Jump to content

నూతలపాటి వెంకటరమణ

వికీపీడియా నుండి
రిటైర్డ్ గౌ.జస్టిస్ ఎన్.వి. రమణ
నూతలపాటి వెంకటరమణ


48వ భారత ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
24 ఏప్రిల్ 2021 – 26 ఆగష్టు 2022
నియమించిన వారు రామ్‌నాథ్ కోవింద్
ముందు శరద్ అరవింద్ బొబ్దే
తరువాత ఉదయ్ ఉమేశ్ లలిత్

సుప్రీం కోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
17 ఫిబ్రవరి 2014 – 23 ఏప్రిల్ 2021
సూచించిన వారు పి. సథాశివం
నియమించిన వారు ప్రణబ్ ముఖర్జీ

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
పదవీ కాలం
2 సెప్టెంబర్ 2013 – 16 ఫిబ్రవరి 2014
సూచించిన వారు పి. సదాశివం
నియమించిన వారు ప్రణబ్ ముఖర్జీ
ముందు బాదర్ సురెజ్ అహ్మద్ (ఆపద్ధర్మ)
తరువాత బాదర్ సురెజ్ అహ్మద్ (ఆపద్ధర్మ)

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (ఆపద్ధర్మ)
పదవీ కాలం
10 మార్చ్ 2013 – 20 మే 2013
నియమించిన వారు ప్రణబ్ ముఖర్జీ

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
27 జూన్ 2000 – 1 సెప్టెంబర్ 2013
సూచించిన వారు ఆదర్శ్ సేన్ ఆనంద్
నియమించిన వారు కె.ఆర్. నారాయణన్

వ్యక్తిగత వివరాలు

జననం (1957-08-27) 1957 ఆగస్టు 27 (వయసు 67)
పొన్నవరం గ్రామం, వీరులపాడు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాసం 5, కృష్ణ మీనన్ మార్గ్, సునేహ్రి బాగ్, న్యూఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం[1]

జస్టిస్ నూతలపాటి వెంకటరమణ (జ. 1957 ఆగస్టు 27) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన న్యాయ నిపుణుడు, భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.[2] కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలోని ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన ఈయన, నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి 1983 లో న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. 2021 ఏప్రిల్ 24 వ తేదీన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడైనాడు.[3][4]

తెలంగాణ‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ఆయనకు గౌర‌వ డాక్ట‌రేట్‌ను ప్ర‌క‌టించింది. దీనిని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ 2022 ఆగస్టు 5న వ‌ర్సిటీ ప్రాంగ‌ణంలోని ఠాగూర్ స్టేడియంలో ఏర్పాటైన 82వ స్నాత‌కోత్స‌వంలో భాగంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు అంద‌జేశారు.[5]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఎన్. వి. రమణ ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27 న వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. గణపతిరావు, సరోజిని ఆయన తల్లిదండ్రులు. ఎన్. వి. రమణ తాత బాపయ్య చౌదరి. ఆయన కంచికర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసి, అమరావతి లోని ఆర్.వి.వి.ఎన్. (రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు) కాలేజీలో బి.యస్సీలో పట్టా పొందాడు. 1982 లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10 న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదై న్యాయవాదిగా వృత్తి ప్రారంభించాడు.[6]

న్యాయ వృత్తి

[మార్చు]

1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా నమోదు చేసుకున్నాడు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశాడు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించాడు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్‌గా వ్యవహరించాడు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశాడు. అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. 2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయసదస్సుల్లో జస్టిస్ రమణ ప్రసంగించాడు. ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నాడు.[2] హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు.

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠం

[మార్చు]

ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన డి మురుగేశన్ జూన్ లో పదవీ విరమణ చెయ్యడంతో ఆయన స్థానంలో జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తిగా భారత ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు 2013 సెప్టెంబరు 2 న, రాజ్ నివాస్ లో ఆడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేతుల మీదుగా జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం చేశాడు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తి

[మార్చు]

2014 ఫిబ్రవరి 7 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన రెండవ తెలుగు వ్యక్తి. అప్పటికే జస్టిస్ చలమేశ్వర్ సుప్రీం కోర్టులో న్యాయ మూర్తిగా కొనసాగుతున్నాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తెలుగువారిలో వెంకట రమణ రెండవ వ్యక్తి. 1966 జూన్ 30 నుండి 1967 ఏప్రిల్ 11 వరకు కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేసాడు.

విశేషాలు

[మార్చు]
  • వెంకటరమణకు తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. అవసరమైతే తప్ప ఆంగ్లంలో మాట్లాడరు. తెలుగులోనే పలుకరిస్తారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తెలుగునే ఎక్కువగా వాడుతుంటారు. 'కోర్టు వ్యవహారాల్లో పారదర్శకత అవసరం. మనకు తెలిసిన మన యాసతో కూడిన, మన తెలుగుభాషలో మాట్లాడడానికి, కేసుల్లో వాదించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు' అంటారు. మాతృభాష ఎదుర్కొంటున్న నిరాధారణ పట్ల పలువేదికలపై ఆవేదన చెందాడు "ఇంగ్లీష్ స్కిల్స్ ఫర్ లాయర్స్" అనే పుస్తక ఆవిష్కరణ సందర్భములో "చైనా , జపాన్ లలో ఆంగ్లానికి ప్రాధాన్యమేమీ లేదు. అయినా ఆ దేశాలు ఎంతో అభివృద్ధి చెందాయి, ఆంగ్లం వస్తేనే అభివృద్ది చెందగలమన్నది అపోహే" అని మాతృభాషపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరచాడు.[7]
  • ఆలమట్టి ప్రాజెక్టు పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదిగా పనిచేశాడు.
  • 13 సంవత్సరాల కాలంలో దాదాపు 60వేల కేసులను పరిష్కరించారు.
  • ముస్లిం రిజర్వేషన్లపై విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల ధర్మాసనంలో జస్టిస్‌ రమణ కూడా ఉన్నాడు. ఈ కేసులో మెజారిటీ జడ్జీల తీర్పుతో ఆయన విభేదించాడు. కులాలు, మతాలవారీ రిజర్వేషన్లు సంఘాన్ని విడగొడతాయని, రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగానే ఉండాలన్నాడు.
  • పర్యావరణ కేసుల్లో చెరువులు, కుంటల పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టరాదని, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలనీ తీర్పులు చెప్పాడు.
  • జమ్మూ కాశ్మీర్‌లో 4 జి ఇంటర్నెట్ సేవలను అందించే తీర్పుతో సహా జస్టిస్ రమణ చాలా ముఖ్యమైన తీర్పులను ఇచ్చాడు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రాష్ట్ర ప్రత్యేక హోదాను రద్దు చేసిన తరువాత హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ సెస్‌లను ప్రభుత్వం నిలిపివేసింది. "ఇంటర్నెట్ యాక్సెస్" అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.[8]

ఇవి కూడ చూడండి

[మార్చు]

శరద్ అరవింద్ బాబ్డే

మూలాలు

[మార్చు]
  1. "Delhi confidential: Mutual Praise". 24 August 2021.
  2. 2.0 2.1 Special Correspondent (2013-09-03). "Justice Ramana sworn in Delhi High Court CJ". The Hindu. Retrieved 2014-01-08.
  3. "తెలుగు బిడ్డకు సర్వోన్నత గౌరవం". www.eenadu.net. Retrieved 2021-04-07.
  4. Andrajyothi (25 April 2021). "చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ". www.andhrajyothy.com. Archived from the original on 26 April 2021. Retrieved 26 April 2021.
  5. "Osmania University To Confer Honorary Doctorate To CJI N V Ramana - Sakshi". web.archive.org. 2022-08-06. Archived from the original on 2022-08-06. Retrieved 2022-08-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. J. Venkatesan (2013-08-19). "Agrawal, Ramana to be Chief Justices of Madras, Delhi HCs". The Hindu. Retrieved 2014-01-08.
  7. "మాతృభాషంటే మక్కువ మమకారం - page number 9". eenadu.net. Archived from the original on 1 జనవరి 2021. Retrieved 8 April 2021.
  8. "Ram Nath Kovind appoints Justice NV Ramana as next CJI-". timesofindia. Archived from the original on 7 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లంకెలు

[మార్చు]