పిఎస్‌ఎల్‌వి-సీ30 ఉపగ్రహ వాహకనౌక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ ప్రయోగ వాహన మాదిరి

పిఎస్‌ఎల్‌వి-సీ30 ఉపగ్రహ వాహకనౌక ను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తయారు చేసిన 31వ పిఎస్‌ఎల్‌వి ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక. ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఆస్ట్రోశాట్ అనే ఉపగ్రహాన్ని 2015 సెప్టెంబరు 28, సోమవారం ఉదయం సరిగా 10:00 గంటలకు, ఆంధ్ర ప్రదేశ్, నెల్లూరు జిల్లా, శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి లాంచ్‌ప్యాడ్ నుండి విజయవంతంగా ప్రయోగించారు.[1][2] అంతకుముందు అనుకున్నవిదంగా అస్ట్రోశాట్ ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 6 ఉపగ్రహాలను కూడా కక్ష్యలో ప్రవేశపెట్టారు. పిఎస్‌ఎల్‌వి-సీ30 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానికి సంబంధించి శనివారం (27. 09-2015) ఉదయం 8 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 25. 32 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తిచేసే విధంగా లాంచ్‌ రిహార్సల్స్ నిర్వహించారు.[3]

పిఎస్‌ఎల్‌వి-సీ30 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఇండోనేసియాకు చెందిన 76 కిలోల లపాన్-ఏ2, కెనడాకు చెందిన14కిలోల ఎన్‌ఎల్‌ఎస్-14సూక్ష్మ ఉపగ్రహాలతో (మైక్రోశాట్‌లైట్) పాటు నాసా/అమెరికాకు చెందిన మొత్తం 28 కిలోల బరువున్న లెమ్యూర్/లీమూర్-2, 3, 4, 5 నానో ఉపగ్రహాలను సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో (sun synchronous polar orbit) లో ప్రవేశపెట్టారు.[4] ఇండోనేషియాకు చెందిన 11 మంది శాస్త్రవేత్తలు, కెనడాకు చెందిన కాన్సల్ జనరల్‌తో పాటు ఓ శాస్త్రవేత్త, నాసాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలూ షార్‌కు విచ్చేశారు.[5] ఇస్రో ఇప్పటిదాకా వాణిజ్యపరంగా 45 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇప్పుడు పిఎస్‌ఎల్‌వి-సీ30 ఉపగ్రహ వాహకనౌక ద్వారా మొత్తం 7 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టడం ద్వారా ఈ సంఖ్య 51 కి పెరిగింది[6]. పిఎస్‌ఎల్‌వి-సీ30 ఉపగ్రహ వాహకనౌక నిర్మాణానికి 150 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తున్నది. ఈ ఉపగ్రహ ప్రయోగ వాహనం పిఎస్‌ఎల్‌వి-XL శ్రేణికి చెందిన 10వ ఉపగ్రహ వాహకం.

అంతకు ముందు ప్రయోగించిన పిఎస్‌ఎల్‌వి-XL శ్రేణికి చెందిన 9 ఉపగ్రహ వాహకనౌకలు:పిఎస్‌ఎల్‌వి-C11/చంద్రయాన్-1, పిఎస్‌ఎల్‌వి-C17/GSAT-12, పిఎస్‌ఎల్‌వి-C19/RISAT-1, పిఎస్‌ఎల్‌వి-C22/IRNSS-1A, పిఎస్‌ఎల్‌వి-C25/మార్స్ ఆర్బిటర్ మిషన్, పిఎస్‌ఎల్‌వి-C24/IRNSS-1B and పిఎస్‌ఎల్‌వి-C26/IRNSS-1C, పిఎస్‌ఎల్‌వి-C27/IRNSS-1D, పిఎస్‌ఎల్‌వి-C28/DMC3 missions [4].

ఈ ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షంలో 650 కి.మీ. ఎత్తులో, భూమధ్య రేఖకక్ష్యకు దగ్గరగా సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో ప్రవేశపెట్టిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహం బరువు 1513 కిలోలు. ఇందులో ఇంధనం బరువు 42 కిలోలు. ఈ ఉపగ్రహం జీవితకాలం ఐదేళ్ళు. ఈ ఉపగ్రహ తయారీకి 178 కోట్లు ఖర్చు అయ్యింది[6]. ఆస్ట్రోశాట్ ఉపగ్రహ తయారీకి 11 ఏళ్లు పట్టినట్లు తెలుస్తున్నది. పిఎస్‌ఎల్‌వి-సీ30 ఉపగ్రహ వాహకనౌక ఎత్తు 45 మీటర్లు, ప్రయోగసమయంలో బరువు 320 టన్నులు[7]

వాహనం ప్రయోగ వివరాలు

[మార్చు]

పిఎస్ఎల్‌వి-సీ30 ఉపహ్రహ వాహననౌకను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్షకేంద్రం లోని మొదటి ప్రయోగ వేదికనుండి ప్రయోగించారు. మొదటి ప్రయోగ వేదికను 1990 లో, మొదటగా పిఎస్ఎల్‌వి ఉపగ్రహాలను ప్రయోగించటం ప్రారంభ మైనపుడు నిర్మించారు. పిఎస్ఎల్‌వి-సీ30 ఉపహ్రహ వాహననౌక నాలుగు దశల, అంచెల నిర్మాణం. ఇందులో మొదటి దశకు ఆరు PS0M-XL బూస్టరులను అదనంగా అనుసంధానం చేసారు. S-12 ఘన ఇంధన మోటారులను కలిగిన ఈ ఆరు బూస్టర్లలో నాలుగు సున్నాకౌంట్ వద్ద, మొదటి దశ S-138 మండటం ప్రారంభం అయిన 0. 42సెకన్లకు రెండు బూస్టరులు, 0. 62 సెకన్లకుమరో రెండు బూస్టరులు రెండు జంటలుగా మండటం ప్రారంభమైనది[8].

స్ట్రాపాన్ మోటరులు మండటం ప్రారంభం కాగానే ఉపగ్రహ వాహననౌక అతరిక్షవైపు తన ప్రయాణాన్నిప్రారంభించింది. ప్రయోగ వేదిక నుండి రాకెట్ పైకి లేచిన 25 సెకన్ల తరువాత మిగిలిన రెండు స్ట్రాపాన్ మోటార్లు మండటం ప్రారంభమైంది. భూస్థాయిలో మొదటగా మండటం ప్రారంభించిన మొదటి రెండుస్ట్రాపాన్ మోటరులు 69. 9 సెకన్లకు దహన క్రియ పూర్తయ్యి, రాకెట్ నుండి వేరుపడ్డాయి. మొదటి రెండుస్ట్రాపాన్ మోటరులు వేరుపడిన సెకండులో ఇరవయ్యవ వంతు సమయంలో భూస్థాయిలో మండటం మొదలైన మిగిలిన రెండుస్ట్రాపాన్ మోటరులుకూడా వేరుపడినవి. రాకెట్ ప్రయోగ వేదిక నుండి బయలు దేరిన తరువాత మండటం మొదలైన చివరి రెండు స్ట్రాపాన్ మోటరులు, వాహకనౌక గమనం/యానం మొదలైన 92 సెకండ్ల తరువాత ప్రధాన రాకెట్/ఉపగ్రహ వాహకనౌక నుండి విడిపోయాయి[8].

స్ట్రాపాన్ మోటరులు రాకెట్‌నుండి విడివడిన తరువాత 1 నిమిషం 52 సెకన్ల పాటు మొదటి దశ వరకు మండిన తరువాత మొదటి దశనుండి వేరుపడినది. మొదటి దశ వేరుపడిన తరువాత, సెకండులో ఇరవైవంతు సమయానంతరం రెండవ (PS2) దశ మండటం మొదలైనది. రెండవ దశలో అసౌష్ఠవ డై మిథైల్ హైడ్రాజీన్ (UDMH), హైడ్రాజీన్ హైడ్రేట్ గా పిలువబడు UH-25 చోదక ఇంధనంగా, డైనైట్రోజన్ టెట్రాక్సైడ్ను ఆక్సిడైజరు/ఆక్సీకరణి (oxidizer) గా ఉపయోగించారు. ఈ దశలో వికాస్ ఇంజనును అమర్చారు. రెండవ దశలో మోటరు మండటం ప్రారంభమైన 57 సెకన్ల తరువాత, భూమి నుండి 114 కిలోమీటర్ల ఎత్తులో, ఉపగ్రహ వాహకనౌక కొన భాగాన ఉపగ్రహం చుట్టూ రక్షణగా అమర్చిన కవచం (పేలోడ్ ఫెయిరింగ్) రాకెట్ నుండి వేరుపడింది. ఈ ఎత్తులో ఎటువంటి వాతావరణ ఒరిపిడి/ఘర్షణ, పీడన ప్రభావం ఉండదు. అందువలన ఈ ఎత్తులో రక్షణకవచాన్ని విడగొట్టటం జరుగుతుంది[8].

రెండునిమిషాల 30.79 సెకన్లకు రెండవ దశ దహనక్రియ పూర్తయి, మూడవ దశ రాకెట్/మోటరునుండి వేరుపడిన 1.19 సెకన్ల తరువాత, ఘన చోదకం కలిగిన మూడవ దశ (PS3) లోని S-7 మోటారు జ్వలనం మొదలైంది. ఈ దశలో మోటరు 70 సెకన్లపాటు చోదన క్రియను కొనసాగించింది. మూడవ దశ దహనక్రియ ముగిసిన తరువాత, వాహకనౌక తన ప్రయాణాన్ని కొనసాగించింది. మూడవ దశ దహనక్రియ ఆగిన, 1.13 నిమిషాల తరువాత మూడవ దశ మోటరు, రాకెట్ నాల్గవ దశనుండి వేరుపడింది. మూడవ దశ మోటరు వేరుపడిన తరువాత రాకెట్ 7.10 నిమిషాలు నిర్దేశిత దిశలో ప్రయాణించిన తరువాత, వాహకనౌక ప్రయాణం మొదలైన 16 నిమిషాల 57 సెకన్లకు నాల్గవ దశ మోటరు దహనక్రియ మొదలైంది[8].

నాల్గవ దశలో రెండు L-2. 5 ఇంజన్లు అమర్చబడి ఉన్నాయి. చోదక ఇంధనంగా మోనో మిథైల్ హైడ్రాజీన్ (MMH), నైట్రోజన్ యొక్క మిశ్రమ ఆక్సైడులను (MON-3) ఉపయోగించారు. నాల్గవ దశ ప్రధాన లక్ష్యం ఉపగ్రహాల పరిభ్రమణానికి కావాల్సిన భ్రమణ వేగాన్ని కల్పించి, ప్రతిపాదిత కక్ష్యలో ప్రవేశపెట్టడం.

ఉపగ్రహాల ప్రక్షేపణ

[మార్చు]

వాహకనౌక భూమి నుండి బయలుదేరిన 22 నిమిషాల 32.92 సెకన్లకు అస్ట్రోశాట్ ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలో ప్రవేశించింది. నాల్గవ దశను 4 నిమిషాల 59 సెకన్లపాటు మండించి, ఆస్ట్రోశాట్ ఉపగ్రహాన్ని అనుకున్నవిధంగా 650 కిలోమీటర్ల ఎత్తులో, 6 డిగ్రీల ఏటవాలు కక్ష్యలో ప్రవేశపెట్టారు.[9] 30 సెకన్ల తరువాత లాపాన్-A2 ఉపగ్రహాన్ని, ఆ తరువాత 25 సెకన్లకు ఎన్‌ఎల్‌ఎస్-14 ఉపగ్రహాన్నీ కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. ఎన్‌ఎల్‌ఎస్-14 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టిన 35 సెకన్ల తరువాత మొదటి రెండు లీమూర్ నానో ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టారు. ఆ తరువాత 10 సెకన్లకు మూడవది, 25 సెకన్ల తరువాత నాల్గవ లీమూర్ ఉపగ్రహాలు కక్ష్యలో ప్రవేశించాయి[8].

ఉపగ్రహాలు/అంతరిక్ష నౌకలు

[మార్చు]

ఆస్ట్రోశాట్

[మార్చు]

ఖగోళ పరిశోధనల కోసం భారతదేశంకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోరూపొందించిన ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహ బరువు:1, 513 కీలోలు, ఉపగ్రహం జీవితకాలం 5 సంవత్సరాలు. ఉపగ్రహంలో 5రకాల సాధనాలను అమర్చారు. అవి1. ట్విన్ అల్ట్రావయొలెట్‌ టెలీస్కోప్ (యూవిఐటీ), 2. లార్జ్‌ఎరియా క్సెనాన్‌ ప్రొపోర్షన్ కౌంటర్ (ఎల్‌ఏఎక్స్‌పీసీ), 3. సాప్ట్‌ ఎక్సురే టెలిస్కోప్ (ఎస్‌ఎక్సుటీ), 4. కాడ్‌మిమ్స్-టెల్యూరైడ్‌కోడెడ్-మాస్క్‌ఇమేజర్ (సీజడ్‌టీఐ), 5. స్కానింగ్‌ స్కై మానిటర్ (ఎస్‌ఎస్‌టీ)

విశ్వంలోని నక్షత్రాలు, గ్రహాలు, కృష్ణ బిలాలు/బ్లాక్‌హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, అయస్కాంత క్షేత్రాలు, వాతావరణ పరిస్థితులు, రేడియేసన్ గురించి అధ్యయనం చేసేందుకు ఆస్ట్రోశాట్ ఉపయోగపడుతుంది. దాదాపు 5సంవత్సరాలు సేవ అందిస్తుంది. ఇది తన జీవితకాలంలో 300టీబీల (టెరాటైట్స్) సమాచారాన్ని అందిస్తుంది. ఆస్ట్రోశాట్ విశ్వంలో పరిభ్రమిస్తూ ఖగోళంలోని స్థితిగతులపై రోజుకొకసారి బెంగళూరుఉపగ్రహ నియంత్రణ కేంద్రనికి 10-15 నిమిషాలపాటు సమాచారాన్ని చేరవేస్తుంది. దీనికి చెందిన గ్రౌండ్ కమాండ్‌ అండ్‌ కంట్రోల్ సెంటర్‌ బెంగళూరులోఉన్నది[9].

లాపాన్ ఏ2

[మార్చు]

ఇది ఇండోనేషియాకు చెందిన సూక్ష్మ ఉపగ్రహం. లాపాన్ అంటే స్థానిక భాషలో లెంభాంగా పెనర్బెన్‌గన్‌డన్‌ డ్యాన్‌ అంటార్సికా నేషనల్‌ అని అర్థం. ఈ ఉపగ్రహంలో అమర్చిన డిజిటల్ స్పెస్ కెమెరాతో భూమికి చెందిన అంశాన్ని చిత్రీకరించి భూమికి పంపిస్తుంది. ఆటోమెటిక్‌ పాకెట్ రిపోర్టింగ్‌ సిస్టమ్‌, వాయిస్‌రిపిటర్‌ ఫంక్షన్‌ ద్వారా భూమిపై సంభవించే విపతులకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.

ఎస్‌ఎల్‌ఎస్-14

[మార్చు]

కెనడాకు చెందిన స్పెస్ ఫ్లైట్ లాబోరెటరీ, యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో ఇన్‌స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడిస్ కెనడాలు సంయుక్తంగా ఈ సూక్ష్మ ఉపగ్రహాన్ని తయారు చేసారు. సముద్రాలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించెందుకు దీన్ని రూపాందించారు[9].

లెమ్యూరు 2, 3, 4, 5

[మార్చు]

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన సపిర్‌గ్లోబల్ సంస్థ రూపొందించిన ఉపగ్రహలివి. ఈ ఉపగ్రహాల సీరిస్‌లో నాలుగింటిని ఒకేసారి ప్రయోగించారు. వాతావరణ పరిస్థితులు, సముద్రాలను పర్యవేక్షించేందుకు దీన్ని ప్రయోగించారు. జీపీఎస్ రేడియో ఆక్యులేసన్‌ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది[9].

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి విడియో లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "PSLV-C30 successfully launches ASTROSAT into the orbit". facebook.com. Retrieved 2015-09-28.
  2. "PSLV-C30 successfully launches". twitter.com/ndtv. Retrieved 2015-09-28.
  3. సాక్షిదినపత్రిక,28.09.2015,నెల్లూరుజిల్లా ఎడిసన్
  4. 4.0 4.1 "PSLV-C30/ASTROSAT MISSION". isro.gov.in. Archived from the original on 2015-09-28. Retrieved 2015-09-30.
  5. ఆంధ్రజ్యోతి దినపత్రిక,27-0-.2015
  6. 6.0 6.1 ఈనాడు దినపత్రిక, తారిఖు:28-09-2015,పొట్టిశ్రీరాములుజిల్లా సంచిక
  7. "ISRO LAUNCHES INDIA INTO ELITE SPACE CLUB". dailypioneer.com. Archived from the original on 2015-09-29. Retrieved 2015-09-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. 8.0 8.1 8.2 8.3 8.4 "PSLV rocket lofts India's Eye in the Sky". nasaspaceflight.com. Archived from the original on 2015-09-30. Retrieved 2015-09-30.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. 9.0 9.1 9.2 9.3 సాక్షి దినపత్రిక,నెల్లూరు ఎడిసన్,సెప్టెంబరు,2015