Jump to content

జిమ్ కార్బెట్ జాతీయ వనం

అక్షాంశ రేఖాంశాలు: 29°32′55″N 78°56′7″E / 29.54861°N 78.93528°E / 29.54861; 78.93528
వికీపీడియా నుండి
జిమ్ కార్బెట్ జాతీయ వనం
కార్బెట్ జాతీయ వనంలో ఒక బెంగాల్ పులి
Map showing the location of జిమ్ కార్బెట్ జాతీయ వనం
Map showing the location of జిమ్ కార్బెట్ జాతీయ వనం
Map showing the location of జిమ్ కార్బెట్ జాతీయ వనం
Map showing the location of జిమ్ కార్బెట్ జాతీయ వనం
Locationనైనీటాల్ జిల్లా, ఉత్తరాఖండ్, భారతదేశం
Nearest cityరామ్‌నగర్, కోట్‌ద్వార్
Coordinates29°32′55″N 78°56′7″E / 29.54861°N 78.93528°E / 29.54861; 78.93528
Area1,318 km2
Established1936
Visitors500,000[1] (in 1999)
Governing bodyప్రాజెక్ట్ టైగర్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం, వైల్డ్‌లైఫ్ వార్డెన్, జిమ్ కార్బెట్ జాతీయ వనం

జిమ్ కార్బెట్ జాతీయ వనం భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో ఉన్న ఒక జాతీయ వనం. ఇది 1936లో బ్రిటిషు పాలన సమయంలో భారతదేశ మొట్టమొదటి జాతీయ వనంగా స్థాపించబడింది. అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ గవర్నర్ విలియం మాల్కం హేలీ పేరు మీద హెయిలీ నేషనల్ పార్క్ అని దీనికి పేరు పెట్టారు. 1956లో, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు ఒక దశాబ్దం తరువాత, దీనికి కార్బెట్ జాతీయ వనంగా మార్చారు. అంతకు సంవత్సరం ముందు మరణించిన వేటగాడు, ప్రకృతి శాస్త్రవేత్త, ఈ జాతీయ వనం స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించిన జిమ్ కార్బెట్ పేరు మీద ఈ పేరు పెట్టారు. ప్రాజెక్ట్ టైగర్ కిందకు వచ్చిన మొదటి జాతీయ వనం ఇది. [2]

కార్బెట్ జాతీయ వనం 520.8 చ.కి.మీ (201.1 చ.మై)లో విస్తరించి, కొండలు, నదీ ప్రాంతాలు, చిత్తడి నేలలు, గడ్డి భూములు, ఒక పెద్ద సరస్సును కలిగి ఉంటుంది. సముద్రమట్టానికి 1,300 నుండి 4,000 అడుగుల (400 నుండి 1,220 మీ) ఎత్తులో ఉంటుంది. శీతాకాలంలో రాత్రులు చల్లగా, పగళ్ళు వెచ్చగా ప్రకాశవంతంగా ఉంటాయి. జూలై నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. ఈ ఉద్యానవనం ఉప-హిమాలయ బెల్ట్ భౌగోళిక, పర్యావరణ లక్షణాలను కలిగి ఉంది.[3] ఇక్కడి దట్టమైన తేమతో కూడిన ఆకురాల్చే అడవిలో ప్రధానంగా షోరియా రోబస్టా (సాల్ చెట్టు), హల్దు, రావి, రోహిణి, మామిడి చెట్లు) ఉంటాయి. ఈ ఉద్యానవనంలో దాదాపు 73 శాతం అటవీ ప్రాంతం ఉండగా, 10 శాతం విస్తీర్ణంలో గడ్డి భూములు ఉన్నాయి. ఇక్కడ 110 వృక్ష జాతులు, 50 క్షీరద జాతులు, 580 పక్షి జాతులు, 25 సరీసృపాల జాతులు ఉన్నాయి.

పర్యావరణ పర్యాటక స్థలమైన ఈ ఉద్యానవనంలో 617 వివిధ జాతుల మొక్కలు, విభిన్న రకాల జంతుజాతులు ఉన్నాయి.[4][5][6] పర్యాటకుల సంఖ్య పెరగడం, మరికొన్ని ఇతర కారణాల వల్ల ఉద్యానవన పర్యావరణ సమతుల్యత తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది.[7]

చరిత్ర

[మార్చు]
భారతీయ ఉడుము
జిమ్ కార్బెట్ జాతీయ వనంలో ఒక మగ ఏనుగు

ఈ ఉద్యానవనంలోని కొన్ని ప్రాంతాలు గతంలో టిహ్రీ గఢ్వాల్ సంస్థానంలో భాగంగా ఉండేవి.[8] రోహిల్లా ఆక్రమణదారుల దాడులకు ఈ అటవీప్రాంతం అనువుగా ఉన్నందున, వాటిని అరికట్టడానికి ఉత్తరాఖండ్ అటవీ శాఖ ఈ అడవులను తొలగించింది.[8] టిహ్రీ సంస్థానం నుంచి గూర్ఖాలను తరిమికొట్టడంలో సహాయం చేసినందుకు గానూ ఆ రాజు తన సంస్థానంలోని కొంత భాగాన్ని ఈస్టిండియా కంపెనీకి అధికారికంగా అప్పగించాడు.[8] టెరాయ్‌కు చెందిన బుక్సా అనే తెగవారు ఈ ప్రాంతంలో స్థిరపడి పంటలు పండించడం ప్రారంభించారు, కానీ 1860ల ప్రారంభంలో బ్రిటిషు పాలకులు వారిని అక్కడి నుంచి బహిష్కరించారు.[8]

19వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి ఇన్‌చార్జిగా ఉన్న బ్రిటిష్ అధికారి మేజర్ రామ్సే ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలోని అడవులను కాపాడటానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 1868లో బ్రిటిషు అటవీ శాఖ ఈ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకుని, పంటల సాగు, పశువుల స్థావరాలను నిషేధించడం ప్రారంభించింది.[9] 1879లో మితంగా చెట్ల నరికివేతను అనుమతిస్తూ ఈ అడవులను రక్షిత అటవీ ప్రాంతంగా ఏర్పాటు చేశారు.


1900ల ప్రారంభంలో ఈ. ఆర్. స్టీవెన్స్, ఈ. ఏ. స్మితీస్‌ సహా అనేక మంది బ్రిటీషర్లు ఈ గడ్డపై జాతీయ వనాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. 1907లో బ్రిటిష్ పాలనా యంత్రాంగం ఇక్కడ వేట స్థలాన్ని స్థాపించే అవకాశాన్ని పరిగణించింది.[9] 1930ల దాకా ఇక్కడ జాతీయ వనం హద్దులను నిర్ణయించే ప్రక్రియ ప్రారంభం కాలేదు. 1936లో సర్ మాల్కం హేలీ యునైటెడ్ ప్రావిన్సెస్ గవర్నర్‌గా ఉన్నప్పుడు 323.75 కి.మీ2 (125.00 చ. మై.) విస్తీర్ణంలో హేలీ నేషనల్ పార్క్ అనే రక్షిత ప్రాంతం ఏర్పడింది. అదే ఆసియాలో మొట్టమొదటి జాతీయ వనం.[10] ఈ రక్షిత ప్రాంతంలో వేటకు అనుమతి లేదు. గృహ అవసరాల కోసం కలప కోతకు మాత్రమే అనుమతి ఉండేది. రక్షిత ప్రాంతంగా ఏర్పాటైన వెంటనే, ఆ ప్రాంతంలో క్షీరదాలు, సరీసృపాలు, పక్షులను చంపడం, బంధించడం నిషేధిస్తూ నియమాలు ఆమోదించబడ్డాయి.[10]

1954-55లో ఈ రక్షిత ప్రాంతానికి రామగంగా నేషనల్ పార్కుగా పేరు మార్చినా, తిరిగి 1955-56లో కార్బెట్ నేషనల్ పార్కుగానే మార్చారు.[10] 1930లలో ఎన్నికల ద్వారా ఏర్పడిన పరిపాలనా యంత్రాంగం కింద ఉద్యానవనం బాగా అభివృద్ధి చెందింది. కానీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మితిమీరిన వేట, కలప కోసం చెట్ల నరికివేతతో జీవం కోల్పోయింది. కాలక్రమేణా, ఈ రక్షిత ప్రాంత విస్తీర్ణం 797.72 కి.మీ2 (308.00 చ. మై.)కి పెంచి, 1991లో కార్బెట్ పులుల అభయారణ్యానికి బఫర్ జోన్‌గా జోడించారు.[10] ఈ జోడింపులో 301.18 కి.మీ2 (116.29 చ. మై.) సోనావాడీ వన్యప్రాణుల అభయారణ్యంతో సహా కాలాగఢ్ అటవీ డివిజన్‌ మొత్తం ఉంది.[10] ఈ జాతీయ వనం 1974లో ప్రాజెక్ట్ టైగర్ వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టుకు ప్రారంభ వేదిక అయింది.[11] దీని నిర్వహణ కార్యక్రమాలు నైనిటాల్ జిల్లాలోని ప్రధాన కార్యాలయం నుండి జరుగుతాయి.[9]

వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వారి టెరాయ్ ఆర్క్ ల్యాండ్‌స్కేప్ పథకం కింద నేపాల్, భారత్‌లలో విస్తరించి ఉన్న పదమూడు రక్షిత ప్రాంతాలలో కార్బెట్ జాతీయ వనం ఒకటి.[12] ఈ పథకంలో ఉన్న మూడు ప్రధాన జంతు జాతులైన పులి, ఆసియా ఏనుగు, ఒంటికొమ్ము ఖడ్గమృగాలను రక్షించడం, వాటి వలసలను సుగమం చేయడం కోసం ఇందులోని పదమూడు రక్షిత ప్రాంతాలను అనుసంధానించడం, వన్యప్రాణుల కారిడార్‌లను పునరుద్ధరించడం జరిగింది. [12]

భౌగోళికం

[మార్చు]
కార్బెట్ పులుల అభయారణ్యంలోని ఢికాలా గడ్డి భూముల్లో ఉన్న రామగంగా జలాశయం

జిమ్ కార్బెట్ జాతీయ వనం పాక్షికంగా దూన్ లోయ వెంబడి ఉండి, ఉత్తరాన దిగువ హిమాలయాలు, దక్షిణాన సివాలిక్ కొండల మధ్య ఉంది; ఇది ఉప-హిమాలయన్ బెల్ట్ నిర్మాణాన్ని కలిగి ఉంది.[3] ఎగువ టెర్షియరీ శిలలు శివాలిక్ శ్రేణి బేస్ వైపు చూస్తూ, గట్టి ఇసుకరాతి ముక్కలు విశాలమైన శిఖరాలను ఏర్పరుస్తాయి. [3] దూన్ అనబడే విలక్షణమైన నిలువాటి లోయలను టెక్టోనిక్ జోన్‌ల వెంట చూడవచ్చు. [3] ఈ ప్రాంతం ఎత్తు సముద్రమట్టం నుంచి 360 మీ. (1,180 అ.) నుంచి 1,040 మీ. (3,410 అ.) మధ్య ఉంటుంది. [3] ఇది అనేక లోయలు, గట్లు, చిన్న ప్రవాహాలు, పీఠభూములతో, వివిధ కోణాలు, వాలు స్థాయిలను కలిగి ఉంటుంది. [3] ఈ ఉద్యానవనం రామగంగా నది వల్ల ఏర్పడిన పత్లీ దూన్ లోయను చుట్టుముట్టి ఉంటుంది. [13] దీని ప్రస్తుత వైశాల్యం 1,288.31 కి.మీ2 (497.42 చ. మై.). ఇందులో 822 కి.మీ2 (317 చ. మై.) కోర్ ప్రాంతం, 466.31 కి.మీ2 (180.04 చ. మై.) బఫర్ ప్రాంతం ఉన్నాయి.[14]

వాతావరణం

[మార్చు]
శీతాకాలంలో తెల్లవారుజామున అలముకున్న పొగమంచు - ఢికాలా, 2019 డిసెంబరు

భారతదేశంలోని ఇతర రక్షిత ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణం సమశీతోష్ణంగా ఉంటుంది.[13] చలికాలంలో ఉష్ణోగ్రత 5 °C (41 °F) నుండి 30 °C (86 °F) దాకా ఉండి, కొన్ని సార్లు ఉదయం పొగమంచు ఉంటుంది.[13] వేసవి ఉష్ణోగ్రతలు సాధారణంగా 40 °C (104 °F) మించవు.[13] శీతాకాలంలో తేలికపాటి వర్షాలు పడతాయి. రుతుపవనాల వల్ల వర్షాకాలంలో భారీ వర్షపాతం ఉంటుంది. [2]

వృక్షజాలం

[మార్చు]

జాతీయ వనం లోపల చెట్ల సాంద్రత గుగ్గిలం కలప అడవులలో ఎక్కువగా, అనోజిసస్ - కాచు అడవులలో అత్యల్పంగా ఉంటుంది.[15] చెట్ల బేసల్ వైశాల్యం గుగ్గిలం కలప చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యధికంగా ఉంటుంది. [15] మాలోటస్ ఫిలిపెన్సిస్, నేరేడు, డయోస్పైరోస్ spp లలో నారు, మొలక పొరలలో ఆరోగ్యకరమైన పునరుత్పత్తి జరుగుతుంది. కానీ గుగ్గిలం కలప అడవులలో నారు, మొలకల పునరుత్పత్తి తక్కువగా ఉంది.[15] 1970లలో జరిగిన ఒక పరిశోధన సర్వేలో భాగంగా 488 విభిన్న వృక్ష జాతులను గుర్తించారు; [5] 2023లో, 110 చెట్ల జాతులతో సహా 617 జాతులు గుర్తించారు. [14] వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గుగ్గిలం కలప ( S. రోబస్టా ), బండారు, సిరిమాను, బాహీనియా రౌసినోసా, రేల, మాలోటస్ ఫిలిప్పెన్సిస్‌లను ప్రధాన వృక్ష జాతులుగా గుర్తించింది. [14]

ఢికాలా గడ్డి మైదానంలో ఏనుగుల ఆట

జంతుజాలం

[మార్చు]

నల్లపాముల గద్ద, బ్లాసం హెడెడ్ పారకీట్, ఎర్ర జంగిల్‌ఫౌల్, గుడ్లగూబలు, గుండుములుపుగాడు (నైట్‌జార్) సహా 586 పైగా నివాస, వలస పక్షుల జాతులు కనిపిస్తాయి.[6] భారతీయ కొండచిలువ వంటి 33 జాతుల సరీసృపాలు, [6] ఏడు జాతుల ఉభయచరాలు, ఏడు జాతుల చేపలు, 36 జాతుల తూనీగలు కూడా గుర్తించారు. [8]

క్షీరదాల్లో భారతీయ ఏనుగు, భారతీయ చిరుతపులి, బెంగాల్ పులి, అడవి పిల్లి, బావురు పిల్లి, లెపర్డ్ క్యాట్ కనిపిస్తాయి . [2] [6] బార్కింగ్ డియర్, సాంభర్ జింకలు, హాగ్ జింకలు, దుప్పులు, స్లాత్ ఎలుగుబంట్లు, ఆసియా నల్ల ఎలుగుబంట్లు, ఇండియన్ గ్రే ముంగిస, నీటి కుక్కలు, ఎల్లో-త్రోటెడ్ మార్టెన్, హిమాలయన్ గోరల్, అలుగులు, నల్ల మూతి కోతులు, రీసస్ కోతులు ఈ జాతీయ వనంలో నివసించే మరికొన్ని జంతువులు. [16] మార్ష్ మొసళ్లు, ఘరియల్‌లను రామగంగా నదిలో వదిలారు. [6] దట్టమైన అడవి, రామగంగా నది, సమృద్ధిగా ఉన్న ఆహారం వల్ల ఈ జాతీయ వనం మాంసాహారులకు అనువుగా ఉంటుంది. చిన్న జంతువులు దొరకనప్పుడు ఇక్కడి పులులు ఆహారం కోసం నీటి గేదె, ఏనుగుల వంటి పెద్ద జంతువులను చంపుతాయి. [6] [17]

ప్రకృతి పర్యాటకం

[మార్చు]
దస్త్రం:Sambar Deer in Jim Corbet National Park.jpg
ఢికాలా టూరిస్ట్ లాడ్జ్ నుండి తెల్లవారుజామున జిమ్ కార్బెట్ జాతీయ వనంలో ఏర్పాటైన ఏనుగు పర్యటనలో తారసపడ్డ సాంభర్ జింక.
పర్యాటక జీపును వెంటాడుతున్న భారతీయ మగ ఏనుగు

వన్యప్రాణుల రక్షణే పార్కు ప్రధాన ఉద్దేశమైనప్పటికీ, నిర్వాహకులు ప్రకృతి పర్యటకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు.[10] 1993లో ప్రకృతి చరిత్ర, సందర్శకుల నిర్వహణ, పార్కు వివరణలతో గైడ్‌లకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. 1995లో గైడ్ల సంఖ్య పెంచడం కోసం ఇదే కార్యక్రమాన్ని రెండవ సారి చేపట్టారు. దీని వల్ల జాతీయ వనంలోని సిబ్బందికి, సందర్శకుల మార్గనిర్దేశానికే కాక నిర్వహణ కార్యకలాపాలకు సమయం కేటాయించడం సాధ్యమైంది.[10]

స్థానిక ప్రజలకు పర్యాటకం నుంచి లాభాలు అందుతూనే జాతీయ వనం సురక్షితంగా ఉండేందుకు భారత ప్రభుత్వం కార్బెట్ జాతీయ వనం, గఢ్వాల్ ప్రాంతాల్లో పర్యావరణ పర్యాటకంపై సదస్సులను నిర్వహించింది.[10] రైలీ & రైలీ (2005) మాటల్లో: "పొడిగా ఉండే నెలల్లో - ఏప్రిల్ నుండి జూన్ మధ్య వరకు - మావటి, ఏనుగులతో చాలా రోజులు జాతీయ వనంలో గడిపితే పులులను చూసేందుకు ఉత్తమ అవకాశాలు ఉన్నాయి."[6]

1991 నాటికే కార్బెట్ జాతీయ వనం 3237 పర్యాటక వాహనాలు, 45,215 మంది సందర్శకులకు ఆతిథ్యం ఇచ్చింది. ఈ సంఖ్యలు కేవలం ప్రధాన పర్యాటక సీజన్ అయిన 15 నవంబర్ నుంచి 15 జూన్ మధ్య కాలంలో మాత్రమే. [4] ఇంత భారీ పర్యాటకుల సంఖ్య ఇక్కడి సహజ పర్యావరణ వ్యవస్థపై ఒత్తిడికి దారితీసింది. నేలపై అధికంగా అడుగులు పడడం వల్ల మొక్కల జాతులు, నేల తేమ స్థాయుల్లో తగ్గుదల కనిపించింది. పర్యాటకులు వంట కోసం కలపను అధికంగా ఉపయోగించారు. ఈ కలప సమీపంలోని అడవుల నుంచి వచ్చినదే. [4] ఇవే కాక, పర్యాటకులు శబ్దం చేయడం, చెత్తను వేయడం, సాధారణంగా ఆటంకాలు కలిగించడం ద్వారా కూడా సమస్యలను లేవనెత్తారు. [18]

ఇతర ఆకర్షణలు

[మార్చు]
  • ఢికాలా పత్లీ దూన్ లోయ అంచుల వద్ద ఉంది. ఇక్కడ వందల ఏళ్ళ నాటి విశ్రాంతి భవనం ఉంది. దీని వెనుకగా కంద శిఖరం ఉంది. ఢికాలా నుంచి లోయ దృశ్యాలు కనిపిస్తాయి.[19]
  • కాలాగఢ్ ఆనకట్ట వన్యప్రాణుల అభయారణ్యం నైరుతి మూలలో ఉంది. అనేక వలస నీటి పక్షులు శీతాకాలంలో ఇక్కడకు వస్తాయి.[20]
  • 20 మీ. (66 అ.) ఎత్తున్న కార్బెట్ ఫాల్స్ జలపాతం కాలాఢూంగీ-రామ్‌నగర్ రహదారిపై రామ్‌నగర్ నుంచి 25 కి.మీ. (16 మై.), కాలాఢూంగీ నుంచి 4 కి.మీ. (2.5 మై.) దూరంలో ఉంది. ఈ జలపాతం చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి.[21]
  • కోసీ నది ఒడ్డున ఉన్న గర్జియా దేవి ఆలయాన్ని కార్తీక పూర్ణిమ (నవంబర్ - డిసెంబర్) సమయంలో ఎక్కువగా సందర్శిస్తారు. ఇది ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతంలో, గర్జియా గ్రామం సమీపంలో, రామ్‌నగర్ నుంచి 14 కి.మీ. దూరంలో ఉంది.[22]

జనాదరణ

[మార్చు]

2005 బాలీవుడ్ చిత్రం కాల్లో జిమ్ కార్బెట్ జాతీయ వనం నేపథ్యంలో జరిగే కథాంశం ఉంది. పార్క్‌లోనే చిత్రీకరణ కూడా జరిగింది. [23]

2019 ఆగస్టులో, భారత ప్రధాని నరేంద్ర మోడీ డిస్కవరీ ఛానల్ కార్యక్రమం మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రత్యేక ఎపిసోడ్‌లో హోస్ట్ బేర్ గ్రిల్స్‌తో [24] కనిపించారు. కార్యక్రమంలో అతను అడవిలో ట్రెకింగ్ చేసి గ్రిల్స్‌తో ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణ గురించి మాట్లాడాడు. [25] 180 దేశాల్లో ప్రసారమైన ఈ ఎపిసోడ్‌ చిత్రీకరణ జిమ్ కార్బెట్ జాతీయ వనంలో జరిగింది. [26]

సవాళ్లు

[మార్చు]

పూర్వం

[మార్చు]
జిమ్ కార్బెట్ జతీయ వనంలో ఏనుగుల గుంపు

కలాగఢ్ నదిపై ఆనకట్ట నిర్మించినప్పుడు 80 కి.మీ2 (31 చ. మై.) శ్రేష్ఠమైన లోతట్టు నదీతీర ప్రాంతం ముంపుకు గురవడం ఈ జాతీయ వన చరిత్రలో ఒక ప్రధాన సంఘటన. దీని ఫలితంగా చిత్తడి జింకలు స్థానికంగా అంతరించిపోవడం, హాగ్ జింకల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం జరిగింది. అయితే, ముంపు ప్రాంతంలో ఏర్పడ్డ జలాశయం జలచరాల పెరుగుదలకు దారితీసింది. అదనంగా శీతాకాలపు వలస పక్షులకు ఆవాసంగానూ మారింది. [10]

జాతీయ వనం దక్షిణ సరిహద్దు వద్ద ఉన్న రెండు గ్రామాలకు 1990-93 సమయంలో రామ్‌నగర్ - కాశీపూర్ రహదారిపై ఉన్న ఫిరోజ్‌పూర్ - మాన్‌పూర్ ప్రాంతానికి పునరావాసం కల్పించారు. ఖాళీ చేయబడిన ప్రాంతాలను బఫర్ జోన్‌లుగా నిర్దేశించారు. ఈ గ్రామాల్లోని కుటుంబాలు ఎక్కువగా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉండేవి. కాలక్రమేణా, ఈ ప్రాంతాలు పర్యావరణ పునరుద్ధరణ సంకేతాలను చూపించడం ప్రారంభించాయి. [27] తీగలు, మూలికలు, గడ్డి, చిన్న చెట్లు కనిపించడం ప్రారంభించాయి. తరువాత గుల్మకాండ వృక్షజాలం, చివరికి సహజ అటవీ సంపద వృద్ధి చెందాయి. ఖాళీ చేసిన వ్యవసాయ భూముల్లో గడ్డి పెరగడం, పక్కనే ఉన్న అటవీ ప్రాంతాలు కోలుకోవడం గమనించారు. [27] 1999-2002 నాటికి ఈ బఫర్ జోన్లలో అనేక వృక్ష జాతులు ఉద్భవించాయి. కొత్తగా ఉద్భవించిన పచ్చని మైదానాలు గడ్డి తినే జంతువులను, ప్రధానంగా జింకలు, ఏనుగులను ఆకర్షించాయి. ఇవి నెమ్మదిగా ఈ ప్రాంతాలకు వలస వచ్చి వర్షాకాలంలో కూడా ఉండడం మొదలుపెట్టాయి. [27]

1988-89 కాలంలో 109 వేట కేసులు నమోదయ్యాయి.[28] ఈ సంఖ్య 1997-98లో 12కు పడిపోయింది. [10]

1985లో బ్రిటిషు పక్షి శాస్త్రవేత్త, బర్డ్‌వాచింగ్ టూర్ గైడ్ అయిన డేవిడ్ హంట్పార్క్‌లో పులిచే చంపబడ్డాడు. [29]

జిమ్ కార్బెట్ జాతీయ వనంలో ఒక దుప్పి
జిమ్ కార్బెట్ జాతీయ వనం ఢికాలా జోన్‌లో రామగంగా నది ఒడ్డున కనిపించిన ఏనుగు కుటుంబం

ఈ జాతీయ వనం అన్యదేశ కలుపు మొక్కలు లాంటానా, పార్థీనియమ్, కాసియా వంటి ఆక్రమణ జాతుల నుండి ముప్పును ఎదుర్కొంటోంది. చెట్లు, గడ్డి వంటి సహజ వనరులు స్థానిక ప్రజల దోపిడీకి గురవుతున్నాయి. 74 కుటుంబాలు కనీసం 13.62 హె. (33.7 ఎకరం) ఆక్రమించినట్టు రికార్డుల్లో ఉంది. [10]

జాతీయ వనం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కనీసం 15-20 సంవత్సరాల క్రితంవి. ఇటీవలి కాలంలో కొత్త గ్రామాలు లేవు. [30] పెరుగుతున్న జనాభా, జతీయ వనానికి 1 కి.మీ. (0.62 మై.) నుండి 2 కి.మీ. (1.2 మై.) లోపు ఉన్న జనసాంద్రత పార్కు నిర్వహణకు సవాలుగా మారాయి. [30] పులులు, చిరుతలు పశువులను చంపినప్పుడు కొన్ని సందర్భాల్లో స్థానిక ప్రజలు ప్రతీకార చర్యలకు పాల్పడ్డారు. [10] జాతీయ వనం దక్షిణ సరిహద్దు వద్ద పంట పొలాలను ఆనుకుని ఉన్న చోట 12 కి.మీ. (7.5 మై.) పొడవున రాతి గోడ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. [10]

ఏప్రిల్ 2008లో, ఈ జాతీయ వన రక్షణ వ్యవస్థలు బాగా బలహీనపడ్డాయని, వేటగాళ్ళు పార్కులోకి చొరబడ్డారని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్‌టీసీఏ క్షేత్ర సందర్శనల సమయంలో సలహాలు, పరిశీలనలు చేసినప్పటికీ, నిర్ణీత రీతిలో వన్యప్రాణుల పర్యవేక్షణ జరగడం లేదని అభిప్రాయపడింది. అంతే కాకుండా, పులులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో సాక్ష్యాలతో కూడిన నెలవారీ పర్యవేక్షణ నివేదిక 2006 నుండి అందలేదు. "ప్రామాణిక పద్ధతిలో జరగాల్సిన పర్యవేక్షణ లేని పక్షంలో, వేటగాళ్ల సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలను పసిగట్టడం అసాధ్యం" అని ఎన్‌టీసీఏ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా జాతీయ వనం గుండా సిమెంటు రోడ్డు నిర్మించారు. కాలాగఢ్, రామ్‌నగర్‌ల మధ్య ఈ రోడ్డు ప్రధాన మార్గంగా మారింది. ఈ దారిలో నిరంతరం పెరుగుతున్న వాహనాల రాకపోకలు జిర్నా, కోటీరావు, ధారా వంటి కీలక అటవీప్రాంతాల్లోని వన్యప్రాణుల జీవనానికి అటంకం కలిగిస్తున్నాయి. కాలాగఢ్ ఇరిగేషన్ కాలనీ విస్తరించి ఉన్న సుమారు 5 కి.మీ2 (1.9 చ. మై.) భాగాన్ని ఖాళీ చేయమని సుప్రీంకోర్టు 2007లో ఆదేశించినప్పటికీ అది జరగలేదు. [31]

పర్యావరణ వ్యవస్థ మూల్యాంకనం

[మార్చు]

జిమ్ కార్బెట్ పులుల అభయారణ్య ఆర్థిక అంచనా అధ్యయనం ప్రకారం దాని వార్షిక ప్రవాహ ప్రయోజనాలు ₹14.7 బిలియన్లు (హెక్టారుకు ₹1.14 లక్షలు). పర్యావరణ వ్యవస్థ సేవలలో ముఖ్యమైనవి జన్యునిధి పరిరక్షణ (₹10.65 బిలియన్లు), ఉత్తరప్రదేశ్‌లోని దిగువ జిల్లాలకు నీటిని అందించడం (₹1.61 బిలియన్లు), న్యూఢిల్లీ నగరానికి నీటి శుద్ధీకరణ సేవలు (₹550 మిలియన్లు), స్థానికంగా ఉపాధి అవకాశాలు (₹82 మిలియన్లు), వన్యప్రాణులకు నివాసం, ఆశ్రయం కల్పించడం (₹274 మిలియన్లు), కార్బన్ సీక్వెస్ట్రేషన్ (₹214 మిలియన్లు). [32]

మూలాలు

[మార్చు]
  1. Sinha, B. C.; Thapliyal, M.; K. Moghe, An Assessment of Tourism in Corbett National Park, Wildlife Institute of India, archived from the original on 5 November 2007, retrieved 2007-10-12
  2. 2.0 2.1 2.2 Riley & Riley 2005: 208
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Tiwari & Joshi 1997: 210
  4. 4.0 4.1 4.2 Tiwari & Joshi 1997: 309
  5. 5.0 5.1 Pant 1976
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 6.6 Riley & Riley 2005: 210
  7. Tiwariji & Joshiji 1997: 309–311
  8. 8.0 8.1 8.2 8.3 8.4 UNEP 2003
  9. 9.0 9.1 9.2 Tiwari & Joshi 1997: 208
  10. 10.00 10.01 10.02 10.03 10.04 10.05 10.06 10.07 10.08 10.09 10.10 10.11 10.12 Corbett National Park (Project Tiger Directorate)
  11. Tiwari & Joshi 1997: 108
  12. 12.0 12.1 Drayton 2004
  13. 13.0 13.1 13.2 13.3 Tiwari & Joshi 1997: 286
  14. 14.0 14.1 14.2 Nautiyal, J.P.; Lone, A.M.U.D.; Ghosh, T.; Malick, A.; Yadav, S. P.; Ramesh, C.; Ramesh, K. (2023). "An Illustrative Profile of Tiger Reserves of India" (PDF). Uttarakhand, India: Wildlife Institute of India; EIACP Programme Centre. pp. 40–41. Archived from the original (PDF) on 7 August 2023.
  15. 15.0 15.1 15.2 Singh et al. 1995
  16. Riley & Riley 2005: 208–210
  17. "Tigers killing and eating elephants in Corbett National Park: government study reveals worrying phenomenon". Times of India. 2019. Retrieved 24 May 2024.
  18. Tiwari & Joshi 1997: 311
  19. "Dikhala".
  20. "Kalagarh Dam".
  21. chandan@nainitaltourism.com. "NAINITAL TOURISM 1000 Pages Since 1999 - Corbett Water Falls | Jim Corbett National Park | Corbett Water Falls Nainital India |". Nainitaltourism.com. Retrieved 2017-09-10.
  22. "Tourist Places to Visit Near Jim Corbett National Park". Corbett-national-park.com. Retrieved 2017-09-10.
  23. "Lara: We had some close calls". Rediff.com. Retrieved 5 January 2015.
  24. "PM Modi rows boat, makes weapon, goes on a wild adventure for Man vs Wild TV show". India Today. Retrieved 14 August 2019.
  25. "Man Vs Wild: PM Modi walks in jungles of Jim Corbett with Bear Grylls, talks about conserving nature". Business Today. 13 August 2019. Retrieved 14 August 2019.
  26. "Taking Cue from PM's 'Man vs Wild' Episode, Tourism Ministry Makes 'Wildlife' Theme for Incredible India". News18. 12 August 2019. Retrieved 14 August 2019.
  27. 27.0 27.1 27.2 Rao 2004
  28. Tiwari & Joshi 1997: 269
  29. Flumm, D. S. "Obituary".
  30. 30.0 30.1 Tiwari & Joshi 1997: 263
  31. The Pioneer
  32. "Economic Valuation of Tiger Reserves in India: A Value+ Approach" (PDF). Indian Institute of Forest Management. January 2015. Archived from the original (PDF) on 26 August 2016.


మరింత సమాచారం కోసం

[మార్చు]