పాలమూరు జిల్లా చారిత్రక స్థలాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్‌కు పాలమూరు అని కూడా పేరు. పాలమూరు జిల్లా అంటే మహబూబ్ నగర్ జిల్లానే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేయకముందు ఉన్న (ఉమ్మడి) మహబూబ్ నగర్‌ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. వాటిలో గద్వాల, పూడూరు, బోరవెల్లి, కొల్లాపూర్, జటప్రోలు, ఆత్మకూరు పేర్కొనదగినవి.

గద్వాల

[మార్చు]

1663 సంవత్సరం నుండి 1712 మధ్యకాలంలో పెదసోమభూపాలుడు (ఇతనినే నలసోమనాద్రి అనేవారు) పూడూరు రాజధానిగా పరిపాలించేవాడు. పూడూరు కోటను మరమ్మత్తు చేస్తుండగా గుప్తనిధి లభించగా, శత్రు ధుర్భేధ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గద్వాలలో మట్టి కోటను కట్టించాడు. కోట నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు రావడముతో కేశవాచారి అనే బ్రాహ్మణుడిని బలి ఇచ్చారని, ఆ పాప పరిహారానికి గాను గద్వాల కోటలో చెన్నకేశవ దేవాలయాన్ని నిర్మించారని కథ ప్రచారంలో ఉంది. చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన తరువాత రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చాడు. గద్వాల సంస్థానాధీశులకు చెన్నకేశవ స్వామి కులదైవం.

1709 నుండి 1712 వరకు కర్నూలు దుర్గం రాజా పెదభూపాలుని ఆధీనంలో ఉండేది. బహద్దూర్ షా అనుయాయులు గద్వాల రాజు ఆధీనంలో ఉన్న కర్నూలు దుర్గాన్ని స్వాధీనం చేసుకోవడానికి నిజాం తన సేనాని దిలీప్ ఖాన్ ను పంపించాడు. దిలీప్ ఖాన్ కు పెద సోమభూపాలునికి మధ్య కర్నూలు సమీపంలోని నిడదూరు గ్రామం దగ్గర జరిగిన యుద్ధంలో రాజా పెదసోమభూపాలుడు జ్యేష్ట శుక్ల అష్టమి రోజు మరణించాడు. నిజాం గద్వాల సంస్థానాన్ని వశం చేసుకోకుండా పెద్దసోమభూపాలుని భార్య లింగమ్మతో సంధిచేసుకొనడంతో నిజాం రాజ్యంలో గద్వాల స్వతంత్ర రాజ్యంగా అవతరించింది. అప్పటి నుంచి 1948లో నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యేవరకు గద్వాల సంస్థానం కొనసాగింది.

పూడూరును చాళుక్యులు పరిపాలించగా, చాళుక్యులకు, పల్లవులకు మధ్య జరిగిన యుద్ధంలో పెదసోమభూపాలుడు గదను, వాలమును ప్రయోగించడము వలన ఈ కోటకు "గదవాల (గద్వాల)" అనే పేరు వచ్చిందని చెబుతారు.[1] ఈ విధంగా 1663 నుండి 1950 వరకు గద్వాల సంస్థానాధీశులచే పరిపాలింపబడింది. రాజాభరణాల రద్దు తరువాత ఈ కోటను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, తరువాత 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాలను కోటలోపల ఏర్పాటు చేసారు. డిగ్రీ కళాశాల పేరు కూడా రాణి పేరు మీదుగా మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ (మాల్డ్) డిగ్రీ కళాశాల అనే పేరు పెట్టబడింది.

పూడూరు

[మార్చు]

పూడూరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి నూతనంగా ఏర్పాటు చేయబడిన జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలంలోని గ్రామం. ఇది చారిత్రక ప్రాశస్త్యం కల గ్రామం. నల సోమనాద్రి గద్వాలలో కోటను నిర్మించకముందు పూడూరును రాజధానిగా చేసుకొని పాలించాడు. చాళుక్యుల కాలంలో కూడా ఈ గ్రామం సామంత రాజధానిగా ఉండేది. ఈ గ్రామం తొమ్మిదవ శతాబ్దాన అత్యున్నత స్థితిలో ఉన్నట్లు ఇక్కడ లభించిన ఓ కన్నడ శాసనం ద్వారా తెలుస్తుంది.[2].ఈ గ్రామంలోని మల్లికార్జునస్వామి దేవాలయం లోని శాసనంలో ' పుండ్రే సంజ్ఞ పురే దుర్గే యశస్సోదరే ' అను సంజ్ఞ వలన దీని పూర్వనామం "పుండ్రపురం"గా ప్రసిద్ధి చెందినట్లు తెలుస్తుంది. ఈ గ్రామం చుట్టూ వలయాకారంలో శిథిలమైన దుర్గం ఆనవాళ్ళు ఉన్నాయి.

ఈ గ్రామం నడిబొడ్డున చెన్నకేశవ ఆలయం ఉంది. ఊరిలో మిగిలిన దేవాలయాలతో పోల్చితే ఇది నూతనమైనది. ఈ ఆలయానికి శిఖరం లేదు. ఒక ఇల్లు వలే కనిపిస్తుంది. ఈ ఆలయ సింహద్వారం చాళుక్య శిల్ప సంప్రదాయములో ఉంది. ఈ ఆలయద్వారం ఒక రైతు పొలం దున్నుతుండగా బయల్పడినదని గ్రామ ఐతిహ్యం. ఈ ఆలయానికి వెనుక వైపు ఉన్న సత్రం చక్కటి పొందికతో నిర్మించబడి, బహు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలోని దేవుడు కేశవస్వామి. ఈ స్వామి గద్వాల సంస్థాన స్థాపకుడైన పెద సోమనాద్రికి, ఇతర గద్వాల ప్రభులకు ఇలవేల్పు. పెద సోమన తన ఆస్థాన కవి అయిన కొటికెలపూడి వీరరాఘవయ్యకు ఈ స్వామి ఆదేశానుసారమే నూతన తిక్కన అను బిరుదునిచ్చాడు. ఈ రాఘవయ్య రచించిన భారత ఉద్యోగపర్వం కూడా ఈ స్వామికే అంకితమివ్వబడినది.[3]

ఈ గ్రామం ఒకప్పుడు జైనులకు ప్రధాన స్థావరంగా ఉండి, 12 వ శతాబ్దిలో జైన, శైవ సంఘర్షణలకు యుద్ధరంగంగా నిలిచినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ గ్రామంలోని మల్లికార్జునస్వామి దేవాలయానికి సమీపంలోని కోటగోడకు ఉన్న కొన్ని విగ్రహాలలో తలపై ఏడు పడగల సర్పం కలిగి ధ్యానముద్రలో ఆసీనుడై ఉన్న జైన తీర్థంకరుని విగ్రహం ఉంది. ప్రధానమైన ఈ విగ్రహంతో పాటు మరో మూడు తీర్థంకరుల విగ్రహాలు కూడా ఉన్నాయి. మల్లికార్జునుని గుడి దగ్గర కూడా చెల్లాచెదురుగా పడి ఉన్న శిల్పాలలో పార్శ్వనాథుని విగ్రహం, మరో రెండు తీర్థంకరుల విగ్రహాలు ఉన్నాయి. ఈ గుడి దగ్గర ఓ నల్లని రాతిపై మూడు వైపుల 12 వ చాళుక్య విక్రమ సంవత్సరం నాటి కన్నడ శాసనం ఉంది. ఈ శాసనంలో కూర్చొని ఉన్న ధ్యాన జైన విగ్రహం, జైనుని ప్రశంస, పల్లవ జినాలయ ప్రశంస కనిపిస్తుంది.[4] అదే విధంగా వీరభద్రాలయం దగ్గర ఉత్తరం వైపు ఉన్న సత్రానికి సంబంధించిన గోడపై ఓ రాతి మీద నాలుగు వరుసలలో కొన్ని శిల్పాలను మలిచారు. మొదటి వరుసలో శివలింగంతో పాటు ధ్యాన జైన విగ్రహం కనిపిస్తుంది. ఈ వీరభద్రాలయం పూర్వం జినాలయంగా ఉండి, వీరశైవం విజృంభించిన కాలంలో ధ్వంసమై శివాలయంగా మారినట్లు మారేమండ రామారావు అభిప్రాయపడ్డారు.[4] పల్లవుల కాలంలో త్రిభువనమల్ల విక్రమాదిత్యుని సామంతుడు హల్లకరాసు పుదూరులోని పల్లవ జినాలయ జైనగురువు కనకసేన భట్టారకునికి ఒక సాగులోనున్న భూమిని దానం చేశాడు.[5]

బోరవెల్లి

[మార్చు]

పాలమూరు జిల్లాలోని ఈ గ్రామం, 2016-తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా లో చేరినది. ఈ జిల్లాలోని మానవపాడ్ మండలంలో కలదు. ఈ గ్రామం ఒకనాడు బోరవెల్లి సంస్థానంగా పేరొందినది. ఈ సంస్థానానికి మూల పురుషుడు నల్లారెడ్డి[6]. మిడిమిళ్ళ గోత్రజులు. వీరి ఇలవేల్పు పోల్గంటి సోమేశ్వరుడు. ఇతనికి మల్లాంబ, తిమ్మాంబ అను ఇద్దరు భార్యలు ఉండేవారు. మల్లాంబకు పెద సోమభూపాలుడు, తిమ్మాంబకు చిన సోమభూపాలుడు అను కుమారులు కలిగారు. పెద సోమభూపాలుని భార్య లక్ష్మమ్మ, వీరి కుమారుడు వెంకటపతి. చిన సోమభూపాలుడి భార్య గిరియమ్మ. ఈమె గద్వాల సంస్థానానికి చెందిన ఆడపడుచు. గద్వాల సంస్థానాధిపతి అయిన పెద శోభనాద్రి, ఆయన భార్య లింగమాంబలు గిరియమ్మ తల్లిదండ్రులు. బోరవెల్లి చిన సోమభూపాలుడు, గిరియమ్మ దంపతులకు సంతానం లేకపోవడంచే పెద సోమభూపాలుని కుమారుడైన వేంకటపతిని దత్త పుత్రునిగా తీసుకున్నారు. గిరియమ్మ తన పుట్టినింటివారిలాగే ఎందరో కవిపండితులను పోషించి మంచి కవిపోషకులుగా పేరు సంపాదించారు. వేంకటపతి కూడా తల్లికి తగ్గ కుమారుడిగానే కవులను పోషించారు. ఈ వెంకటపతే బోరవెల్లి సంస్థానాన్ని 1668 లో గద్వాల సంస్థానంలో విలీనం చేసాడు. తరువాత గద్వాల, బోరవెల్లి ఉమ్మడి సంస్థానాలకు ఏలికయ్యాడు[7]. దీనితో ఇక్కడి కవులు గద్వాల సంస్థానానికి బదిలీ అయ్యారు. అందుకే ' గద ' ( గదాయుధం), 'వాలం ' (కత్తి) కలిగిన సంస్థానానికి ' గంటం ' (కలం) జోడించిన ఖ్యాతి బోరవెల్లికి దక్కిందంటారు. బోరవెల్లి సీమలో ఎంతో మంది కవులు తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించి ప్రభువుల ఆదరణకు నోచుకున్నారు. దత్తన్న, మల్లన మంత్రి, కృష్ణప్ప, బోరవెల్లి నృసింహకవి, పూడూరు కృష్ణయామాత్యుడు, రేటూరి రంగరాజు, చింతలపల్లి ఛాయాపతి, లయగ్రాహి గరుడాచల కవి వంటి ఎందరో కవులు ఇక్కడివారే. ఈ గ్రామంలో శివాలయాన్ని, కేశవాలయాన్ని బోరవెల్లి సంస్థాన ప్రభువులు నిర్మించారు. వీటిలో కేశవాలయం ప్రసిద్ధి చెందినది. ఇక్కడి కేశవస్వామికి బోరవెల్లి సంస్థాన కవులైన చింతలపల్లి ఛాయాపతి 'రాఘవాభ్యుదయం ', లయగ్రాహి గరుడాచల కవి ' కౌసలేయ చరిత్రం ' అంకితమియబడినవి.

కొల్లాపురం

[మార్చు]

జటప్రోలు

[మార్చు]

ఆత్మకూరు

[మార్చు]

ఆత్మకూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక పట్టణం. ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని 23 మేజర్ గ్రామపంచాయతీలలో ఒకటి.

ఖిల్లాఘణపురం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము-2, 1962 ప్రచురణ, పేజీ 304
  2. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-23
  3. సమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం,రచన:ఆరుద్ర, ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట-50
  4. 4.0 4.1 గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-24
  5. సమగ్ర ఆంధ్ర చరిత్ర - సంస్కృతి రెండవ భాగం - ముప్పాళ్ళ హనుమంతరావు పేజీ.733
  6. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-83
  7. సంగ్రహాంధ్ర విజ్ఞానకోశం, 3 వ సంపుటం, పుట -305