దార్ల వెంకటేశ్వరరావు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. (22 December 2013) |
డా. దార్ల వెంకటేశ్వరరావు | |
---|---|
జననం | దార్ల వెంకటేశ్వరరావు 1973 [September, 05] |
నివాస ప్రాంతం | హైదరాబాదు భారత దేశము |
ఇతర పేర్లు | దార్ల, భావన |
విద్య | యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ |
తండ్రి | శ్రీ లంకయ్య |
తల్లి | శ్రీమతి పెదనాగమ్మ. |
వెబ్‌సైటు | |
http://vrdarla.blogspot.in/ |
డా. దార్ల వేంకటేశ్వరరావు (Darla Venkateswara Rao) కవి, సాహిత్య విమర్శకుడు. ఈయన హైదరాబాదు విశ్వవిద్యాలయము. తెలుగు శాఖాధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు.
జీవిత విశేషాలు
[మార్చు]వేంకటేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గరలోని కాట్రేనికోన మండలం, చెయ్యేరు అగ్రహారంలో శ్రీ లంకయ్య, శ్రీమతి పెదనాగమ్మ దంపతుల తృతీయ కుమారుడుగా జన్మించారు. అమలాపురంలో ప్రసిధ్ద విద్యాకేంద్రంగా పేరున్న కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో బి.ఏ (స్పెషల్ తెలుగు) వరకూ చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఏం. ఏ,, తెలుగులో చేరి, అక్కడే ఎం.ఫిల్,. పిహెచ్.డి. పరిశోధనల్ని చేశారు. డా. యస్. టి. జ్ఞానానందకవి గారి ఆమ్రపాలి పై ఎం.ఫిల్., ‘‘జ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన’’ పేరుతో పరిశోధన చేశారు. ‘‘పరిశోధకుడుగా ఆరుద్ర’’ అనే అంశంపై పిహెచ్.డి. పరిశోధన చేసి హైదరాబాదు విశ్వవిద్యాలయం నుండి 2003లో డాక్టరేట్ డిగ్రీని పొందారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషన్ నిర్వహించిన పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపన్యాసకుడుగా ఎంపికయ్యారు. శ్రీ అనంత పద్మనాభ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల, వికారాబాదులో డిగ్రీ అధ్యాపకుడుగా కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత 2004 నుండి హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖలో అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు.
సాహిత్య ప్రవేశం
[మార్చు]ప్రముఖ విమర్శకుడు డా.ద్వానాశాస్త్రి గారు అమలాపురంలోని కోనసీమ భానోజీ రామర్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేసేటప్పుడు వేంకటేశ్వరరావు కూడా ఒక విద్యార్థిగా ఆయన దగ్గర చదువుకొన్నారు. ఆయన ప్రోత్సాహంతో ఆ రోజుల్లోనే చిన్న చిన్నకవితలు, వ్యాసాలు రాసేవారు. వేంకటేశ్వరరావు మొదటి కవిత ఇంటర్మీడియట్ చదువుతుండగా కళాశాల మ్యాగ్ జైన్ లో ప్రచురితమైంది. ఆ కవిత పేరు ‘జీవితనావ’ ఆయన చదువుకున్న కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థినీ విద్యార్థుల రచనలను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో వార్షిక సంచికను ప్రచురించేవారు. దానికి తెలుగు, ఆంగ్లం, హిందీ, సంస్కృతం అధ్యాపకులతో పాటు విద్యార్థి ప్రతినిధులను కూడా సంపాదకమండలిలో తీసుకొనేవారు. ఐదు నిమిషాల ముందు ఒక అంశాన్నిచ్చి కవిత, కథ, వ్యాసం వంటి ఏదో ఒక ప్రక్రియ రూపంలో రాయమనేవారు. దానిలో ప్రథమ, ద్వితీయస్థానం సాధించిన వారిని ఈ సంపాదకమండలిలో విద్యార్థి ప్రతినిథులుగా ఎంపిక చేసేవారు. వేంకటేశ్వరరావు తన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనే తెలుగు సృజనాత్మక రచనలో ప్రథమ స్థానాన్ని సాధించి, ఆ సంపాదకమండలిలో స్థానాన్ని సంపాదించారు. అప్పటి నుండి డా.ద్వానాశాస్త్రి, డా.వాడవల్లి చక్రపాణిరావు, డా.బి.వి.రమణమూర్తి (మార్గశీర్ష) వంటి ప్రముఖ సాహితీవేత్తలను ఆకర్షించగలిగారు. అంతకుముందే ఉన్నతపాఠశాలలో చదివేరోజుల్లో శ్రీకంఠం లక్ష్మణమూర్తి, ఆతుకూరి లక్ష్మణరావు అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్థానిక సమస్యలపై పత్రికల్లో ఉత్తరాలు రాయటంతో తన రచనా ప్రవేశం మొదలైందని వేంకటేశ్వరరావు ఇలా రాసుకున్నారు.[1] '‘కోనసీమ కేంద్రం అమలాపురంలో విస్తృతంగా సాహిత్య సభలు జరుగుతుంటాయి. ఆ వార్తలను పత్రికలు కూడా ఫోటోలతో సహా ప్రముఖంగానే ప్రచురిస్తుంటాయి. వాటిని బాగా గమనిస్తుండేవాణ్ణి. ఆ సాహిత్య వార్తల్లో నేను కూడా ఒక వ్యక్తిని కావాలనిపించేది. అప్పటికి సామాజిక వర్గంలో మా కుటుంబంలోగానీ, మా పల్లెలో గానీ ఎవరూ సాహిత్యం రాసిన వారు లేకపోవడం గమనించాను. ఆకాలేజీలో చేరకముందు హైస్కూల్లో చదివేటప్పుడు తెలుగు మాష్టారు శ్రీకంఠం లక్ష్మణమూర్తి, సోషల్ మాష్టారు ఆతుకూరి లక్ష్మణరావు గార్లు నన్ను బాగా ప్రోత్సహించేవారు. వారిద్దరూ బ్రాహ్మణకులానికి చెందినవాళ్ళే. అయినా నన్ను ఎంతగానో ఇష్టపడేవారు. ... ఆ విధంగా పత్రికలు చదవడమే కాకుండా, పత్రికల్లో స్థానిక సమస్యల గురించి రాసేవాడిని. కథలు, వ్యాసాలు చదివి వాటిపై నాకు తోచిన అభిప్రాయాలను రాసి పత్రికలకు రాసి పంపించేవాణ్ణి...’’ ఇలా తన రచనా నేపథ్యాన్ని ‘మాగురువుగారు’ పేరుతో రాసిన వ్యాసంలో దార్ల వెంకటేశ్వరరావు వివరించారు. ఆనాటి నుండి చిన్న చిన్న జోక్స్, చిన్నచిన్న కవితలు, కథలు, వ్యాసాలు, దిన, వార, మాస పత్రికల్లో రాయడం ద్వారా తన సాహిత్య ప్రవేశం ప్రారంభమైంది.
రచనలు
[మార్చు]వేంకటేశ్వరరావు తొలిరచనను స్ఫష్టంగా గుర్తించవలసి ఉంది. అయితే ఆయన రచనలను బట్టి ఎనిమిదో తరగతిలోనే ఆయన రాసిన హాస్య సంభాషణలు, ఉత్తరాలు వివిధ పత్రికల్లో ప్రచురితమైయ్యేవని ఆధారాలున్నాయి. కవిత్వ రచన మాత్రం కళాశాల మ్యాగజైన్ లో ప్రచురితమైన ‘జీవితనావ’ (1992) గానే తెలుస్తోంది. కళాశాల మ్యాగజైన్ లోనే తన మిత్రుల పేర్లతో కథలు, కవితలు రాసినట్లు తన ఆత్మకథ మొదటి భాగం‘దార్ల ఆత్మకథ నెమలికన్నులు’లో రాసుకున్నారు. ఇది త్వరలోనే విడుదల అవుతుంది. మానవీయ సంబంధాల విచ్చిన్నతను సృజనీకరిస్తూ ఈయన రాసిన మొదటి కథ ‘‘డాబామామ్మగారు’’ (1996) ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన నేపథ్యంతో ‘‘రాఖీ’’ అనే కథను రాశారు. అలా కొన్ని కథల్ని రాసినా, తర్వాతి కాలంలో తన రచనా వ్యాసంగాన్ని కవిత్వం పైనే మరలించారు. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంతో రాసిన వచన కవితలను ‘‘దళిత తాత్త్వికుడు’’(2004) పేరుతో ప్రచురించారు. మరికొన్ని కవితలను కలిపి 2016లో ‘‘నెమలికన్నులు’’ కవిత్వాన్ని ప్రచురించారు.*అంతర్జాతీయ అంతర్జాల పత్రిక ‘ది క్రైటీరియన్’లో అనువాదమైన దార్ల వెంకటేశ్వరరావు కవిత పరిశోధన, బోధనారంగంలో స్థిరపడిన తర్వాత పరిశోధకుడు, విమర్శకుడిగా తన సాహితీప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. గ్రంథరూపంలో వచ్చిన రచనల వివరాలు:
దార్ల రచనల జాబితా
[మార్చు]- మాదిగ చైతన్యం 1997 - ( కవితా సంకలనం - ఉప సంపాదకత్వం)
- సాహితీ మూర్తుల ప్రశస్తి 1997 - ( సహాయ సంకలన కర్త )
- డా. యస్. టి. జ్ఞానానందకవి గారి ఆమ్రపాలి పరిశీలన 1999 - (పరిశోధన గ్రంథం ) [2]
- దళిత తాత్త్వికుడు2004 - (కవితా సంపుటి) [3]
- సృజనాత్మక రచనలు చేయడం ఎలా? 2005-(అనువర్తిత విమర్శ) [4]
- సాహితీ సులోచనం (పుస్తక సమీక్షా వ్యాసాలు) 2006 [5]
- ఒక మాదిగ స్మృతి _ నాగప్పగారి సుందర్రాజు పరిచయం2007 - ( మోనోగ్రాఫ్) [6]
- దళిత సాహిత్యం మాదిగ దృక్పథం2008 - (సాహిత్య విమర్శ )[7]
- వీచిక 2009 - ( సాహిత్య విమర్శ )[8]
- పునర్మూల్యాంకనం 2010 -(సాహిత్య విమర్శ,) [9]
- బహుజన సాహిత్య దృక్పథం 2012 - (సాహిత్య విమర్శ)[10]
- సాహితీమూర్తులు-స్ఫూర్తులు 2015 -(సాహిత్య విమర్శ) [11]
- నెమలి కన్నులు 2016 - (వచన కవిత్వం)[12]
- సాహితీ సౌగంధి 2016 - (పీఠికలు) [13]
- సాహిత్య పరిశోధనకళ-విధానం 2017 ( పరిశోధన సూత్రాలు -సంపాదకత్వం)
- రాజశేఖరచరిత్ర నవల- వివిధ దృక్కోణాలు 2017 ( విద్యార్థి సదస్సుసంచిక, ప్రధాన సంపాదకుడు) [14]
- Voice of Dalit: The Poetry of Darla Venkateswara Rao, translated and Introduced by J.Bheemaiah, Published by Prestige Books International, New Delhi, 'ISBN 978-81-935421-6-3
- దార్లమాట శతకం 2021 - [15]
- Cultural Identity and Dalit Literature ( Emergence of Madigas in Indian Society), by Darla Venkateswara Rao & J.Bheemaiah, December, 2021, published by the Prestige Books International, New Delhi, ISBN 978-81-947512-43
సాహిత్య దృక్పథం
[మార్చు]విశ్వవిద్యాలయంలో చేరిన తర్వాత డా.బి.ఆర్ . అంబేద్కర్ రచనలు, ప్రసంగాల ప్రభావం వల్ల తన ఆలోచన మరింత పదునుదేరిందని పేర్కొన్నారు.[16] అంతకు ముందు తమ స్వగ్రామంలో అంబేద్కర్ జయంతి, వర్థంతులు జరిపినప్పటికీ సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన తర్వాతనే దళితవాదం పట్ల నిజమైన అవగాహన ఏర్పడిందని చెప్పుకున్నారు. అయితే, సెంట్రల్ యూనివర్సిటీలో కూడా దళిత సంఘాల్లో మాదిగ విద్యార్థులను దూరం పెట్టడాన్ని గమనించడంతో విద్యార్థులు ‘దళిత విద్యార్థి సంఘం’ (డి.ఎస్.యు) ఏర్పరిచారు. దీన్ని ‘దండోరా విద్యార్థి సంఘం’ అని పరోక్షంగా పిలిచేవారు. డి.ఎస్.యుతో పాటుగానే ‘మాదిగ సాహిత్యవేదిక’ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంఘం, సాహిత్యవేదిక వ్యవస్థాపకుల్లో వేంకటేశ్వరరావు కూడా భాగస్వామిగా ఉన్నారు. మాదిగ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో వెలువడిన‘‘మాదిగచైతన్యం’’ కవితాసంకలనంతో తెలుగుసాహిత్య చరిత్రలో ‘మాదిగసాహిత్యం’ అనే ధోరణి ఒకటి ప్రారంభమైంది. దీనికి ప్రధాన సంపాదకుడు నాగప్పగారి సుందర్రాజు. సంపాదకుడుగా దార్ల వేంకటేశ్వరరావు ఉన్నారు. ఈయనతో పాటు మరికొంతమంది సంపాదకవర్గ సభ్యులుగా ఉన్నప్పటికీ ఆ కవితాసంకలనం సంపాదక బాధ్యతలన్నీ వేంకటేశ్వరరావు నిర్వహించారు. ఈ పుస్తకాన్ని తీవ్రంగా విమర్శించిన సమీక్షకుడికి సంపాదకుడుగా తన వాదాన్ని వినిపిస్తూ వేంకటేశ్వరరావు ఒక ప్రతివిమర్శ వ్యాసాన్ని రాశారు. ఆ తర్వాత దళిత సాహిత్యం రాస్తున్నప్పటికీ, తెలుగులో మాదిగ సాహిత్య దృక్పథంపైనే తన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఈయన రచనల్లో మార్క్సిజం పట్ల సానుభూతి కనిపిస్తున్నా దేశీయ అవసరాలు, భావజాలవ్యాప్తిలో భాగంగా దళిత, బహుజన సాహిత్యాన్నే విస్తృతంగా రాస్తున్నారు. అస్ఫృశ్యతను ప్రధాన కారణంగా చూసినప్పుడు, అది పాకీవాళ్ళు, మాదిగల పట్లనే ఎక్కువగా కనిపిస్తుంది. జస్టీస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ప్రకారం పాకీవాళ్ళు (రెల్లి) కూడా మాదిగ ఉపకుల జాబితాకే చెందుతారు. అందువల్ల దళితులంటేనే మాదిగలుగా గుర్తించాలనేది దార్ల వెంకటేశ్వరరావు వాదన. దళితుల గురించి దళితులైనా, దళితేతరులైనా ఎవరు రాసినా దళితుల్లోని ‘అస్ఫృశ్యత’నే ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. కనుక, మాదిగ సాహిత్యమే దళిత సాహిత్యానికి మూలమని, మాదిగ సాహిత్యం దళితసాహిత్యం నుండి ఆవిర్భవించినట్లు చెప్పకూడదనీ, దళితసాహిత్యమే మాదిగ సాహిత్యం నుండి పుట్టుకొచ్చిందనీ దార్ల వెంకటేశ్వరరావు ప్రతిపాదిస్తారు.[17]
నూతన పాఠ్యప్రణాళికల రూపకల్పన
[మార్చు]సంప్రదాయ అవిచ్ఛిన్నతతో పాటు, ఆధునిక భావజాలాల్ని చర్చించే అవకాశం కూడా విశ్వవిద్యాలయాల అధ్యయనాల్లో ఉంటుంది. విశ్వవిద్యాలయ నిధుల సంఘం (UGC), మానవ వనరుల శాఖల వారు కూడా ఎప్పటికప్పుడు నూతనావిష్కరణలకు అవకాశాలు పురిగొల్పేలా పాఠ్యప్రణాళికలను రూపొందిస్తుంటారు. అటువంటి వాటిలో ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (CBCS) ఒకటి ప్రకటించింది.[18] దీని ప్రకారం విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధితో పాటు అనువర్తిత జ్ఞానానికి ప్రాధాన్యాన్నిస్తున్నారు. ఈ రకమైన ఆలోచనతోనే డా.దార్ల వెంకటేశ్వరరావు తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కొన్ని నూతన పాఠ్య ప్రణాళికలకు రూపకల్పన చేశారు. వీటిలో ముఖ్యమైన కొన్ని కోర్సులలో దళిత సాహిత్యం, ‘ప్రవాసాంధ్రసాహిత్యం-పరిచయం‘, ‘పరిశోథన గ్రంథ రచనా నైపుణ్యాలు‘ తెలుగు సాహిత్యంలో సృజనా త్మక నైపుణ్యాలు మొదలైనవన్నీ తెలుగు భాషా సాహిత్యాలను ఎం.ఏ.స్థాయిలో ప్రవేశపెట్టారు.
పురస్కారాలు
[మార్చు]భారతీయ సాహిత్య పరిషత్ (రాజమండ్రి శాఖ) వారు 1996లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతిని సాధించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు డిగ్రీ స్థాయిలో స్పెషల్ తెలుగు చదివి విశ్వవిద్యాలయం స్థాయిలో సర్వప్రథముడిగా నిలిచిన వారికిచ్చే ‘కళాప్రపూర్ణ’ జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి (1995), కందుకూరి వీరేశలింగం, రాజ్యలక్ష్మి దంపతుల స్మారక బహుమతి (1995)లను అందుకున్నారు.
దళితసాహిత్యంపై చేసిన సేవకు గుర్తింపుగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) వారి డా.బి.ఆర్. అంబేద్కర్ ఫెలోషిప్ పురస్కారం (2007) పొందారు [19] ఈ విషయాన్ని పలు పత్రికలు, అంతర్జాల పత్రికలూ విశేషంగా వార్తాంశాలను రాశాయి.[20] ఈయన తెలుగు సాహిత్య విమర్శకు చేస్తున్న కృషిని గుర్తించిన మానస ఆర్ట్ థియేటర్స్, హైదరాబాదు వారు సాహిత్య రంగంలో కృషిచేసే వారికిచ్చే ఉత్తమ సాహిత్య విమర్శకుడు పురస్కారం (2012) తో త్యాగరాయ గానసభ, (5-3-2012)లో సత్కరించారు. తెలుగు సాహిత్య విమర్శలో చేసిన కృషికి గుర్తింపుగా 2012 సంవత్సరానికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారంతో సత్కరించారు.[21] 2016లో బహుజన సాహిత్య వేదిక, ఆంధ్రప్రదేశ్ వారు రాష్ట్రస్థాయిలో మల్లవరపు జాన్ కవి స్మారక పరిశోధక పురస్కారంతో సన్మానించారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వారు 2016 విద్యాసంవత్సరానికి గాను ఉత్తమ బోధన, పరిశోధన రంగాల్లో కృషిచేసినందుకుగాను 2016 అక్టోబరు 1 న జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ అవార్డుతో సత్కరించారు.[22] ఈ అవార్డుకి గాను లక్షరూపాయల ప్రత్యేక పరిశోధన గ్రాంటుని మంజూరు చేస్తారు. యునైటెడ్ ఫ్రంట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్, సాహితీవిభాగం, వరంగల్లు వారు జాషువా జాతీయ పురస్కారం (2016)తో 2016 నవంబరు 6 వతేదీన డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య ఆర్.సీతారామారావుగారి చేతుల మీదుగా సత్కరించారు.[23] అంతర్జాల మాసపత్రిక‘విహంగ’ 2017 వ సంవత్సరం నుండి విహంగ సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈ యేడాది విహంగ అంతర్జాల పత్రిక పురస్కారాన్ని డా.దార్ల వెంకటేశ్వరరావు అందుకున్నారు. ఈ పురస్కారాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం, బొమ్మూరు (రాజమహేంద్రవరం)లో 2017 జనవరి 11 వతేదీన జరిగిన పురస్కార ప్రదానోత్సవ సభలో యూనివర్సిటి వైస్-ఛాన్సలర్ ఆచార్య ఎస్వీసత్యనారాయణ, సాహిత్య పీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు, విహంగ మాసపత్రిక సంపాదకురాలు డా. పుట్ల హేమలతల చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.[24]
ఛాన్సలర్ అవార్డు
[మార్చు]హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వారు 2016 విద్యాసంవత్సరానికి గాను ఉత్తమ బోధన, పరిశోధన రంగాల్లో కృషిచేసినందుకుగాను 2016 అక్టోబరు 1 న జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ అవార్డుతో సత్కరించారు.[19] ఈ అవార్డుకి గాను లక్షరూపాయల ప్రత్యేక పరిశోధన గ్రాంటునిచ్చారు. సంవత్సరానికి కేవలం ఐదుగురు అధ్యాపకులకు మాత్రమే ఈ అవార్డునిస్తారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి (యూనివర్సిటి ఆఫ్ హైదరాబాదు)లో అధ్యాపకుడుగా పనిచేస్తున్న 45 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు మాత్రమే ఈ పురస్కారానికి అర్హులు. ఒకవైపు బోధన, మరొకవైపు పరిశోధన రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారిని గుర్తించి ఈ అవార్డుకి ఎంపిక చేస్తారు.డా. దార్ల వెంకటేశ్వరరావుకి బోధనకు, దళిత, ప్రవాసాంధ్ర సాహిత్యంలో పరిశోధన చేసిన కృషికి గాను ఈ అవార్డునిస్తున్నట్లు ప్రకటించారు.
పరిశోధన కృషి
[మార్చు]దార్ల వెంకటేశ్వరరావు దళిత సాహిత్యంలో విశేషంగా కృషి చేస్తున్నారు. వీచిక సాహిత్య విమర్శ గ్రంథంలో ‘దళిత సాహిత్యం-మౌలిక భావనలు’ పరిశోధక వ్యాసంలో తెలుగు దళిత సాహిత్యం ఆరంభం,వికాసాలను, వివిధ ప్రక్రియలను విశ్లేషించారు.[25] దళిత సాహిత్యాన్ని కేవలం దళితులే రాయనవసరం లేదనీ, ఆచరణాత్మకమైన దృక్పథంతో ఎవ్వరైనా రాయొచ్చని ఈయన అభిప్రాయం. శ్రీపాద సుబ్రహ్మణ్యం, అరుణకుమార, మంగిపూడి వెంకటశర్మ మొదలైన వారు రాసిన సాహిత్యంలో దళితుల జీవితాల పట్ల సానుభూతి వ్యక్తమవుతుందన్నారు. దళిత సాహిత్యాన్ని ఎవరు రాసినా దాని మౌలిక స్వభావం, లక్ష్యాలను వీడనంతవరకు దాన్ని దళిత సాహిత్యంగానే పరిగణించవచ్చుననే ఆలోచన ఇంచుమించుగా సర్వాంగీకారం పొందింది. కింది విషయాలు గమనిస్తే ఈ మౌలికాంశాలు ఉన్నదే దళిత సాహిత్యమని స్పష్టమవుతుంది.
- ప్రాచీన, సాంప్రదాయిక స్వభావం కలిగిన సామాజిక నిర్మాణాన్ని (కులవ్యవస్థని) తిరస్కరించటం.
- స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం ఆశించే మానవతా దృక్పథాన్ని ఆశించటం.
- హేతువుకు అందని అతీంద్రియ భావాలను తిరస్కరించటం.
- వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చి జీవితానుభవాలను సృజనీకరించటం.
- వస్తువుకి రూపం సహకారి కావటం, సాహిత్యం సామాజిక చైతన్యాన్ని ఆకాంక్షించేటట్లు రూపొందటం, కళ సమాజం కోసమే అన్న దృక్పథానికి కట్టుబడటం.
- సత్యం, శివం, సుందరం అనే భావనలను తిరస్కరించటం.
- అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, సామాజిక, ఆర్థిక న్యాయం కోసం పోరాడటం.
- కర్మ, పునర్జన్మ, పరమాత్మ వంటి భావనలను నిరసించటం.
- దళితుల భాషను, ఆచార వ్యవహారాలను గౌరవించి, ఆత్మ గౌరవాన్ని పెంపొందించటం.
- హిందూ లేదా మూఢత్వాన్ని ప్రబోధించే మత భావనలను తిరస్కరించి, ప్రత్యామ్నాయ సంస్కృతిని రూపొందించటం.
- అస్పృశ్యత కారణంగా దూరంగా విసిరేయబడిన వారిని ప్రధాన జీవన స్రవంతిలో కలపటం, కులాన్ని నిర్మూలించటం ప్రధాన లక్ష్యాలుగా గ్రహించటం.
- దళిత సాహిత్యాన్ని రాయటం వినోదం కోసం కాదనీ, సామాజిక చైతన్యం, సామాజిక పరివర్తనకు బాధ్యతాయుతమైన పనిగా గుర్తించటం - దళితులు రాజ్యాధికారాన్ని చేపట్టే దిశగా సాహిత్యం ప్రేరణనివ్వటం. దళిత సాహిత్య స్వభావాన్ని తెలుసుకోవటానికి పై అంశాలను క్రోడీకరించినా, "దళిత సాహిత్యం' అని పిలుస్తున్న అన్ని రచనలకూ పైన పేర్కొన్న అన్ని లక్షణాలు సరి పోతున్నాయని చెప్పే వీలు లేదు. కానీ, మౌలికంగా ఈ లక్షణాలు చాలా వరకు దళిత సాహిత్యంలో కనిపిస్తున్నాయని దార్ల వెంకటేశ్వరరావు వివరించారు.
మూలాలు
[మార్చు]- ↑ [ఆరు పదుల ద్వానా ( షష్టి పూర్తి ప్రత్యేక సంచిక, యువకళావాహిని ప్రచురణ, హైదరాబాద్, 15 జూన్ 2008, పుట:63]
- ↑ [1]
- ↑ https://vrdarla.blogspot.in/2009/06/blog-post_28.html[permanent dead link]
- ↑ https://archive.org/details/SrujanatmakaRachanaluCheyadamEla
- ↑ [2]
- ↑ https://archive.org/details/OkaMadigaSmruti
- ↑ https://archive.org/details/DalitaSahityam-MadigaDrukpatham)
- ↑ [3]
- ↑ [4]
- ↑ [5]
- ↑ [6][permanent dead link]
- ↑ [7][permanent dead link]
- ↑ [8]
- ↑ [9]
- ↑ [10]
- ↑ దార్ల ఆత్మకథ ‘నెమలికన్నులు’
- ↑ మాదిగసాహిత్యం నుండే దళితసాహిత్యం... సూర్యదినపత్రిక, అక్షరం సాహిత్యానుబంధం, 16-2-2009[permanent dead link]
- ↑ www.ugc.ac.in Guidelines
- ↑ https://vrdarla.blogspot.in/2007/12/1.html[permanent dead link]
- ↑ http://telugu.oneindia.com/sahiti/essay/2008/darla-recieves-fellowship-110108.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-09-09. Retrieved 2016-11-15.
- ↑ [11]
- ↑ ఈనాడు దినపత్రిక, వరంగల్లు పశ్చిమ, 7 నవంబరు 2016, జాషువా జయంతి పురస్కారాలు[permanent dead link]
- ↑ # విహంగ ఆరవ వార్షికోత్సవం-అంతర్జాలంలో తెలుగు సాహిత్యం జాతీయ సదస్సు, 11-1-2017
- ↑ [దార్ల వెంకటేశ్వరరావు, వీచిక(సాహిత్య విమర్శ వ్యాసాలు) సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2009.పుటలు: 59-78]
బయటి లింకులు
[మార్చు]- దార్ల వెంకటేశ్వరరావు గారి బ్లాగ్
- దార్ల కవితలు
- Dr. Darla Venkateswara Rao
- దార్ల వెంకటేశ్వరరావు గారితో ఈటి.వి తెలుగు-వెలుగు ఇంటర్వ్యూ
- దార్ల వెంకటేశ్వరరావు గారితో టి.వి10 ఇంటర్వ్యూ
- దార్ల వెంకటేశ్వరరావు గారి Yesweinspire.com ప్రత్యేకకథనం
- పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం ప్రదానోత్సవం
- హైదరాబాదు విశ్వవిద్యాలయం 18 వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ అవార్డు ప్రదానం
- నమస్తేతెలంగాణ సాహిత్యానుబంధం[permanent dead link]
- History of Telugu Dalit Literature, Ed.Thummapudi Bharathi
- STEEL NIBS ARE SPROUTING: New Dalit Writing From South India,Ed. by Tharu, K. Satyanarayana
- ఈనాడు దినపత్రిక, వరంగల్లు పశ్చిమ, 7 నవంబరు 2016, జాషువా జయంతి పురస్కారాలు [permanent dead link]
- https://web.archive.org/web/20140909211255/http://uohherald.commuoh.in/literary-critic-award-for-uoh-faculty/
- అంతర్జాతీయ అంతర్జాల పత్రిక ‘ది క్రిటేరియన్’ లో అనువాదమైన దార్ల వెంకటేశ్వరరావు కవిత
- All articles with dead external links
- మౌలిక పరిశోధన కలిగివున్నాయని అనుమానమున్న వ్యాసాలు from 22 December 2013
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- తెలుగు రచయితలు
- 1973 జననాలు
- జీవిస్తున్న ప్రజలు
- దళిత కవులు
- దళిత రచయితలు
- తెలుగు ఆచార్యులు
- తూర్పు గోదావరి జిల్లా రచయితలు
- తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యాయులు
- ఆత్మకథ రాసుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- ISBN మ్యాజిక్ లింకులను వాడే పేజీలు