Jump to content

కొండూరు వీరరాఘవాచార్యులు

వికీపీడియా నుండి
కొండూరు వీరరాఘవాచార్యులు సాహితీవేత్త, పండితుడు
వ్యక్తిగత వివరాలు
జననం1912 సెప్టెంబర్ 26
తెనాలి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్
మరణం1995 జనవరి 19
జాతీయతభారతీయుడు
తల్లిపార్వతమ్మ
తండ్రికోటీశ్వరాచార్యులు

కళాప్రపూర్ణ ఆచార్య కొండూరు వీరరాఘవాచార్యులు ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు. రాఘవాచార్యులు శాస్త్ర పాండిత్యంతో పాటు కవితా సంపదను, ప్రాచీన సంప్రదాయాలతో పాటు ఆధునికరీతులను, సమపాళ్లలో మేళవించుకున్న సాహితీవేత్తలలో దర్శనాచార్య బిరుదాంకితుడైన ఆచార్య కొండూరు వీరరాఘవాచార్యులు ఒకరుగా చెప్పుకోవచ్చు. ఈయన అనేక గద్య, పద్య రచనలు చేసి, ఆచార్యులుగా మూడు దశాబ్దాలుగా తెలుగు సాహితీ ప్రపంచానికి చిరపరిచితులు.

జీవితవిశేషాలు

[మార్చు]

వీరరాఘవాచార్యులు 1912, సెప్టెంబరు 26కు సరియైన పరీధావి నామ సంవత్సర భాద్రపద పూర్ణిమ, గురువారం నాడు గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని, కోపల్లె గ్రామంలో జన్మించాడు. పార్వతమ్మ, కోటీశ్వరాచార్యులు ఇతని తల్లిదండ్రులు. ఈయన తెనాలిలోని సంస్కృత కళాశాలలో త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి వద్ద విద్యను అభ్యసించి 1936లో ఉభయభాషా ప్రవీణుడైనాడు. ఈయన బాల్యంలోనే శిల్పకవితా కళలతో పాటు యోగ, వేదాంతంలలో శిక్షణ పొందాడు. గుంటూరులోని శారదానికేతనం, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూలు మొదలైన ఉన్నతపాఠశాలలలో సంస్కృతాంధ్ర పండితుడిగా పనిచేశాడు. తర్వాత తెనాలిలోని వి.యస్.ఆర్ కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు[1].

పదవులు

[మార్చు]
  • ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం సంచాలకులు 1974 నుండి 1984 వరకు
  • ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం గౌరవాధ్యక్షులు 1985 నుండి 1995 వరకు
  • ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ సభ్యుడు
  • ఆంధ్రప్రదేశ్ శిల్పకళాపరిషత్ కార్యదర్శి

రచనలు

[మార్చు]
  1. ఆత్మదర్శనం
  2. శిల్పదర్శనం
  3. సాహిత్య దర్శనం
  4. తోరణము
  5. అమరావతి[2] (పద్యకావ్యము)
  6. మిత్ర సాహస్రి[3]
  7. లేపాక్షి[4] (నవల)
  8. మోహనాంగి[5] (నవల)
  9. కళారాధన[6] (నవల)
  10. భోజరాజీయము[7] (అనంతామాత్యుని రచనకు సంగ్రహరూపం, సంపాదకత్వం)
  11. శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతమ్‌ [8] (సంస్కృతం)
  12. శ్రీ సిద్ధయ్య చరిత్ర కాలజ్ఞాన సహితము[9]
  13. మూడుకావ్యాలు[10] (రామాయణ భారత భాగవతముల సమీక్ష)
  14. ఋగ్వేద రహస్యాలు[11]
  15. యజుర్వేద దర్శనము
  16. దిగ్దర్శనము
  17. నిరంజన విజయము
  18. శిల్పకళాక్షేత్రాలు
  19. ఆసియా జ్యోతులు
  20. మన గురుదేవుడు
  21. తత్వసాధన
  22. తత్వ సూక్తులు
  23. విశ్వకర్మ పురాణం,
  24. గాయత్రీ విశ్వకర్మలు,
  25. విశ్వస్వరూపం మొదలైనవి.

కళారాధన

[మార్చు]

విశిష్టాద్వైత సిద్ధాంతకర్త, ఆళ్వారులలో ఒకరు అయిన రామానుజాచార్యులు వైష్ణవాన్ని వ్యాపింపజేస్తున్నప్పటి గాథను ఇతివృత్తంగా స్వీకరించి వీరరాఘవాచార్యులు కళారాధన నవల రచించారు. వీరబల్లాలుడనే కన్నడ రాజు కళారాధన, ఆ కళారాధన ద్వారానే విష్ణుభక్తి అతనిలో పాదుకొల్పిన రామానుజుని చమత్కృతి వంటివి ఇందులో ప్రధానాంశాలు. స్థపతులుగా విలసిల్లి అపురూపమైన ఆలయాలు, విగ్రహాలు చెక్కిన విశ్వబ్రాహ్మణ కులస్తుల గురించి ఈ నవలలో ఎంతగానో ప్రసక్తి కలుగుతుంది. శిల్పకళా రహస్యములు ఎరిగి ఈ గ్రంథం రాసినట్టు పలువురు పండితులు పరిశీలన.

పండితాభిప్రాయము

[మార్చు]

"మన రచయితలలో ప్రాచీన గ్రంథాలు చదివి, సంప్రదాయ జ్ఞానముతో అనుభవ పూర్వకంగా రచనలు చేసే వారు బహుతక్కువ. అయితే వీరరాఘవాచార్య అలాంటి వారు కాదు" - కళాప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణ

పురస్కారాలు

[మార్చు]
  • మద్రాసు విద్వత్ సదస్సులో పండితుల సమక్షంలో దర్శనాచార్య అనే బిరుదు ప్రదానం.
  • 1938లో అయోధ్య సంస్కృత పరిషత్తు వారిచే విద్యాధురీణ బిరుద ప్రదానం
  • 1939లో మైసూరు మహారాజా వారిచే సత్కారం
  • 1972లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారిచే కళాప్రపూర్ణ బిరుద ప్రదానం.

మరణం

[మార్చు]

ఇతడు సహస్రమాసజీవియై తెనాలిలో 1995, జనవరి 19న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. విశ్వబ్రాహ్మణ సర్వస్వము - రాపాక ఏకాంబరాచార్యులు - పేజీలు 439-440
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో అమరావతి పుస్తక ప్రతి
  3. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మిత్రసాహస్రి పుస్తక ప్రతి
  4. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో లేపాక్షి పుస్తక ప్రతి
  5. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మోహనాంగి పుస్తక ప్రతి
  6. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కళారాధన పుస్తక ప్రతి
  7. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో భోజరాజీయము పుస్తక ప్రతి
  8. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతమ్‌ పుస్తక ప్రతి
  9. సరళ సుబోధకం సిద్ధయ్య చరితం- చరణ శ్రీ[permanent dead link]
  10. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మూడుకావ్యాలు పుస్తక ప్రతి
  11. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఋగ్వేద రహస్యాలు పుస్తక ప్రతి

బయటి లింకులు

[మార్చు]

నరిశెట్టి ఇన్నయ్య గారి వ్యాసం