తాపీ ధర్మారావు
తాపీ ధర్మారావు నాయుడు | |
|---|---|
![]() తాపీ ధర్మారావు నాయుడు | |
| జననం | తాపీ ధర్మారావు నాయుడు 1887 సెప్టెంబరు 19 ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు |
| మరణం | 1973 May 8 (వయసు: 85) |
| ఇతర పేర్లు | తాతాజీ |
| వృత్తి | కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులు |
| పేరుపడ్డది | తెలుగు రచయిత తెలుగు భాషా పండితుడు హేతువాది నాస్తికుడు |
| భాగస్వామి | అన్నపూర్ణమ్మ |
| పిల్లలు | కుమార్తెలు (లక్షుమమ్మ, బంగారమ్మ), తర్వాత కవలలు పుట్టి చనిపోయారు. కుమారులు (మోహనరావు, కీ॥అహోబలరావు, చాణక్య) |
| Parents |
|
| Notes | |
తాపీ ధర్మారావు నాయుడు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” | |
తాపీ ధర్మారావు (1887 సెప్టెంబర్ 19 - 1973 మే 8) తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
జీవిత చరిత్ర
[మార్చు]తాతాజీ గారి అసలు పేరు బండారు ధర్మారావు నాయుడు . ఈయన పూర్వీకులు సైన్యంలో పనిచేశారు. బండారు వంశంలోని లక్ష్మన్న అనే వ్యక్తి సైనికోద్యోగం నుండి తిరిగి వచ్చి తాపీపనిలో స్థిరపడ్డాడు. అందరూ ఆయనను తాపీ లక్ష్మయ్య అని పిలుస్తూ ఉండేవారు. ఆయనకు ఒక కొడుకు. లక్ష్మయ్యకి అప్పన్న అని మనవడు పుట్టాక కొడుకు, కోడలు ఇద్దరూ మరణించారు. దాంతో అప్పన్న శ్రీకాకుళంలో లక్ష్మన్న దగ్గరే పెరిగాడు. లక్ష్మన్నకు మనవడిని బాగా చదివించాలనే కోరిక. కానీ అప్పన్నకు అయిదు సంవత్సరాల వయసులోనే లక్ష్మన్న కూడా మరణించాడు. దాంతో అప్పన్న పోషణ భారమంతా లక్ష్మయ్య భార్యమీద పడింది. అప్పన్నను బళ్ళో చేర్చినపుడు తాపీ లక్ష్మయ్య మనవడు అప్పన్న అని రాశారు. అప్పుడే అతని అసలు ఇంటి పేరైన బండారు మరుగున పడి తాపీ అని మారిపోయింది. అప్పన్న శ్రీకాకుళంలో మెట్రిక్ పూర్తి చేసి మద్రాసులో వైద్యవిద్య నభ్యసించాడు. అప్పన్న మంచి తెలివితేటలతో డాక్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై శ్రీకాకుళానికి తిరిగి వచ్చారు. అప్పన్న భార్య నరసమ్మ. ఈ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు కలిసి మొత్తం ఐదు మంది సంతానం. వీరిలో రెండవ వాడు ధర్మారావు.
ధర్మారావు 1887 సంవత్సరంలో సెప్టెంబర్ 19న ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న బెర్హంపూరు (బరంపురం) జన్మించాడు.[1] ఈయనను చిన్నప్పుడు ఢిల్లీరావని కూడా పిలిచేవారు. ఈయన ప్రాథమిక విద్యను విజయనగరం రిప్పన్ స్కూల్లో చదివారు. చిన్నప్పుడు గణితం బాగా చదివేవాడు. మెట్రిక్యులేషన్ విజయవాడలో, పర్లాకిమిడిలో ఎఫ్.ఏ. వరకు చదువుకొని మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చేరారు. పర్లాకిమిడిలో చదివే రోజులలో వ్యవహారిక భాషావేత్త అయిన గిడుగు రామ్మూర్తి ఈయనకు గురువు. కల్లికోట రాజావారి కళాశాలలో గణిత ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1910 ప్రాంతంలో కొందరు మిత్రులతో కలిసి బరంపురంలో వేగుచుక్క గ్రంథమాలను స్థాపించారు. మిత్రులతో కలిసి ఒక సంఘంగా ఏర్పడి అభ్యుదయ వాదం, ప్రజా సమస్యలపై చర్చలు చేసేవారు. కొద్దిగా చిత్రకళ కూడా నేర్చుకున్న ధర్మారావు మిత్రులు వేసే నాటకాలకు రచన, నిర్వహణ, వేషధారణ మొదలైన పనులన్నీ చేసేవారు. మ్యాజిక్ కూడా నేర్చుకుని అప్పుడప్పుడూ ప్రదర్శించేవారు. అమిత బలశాలిగా పేరుగాంచిన కోడి రామ్మూర్తి నాయుడు ఈయనకు వ్యాయామ పంతులు.
ధర్మారావుకు 1904 లో దూరపు బంధువు అయిన అన్నపూర్ణమ్మతో వివాహం జరిగింది. అప్పటికి ఆయన మెట్రిక్ ఉత్తీర్ణుడయ్యారు. తర్వాత ఎఫ్. ఎ చదవడానికి పర్లాకిమిడి వెళ్ళారు. అది రాజా గారి పోషణలో నడుస్తున్న కళాశాల. అక్కడే గిడుగు రామ్మూర్తి పంతులు చరిత్ర బోధించేవారు. ఎఫ్. ఎ చదువు తర్వాత తండ్రి సంపాదన అంతంతమాత్రమే కావడం, అన్న వైద్య విద్య ఇంకా పూర్తి కాకుండా ఉండటం వల్ల ఆయన కొన్ని చిరుద్యోగాలు చేయవలసి వచ్చింది. 1906 లో ఒక సంవత్సరం పాటు టెక్కలి, బరంపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగయ్యాక రాజమహేంద్రవరంలో చేరడానికి వెళ్ళారు కానీ అప్పుడే మద్రాసు నుంచి పచ్చయప్ప కళాశాలలో సీటు వచ్చిందని తండ్రి తెలియజేయగా మిత్రుల సలహా మేరకు మద్రాసు వెళ్ళడానికే నిశ్చయించుకున్నారు. అక్కడ నుంచి 1909 లో బి. ఎ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. మద్రాసు విద్యార్థి దశలో ఉన్నపుడే తమిళ సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని శిలప్పదికారం, మణిమేఖలై, కంబ రామాయణం లాంటి పుస్తకాలు అధ్యయనం చేశారు. పత్రికారంగంలో లబ్ధప్రతిష్తులైన నార్ల వేంకటేశ్వర రావు తాపీ ధర్మారావు శిష్యులు.
ఇతని తొలి రచన 1911లో ఆంధ్రులకొక మనవి అనే పేరుతో విలువడింది. పత్రికా నిర్వహణలో ఇతనికి మంచి పేరు ఉంది. కొండెగాడు, సమదర్శిని, జనవాణి, కాగడా మొదలైన పత్రికలు ఇతని ప్రతిభకు నిదర్శనాలు. తాపి ధర్మారావు 1973 మే 8న మరణించారు. తెలుగు సినిమా దర్శకులు తాపీ చాణక్య తాపి ధర్మారావు గారి కుమారుడు.[2]
జీవితంలో ముఖ్య ఘట్టాలు
[మార్చు]1887 - సెప్టెంబర్ 19 జననం - గంజాం జిల్లా, బరంపురం
1903 - మెట్రిక్ పరీక్షకెళ్ళే యత్నం విఫలం
1904 - మెట్రిక్ పరీక్షలో మొదటి శ్రేణిలో కృతార్థత - విజయ నగరం
1904 - గురజాడను సుదూరంగా దర్శించడం
1904 - ఎఫ్.ఎ. పర్లాకిమిడి రాజా కళాశాలలో ప్రవేశం, పర్లాకిమిడి
సినిమా జీవితం
[మార్చు]ఈయన మాలపిల్ల (1938), రైతుబిడ్డ (1939), కీలుగుర్రం (1949) పల్లెటూరిపిల్ల (1950) రోజులు మారాయి (1955) వంటి పలు సినిమాలకు సంభాషణలు రాశారు. .
విశేషాలు
[మార్చు]- ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ముఖ్యమంత్రిగా బొబ్బిలి రాజా ఉన్నప్పుడు- తాపి ధర్మారావు గారు ఆయన దగ్గర కార్యదర్శిగా పనిచేశారు.
- ఆంధ్ర రాష్ట్ర పత్రికా రచయితల మహాసభ జరిగినప్పుడు తాపీవారే మొదటి అధ్యక్షులు.
- మాలపిల్ల చిత్రానికి కథ అందించినది - గుడిపాటి వెంకట చలం.
- తాపీ ధర్మారావుని గౌరవంగా 'తాతాజీ' అని పిలిచేవారు.
రచనలు
[మార్చు]- ఆంధ్రులకొక మనవి
- దేవాలయాలపై బూతుబొమ్మలు ఎందుకు? 1936
- పెళ్ళి దానిపుట్టుపూర్వోత్తరాలు 1960
- ఇనుపకచ్చడాలు
- సాహిత్య మొర్మొరాలు
- రాలూ రప్పలూ
- మబ్బు తెరలు
- పాతపాళీ
- కొత్తపాళీ
- ఆలిండియా అడుక్కుతినేవాళ్ళ మహాసభ
- విజయవిలాసం వ్యాఖ్య
- అక్షరశారద ప్రశంస
- హృదయోల్లాసము
- భావప్రకాశిక
- నల్లిపై కారుణ్యము
- విలాసార్జునీయము
- ఘంటాన్యాయము
- అనా కెరినీనా
- ద్యోయానము
- భిక్షాపాత్రము
- ఆంధ్ర తేజము
- తప్తాశ్రుకణము
పురస్కారములు
[మార్చు]- శృంగేరి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర భారతీ శంకరాచార్యుల వారి నుండి 1926లో ‘ఆంధ్రవిశారద’ బిరుదు,
- చేమకూరి వెంకటకవి రచించిన ‘విజయవిలాసం’ కావ్యానికి చేసిన ‘హృదయోల్లాస వ్యాఖ్య’కు 1971లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారము.
ఇవి కూడా చూడండి
[మార్చు]- తాపీ ధర్మారావు జీవితం-రచనలు
- తాపీ ధర్మారావు రచనలు (తెలుగుపరిశోధన వారి వెబ్ సైట్ లో)
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాశక్తి (19 September 2015). "జన మాధ్యమాలలో తెలుగు వినియోగం". www.prajasakti.com. Archived from the original on 23 September 2015. Retrieved 19 September 2019.
- ↑ ఏటుకూరి, ప్రసాద్. తాపీ ధర్మారావు జీవితం-రచనలు. Retrieved 19 March 2015.
వనరులు
[మార్చు]- Pages using infobox person with unknown parameters
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1887 జననాలు
- 1973 మరణాలు
- తెలుగు రచయితలు
- తెలుగు సినిమా రచయితలు
- సంపాదకులు
- నాస్తికులు
- తెలుగు సినిమా పాటల రచయితలు
- శ్రీకాకుళం జిల్లా రచయితలు
- శ్రీకాకుళం జిల్లా హేతువాదులు
- శ్రీకాకుళం జిల్లా పాత్రికేయులు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తెలుగు రచయితలు
- కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ రచయితలు
