ఫిడెల్ కాస్ట్రో
ఫిడెల్ కాస్ట్రో (Fidel Castro ( audio) ) (జననం:ఆగస్టు 13, 1926 - మరణం:నవంబరు 25, 2016) పూర్తి పేరు ఫిడెల్ అలెహంద్రో కాస్ట్రో రుజ్, క్యూబా రాజకీయ నాయకుడు, విప్లవకారుడు. కాస్ట్రో క్యూబాను 1959 జనవరి నుండి 2008 ఫిబ్రవరి వరకు పరిపాలించాడు. ఇతను క్యూబా నియంత బాటిస్టాను సాయుధ పోరాటం ద్వారా తొలగించి అధికారం చేపట్టాడు. క్యూబాను పశ్చిమార్థ భూగోళంలో మొట్ట మొదటి సామ్యవాద దేశంగా మార్చాడు. ఇతడు అమెరికాకు బద్ధ వ్యతిరేకి. అమెరికా గూఢాచార సంస్థ సి.ఐ.ఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) కాస్ట్రోను హత్య చేయటానికి మొత్తం 638 సార్లు విఫలయత్నం చేసింది. ఇతడు కాల్చే చుట్టలో బాంబు పెట్టి, అతని స్కూబా-డైవింగ్ సూట్‌లో ప్రాణాంతకమైన ఫంగస్‌ను ఉంచటం వంటి పలు విన్నూత విధానాలతో హత్యాప్రయత్నం చేసింది. మాఫియా తరహాలో కాస్ట్రోను కాల్చివేయటానికి కూడా ప్రయత్నించింది. ఆఖరికి అతని మాజీ ప్రియురాలు మారిటా లోరెంజ్ ద్వారా కూడా ఇతనిని హత్యచేయుటకు సి.ఐ.ఏ ప్రయత్నించింది. కానీ ప్రతీ సారీ కాస్ట్రో మృత్యుంజయుడై బయటపడి అమెరికాకు పక్కలో బల్లెమై ఎదురు నిలిచాడు.
బాల్యం, విధ్యాబ్యాసం
[మార్చు]కాస్ట్రో క్యూబాలోని మయారి పట్టణానికి సమీపంలో ఉన్న బిరాన్ అనే గ్రామంలో ఆగస్టు 13, 1926 (కొందరు 1927 అని కూడా పేర్కొంటారు) న జన్మించాడు. ఇతని తండ్రి స్పెయిన్ దేశం నుండి వలస వచ్చిన చెరకు తోటల పెంపకందారుడు. కాస్ట్రో తల్లి లీనా రుజ్ గొంజాలెజ్ ఇంటి పనిమనిషి, కాస్ట్రోకు 15 ఏళ్ల వయసు వచ్చేదాకా తండ్రి ఏంజెల్ కాస్ట్రో, మరియా లూయిసా అర్గోటా అనే మరో మహిళతో వివాహమైనది. బాల్యంలో కాస్ట్రో అనేక పరాయి ఇళ్లలో పెరగటమే కాకుండా, వివాహేతర సంతానంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. కాస్ట్రో 1947లో క్యూబన్ పీపుల్స్ పార్టీలో చేరాడు. 1950లో హవానా విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. తరువాత కాస్ట్రో హవానాలోనే న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించాడు. 1952లో క్యూబా ప్రతినిథుల సభ కొరకు జరగబోయే ఎన్నికలలో పోటీచేశాడు. కానీ అదే సమయంలో బాటిస్టా మిలిటరీ కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుని రాజ్యాంగాన్ని బహిష్కరించి క్యూబాలో నియంతృత్వాన్ని నెలకొల్పాడు.
క్యూబా తిరుగుబాటు
[మార్చు]కాస్ట్రో బాటిస్టా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రహస్య విప్లవ వర్గానికి నాయకత్వం వహించాడు. జూలై 26, 1953 న కాస్ట్రో దళాలు శాంటియాగో దె క్యూబా నగరం లోని మోన్‌కాడా సైనిక స్థావరాన్ని ముట్టడించాయి. ఈ ముట్టడిలో పట్టుబడటంతో కాస్ట్రోకు 15 సం.లు కారాగార శిక్ష విధించబడింది. కానీ 1955లో బాటిస్టా ఇతనిని విడుదల చేశాడు. విడుదలైన వెంటనే కాస్ట్రో తన మొదటి తిరుగుబాటు జరిగిన రోజు స్మారకంగా జూలై 26 ఉద్యమం అనే పేరుతో ఒక విప్లవ దళాన్ని నిర్మించాడు. ఈ విప్లవ దళంతో కాస్ట్రో మెక్సికో ప్రవాసం వెళ్లాడు. అక్కడే ప్రఖ్యాత విప్లవ కారుడు చే గెవారా వీరితో కలిసాడు. మొత్తం 82 మందితో కూడిన ఈ విప్లవ దళం మరలా తిరిగి డిసెంబరు, 1956లో క్యూబాలో కాలు మోపింది. ఈ దళంలోని 70 మంది వెంటనే చంపివేయబడ్డారు. కాస్ట్రో, అతని సోదరుడు రౌల్ కాస్ట్రో, చే గెవారాలతో కూడిన మిగిలిన 12 మంది క్యూబా ఆగ్నేయ ప్రాంతంలోని సియెర్రా మేస్త్రా పర్వత శ్రేణిలోకి పారిపోయారు. ఆ పర్వత ప్రాంతంలోని చుట్టుపక్కల ప్రజలు కాస్ట్రో విప్లవదళంలో చేరారు. కాస్ట్రో 1958 డిసెంబరు నెలలో తన విప్లవదళంతో హవానాకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో అతనికి లభించిన ప్రజాదరణను చూచిన బాటిస్టా జనవరి 1, 1959 న దేశం విడిచి పారిపోవటంతో క్యూబా నాయకుడిగా కాస్ట్రో అధికారాన్ని చేపట్టాడు.
అధికారం
[మార్చు]అధికారాన్ని చేపట్టిన వెంటనే కాస్ట్రో అమెరికాతో సహా విదేశీయులందరి, స్వదేశీయుల ఆస్థులన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. ఈ చర్యల మూలంగా అమెరికాతో దౌత్య, వ్యాపార సంబంధాలు దెబ్బతినటంతో కాస్ట్రో అప్పు, ఆయుధాలు, ఆహార సరఫరా ఇత్యాది వాటి కొరకు సోవియట్ యూనియన్కు దగ్గరయ్యాడు. కాస్ట్రో క్యూబా సహజ వనరులన్నింటినీ జాతీయం చేశాడు. వ్యవసాయాన్ని సమష్టిగా నిర్వహించాడు. క్యూబాలో ఏక పార్టీ పాలనతో సోషలిష్టు రాజ్యాన్ని నెలకొల్పాడు. దీనితో అనేకమంది ధనవంతులైన క్యూబన్లు దేశం విడిచి వెళ్ళిపోయారు. కాస్ట్రో క్యూబాలోని అమెరికా కంపెనీలన్నింటినీ స్వాధీనం చేసుకోవటంతో ఆగ్రహించిన అమెరికా 1960లో క్యూబాతో అన్ని రకాల వ్యాపార ఒప్పందాలను రద్దుచేసుకున్నది.
బే ఆఫ్ పిగ్స్
[మార్చు]1961లో అమెరికా క్యూబా నుండి ప్రవాసం వచ్చిన వారి ద్వారా కాస్ట్రో ప్రభుత్వాన్ని కూల్చివేయుటకు విఫల యత్నం చేసింది (Bay of Pigs Invasion) ఈ ఘటన తరువాత కాస్ట్రో మరింతగా సామ్యవాదం వైపు మరలాడు. సోవియట్ యూనియన్ తో మరింత బలమైన బంధాలను ఏర్పరచుకుని దానినుండి ఆర్థిక, సైనిక పరమైన సహాయాలను పొందనారంభించాడు.
క్యూబా అణు క్షిపణులు
[మార్చు]1962లో సోవియట్ యూనియన్ క్యూబాలో మధ్య తరహా అణు క్షిపణులను మోహరించడంతో అమెరికా అభ్యంతరం తెలిపినది. ఈ సంక్షోభ సమయంలో ప్రపంచమంతటా అణు యుధ్ధ భయం ఆవరించింది. కానీ సోవియట్ నేత నికితా కృశ్చెవ్, అమెరికా నేత జాన్ ఎఫ్. కెన్నడీల మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ సంక్షోభం శాంతియుతంగా పరిష్కారమైనది.
విదేశాలతో సంబంధాలు
[మార్చు]తరువాతి కాలంలో కాస్ట్రో వర్ధమాన దేశాలలో అలీనోద్యమ నేతగా సమున్నత స్థానాన్ని పొందాడు. కాస్ట్రో దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, ఆఫ్రికా లలోని అనేక దేశాలలోని విప్లవోద్యమాలకు సహాయం చేశాడు. కాస్ట్రో ప్రభుత్వం క్యూబన్లకు మెరుగైన విద్యను, ఆరోగ్య సౌకర్యాలను కల్పించింది. 1991లో సోవియట్ యూనియన్ పతనమవటంతో ఆ దేశం నుండి నిరవధికంగా అందుతున్న సహాయం ఆగిపోయింది. అయినా కూడా కాస్ట్రో సామ్యవాద పంథాకే బలంగా కట్టుబడ్డాడు.
వారసత్వం
[మార్చు]తన వారసుడుగా ఏనాడో ప్రకటించిన తమ్ముడు రౌల్ కాస్ట్రోకు బాధ్యతలను అప్పగించి ఫిబ్రవరి, 2008లో పరిపాలనా బాధ్యతలనుండి ఫిడెల్ కాస్ట్రో తప్పుకున్నాడు. He died.