చల్లా కృష్ణనారాయణరెడ్డి
చల్లా కృష్ణనారాయణరెడ్డి | |
---|---|
![]() చల్లా కృష్ణనారాయణరెడ్డి | |
జననం | చల్లా కృష్ణనారాయణరెడ్డి ఆగష్టు 1, 1925 |
మరణం | సెప్టెంబరు 5, 2013 |
ఇతర పేర్లు | సి.కె.నారాయణరెడ్డి పీలేరు గాంధీ |
సుపరిచితుడు | హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకులు,మాజీ శాసన సభ్యులు |
జీవిత భాగస్వామి | జయప్రద |
పిల్లలు | ఇద్దరు కూతుళ్లు డా. అరుణ, సి. శైలజ |
సి. కె. నారాయణ రెడ్డి (ఆగష్టు 1, 1925 - సెప్టెంబరు 5, 2013) హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు, పీలేరు గాంధీగా సుప్రసిద్ధులు. సికెగా వ్యవహరించబడే ఆయన పూర్తి పేరు చల్లా కృష్ణ నారాయణరెడ్డి.[1]
జీవిత విశేషాలు[మార్చు]
చల్లా కృష్ణనారాయణరెడ్డి చిత్తూరు జిల్లా పీలేరు సమీపంలోని రొంపిచర్ల మండలం చల్లావారిపల్లె(చిత్తూరు జిల్లా) లో ఆగస్టు 1 1925 న జన్మించారు. మదనపల్లెలో బీసెంట్ థియొసాఫికల్ స్కూల్/కాలేజీలో బి.ఎ వరకు చదువుకున్నారు. బిఎ రెండో సంవత్సరంలో ఉండగానే పేద విద్యార్థుల కోసం ఆయన ఒక వసతి గృహాన్ని నిర్వహించారు. కాలేజిలో మంచి హాకీ క్రీడాకారుడిగా రాణిస్తూనే సామాజిక సమస్యల పట్ల స్పందించేవారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఎప్పుడూ ఖద్దరు వస్త్రాలనే ధరించారు. సోషలిస్టు పార్టీలో క్రియాశీల సభ్యుడిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 1953లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. కరవు రోజుల్లో గంజి కేంద్రాలను నిర్వహించారు.అనేక వసతిగృహాలను నెలకొల్పారు. దళిత పిల్లల చదువు కోసం విశేషంగా కృషి చేశారు.బాకారావు పేట, వాయలపాడు, యెర్రవారిపాలెం, నేలబైలు, పీలేరు, మదనపల్లెలో బడుగు వర్గాలకోసం వసతి గృహాలను నిర్వహించారు. అక్కడ చదువుకున్న మునివెంకటప్ప, అబ్బన్న ఐఎఎస్ అధికారులు అయ్యారు. సికె 1962లో కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు.[2]
రొంపిచెర్లలో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 1967 లో చారుమంజుందార్ గ్రూపులో చేరారు. 1970 లో ప్రభుత్వం వీరిని అరెస్టు చేసింది. అత్యయిక పరిస్థితి సందర్భంగా 1975 లో జైల్లో నిర్భంధించింది. జనతా ప్రచురణలు, అనుపమ ప్రచురణలు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ను నెలకొల్పి అనేక మంచి పుస్తకాలను తెలుగులో వెలువరించారు. అనుపమ ప్రచురణలు నెలకొల్పి - ది స్కాల్‌పెల్, ది స్వోర్డ్ -రిచర్డ్ అ లెన్, టెడ్ గోర్డన్, ఫాన్‌షెన్-విలియమ్ హింటన్, మై ఇయర్స్ ఇన్ ఎన్ ఇండియన్ ప్రిజన్-మేరీ టైలర్ రెడ్‌స్టార్ ఓవర్‌చైనా-ఎడ్గార్ స్నో తదితర పుస్తకాలను తెలుగులోకి ప్రచురించారు. ప్రజల మనసుల్ని గెలిచేందుకు చిన్న పుస్తకాలు విశేషంగా తోడ్పడతాయని భావించేవారు.1980లో హైదరాబాద్ బుక్‌ట్రస్టును నెలకొల్పి అప్పటినుంచి 1990 ల చివర తన ఆరోగ్యం క్షీణించేవరకూ నిర్విరామంగా కృషిచేస్తూ అనేక పుస్తకాలను తెలుగులో వెలువరించారు. జంటనగరాల్లో కుక్కల సంతతి ఎక్కువైనా సరే కుక్కలను చంపకూడదని ఉద్యమం నిర్వహించారు. ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటాలు చేశారు. శాసన సభ్యులకు అనేక సౌకర్యాలు అక్కరలేదన్నారు. ఆయన సతీమణి జయప్రద మదనపల్లె ఉన్నత పాఠశాలలో సామాన్యశాస్త్ర ఉపాధ్యాయురాలిగా, అనంతరం ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. 1972 లో ఉస్మానియా యూనివర్సిటీలో హత్యకు గురైన జార్జి రెడ్డి వీరి అన్న కుమారుడు. సికె గారికి భార్య జయప్రద, ఇద్దరు కూతుళ్లు డా. అరుణ, సి. శైలజ ఉన్నారు. ఈయన 2013 సెప్టెంబరు 5 న హైదరాబాద్‌లో చనిపోయారు.[2] నారాయణ రెడ్డిగారి కోరిక మేరకు, ఆయన కుటుంబసభ్యులు ఆయన మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి కి అందజేశారు.
మూలాలు[మార్చు]
యితర లింకులు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from ఫిబ్రవరి 2020
- Articles with permanently dead external links
- 1925 జననాలు
- 2013 మరణాలు
- తెలుగువారిలో స్వాతంత్ర్య సమర యోధులు
- చిత్తూరు జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- చిత్తూరు జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- చిత్తూరు జిల్లా కమ్యూనిస్టు నాయకులు