గండ్లూరి దత్తాత్రేయశర్మ
గండ్లూరి దత్తాత్రేయశర్మ | |
---|---|
జననం | గండ్లూరి దత్తాత్రేయశర్మ 1950, సెప్టెంబరు 6 అనంతపురం జిల్లా రామగిరిమండలం కుంటిమద్ది గ్రామం |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | అవధాని,కవి |
మతం | హిందూ |
తండ్రి | లక్ష్మీనరసప్ప |
తల్లి | లక్ష్మీనరసమ్మ |
గండ్లూరి దత్తాత్రేయశర్మ కర్నూలు జిల్లా డోన్లో నివసిస్తున్న సుప్రసిద్ధ అవధాని.
జీవిత విశేషాలు[మార్చు]
గండ్లూరి దత్తాత్రేయశర్మ లక్ష్మీనరసమ్మ, లక్ష్మీనరసప్ప దంపతులకు 1950 సెప్టెంబరు 6లో అనంతపురంజిల్లా కుంటిమద్ది గ్రామంలో జన్మించాడు. చిన్నతనంలోనే ఇతడు తన తండ్రి వద్ద అమరము, ఆంధ్రనామసంగ్రహం, గజేంద్రమోక్షము, రుక్మిణీకళ్యాణము మొదలైనవి నేర్చుకున్నారు. ఇతని ప్రాథమిక విద్య కుంటిమద్ది గ్రామంలోనే జరిగింది. మధురకవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి ఇతనికి పాఠశాలలో తెలుగు పంతులు. అతని ప్రోత్సాహమే గండ్లూరి దత్తాత్రేయశర్మకు సాహిత్యరంగంపట్ల మక్కువ కలిగించింది. యస్.యస్.ఎల్.సి ఉత్తీర్ణుడైన తర్వాత ఇతడు తిరుపతి ప్రాచ్యకళాశాలలో విద్వాన్ చదివాడు. అక్కడ శతావధాని గౌరిపెద్ది రామసుబ్బశర్మ వద్ద అవధానంలో మెళకువలు నేర్చుకున్నాడు. 1970 నుండి అవధానాలు చేయడం ప్రారంభించాడు. 1973లో విద్వాన్ పూర్తిచేసి 1974లో కర్నూలులో పండిత శిక్షణ పొంది ద్రోణాచలం (డోన్) లోని శ్రీకన్యకాపరమేశ్వరి ఉన్నతపాఠశాలలో ఆంధ్రోపాధ్యాయుడిగా చేరి పదవీవిరమణ వరకు అక్కడే పనిచేశాడు. ప్రైవేటుగా ఎం.ఏ, పి.హెచ్.డిలు సంపాదించాడు. గుంటూరు, బేతంచర్ల, కర్నూలు ప్రాంతాలలో శతావధానాలు, ఢిల్లీ, సేలం, హోసూరు, భువనేశ్వర్, బెంగళూరు మొదలైన రాష్ట్రేతర ప్రాంతాలతో పాటుగా హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం మొదలైన పలుచోట్ల అష్టావధానాలు విజయవంతంగా నిర్వహించాడు. ఇతడు జోస్యుల సదానందశాస్త్రితో కలసి జంటగా అవధానాలు కొన్ని చేశాడు.
రచనలు[మార్చు]
- గుంటూరు శతావధానము
- బేతంచర్ల శతావధానము
- కర్నూలు శతావధానము
- కవితానీరాజనం
- సుమనోరంజని
- వెన్నెలతీగలు
- శ్రీకృష్ణతాండవము
- వ్యాసమంజూష
అవధానాలలో పూరణలు[మార్చు]
ఇతడు అవధానాలలో పూరించిన పద్యాలలో మచ్చుకు కొన్ని ఇక్కడ చూద్దాం.
- సమస్య:రతికై రమ్మనె యాత్మ సోదరుని నారాటంబు గన్పట్టగన్!
పూరణ
- క్షితికంపించ తురుష్క ముష్కర మహాసేనాపతుల్ రేగి, యు
- ద్ధతి యుద్ధంబున రాజపుత్రకుల విధ్వంసబు సల్పన్,రుషా
- ప్లుతి యొక్కర్తు కనారి రక్తతిలకంబున్ మోమునకు దిద్ది, హా
- రతికై రమ్మనె యాత్మసోదరుని నారాటంబు గన్పట్టగన్!
- సమస్య:జనవరిలోన గర్భమయి జన్మమొసంగెను మార్చిలోపలన్!
పూరణ
- మనువు కుదుర్చుకొంటిని శ్రమంపడి కూరిమి పెద్దబిడ్డకున్
- అనువుగ లగ్నమున్ కుదిరె, ఆద్పతి బంధు సమక్షమందు నే
- మునుకొని పెండ్లి చేసితిని పోయిన నూతన వత్సరంబునన్
- జనవరిలోన్; గర్భమయి జన్మమొసంగెను మార్చిలోపలన్!
- సమస్య: ఆలి కుచము కోసి తినియె నానందముగన్!
పూరణ
- లీలన్ భోజన వేళన్
- కాలానుగుణమ్ములైన కాయలు పండ్లన్
- గాలించి తెచ్చి యిచ్చిన
- ఆ లికుచముకోసి తినియె నానందముగన్! (లికుచము = గజనిమ్మకాయ)
- వర్ణన: వరూధిని వంటి వధూటి ఏకాంతంలో కౌగిలింతను కోరితే మీ స్పందన?
పూరణ
- మక్కువ జూపుటో, వలపు మాటల కౌగిట గారవించుటో
- చెక్కిలి నొక్కుటో, జిలుగు చేల చెఱంగును చక్కనొత్తుటో
- చక్కెర బొమ్మ! కాముకుల సంగతి సాధ్యము - మమ్ము బోంట్లకీ
- ఫక్కి యధర్మమంచు నొక భంగి వరూధిని బుద్ధి మాన్పెదన్
బిరుదులు[మార్చు]
ఇతనికి అవధాన సరస్వతి, అవధానరత్న అనే బిరుదులున్నాయి.
మూలాలు[మార్చు]
- కర్నూలుజిల్లా రచయితల చరిత్ర - కె.ఎన్.ఎస్.రాజు, కర్నూలుజిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం, కర్నూలు