పి.సి.నరసింహారెడ్డి
పి.సి.నరసింహారెడ్డి | |
---|---|
జననం | పెంచుకల చిన నరసింహారెడ్డి 1943 జూలై 3 |
మరణం | 2020 ఆగస్టు 19 | (వయసు 77)
పౌరసత్వం | భారతీయుడు |
వృత్తి | కవి, ఆచార్యుడు |
జీవిత భాగస్వామి | భారతీదేవి |
తల్లిదండ్రులు |
|
పి. సి. నరసింహారెడ్డిగా ప్రసిద్ధి చెందిన పెంచుకల చిన నరసింహారెడ్డి[1] తెలుగు అకాడమీలో జిల్లావారీ మాండలిక పద సంకలనాల కోసం కృషి చేశారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో లింగ్విస్టిక్స్ లెక్చరర్‌గా చేరి అక్కడే డీన్‌గా ఉద్యోగవిరమణ చేశారు. యు.జి.సి. కోసం 'ద్విభాషా వ్యవహారం - భాషా సామాజిక పరిశీలన' అనే అంశంపై ఒక ప్రాజెక్టు చేశారు. ఆయన చిత్రకారుడు కూడా. సుమారు 40 వేల బొమ్మలు గీశారు.
నరసింహారెడ్డి 1943, జూలై 3న మహబూబ్‌నగర్ జిల్లా, గద్వాల తాలూకా గట్టు మండలంలోని పెంచుకలపాడు గ్రామంలో జన్మించాడు.[2] ఆ ఊళ్లో రెండు పెద్ద బండరాళ్లు పెనవేసుకున్నట్టు ఉంటాయి. పెనవేసుకున్న 'కల్' (కన్నడంలో రాయి) కాబట్టి కాలక్రమంలో అది 'పెంచుకలపాడు'గా మారిందనేది కథనం.[1] బసవమ్మ, నర్సిరెడ్డిలు అమ్మానాన్నలు. భార్య భారతీదేవి. తండ్రి బసిరెడ్డి పోలీస్‌పటేల్.[1] కానిగసాలెలో ప్రాథమిక విద్య. గద్వాలలో 5వ తరగతి చదివాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి డి.కె.సమరసింహారెడ్డి ఈయనకు పాఠశాలలో సహాధ్యాయి. హైదరాబాద్ నిజాం కాలేజీ నుండి పట్టభద్రుడై, తెలుగు భాషా శాస్త్రంలో ఎం.ఏ. ఉస్మానియాలో చేశాడు. అక్కడ పోరంకి దక్షిణామూర్తి, ఓలేటి సుబ్బారావులు ఈయన తోటి విద్యార్థులు.
చిన్నతనం నుండి ఏ చిత్తు పేపరు కన్పించినా ఏదో ఒక బొమ్మ గీయడం అలవాటైన నరసింహారెడ్డి, బంగోరె బ్రౌన్‌పైన చేసిన ప్రాజెక్టులన్నిటికీ బొమ్మల్ని వేశాడు.[1] చలసాని ప్రసాదరావు 'హిందూ కళ- వికాస దశ' అనే వ్యాసం ఈయనతో రాయించాడు.[1] యువకుడిగా నరసింహారెడ్డి 'తిరగబడు' కవుల్లో ఒకరిగా ఆ కవితా సంకలనంలో ‘ఐ’ అనే కలంపేరుతో "తిరగబడు" అనే కవిత రాశారు. విరసం ఏర్పాటుతో సంబంధాలు వున్నా, సభ్యత్వం తీసుకోలేదు. "శుక్తి" అనే మారుపేరుతో చిత్రకారునిగా చిత్రాలు గీశాడు. "సృజన" పత్రిక శ్రీర్షిక అక్షరాలు ఈయన రాసినవే. శ్రీశ్రీ "మరో ప్రస్థానం" కవితాసంకలనంపై ఉన్న ముఖచిత్రం నరసింహారెడ్డి గీసినదే.[3] నార్ల చిరంజీవి కవితా సంకలనం, "కొమ్మలు – రెమ్మలు"లోని కవితలకు ఈయన వేసిన చిత్రాలను బాపు మెచ్చుకున్నాడు. చలసాని ప్రసాదరావు సంపాదకత్వంలో వచ్చిన "కళ" పత్రికలో కొన్ని సంచికలకు బొమ్మలు వేసాడు. భాషాశాస్త్రంలో ఉపన్యాసకుడిగా వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వృత్తి జీవితం ప్రారంభించిన తర్వాత ఆయన కేవలం భాషాశాస్త్రానికి పరిమితమైపోయాడు.[2][4]
చిత్తూరు జిల్లా నగరి ప్రాంతం తెలుగు, తమిళ భాషల ప్రభావంతో ఉంటుంది. అక్కడి దళితులు కేవలం తమిళమే మాట్లాడాలనే నియముందట. ఒక రెడ్డి కులస్థుడి ముందు ఒక దళితుడు తెలుగులో మాట్లాడటం నేరమైందట. అతన్ని చెట్టుకు కట్టేసి కొరడా దెబ్బల శిక్ష విధించారట. యు.జి.సి.లో ప్రాజెక్టు కోసం ఇదే తరహాలో మిగతా రాష్ట్ర సరిహద్దుల్లో తెలుగు - ఒరియా, తెలుగు - మరాఠి, తెలుగు - కన్నడం లపై పరిశోధన జరిపారు. దాదాపు 50, 60 వేల వాడుక పదాల్ని సేకరించారు.
పి.సి.నరసింహారెడ్డి తన 77వ ఏట 19 అగస్టు 2020న హైదరాబాదులో మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 రేవూరు, అనంత పద్మనాభరావు. "భాషా శాస్త్ర నరసింహుడు". sanchika.com. Retrieved 18 October 2024.
- ↑ 2.0 2.1 2.2 "ఆచార్య పి. సి. నరసింహారెడ్డి". ప్రజాసాహితి. Retrieved 18 October 2024.
- ↑ "కన్నుతో కవితలు - ముత్యపు చిప్పనుండి జీవనరేఖలు". సాక్షి. Retrieved 18 October 2024.
- ↑ బండారి, రాజ్ కుమార్. "ఐదు దశాబ్ధాల "ఐ" కవిత – 'తిరగబడు'". సారంగ. Retrieved 18 October 2024.