Jump to content

పవిత్ర బంధం (1996 సినిమా)

వికీపీడియా నుండి
పవిత్ర బంధం
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం వెంకటేష్,
సౌందర్య
సంగీతం ఎంఎం కీరవాణి
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ గీత చిత్ర ఇంటర్నేషనల్
భాష తెలుగు

వెంకటేష్, సౌందర్య జంటగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన పవిత్ర బంధం చిత్రం 1996 లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో పెళ్ళి విశిష్ట్తతను, దాని గొప్పతనాన్నీ సున్నితంగా, హృద్యంగా చిత్రీకరించారు. సి. వెంకటరాజు, జి. శివరాజు గీతా చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌లో నిర్మించిన ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు.[1][2] ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. వెంకటేష్, సౌందర్య నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నమోదైంది.[3] దాని విజయం కారణంగా, దీన్ని ఆరు ఇతర భాషలలో పునర్నిర్మించారు. కన్నడంలో మాంగల్యం తంతునానేనా (1998), హిందీలో హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై (1999), తమిళంలో ప్రియమానవలే (2000), బెంగాలీలో సాట్ పాకే బంధ (2009) ), ఒడియాలో సుహాగ్ సింధూరా (1996) గా నిర్మించారు. బంగ్లాదేశ్‌లో నిర్మించిన ఇ బధోన్ జబెనా చిరే (2000)లో రియాజ్, షబ్నూర్ నటించారు. కన్నడ చిత్రం అనురాగ అరలితు తర్వాత ఆరు భాషలలో రీమేక్ చేసిన రెండవ భారతీయ చిత్రంగా ఇది నిలిచింది.

ఉత్తమ చిత్రంగా బంగారు నంది అవార్డు గెలుచుకున్నచిత్రం.

విశ్వనాథ్ ( ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, 55) మల్టీ మిలియనీర్ పారిశ్రామికవేత్త. విజయ్ ( వెంకటేష్, 25), అతని ఏకైక కుమారుడు, యునైటెడ్ స్టేట్స్ (చికాగో, ఇల్లినాయిస్) లో పెరుగుతాడు. వివాహం పట్ల అతనికి ఆసక్తి లేదు. అతని లక్ష్యం సాధ్యమైనంతవరకు తన యవ్వనాన్ని ఆస్వాదించడమే. విశ్వనాథ్ తన కొడుకు వివాహం చేసుకుని బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటాడు. అతని పట్టుదల వలన విజయ్ వివాహానికి అంగీకరిస్తాడు. కానీ ఒక ప్రత్యేకమైన షరతుతో -పెళ్ళి తరువాత ఆమెతో ఒకే సంవత్సరం పాటు మాత్రమే కాపురం చేస్తాడు. ఆ తరువాత అతడికి నచ్చితే కొనసాగిస్తాడు, లేదంటే తెగతెంపులు చేసుకుంటాడు. ఇదీ షరతు.ఒక రకమైన టెస్ట్ డ్రైవ్ గా అతడు ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడు.

విశ్వనాథ్ వ్యక్తిగత కార్యదర్శి రాధ ( సౌందర్య, 22) కష్టపడి పనిచేసే యువతి, కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది. ఉద్యోగాన్ని వదిలి తన కొడుకును పెళ్ళి చేసుకోమని విశ్వనాథ్ రాధను కోరతాడు. కాని విజయ్ యొక్క వింత పరిస్థితి విన్నప్పుడు ఆమె నిరాకరిస్తుంది. అయితే, రాధ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, కాబట్టి ఆమె ఈ ఆఫర్‌ను పునఃపరిశీలిస్తుంది. విజయ్‌ను వివాహం చేసుకున్నందుకు ప్రతిఫలంగా, తన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయమని కోరుతుంది. విశ్వనాథ్ అందుకు వెంటనే అంగీకరిస్తాడు.

విజయ్ రాధ పెళ్ళి చేసుకుంటారు. వివాహం తరువాత, వారు ఒకరితో ఒకరు స్నేహంగా ఉంటారు. విజయ్ ఒక ప్రమాదంలో గాయపడినప్పుడు రాధ ప్రత్యేఖ శ్రద్ధతో అతనిని చూసుకుంటుంది. అయితే, సంవత్సరం చివరిలో, ముందే అనుకున్నట్లుగా, వివాహాన్ని రద్దు చేయాలని విజయ్ నిర్ణయించుకుంటాడు. రాధ విజయ్ ను వదిలి ఇంటికి తిరిగి వస్తుంది. విడిపోయిన తరువాత, విజయ్‌కి తన భార్య పట్ల అనురాగం పెరుగుతూ ఉంటుంది. త్వరలో, అతను ఆమె విలువను గ్రహించి, ఆమె తిరిగి రావాలని కోరుకుంటాడు, కాని ఆమె తిరస్కరిస్తుంది. ఇంతలో, రాధ గర్భవతి అని తెలుసుకుంటాడు. స్వీయ పోషణకై, ఆమె ఓ కొత్త కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టరు విజయ్యేనని తెలిసి ఆమె ఆశ్చర్యపోతుంది. తాను మారిపోయానని చెప్పి ఆమెను తిరిగి కోరుకుంటాడు. కానీ పదేపదే వేడుకున్నాగానీ, ఆమె అంగీకరించదు. ఎందుకంటే అతనిపై ఆమెకున్న విశ్వాసం దెబ్బతింది. విజయ్ ఆమెను వెంబడిస్తూనే ఉంటాడు. తరువాత, రాధకు ఆమె కుటుంబం సీమంతం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి విశ్వనాథ్, విజయ్ హాజరవుతారు, రాధ విజయ్ ను తన భర్త అని వెల్లడించి, అతిథులందరికీ తమ వివాహ ఒప్పందం గురించి చెబుతుంది. అప్పుడు ఒక వాదన జరిగి, విజయ్ అతని తండ్రి బయటికి వెళ్తారు, తరువాత అతిథులందరూ కూడా వెళ్తారు.

విజయ్‌ను చంపడానికి ఒకప్పుడు ప్రయత్నించిన దిలీప్ (ప్రకాష్ రాజ్), జయరామ్ (శ్రీహరి) లు జైలు నుంచి తప్పించుకున్నారని రాధకు తెలుస్తుంది.. మోసం చేసినందుకు తమను ఉద్యోగం నుండి తొలగించిన విజయ్ కోసం వారు వెతుకుతూంటారు. రాధ ఆందోళన చెంది, వీలైనంత త్వరగా విజయ్‌ను కలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. విలన్లిద్దరూ ఆమెను విజయ్‌నూ చంపడానికి ప్రయత్నిస్తారు. జయరాం, దిలీప్ లు లారీ కిందపడి మరణిస్తారు. రాధ మగబిడ్డను ప్రసవిస్తుంది. వారిద్దరీ రాజీపడతారు.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. టి-సిరీస్ ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4]

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "మాయదారి మాయదారి అందమా"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుజాత 3:52
2. "చలి కొడతాంది"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర 4:37
3. "పాటంటే పాట కాదూ"  సురేష్ పీటర్స్, అనురాధా శ్రీరాం 2:58
4. "ఐసలకడీ"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఆశాభోస్లే 6:02
5. "ఓ మై డాడీ"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర 4:48
6. "అపురూపమైనదమ్మ ఆడజన్మ"  కె.జె. ఏసుదాస్ 4:45
25:42

రీమేక్‌లు

[మార్చు]
సంవత్సరం సినిమా భాష తారాగణం దర్శకుడు
1996 సుహాగ్ సింధూర ఒరియా సిద్ధాంత, రచనా బెనర్జీ
1998 మాంగళ్యం తంతునానేన కన్నడ వి. రవిచంద్రన్, రమ్య కృష్ణన్ వీఎస్ రెడ్డి
1999 హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై హిందీ అనిల్ కపూర్, కాజోల్ సతీష్ కౌశిక్
2000 ఇ బధోన్ జబేనా చీరే బెంగాలీ బంగ్లాదేశ్ రియాజ్, షబ్నూర్ ఎఫ్ఐ మాణిక్
2000 ప్రియమానవాలే తమిళం విజయ్, సిమ్రాన్ కె. సెల్వ భారతి
2009 సాత్ పాకే బంధ బెంగాలీ జీత్, కోయెల్ మల్లిక్

మూలాలు

[మార్చు]
  1. https://www.imdb.com/title/tt1579650/
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-06-18. Retrieved 2020-08-05.
  3. "Success and centers list – Venkatesh". idlebrain.com. Retrieved 16 December 2012.
  4. "MusicRaaga (Old to New): Pavitra Bandham (1996)". Archived from the original on 27 January 2013. Retrieved 5 February 2013.