కవిరాజ మనోరంజనము

వికీపీడియా నుండి
(పురూరవశ్చరిత్రము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కవిరాజ మనోరంజనము
కృతికర్త: కనుపర్తి అబ్బయామాత్యుడు
ముద్రణల సంఖ్య: 2
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: పద్య కావ్యం
విభాగం (కళా ప్రక్రియ): తెలుగు సాహిత్యం
ప్రచురణ: చింతామణి ముద్రాక్షరశాల
విడుదల: 1750

కవిరాజ మనోరంజనము అనే ప్రబంధాన్ని కనుపర్తి అబ్బయామాత్యుడు సా.శ1750 ప్రాంతాలలో రచించాడు. దీనికే పురూరవశ్చరిత్రము అనే మరొక పేరు ఉంది. ఇది 5 ఆశ్వాసాల ప్రౌఢ కావ్యము. ఈ పుస్తకాన్ని చింతామణి ముద్రాక్షరశాలలో మొదట ప్రచురించారు. 1929లో వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసువారు ఈ పుస్తకాన్ని దోషాలను సవరించి ప్రకటించారు. శేషాద్రి రమణ కవులు ఈ పుస్తకానికి పీఠిక రచించారు.

విషయసూచిక[మార్చు]

  • పీఠిక
  • షష్ఠ్యంతములు

ప్రథమాశ్వాసము[మార్చు]

  • ప్రతిష్ఠానపురవర్ణనము
  • పురూరవుని సౌందర్యాదులు
  • పురూరవుని యొద్దకు నారదుఁడు వచ్చుట
  • నారదుఁడు పురూరవునకు రాజనీతి చెప్పుట
  • నారదుండాత్మవిద్యోపదేశము చేయుట
  • నారదుఁడు నాకమున కేగుట

ద్వితీయాశ్వాసము[మార్చు]

  • చంద్రుని వృత్తాంతము
  • బుధుని చరిత్రము
  • వశిష్ఠుడు విష్ణుని స్తుతించుట
  • ఇలాకన్య పురుషుఁడగుట
  • రాజకుమారుఁడు ఈశ్వరశాపమున సుందరియౌట
  • స్త్రీయైన సుద్యుమ్నుఁడు బుధుని మోహించుట

తృతీయాశ్వాసము[మార్చు]

  • పురూరవుని రాజ్యాభిషేకము
  • పురూరవుని జైత్రయాత్ర
  • ఊర్వశి పురూరవుని విరాళిగొనుట
  • మన్మథోపాలంభనము
  • చంద్రోపాలంభనము
  • మలయానిలోపాలంభనము
  • కోకిలాద్యుపాలంభనము
  • ఊర్వశిని సఖులూరడించుట
  • త్రైలోకవర్తి యను చిలుక తన చెలికి ఊర్వశివృత్తాంతముఁ దెల్పుట

చతుర్థాశ్వాసము[మార్చు]

  • గ్రీష్మఋతువర్ణనము
  • వర్షాకాలవర్ణనము
  • ఋషుల తపోవిఘ్నమునకై యింద్రుఁ డూర్వశిని బంపుట
  • ఊర్వశి మిత్రావరుణులయొద్దికి భూమికి వచ్చుట
  • పుష్పాపచయవర్ణనాదికము
  • జలకేళీవర్ణనము
  • మిత్రావరుణు లూర్వశిని శపించుట
  • హేమంత ఋతువర్ణనము
  • శిశిరఋతువర్ణనము
  • పురూరవుడు మాఘస్నానముచేయ నేఁగుట
  • తనకుఁ బ్రత్యక్షమైనవిష్ణుని రాజు స్తుతించుట

పంచమాశ్వాసము[మార్చు]

  • వసంతఋతువర్ణనము
  • చారులు పురూరవునకు విచిత్రవనవృత్తాంతముం దెల్పుట
  • పురూరవుఁడు చిత్రవనముం జూడనేఁగుట
  • పురూరవు డూర్వశికడకుఁ జెలికాని బంపుట
  • పురూరవుం డూర్వశిని నిజపురంబునకుఁ దెచ్చుట
  • సూర్యాస్తమయాదివర్ణనము
  • ఇంద్రునిపంపున గంధర్వులూర్వశికై భూలోకమునకు వచ్చుట

కథాసంగ్రహం[మార్చు]

పురూరవుని సభామందిరానికి నారదుడు విచ్చేసి కొంత వేదాంతాన్ని, రాజనీతిని బోధించి అమరావతికి వెడతాడు. అక్కడ ఇంద్రునితో భూలోక విశేషాలు తెలుపుతూ ప్రసంగవశాత్తూ పురూరవుని వృత్తాంతం కొంత ముచ్చటిస్తాడు. ఇంద్రుడు పురూరవుని పూర్వవృత్తాంతం కొంచెం వివరంగా చెప్పమని నారదుని వేడుకోగా అతడు ఈ విధంగా చెప్పసాగాడు. తారాచంద్రులకు బుధుడు జన్మిస్తాడు. బుధుడికి ఇలాకన్య యందు పురూరవుడు జన్మిస్తాడు. పురూరవుడు వశిష్ఠుడివద్ద విద్యాభ్యాసం గావించి యుక్తవయసు రాగానే పట్టాభిషిక్తుడౌతాడు. పిమ్మట దిగ్విజయయాత్ర గావిస్తాడు. నారదుడు పురూరవుని దిగ్విజయ యాత్రను వర్ణించి చెప్పినప్పుడు అది విన్న ఊర్వశికి పురూరవునిపై వాంఛ కలుగుతుంది. మిత్రావరుణులు చేస్తున్న తపస్సును భగ్నం చేయడానికి ఊర్వశిని ఇంద్రుడు భూలోకానికి పంపుతాడు. మిత్రావరుణల చేత శాపగ్రస్త అయి ఊర్వశి పురూరవుని కలుస్తుంది. తాను మక్కువతో పెంచిన జోడు తగళ్లను తస్కరులపరహరించకూడదు, పురూరవుడు తనకు నగ్నంగా కనిపించకూడదు అనే రెండు షరతులను విధించి ఈ షరతుల భంగం కలిగితే ఇంద్రలోకానికి వెళ్లిపోతానని చెబుతుంది. ఊర్వశి గర్భధారిణియై యాయువు అనే పుత్రుని కని తన షరతులకు లోబడి ఇంద్రలోకానికి వెళ్లిపోతుంది. పురూరవుడు ఊర్వశీ వియోగానికి ఓర్వజాలక గంధర్వులను ఆశ్రయిస్తాడు. వారు ఊర్వశీ రూపముకలిగిన అగ్నిస్థాలి అనే యువతిని పురూరవునకు ఇస్తారు. పురూరవుడు ఈ మోసాన్ని కనుగొని పురంధర ప్రముఖ దేవతలను ఆశ్రయించి తిరిగి ఊర్వశిని పొందుతాడు. నర, సురలోకాలకు యధేచ్ఛగా సంచరించేందుకు వరాలను పొందుతాడు. తరువాత ఊర్వశీపురూరవులకు శ్రుతాయువు, సత్యాయువు, జయుడు, విజయుడు అనే పుత్రులు కలిగారు. వీరుగాక నరణుల యందు హవ్యవాహనుడు అనే పుత్రుడు కలుగుతాడు.

ఈ కావ్యంలో ఈకథతో పాటుగా తారాశశాంక విజయము, ఇలాకన్యకథ, ఊర్వశి పూర్వవృత్తాంతము, కుమారవన వృత్తాంతము మొదలైన ఉపకథలున్నాయి.

రసపోషణ[మార్చు]

ఈ ప్రబంధములో శృంగారము స్థాయి రసము. తనకు వీలైన ప్రతిసందర్భములో కవి శృంగారాన్ని చొప్పించాడు. ఈ శృంగారము మొదట తారావిధుల సందర్భములోను, పిమ్మట పార్వతీశంకరుల విషయములోను, తదుపరి ఇలాకన్య బుధుల విషయములోను, అనంతరం ఊర్వశీ మిత్రావరణుల ఘట్టములోను, చివరగా నాయికా నాయకులైన ఊర్వశీ పురూరవుల సందర్భములోను పరిపూర్ణత నొందింది. కవికి శృంగారం అంటే నల్లేరు మీద బండి నడక ఐనా కవి మితం ఎరుగక పచ్చి శృంగారాన్ని వర్ణించాడు. కవి ప్రథమ సమాగమాన్ని వర్ణించడంతో తనివి తీరక గర్భధారణాన్ని, గర్భవతిని, గర్భవతి సంగమాన్ని, బాలింతరాలితనమును, 'ప్రసవానంతర ద్వితీయ మాస సంగమాధిక సుఖము' ను కూడా వర్ణిస్తాడు. ఈ వర్ణనలు కొంత ఏవగింపును కలిగిస్తాయి. మిగిలిన రసములు అక్కడక్కడ కనిపిస్తాయి.

పాత్రౌచిత్యం[మార్చు]

ఈ కథలో ముఖ్యంగా వచ్చే పాత్రలు ఊర్వశీ, పురూరవులు, వారి సంయోగకర్తలగు నారద శుకదంపతులు. నాయికా నాయకుల పాత్రలు బాగా చిత్రించబడింది. నారదుడు ప్రథమ ఆశ్వాసములో పురవర్ణన తర్వాత పురూరవునికి రాజనీతిని, వేదాంతాన్ని బోధించిన తీరు చూస్తే దీనిని వ్రాసింది శృంగారప్రియుడైన కవియేనా అని ఆశ్చర్యం కలుగుతుంది.

అనుకరణ[మార్చు]

కనుపర్తి అబ్బయామాత్యుడు ఈ కావ్యములో పూర్వకవులను, వసుచరిత్రము, శృంగారనైషధము మొదలైన కావ్యాలను అనుకరించాడు. పోతన మహాకవి అంత్యప్రాసను కూడా పెక్కుచోట్ల ఇతడు అనుకరించాడు. పింగళి సూరన కళాపూర్ణోదయములో నుండి కూడా ఇతడు కొన్ని పద్యాలను అనుకరించాడు.

శైలి[మార్చు]

ఈ కావ్యములో అబ్బనామాత్యుని శైలి మృదుపద గుంఫితమై, మిగుల ధారాళమై అలరారుతున్నది. ఈ గ్రంథంలో జాతీయాలను, లోకోక్తులను విరివిగా వాడాడు. "కలుగదు కదా వివేకంబు కాముకులకు", "వ్రతము చెడిన సుఖము దక్కగలదె", "భార్యా రూపవతీ శతృః", "ఉష్ణం ఉష్ణేన శీతలం" మొదలైనవి కొన్ని ఉదాహరణలు.

వర్ణన[మార్చు]

ఇతర ప్రబంధకవుల వలే కనుపర్తి అబ్బయామాత్యుడు కూడా ఈ ప్రబంధంలో పురము, జలక్రీడ, పుష్పాచయము, వేట, మన్మథవికారము, శిశిరోపచారములు, మన్మథశశ్యనిలదూషణములు, ఋతువులు మొదలైనవాని వర్ణనలు చేశాడు.

బంధ, చిత్రకవిత్వం[మార్చు]

ఈ కావ్యంలో శ్లేషాలంకారము, యమకాలంకారము మొదలైన అలంకారాలను కవి ప్రయోగించాడు. గోమూత్రిక, నాగ, ఛత్ర, అష్టదళపద్మ, పుష్పమాలిక, ఖడ్గ, చక్ర, సర్వతోభద్ర బంధములను ఈ కావ్యంలో చొప్పించాడు. బంధకవిత్వంతో విరమించక ఆంధ్రగీర్వాణభాషాశ్లేషకందము, కందద్వయరుగ్మవతీకమలవిలసితక్రౌంచపదవృత్తము మొదలైన గర్భకవిత్వాన్ని వ్రాశాడు. కందము, ఓష్ఠ్యకందము, నిర్యోష్ఠ్యమహాస్రగ్ధర, ద్వ్యక్షరి కందము మొదలైనవాటిని కూడా ఈ కావ్యంలో చూడవచ్చు.

పండితాభిప్రాయం[మార్చు]

  • వసుచరితమునకుఁ దరువాతఁ గవిరాజ మనోరంజనముతోఁ దులతూగఁ దగిన ప్రబంధము లొకటి రెండు కంటే నెక్కువగా లేవు... బాల్యములో రచింపబడినదగుటచే అనిరుద్ధచరిత్రము, పురూరవశ్చరిత్రమంత ప్రౌఢముగా లేదు. కవి సాహిత్యము నందే కాక సంగీతమునందును ప్రవీణుడైనట్లు కనబడుచున్నాడు. - కందుకూరి వీరేశలింగము

బయటి లింకులు[మార్చు]