Jump to content

రెంటూరి రంగరాజు

వికీపీడియా నుండి
(రేటూరి రంగరాజు నుండి దారిమార్పు చెందింది)

రెంటూరి రంగరాజు.17 వ శతాబ్ది ప్రథమార్ధానికి చెందిన ప్రముఖ తెలుగు కవి. ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. అపస్తంబ సూత్రుడు. శ్రీవత్స గోత్రుడు. చినగంగనామాత్య పుత్రుడు. ఇతను మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల సంస్థానానికి ముందు వెలుగొందిన బోరవెల్లి సంస్థానానికి చెందిన కవి. శ్రీరంగదేశికుల శిష్యుడనని కవి ప్రకటించుకున్నాడు. అద్దంకి సింగరాచార్యులు శిష్యుడన్న మరో వాదన కూడా ఉంది. కామేశ్వర చరిత్రం అను ద్విపద కావ్యాన్ని రాసిన రేటూరి భావనామాత్యుడు ఇతని పినతండ్రి కుమారుడు.

ఇంటిపేరు - వాదాలు

[మార్చు]

రంగరాజు ఇంటి పేరు రెంటూరి అని, రేటూరి అని రెండు రకాలుగా సాహితీ చరిత్రకారులు వాడుతున్నారు. రెంటూరి వారని భానుమతీ పరిణయం ముద్రిత పత్రిలో ఉండినా, ఇది లేఖన ప్రమాదమని, మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో ఉన్న భానుమతీ పరిణయం తాళపత్ర ప్రతిలో రేటూరి అనే ఉందని చాగంటి శేషయ్య పేర్కొన్నారు[1]. అంతేకాకుండా ఇతను గుంటూరు జిల్లా బాపట్ల (తాలుకాలోని)కు ఉత్తరాన ఎనిమిది మైళ్ళ దూరాన ఉన్న రేటూరు వారై ఉండవచ్చునని కూడా చాగంటి శేషయ్య పేర్కొన్నారు.

రచనలు

[మార్చు]

ఇతను 'భానుమతీ పరిణయం ' అను గ్రంథాన్ని రచించాడు. ఇది నాలుగు ఆశ్వాసాల గ్రంథం. ఈ గ్రంథాన్ని కవి వేంకటగిరి ప్రభువగు వెలగోటి రాయభూపాలునకు అంకితం ఇచ్చాడు[2]. ఇతను ' దేవకీనందన శతకం ' అను పేర కొన్ని వందల పద్యములు రచించినట్లు అప్పకవీయం మూడవ ఆశ్వాసంలోని 23 వ పద్యము వలన తెలుయుచున్నది. కాని ఈ శతకం అలభ్యం. కృతిపతి తన్ను గూర్చి పలికినట్టుగా కవి తన శక్తిసామర్ధ్యాదులను భానుమతీ పరిణయమునం దిట్లు తెలుపుకొన్నాడు -

సీ. వ్యస్తాక్షరీధుర్యవిస్తీర్ణభావంబు క్రముకసంఖ్యాఖ్యానకౌశలంబు
నారోహణావరోహణలేఖనప్రౌఢి యగ్రపద్యగ్రహణాభిరక్తి
యనవలోకితశారికాభిఖేలనరీతి వరసమస్యాపూర్తివైభవంబు
సముదగ్రవీక్షితచతురంగబలకేళికావిలాసము నేకకాలముననె

యలర బ్రకటింపనేర్తు పష్టావధాన కలితశత లేఖినీపద్యగద్యశక్తి
సాటిమీరితి వాంధ్రకర్ణాటచోళ రాజసభలను రెంటూరి రంగనార్య.


గోలకొండ మహమ్మదీయులను, కొండవీడు వినుకొండప్రభువులను జయించి 1579 సంవత్సరమునందు విజయనగరరాజుల పక్షమున బోరాడి విపక్షరాజబృందము నోడించిన కస్తురి రంగనాయనికి కృతిపతియైన రాయభూపతి పెదతండ్రి మనుమడు. భానుమతీ పరిణయము కృతినందునప్పటికి రాయనృపాలునికి యుక్తవయస్సువచ్చిన కొడుకు లుండుటచేత గ్రంథరచన చేసిన కాలము 1620వ సంవత్సరప్రాంతమని చెప్పవచ్చును.

చ. అనుపమభద్రలీల వెలమాన్వయవార్థి బ్రతాపలక్ష్మితో
నెనసినరాయశౌరి జగదేకవదాన్యశిఖావతంస మౌ
ననుచు నుతించుటేమియరు దావిభు డిచ్చినభూరిసంపదన్
ధనదులు రాజులున్ ఘనులు దా రగుచు న్నిఖిలార్థు లుండగన్.

ఇత్యాది పద్యములతో గవి కృతిపతిని బహువిధముల వర్ణించి యున్నాడు.

రచనా శైలి

[మార్చు]

ఇతని రచనా శైలిలో అల్లసాని పెద్దన కవితా ఛాయలు, ఎత్తుగడలు కనిపించినా, ఈతని కవనము ద్రాక్షాపాకమై మనోహరముగా నున్నది. శైలిని జూపుటకై భానుమతీ పరిణయములోని కొన్నిపద్యముల నిందు జూపుచున్నాను.

ఉ. తీరినజాతినీలములతిన్నెలపై బ్రతిబింబితంబులౌ
తారకసౌధమౌక్తికవితానము లొప్పగ జూచి బాలికల్
చారుమృగీమదం బలది చక్కనికప్రపుమ్రుగ్గు లిప్పు డి
చ్చో రచియించినామనుచు సూటిగ నాత్మ దలంతు రప్పురిన్. ఆ. 1.

చ. సుమముల వ్రాలివ్రాలి పరిశుద్ధవసంతకళా ప్తమత్తరం
గములను దేలితేలి యతికాంతసుధామధురోల్లసన్మరం
దము చవి గ్రోలిక్రోలి నవదక్షిణగంథవహానుకూలసం
భ్రమమున సోలిసోలి మదబంభరము ల్విహరించు వామనిన్. ఆ. 2.

చ. అలరె జకోరముల్ ప్రియతరాబ్జముఖీమణిదృక్చకోరముల్
కలగె సరోజముల్ మదనకంపితపాంథమనస్సరోజముల్
తొలగెను భీతి జక్రములు ధూర్తగుణోజ్జ్వలజారచక్రముల్
నలినవిరోధినూత్నకిరణంబులు కొన్ని దివిం దలిర్పగన్. ఆ. 3.

చ. అతిముద మొప్ప ధర్మతనయాదులు చూచిరి కేకికోకిల
ప్రతతివతంసహంసమదబంభరడింభరథాంగనాదమం
డితబహుగంథబంధురపటీరతటీరతటీరమమాణగోపికా
ధృతమణిదీపికానికరతేజము రైవతకాద్రిరాజమున్. ఆ. 4.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రకవితరంగిణి, సం. చాగంటి శేషయ్య, పుట- 172
  2. గద్వాల సంస్థాన తెలుగు సాహిత్య పోషణం, రచన:డాక్టర్ కట్టా వేంకటేశ్వర శర్మ, సునందా పబ్లికేషన్స్, మ. నగర్, 1987, పుట-71