Jump to content

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (అవధాని)

వికీపీడియా నుండి
జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి

జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి(1892-1980) ప్రఖ్యాత అవధాని. ఇతడు అనేకమైన శతావధానాలు, సహస్రావధానాలు, ఒక పంచసహస్రావధానము చేశాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు కృష్ణా జిల్లా, గుడివాడ సమీపం లోని కలవపాముల గ్రామంలో జన్మించాడు. ఇతడు బందరులో చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వద్ద లఘుకౌముది, అవధాన విద్యలు అధ్యయనం చేశాడు. కొంతకాలం ఇతడు గురజాల హైస్కూలులో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశాడు. తరువాత గద్వాల రాణీ ఆదిలక్ష్మీదేవమ్మ సంస్థానంలో చేరి మూడుదశాబ్దాలు అక్కడే ఆస్థానకవిగా విలసిల్లాడు. గద్వాల ఆస్థానపదవీ విరమణ తర్వాత హైదరాబాదుకు వచ్చి అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని 1980, అక్టోబరు 24న మరణించాడు.[1]

రచనలు

[మార్చు]

ఇతడు 32కు పైగా గ్రంథాలను వెలయించాడు. వాటిలో కొన్ని:

  • ఆంధ్రదేశ చరిత్ర (బృహత్ పద్యకావ్యము)
  • కేశవేంద్ర విలాస శతకము
  • సాలంకార కృష్ణదేవరాయలు
  • అరేబియన్ నైట్స్ కథలు
  • ఆలీబాబా నలుబదిదొంగలు
  • తెనాలి రామకృష్ణుని కథలు
  • రంజని (నవల)
  • వీరపురుషులు[2]
  • హంతక చూడామణి[3] (డిటెక్టివ్ నవల)
  • హత్యాపేటిక[4] (డిటెక్టివ్ నవల)
  • నలమహారాజు కథ[5]
  • కరీంనగర సంపూర్ణ శతావధానము [6]

అవధానాలు

[మార్చు]

ఇతడు మంతెన, చెన్నూరు, లింగాపురం, వేములవాడ, కమాన్‌పురం, కరీంనగర్‌లలో శతావధానాలు, యాదగిరిగుట్ట, నల్లగొండ, సింగవరం, దైవముదిన్నె, ఇల్లెందు, గురజాల, హనుమకొండ, మంథెన, కొల్లాపురము, గద్వాల, నూజివీడు, మిర్యాలగూడ, నారాయణపేట, బళ్లారి, జగిత్యాల, గోపాల్‌పేట, శ్రీశైలము, చల్లపల్లి, కరీంనగర్, కూనవరము, భీమవరము మొదలైన చోట్ల సహస్రావధానాలు చేశాడు. హనుమకొండలో 1954లో పంచసహస్రావధానాన్ని నిర్వహించాడు[1].

ఇతడి అవధానాలలో మచ్చుకు కొన్ని పూరణలు:

  • సమస్య: రాతిరి సూర్యుండు నంబరమ్మున దోచెన్

పూరణ:

ఆతత కాసారము ల
బ్జాత మనోజ్ఞంబులయ్యె జక్రము లెల్లన్
గావర ముడిగెను, ముగిసెన్
రాతిరి, సూర్యుండు నంబరమ్మున దోచెన్

  • సమస్య: పచ్చిమాంసంబు దినువాడు బ్రాహ్మణుండు

పూరణ:

బ్రహ్మవిజ్ఞాన హేతు భావప్రబోధి
నిత్యకర్మాభి నిరతుడే ద్విజుడు కాని
యగునె కలుద్రావ జందెమ్ము లవల ద్రోసి
పచ్చిమాంసంబు దినువాడు బ్రాహ్మణుండు

  • సమస్య: బంగ్లా మీదికి ద్రోవజూపగదవే భామా కురంగేక్షణా

పూరణ:

ఆంగ్లేయాభినిదత్త యంత్ర శకట వ్యాపారముంజేసి తా
బెంగ్లానిందొరగారు వచ్చెనదిగో వేవేగ నీచెంగటన్
బంగ్లాపై దొరసాని యున్నదట నాపైనన్ం దయంబూని యా
బంగ్లా మీదికి ద్రోవజూపగదవే భామా కురంగేక్షణా!

  • వర్ణన: కాళిదాసు

ఘనసారస్వతలోకమాన్య రసవత్కావ్యంబులన్ వ్రాసి స
జ్జన మాన్యంబగు భావలోకమున సత్థ్యానంబునుంబూని పృ
థ్విని నశ్రాంతయశంబు నిల్పిన సుధీవరుండు తత్కాళిదా
సుని గీర్తించెద నస్మదీయ కవితా శోభాభిసంవృద్ధికై

  • దత్తపది: క-మ-ల-ము అనే నాలుగు అక్షరాలు నాలుగు పాదాల మొదటి అక్షరాలుగా కమలం వర్ణన.

కల మృదురావసంకలిత గానము నయ్యలదేంట్లు సేయగో
మలతర మారుతాంకుర సమంచితవీజనలాదిగాగ లీ
లల దళముల్ నటింపగ విలాసవిభాసి పరాగరాజియ
మ్ములఁ జెలరేగగా, గమలముల్ ప్రమదంబిడు శ్రీనివాసముల్

సత్కారాలు,బిరుదులు

[మార్చు]
  • ఇతడికి కవిమణి, కవికేసరి కిశోర, బాల సరస్వతి, అభినవ సరస్వతి, శతావధాన కుశల, విద్వద్బాల శతావధాని, సహస్రావధాన ఫణీంద్ర, సహస్రావధాన వాచస్పతి, సహస్రావధాన చతురానన, సహస్రావధాన పంచానన మొదలైన బిరుదులు వరించాయి.
  • 1959లో గుడివాడలో ఇతడికి కనకాభిషేకం చేశారు[1].

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 187–194.
  2. జంధ్యాల, సుబ్రహ్మణ్యశాస్త్రి (1954). వీరపురుషులు (ప్రథమ ed.). సికింద్రాబాదు: కొండా శంకరయ్య. pp. 1–122. Retrieved 26 July 2016.
  3. జంధ్యాల, సుబ్రహ్మణ్యశాస్త్రి (1953). హంతక చూడామణి (ప్రథమ ed.). హైదరాబాదు: కొండా శంకరయ్య. pp. 1–120. Retrieved 26 July 2016.
  4. జంధ్యాల, సుబ్రహ్మణ్యశాస్త్రి (1954). హత్యాపేటిక (ప్రథమ ed.). సికింద్రాబాదు: కొండా శంకరయ్య. pp. 1–110. Retrieved 26 July 2016.
  5. జంధ్యాల, సుబ్రహ్మణ్యశాస్త్రి (1950). నలమహారాజు కథ (ప్రథమ ed.). సికిందరాబాదు: కొండా శంకరయ్య. pp. 1–110. Retrieved 26 July 2016.
  6. జంధ్యాల, సుబ్రహ్మణ్యశాస్త్రి. కరీంనగర సంపూర్ణ శతావధానము. Retrieved 26 July 2016.