గంటేడ గౌరునాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గంటేడ గౌరునాయుడు ప్రముఖ తెలుగు కథా రచయిత, కవి.

గంటేడ గౌరునాయుడు
జననం(1954-08-07)1954 ఆగస్టు 7
విజయనగరం జిల్లా, కొమరాడ మండలం దళాయిపేట గ్రామం
వృత్తిఉపాధ్యాయుడు
మతంహిందూ
భార్య / భర్తజానకి
పిల్లలుకిరణ్ కుమార్, క్రాంతి కుమార్
తండ్రిగంటేడ సత్యంనాయుడు
తల్లిసోములమ్మ

జీవితవిశేషాలు[మార్చు]

ఇతడు విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని దళాయిపేటలో సత్యంనాయుడు, సోములమ్మ దంపతులకు 1954 ఆగస్టు 7న జన్మించాడు.[1] [2] చిన్నతనంలో జముకు పాటలకు ఆకర్షితుడైనాడు.ప్రాథమిక విద్య దళాయిపేటలో, ఉన్నత పాఠశాల చదువు కోటిపాంలో, ఇంటర్‌మీడియెట్ పార్వతీపురంలో చదివాడు. ఇంటర్‌మీడియెట్ చదివిన తరువాత చదువు మానేసి కొద్దిరోజులు వ్యవసాయం చేసాడు. సామవేదుల రామగోపాలశాస్త్రి దగ్గర ప్రాచీన సాహిత్యం నేర్చుకున్నాడు. అతని ప్రోద్బలంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం డి.ఓ.ఎల్ పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడైనాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. పూర్తిచేసి తర్వాత బి.ఇడి. చదివాడు. 1978లో తెలుగు పండితుడిగా ఉద్యోగం ప్రారంభించి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలలో ఉపాధ్యాయునిగా 30 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణచేశాడు. ఇతడు కవి, రచయిత మాత్రమే కాకుండా చిత్రకారుడు కూడా. ఇతనిపై వాడ్రేవు చినవీరభద్రుడు, అట్టాడ అప్పల్నాయుడు, భూషణం, కాళీపట్నం రామారావు మొదలైన వారి ప్రభావం ఉంది. స్నేహకళాసాహితి అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి కళింగాంధ్ర ప్రాంతంలో యువ కవులను రచయితలను ప్రోత్సహిస్తున్నాడు.

రచనలు[మార్చు]

ఉత్తరాంధ్ర మాండలికంలో సుమారు 60కి పైగా కథలు వ్రాశాడు. రెండు కథాసంపుటాలు, మూడు కవితాసంపుటాలు, 3 గేయసంపుటాలు, ఒక వ్యాససంపుటి ప్రచురించాడు. క్రాంతి, గౌన అనే కలంపేర్లతో రచనలు చేస్తుంటాడు. ఇతని రచనలు నాగావళి, ఆంధ్రజ్యోతి, స్రవంతి, పుస్తకం, ప్రజాసాహితి, కథాంజలి, ఆహ్వానం, రచన, సాహిత్యనేత్రం, వార్త, విపుల, ఆంధ్రప్రభ మొదలైన ఎన్నో పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

కథలు[మార్చు]

కథానిలయంలో లభ్యమౌతున్న కథల జాబితా

  1. అవతలి ఒడ్డు
  2. ఆసరసాల
  3. ఇది చేదు కథ కాదు
  4. ఏటిపాట
  5. ఒక రాత్రి రెండు స్వప్నాలు
  6. కాటు
  7. కొండమల్లె
  8. గెంజిమెతుకులు
  9. చొక్కాగుడ్డ కోసం
  10. జీవసూత్రం
  11. తిరుగుడు గుమ్మి
  12. దేవుడూ వర్ధిల్లు
  13. నరాలు తెగుతున్న నేల
  14. నాణెంకిందచీమ
  15. నీటిముల్లు
  16. నీడనివ్వని పందిరి
  17. పొద్దు ములిగిపోయింది
  18. బడిసాల
  19. బతుకాకు
  20. బతుకు పోరు
  21. మాయ
  22. రంగురంగుల చీకట్లోకి
  23. రక్తాశ్రువు
  24. రాగాల చెట్టు
  25. వలస పక్షి
  26. విముక్తి
  27. శారదపెళ్లి...
  28. సెగ
  29. హత్య
  30. భూమిపుండు

కథాసంపుటాలు[మార్చు]

  1. ఏటిపాట (1971)
  2. ఒకరాత్రి - రెండుస్వప్నాలు (2007)
  3. కథాపార్వతీపురం (సంకలనకర్త - అట్టాడ అప్పల్నాయుడుతో కలిసి)

కవితాసంపుటాలు[మార్చు]

  1. నదిని దానం చేశాక
  2. నాగేటిచాలుకు నమస్కారం (దీర్ఘకవిత)
  3. నాగలి (దీర్ఘకవిత)

గేయసంపుటులు[మార్చు]

  1. పాడుదమా స్వేచ్ఛాగీతం (1998)
  2. గీతాంజలి (2004)
  3. ప్రియభారత జననీ (2009)

వ్యాససంపుటి[మార్చు]

  1. కళింగోర (ఆంధ్రప్రభ దినపత్రికలో యాసపీఠం అనే శీర్షికలో వ్రాసిన వ్యాసాలు)

రచనల నుండి ఉదాహరణ[మార్చు]

ఇతని కవితల నుండి మచ్చుకు ఒకటి.

నా తిత్తవ

బురద కుమ్మి బురద బుక్కినోళ్ళ మాట
మట్టి వాసనే వేస్తుంది మరి
నా కవిత్వ పాదాలను ముట్టుకుంటే
వేళ్ళకు మట్టి అంటకుండా ఎలా వుంటుంది
నా పదాలను పలకరిస్తే పశువులను పలకరించినట్టు
నా పలుకులను పరామర్శిస్తే
చేలనూ నాగేటి చాళ్ళనూ పరామర్శించినట్టు
నా మాటలు సాటవల సందళ్ళు
సామెతల సందిళ్ళు
నా పాటలు సెమట పూల పందిళ్ళు
చలిమంటల కుందిళ్ళు
గైని తీసి నా తల్లి బాస కళ్ళంలో అడుగుపెడితే
తెలుస్తుంది నా పలుకుబడి
నివ్వెర పరుస్తుంది నా నానుడి
నా నాడుల్లో నాగావళి అలల జడి
జంఝావతి అలజడి
వంశధార వరద ఉధృతి అంచనా వేయాలనుకుంటే
వొడ్డున నిలబడి చూస్తే చాలదు
లోతు చూడాలంటే ఈత తెలియాల్సిందే
మట్టిని గురించిన ఎరుకలేని వాడికి
సేద్యం ఎలా సాధ్యమవుతుంది?
పదం పదును తెలియనోడికి
పద్యం ఎలా పట్టుబడుతుంది?
కవిత్వం ఒక బెడ్డ దుక్కి
ఆ రహస్యం పోతనకు తెలుసు
మడిసెక్కలో మొక్కల్ని
మెదడు ముక్కలో మహావాక్యాలని
ఏకకాలంలో రచించే ప్రతీవాడూ ఒక పోతన
నిత్య కృషీవలుడు నిరంతర స్వాప్నికుడూ కదా కవీ!
నేను కవిని
మట్టిలోంచి మొలకెత్తిన వాణ్ణి
మట్టి కోసం ఎలుగెత్తిన వాణ్ణి
చెట్టు చిగురు చూసి కాయ వగరు
అలల తీరు చూసి ఏటి పొగరు చెప్పగల వాణ్ణి
వేళ్ళతో భూమిని చివుళ్ళతో ఆకాశాన్ని వొడిసిపట్టి
చూపుల్ని సూదులు చేసి
చినుకుల దారాలతో కలిపి కుట్టేవాణ్ణి
నేను కవిని
మట్టి గుండె చప్పుడు నా భాష
మర్మమెరగని మోటుదనం నా యాస
యాస నా నేల శ్వాస
నా పలుకు పంచదార
నా పేరు కళింగోర
గురజాడ అడుగుజాడలో నా నడక
గిడుగు నీడలో నా పడక
తూర్పులో పొడిచిన తొలి వెలుగు రేక
నా భుజాన కస్తవా!
ఇదిగిదిగీ నా తిత్తవ.

పురస్కారాలు[మార్చు]

  1. చాసో స్ఫూర్తి సాహిత్య పురస్కారం
  2. ఎస్.బి.ఎస్.ఆర్. కళాపీఠం సాహిత్య పురస్కారం
  3. జ్యేష్ట లిటరరీ అవార్డు
  4. ఎస్.ఆర్.కృష్ణమూర్తి స్మారక సాహిత్య పురస్కారం
  5. మాడభూషి రంగాచార్య స్మారక సాహిత్య పురస్కారం
  6. విశాలసాహితి పురస్కారం
  7. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం
  8. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమకథా పురస్కారం
  9. ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు
  10. పి.టి.ఆర్.స్మారక కవితా పురస్కారం
  11. పోలవరపు కోటేశ్వరరావు స్మారక సాహిత్య్ పురస్కారం
  12. రాచకొండ రచనా పురస్కారం
  13. గురజాడ సాహితీ పురస్కారం

మూలాలు[మార్చు]

  1. "గంటేడ గౌరునాయుడు". పాలపిట్ట మాసపత్రిక. 5 (8–9): 17.
  2. చీకోలు, సుందరయ్య. "గంటేడగౌరునాయుడు". తెలుగు మహానుభావులు. డా.శేషగిరిరావు. Archived from the original on 26 అక్టోబరు 2015. Retrieved 20 December 2014.

ఇవికూడా చదవండి[మార్చు]

  1. జనకథన మాంత్రికుడు గౌరునాయుడు -కథాస్థానీయత - కె.ఎన్.మల్లీశ్వరి వ్యాసం - చినుకు మాసపత్రిక - అక్టోబరు 2012
  2. శ్రీకాకుళపు సౌరు గౌరు నాయుడి కథలు! - అక్షర - సూర్యదినపత్రిక - 07-08-2011
  3. నవ్యనీరాజనం - నవ్యవీక్లీ -11-01-2011