Jump to content

ప్రబంధము

వికీపీడియా నుండి
(ప్రబంధ యుగము నుండి దారిమార్పు చెందింది)

తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం. ప్రకృష్టమైన పదబంధమున్న కావ్యం ప్రబంధము.

చరిత్ర

[మార్చు]

ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉంది. నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.

పెద్దన రాసిన మనుచరిత్ర బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. తర్వాత వచ్చిన వసుచరిత్ర మనుచరిత్రకు మించిన కవిత్వం కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహాత్మ్యము, పింగళి సూరన కళాపూర్ణోదయం, చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.

లక్షణాలు

[మార్చు]

ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు.

  • పింగళి లక్ష్మీకాంతం: ప్రబంధమునకు ఏక నాయకాశ్రయత్వము, దానితోపాటు వస్త్వైక్యము ప్రధాన ధర్మములు. ప్రబంధము అష్టాదశ వర్ణనాత్మకమై యుండవలెను. అందు శృంగారము ప్రధాన రసము. ఆవశ్యకతను బట్టి తక్కిన రసములు గౌణములు కావచ్చును. ఆలంకారిక శైలి ప్రబంధమునకు జీవము. ప్రబంధము భాషాంతరీకరణము కాకూడదు. స్వతంత్ర రచనయై యుండవలెను. పదునారవ శతాబ్ది ఆది నుండి వెలువడిన మనుచరిత్రాది కావ్యములన్నిటికి పైన పేర్కొన్న లక్షణములన్నియు సమగ్రముగా పట్టినను, పట్టకున్నాను, స్వతంత్ర రచనలగుట చేతను, ఆలంకారిక శైలీ శోభితములగుట చేతను అవన్నియు ప్రబంధములుగానే పరిగణింపబడినవి.[1]
  • కాకర్ల వెంకట రామ నరసింహము: కథైక్యమును అష్టాదశ వర్ణనలును గలిగి శృంగార రస ప్రధానమై, అర్థాతిశాయియైన శబ్దమును గ్రహించి యాలంకారిక సాంకేతికములకు విధేయమై, ఆనాటి విస్తృతిగల యితివృత్తముతో, భాషాంతరీకరణముగాక, స్వతంత్రరచనయేయైన తెలుగు కావ్యము ప్రబంధము. అయితే పైని వివరించిన లక్షణములు కొన్ని ప్రబంధములందు గానరాకున్నను నాయా యుగధర్మ ప్రాధాన్యము బట్టియు, రచనా ధోరణి బట్టియు నవియు బ్రబంధనామముననే వ్యవహరింపబడుచున్నవి.[2]
  • దివాకర్ల వేంకటావధాని: ధీరోదాత్త నాయకములును, శృంగార రస ప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములు ఆలంకారిక శైలిలో వ్రాయబడినవి- వీటికే ప్రబంధములని పేరు.[3]
  • సి.నారాయణరెడ్డి: ప్రబంధము యొక్క లక్షణములు నాలుగు.
ఒకటి: కథానాయకుని యొక్క తృతీయ పురుషార్థమునకు(కామమునకు) చెంది ప్రాయికముగా తద్వివాహ సంబంధియగుట.
రెండు: శృంగారము అంగీరసముగా నుండుట.
మూడు: వర్ణన బాహుళ్యము కలిగియుండుట.
నాలుగు: రీతి ప్రాధాన్యము కలిగి యుండుట.[4]
  • వెల్చేరు నారాయణరావు: పురాణామార్గం కథనమార్గం, ప్రబంధమార్గం వర్ణనమార్గం. ప్రబంధానికీ, పురానానికి తేడా కథనం వర్ణన-వీటి ఎక్కువ తక్కువలలో మాత్రమే వుందనే అభిప్రాయం బలపడింది.[5]

చరిత్ర రచనలో

[మార్చు]

తెలుగు ప్రబంధాలకు అప్పటి స్థితిగతులను కాక కవుల ఊహాలోకాలనే అద్దంపట్టాయన్న అపప్రధ ఉన్నా చాలామంది పండితులు, చరిత్రకారులు వీటికి చరిత్ర రచనలో ఎంత ప్రాధాన్యత ఉందో, ఆనాటి స్థితిగతులు ప్రబంధాల్లో ఎలా ప్రతిబింబించాయో వివరించారు. ప్రబంధ యుగంగా వర్దిల్లిన విజయనగర సామ్రాజ్య కాలంలోని ఆచారాలు, వ్యవహారాలు, జీవనశైలి వంటివాటికి ప్రబంధాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యంలో 15-16 శతాబ్దుల కాలంలో పర్యటించిన పలువురు విదేశీ యాత్రికులు నమోదుచేసిన చరిత్రలో ఏదైనా సంస్కృతికి సరిపోలని విషయం ఉన్నా, స్పష్టత కావాల్సివచ్చినా వారేమి సూచిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రబంధాలు పనికివచ్చాయి. ప్రబంధాల్లో జలక్రీడల వర్ణనం, సుగంధ ద్రవ్యాల వినియోగం, వారకాంతల వివరాలు, జాతరలు - మొక్కుబళ్ళు, సైనిక ప్రయత్నాలు వంటివాటి వర్ణనలు సామాజిక చరిత్ర నిర్మాణంలో ఉపకరిస్తున్నాయి.[6]

ఉదాహరణలు

[మార్చు]
  1. మనుచరిత్ర
  2. సంస్కృతము లోని మాలవికాగ్నిమిత్రము
  3. ఆముక్త మాల్యద
  4. నాలాయిర దివ్య ప్రబంధము-తమిళము
  5. ముకుందవిలాసము
  6. వీరభద్ర విజయము
  7. సుపాణినీ పరిణయము అను అచ్చ తెలుగు ప్రబంధ కావ్యమును రచించిన సంబరాజు రామచంద్రకవి దీనిని వట్టెము చెన్నకేశవస్వామికి అంకితమిచ్చాడు. ఇది మూడాశ్వాసముల ప్రబంధము.సుపాణినీ కార్వవీర్యార్జునుల పరీణమిందలి యితివృత్తము. వట్టెము నాగర్ కర్నూలుకు దగ్గరలో ఒక గ్రామం.ఈ కవి తాతగారు వేంకటాచలరాజు పండితుడు; తండ్రి నరసింగరాజు సత్కవి.

మూలాలు

[మార్చు]
  1. పింగళి లక్ష్మీకాంతం, విజ్ఞాన సర్వస్వము, సంపుటి 3, తెలుగు సంస్కృతి-1, పుట.603.
  2. కాకర్ల వేంకట రామ నరసింహము, ఆంధ్ర ప్రబంధములు : అవతరణ వికాసములు, పుట iv.
  3. దివాకర్ల వేంకటావధాని, 'ఆంధ్రవాజ్మయ చరిత్రము-II' సంగ్రహాంధ్రవిజ్ఞానకోశము, సంపు-I, పుట 576
  4. సి.నారాయణరెడ్డి, ఆధునికాంధ్ర కవిత్వము: సంప్రదాయములు, ప్రయోగములు.
  5. తెలుగులో కవితా విప్లవాల స్వరూపం: వెల్చేరు నారాయణరావు, పుట 45
  6. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=ప్రబంధము&oldid=3422421" నుండి వెలికితీశారు