా భావిస్తారు.[5] ఇతను శాశ్వతానందానికి ప్రతినిధి. ఇక్కడి చాలా ప్రదేశాలు గురు రింపోచే (పద్మసంభవుడు) తో ముడిపడి ఉన్నాయి. ఈయన సా.శ. 7-8 శతాబ్దాలలో టిబెట్ లోని అనేక ప్రదేశాలలో చేసిన తాంత్రిక అభ్యాసాలు, బోధనలు ఈ దేశంలో బౌద్ధం ప్రధాన మతంగా పరిణామం చెందడానికి దోహదమయ్యాయి.[6]

తాంత్రిక బౌద్ధ ప్రబోధకుడైన మిలరేపా (1052 – 1135) బోన్ మత ప్రబోధకుడైన నారో బోన్-చుంగ్ ని సవాలు చేయడానికి టిబెట్ వచ్చాడని చెపుతారు. ఈ ఇద్దరు మాంత్రికులు భీకరమైన మాంత్రిక మాయజాల యుద్ధం చేసారు కానీ ఎవరూ నిర్ణయాత్మకంగా విజయం సాధించలేదు. చివరికి కైలాస పర్వత శిఖరాగ్రాన్ని ఎవరైతే ముందుగా చేరతారో వారే విజేత అనే ఒప్పందం కుదిరింది. ఆ పోటీలో నారో బోన్-చుంగ్ మాయా ఢంకా మీద కూర్చొని పర్వత శిఖరం ఎత్తుకు ఎగరటం ప్రారంభించాడు. ఇలా ఉండగా, మిలరేపా సావధానంగా కూర్చొని ధ్యానం చేయడాన్ని చూసి ఆయన అనుయాయులు నిశ్చేష్టులయ్యారు. నారో బోన్-చుంగ్ దాదాపు శిఖరాగ్రానికి చేరుకోబుతుండగా మిలరేపా హఠాత్తుగా రంగంలోకి దిగి, సూర్య కిరణాలపై ప్రయాణం చేసి, నారో బోన్-చుంగ్ కంటే ముందే శిఖరాగ్రాన్ని చేరి పోటీలో గెలిచాడు. మిలరేపా అదే సమయంలో గుప్పెడు మంచుని దగ్గరిలోని పర్వతాగ్రంపై చల్లి బోన్పోకు (బోన్ మతావలంబికులను బోన్పో అంటారు) దత్తం చేశాడు. అప్పటినుండి అది బోన్రిగా పిలవబడుతూ, బోన్ మతంతో ఆ ప్రాంతపు సంబంధాలు కొనసాగేలా చేసింది.[7][8][9]

బోన్ లో

[మార్చు]

టిబెట్ స్థానిక మతమైన బోన్ లో, యావత్తు మార్మిక ప్రాంతం, తొమ్మిదంతస్థుల స్వస్తిక పర్వతాన్ని ఆధ్యాత్మిక శక్తికంతటికీ కేంద్రంగా భావిస్తారు.

తీర్థయాత్ర

[మార్చు]
మానసరోవరం (కుడివైపు), ముందువైపు రాక్షసతాల్ కలిగిన కైలాస పర్వతం ఉపగ్రహచిత్రం
కైలాస పర్వతం

ప్రతి సంవత్సరం వేల సంవత్సరాలనాటి సంప్రదాయాన్ని పాటిస్తూ వేలమంది కైలాస పర్వతానికి తీర్థయాత్ర చేస్తారు. అనేక మతాలకి చెందిన యాత్రికులు కైలాస పర్వతాన్ని పాదాలతో చుట్టిరావడం పుణ్యఫలదాయకమైన పవిత్ర ఆచారంగా నమ్ముతారు. హిందువులు, బౌద్ధులు ఈ ప్రదక్షిణాయాత్రని సవ్యదిశలో చేస్తారు. జైన, బోన్ పో మత అనుయాయులు ఈ పర్వతాన్ని అపసవ్య దిశలో చుడతారు. కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రదక్షిణామార్గం 52 కి.మీ. (32 మై.) పొడవైనది.

కొంతమంది యాత్రికులు కైలాస పర్వత ప్రదక్షిణ మొత్తం ఒక్కరోజులోనే పూర్తి చెయ్యాలని నమ్ముతారు. అదంత సులభం కాదు. మంచి శారీరక పటుత్వంతో వేగంగా నడవగలిగే మనిషికి ఈ 52 కిలోమీటర్ల యాత్రను పూర్తి చెయ్యడానికి దాదాపు 15 గంటలు పడుతుంది. అస్థిర వాతావరణం, ఎత్తుప్రదేశం వల్ల వచ్చే అస్వస్థత, ఈ ప్రక్రియలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకి భయపడినప్పటికీ కొంతమంది భక్తులు ఈ సాహసాన్ని ఒక్క రోజులోనే పూర్తిచేస్తారు. అలాగే మరికొంతమంది యాత్రికులు మొత్తం ప్రదక్షిణ అంతా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ ప్రదక్షిణను పూర్తిచేస్తారు. యాత్రికుడు వంగి, మోకాళ్ళ మీద కూర్చొని, మొత్తం సాగిలపడి వేళ్ళతో గుర్తు చేసి, మోకాళ్ళ మీద లేచి ప్రార్థించి, చేతులతో, మోకాళ్ళతో గుర్తిపెట్టిన స్థలం వరకు ప్రాకి మళ్లీ మళ్లీ ఈ పద్ధతిని పునరావృతం చేస్తారు. ఈ విధంగా ప్రదక్షిణ పూర్తి చేయడానికి కనీసం నాలుగు వారాల శారీరక ఓరిమి అవసరమవుతుంది. ఈ పర్వతం టిబెటన్ హిమాలయాలలో మారుమూల ప్రాంతంలో, ఆశ్రయం ఇవ్వడానికి కూడా ఎలాంటి జనావాసాలు కూడా లేని చోట ఉంది. యాత్రికుల సౌకర్యార్థం కొన్ని ఆధునిక వసతులైన బెంచీలు, విశ్రాంతి ప్రదేశాలు, ఉపాహార కేంద్రాలు ఏర్పాటుచేయబడ్డాయి. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాలు, పవిత్రమైన ఈ పర్వతంపై కాలు పెట్టటం మహా పాపమని నమ్ముతాయి. ఈ నమ్మకాన్ని మూఢనమ్మకంగా నిరూపించటానికి ప్రయత్నించిన వారంతా ఆ ప్రయత్నంలో మరణించారని చెపుతారు[ఆధారం చూపాలి]. ఇక్కడినుండి స్వర్గానికి సోపానమార్గముందని కూడా భక్తులు నమ్ముతారు.

1950లో చైనా సైన్యం టిబెట్ లో అడుగు పెట్టిన తరువాత, చైనా-భారత సరిహద్దులలో నెలకొన్న రాజకీయ, సరిహద్దు అనిశ్చితి వలన, ఈ తీర్థయాత్ర 1954 నుండి 1978 వరకు నిలిపివేయబడింది. దాని తరువాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది. వీరు చైనా, భారతీయ ప్రభుత్వాల పర్యవేక్షణలో సుదీర్ఘమైన, క్లిష్టమైన హిమాలయాల అధిరోహణ చేస్తారు. కాట్మండు భూమార్గం గుండా ప్రయాణం చేయవచ్చు లేదా కాట్మండు నుండి లాసాకు విమానంలో ప్రయాణించి, అక్కడినుండి కారులో టిబెటన్ పీఠభూమిపై ప్రయాణిస్తూ ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ ప్రయాణం నాలుగు రాత్రులు పడుతుంది. చివరికి సముద్రతలానికి 4,600 మీటర్ల ఎత్తులో ఉన్న దార్చేన్ అనే చిన్న అవుట్ పోస్ట్ చేరతారు. ఈ ప్రదేశం ప్రతి సంవత్సరం యాత్రా సమయంలో తీర్థయాత్రికులతో నిండిపోతుంది. కనిష్ఠ సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ విదేశీ తీర్థయాత్రికుల కోసం ఆధునిక అతిధిగృహాలు అందుబాటులో ఉన్నాయి. అదే టిబెటన్ తీర్థ యాత్రికులయితే సాధారణంగా వారి సొంత గుడారాల్లో బసచేస్తారు. సుదూర-పశ్చిమ టిబెట్ ప్రాంతానికి సేవలందించడానికి, స్విస్ న్‌గారీ కోర్సం ఫౌండేషన్ 1997లో ఇక్కడ ఒక చిన్న ప్రాంతీయ వైద్య కేంద్రాన్ని నెలకొల్పింది.

పవిత్ర పర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో మాత్రం ప్రయాణమంతా, కాలి నడకన, లేదా పోనీపైగానీ, జడల బర్రె పై చేయాలి. ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు15,000 అ. (4,600 మీ.) టర్బోచే (జెండా స్తంభం) ఎత్తు నుండి అధిరోహించటం ప్రారంభిస్తే మూడు రోజులు పడుతుంది, డ్రోల్మ పాస్18,200 అ. (5,500 మీ.) దాటాక దారిగుండా రెండు రాత్రులు పడుతుంది. మొదట దిరాపుక్ గొంప మైదానం దగ్గర కొంచెం పాస్ కి ముందు, 2 నుండి 3 కి.మీ. (1.2 నుండి 1.9 మై.) రెండు పాస్ దాటిన తరువాత సాధ్యమైనంత క్రిందకి దిగిన తరువాత (దూరంలో గౌరీ కుండ్ కనిపిస్తుంది).

పర్వతారోహణ

[మార్చు]
కైలాస పర్వతపు ఉత్తరముఖం
దక్షిణ ముఖం

కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నాలు ఇప్పటి వరకూ ఏవీ జరగలేదు. ఇది బౌద్దుల, హిందువుల నమ్మకాలకి వ్యతిరేక చర్యగా భావించి అధిరోహకులు ఈ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నాలు చేయలేదని భావించబడుతున్నది. 1926 లో హ్యూగ్ రట్లెడ్జ్ పర్వతపు ఉత్తర ముఖాన్ని అధ్యయనం చేసి, 6000 అడుగుల ఎత్తున్న శిఖరాగ్రం ఎక్కడానికి చాలా కష్టతరమైనదని తీర్మానించాడు[10] ఈశాన్యపు అంచునుండి ఎక్కేందుకు ప్రణాళిక వేసుకున్నాడు కానీ, సమయం చాల్లేదు. రట్లెడ్జ్, ఆ ప్రాంతాన్ని కల్నల్ ఆర్.సి.విల్సన్ తో పాటు సందర్శించాడు. విల్సన్ పర్వతానికి అవతలి వైపున, త్సేతెన్ అనే షెర్పాతో పాటు ఉన్నాడు. విల్సన్ చెప్పినదాని ప్రకారం, త్సేతెన్ తాము ఉన్న కోణం (ఆగ్నేయం) నుండి పర్వతాన్ని అధిరోహించే వీలు ఉన్నదని భావించి "సాహిబ్ మనం దాన్ని ఎక్కగలం" అని అన్నాడు.[11] విల్సన్ ఆల్పైన్ జర్నల్ (1928) అనే పర్వతారోహణా పత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని బట్టి, విల్సన్ ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు తీవ్రంగా నిశ్చయించుకున్నాడని తెలుస్తున్నది. కానీ విల్సన్ కూడా సమయాభావం వల్ల ప్రయత్నించలేదు. హెర్బర్డ్ టీచీ 1936లో, గుర్లా మాంధాత పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నం చేస్తూ, ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆయన, కైలాస పర్వతాన్ని ఎక్కగలమా అని న్‌గారీకి చెందిన ఒక గార్పోన్ వ్యక్తిని అడగగా, ఆ గార్పోన్ వ్యక్తి "పూర్తిగా పాపరహితమైన వ్యకులు మాత్రమే కైలాస పర్వతాన్ని ఎక్కగలరు. అలాంటి వ్యక్తులు ఈ ఏటవాలు హిమకుడ్యాలను ప్రయాసపడి ఎక్కనవసరం లేదు. ఒక పక్షిలాగ మారి శిఖరాగ్రానికి ఎగరగలడు" అని సమాధానిమిచ్చాడట.[12] 1980వ దశకం మధ్యలో చైనా ప్రభుత్వం, ఇటలీకి చెందిన ప్రఖ్యాత పర్వతారోహకుడైన, రైన్‌హోల్డ్ మెస్నర్ కు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు అవకాశమిచ్చింది కానీ, ఆయన దాన్ని తిరస్కరించాడు.[13]

2001లో చైనా, ఒక స్పానిష్ పర్వతారోహణ బృందానికి కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు అనుమతినిచ్చింది కానీ, అంతర్జాతీయ అభ్యంతరాలకు తలొగ్గి, పర్వతారోహణ ప్రయత్నాలన్నింటినీ నిషేధించేందుకు నిర్ణయించింది.[13] స్పానిష్ బృందపు ప్రణాళికను ఖండిస్తూ, రైన్‌హోల్డ్ మెస్నర్, "మనం ఈ పర్వతాన్ని జయిస్తే, ప్రజల మనసుల్లోని పవిత్ర విశ్వాసాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తాము..నేను వారిని (స్పానిష్ బృందం) ఇంకాస్త కఠినమైన పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రోత్సహిస్తాను. కైలాస పర్వతం పెద్ద ఎత్తయింది కాదు, అంత కష్టమైంది కూడా కాదు." అని అన్నాడు.[14]

గమనికలు

[మార్చు]
  1. Albinia (2008), p. 288. abc
  2. Camaria, Pradeep (1996), Kailash Manasarovar on the Rugged Road to Revelation, New Delhi: Abhinav, retrieved 11 June 2010
  3. 3.0 3.1 3.2 Allen, Charles. (1982). A Mountain in Tibet, pp. 21–22. André Deutsch. Reprint: 1991. Futura Publications, London. ISBN 0-7088-2411-0.
  4. The Sacred Mountain, pp.15
  5. http://www.khandro.net/deity_Chakrasamvara.htm
  6. The Sacred Mountain, pp. 39, 33, 35, 225, 280, 353, 362-363, 377-378
  7. The Sacred Mountain, pp. 31, 33, 35
  8. The World's Most Mysterious Places Published by Reader's Digest ISBN 0-276-42217-1 pg.85
  9. The Sacred Mountain, pp. 25–26
  10. The Sacred Mountain, p. 120
  11. The Sacred Mountain, p. 116
  12. The Sacred Mountain, p. 129
  13. 13.0 13.1 "China to Ban Expeditions on Mt Kailash". tew.org. Archived from the original on 18 జూలై 2011. Retrieved 11 నవంబరు 2016.
  14. "Scaling a Mountain to Destroy The Holy Soul of Tibetans". tew.org. Archived from the original on 27 ఏప్రిల్ 2011. Retrieved 11 నవంబరు 2016.

వీటిని కూడా చూడండి

[మార్చు]

మూల గ్రంథాలు

[మార్చు]
  • Albinia, Alice. (2008) Empires of the Indus: The Story of a River. First American Edition (2010) W. W. Norton & Company, New York. ISBN 978-0-393-33860-7.
  • Snelling, John. (1990). The Sacred Mountain: The Complete Guide to Tibet's Mount Kailas. 1st edition 1983. Revised and enlarged edition, including: Kailas-Manasarovar Travellers' Guide. Forwards by H.H. the Dalai Lama of Tibet and Christmas Humphreys. East-West Publications, London and The Hague. ISBN 0-85692-173-4.

బాహ్య లింకులు

[మార్చు]