Jump to content

బంగారు తిమ్మరాజు

వికీపీడియా నుండి
బంగారు తిమ్మరాజు
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.విశ్వనాథం
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి,
సుజాత
సంగీతం ఎస్.పి.కోదండపాణి
నిర్మాణ సంస్థ గౌరి ప్రొడక్షన్స్
భాష తెలుగు

బంగారు తిమ్మరాజు లేదా శ్రీ వేంకటేశ్వర పూజామహిమ 1964 ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు సినిమా. జి.విశ్వనాథం దర్శకత్వంలో గౌరీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్.భావనారాయణ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో నిర్మించాడు. తమిళంలో విజయ వీరన్ అనే పేరుతో ఈ సినిమా వెలువడింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

సాళువ సామ్రాజ్యాధిపతియైన దేవరాయలు భార్య మేనమ్మతో సహా నియమం తప్పకుండా వేంకటేశ్వరుని ఆరాధిస్తూ ఉంటాడు. ఒకనాడు మేనాంబిక సోదరుడూ, కళింగ సామ్రాజ్యాధిపతి అయిన రఘుపతిరాయలు భార్యాసమేతుడై వస్తాడు. తనరాజ్యంలో కాటకం పట్టుకుందని చెప్తాడు. తన బావగారి రాజ్యం సుభిక్షవంతంగా చేయమని వేంకటేశ్వరుని వేడుకుంటాడు దేవరాయలు. భక్తుని ప్రార్ధన విని దాసరి రూపంలో ప్రత్యక్షమవుతాడు తిరుమలేశుడు. దేవరాయలచే సపర్యలంది, తాంబూలం సేవిస్తూ "నా నోరుపండినట్లే మీ కడుపుకూడా పండాలి " అని ఆశీర్వదిస్తాడు. బిడ్డలు లేక బాధపడుతున్న మేనమ్మ ఆ మాట విని “మీ నోటి చలవ వల్ల సంతాన భాగ్యం కలిగితే పుట్టిన బిడ్డడికి ఏడుకొండలవాని పేరు పెట్టుకుంటాం, మూడవ సంవత్సరం దాటకుండా స్వామికి తలనీలాలు సమర్పించి కుంటాం” అని మొక్కుకుంటుంది. కళింగ దేశంలోని కాటకం పోవాలంటే వర్షాధిపతియైన ఇంద్రుడితో చెప్పుకోమంటాడు. ఆకాశగమనాన్ని కల్గించె పాదలేపనం ప్రసాదిస్తాడు దాసరి రూపంలో ఉన్న శ్రీనివాసుడు.

స్వామి యిచ్చిన పొదలేపన ప్రభావంతో దేవరాయలు, రఘుపతిరాయలు ఇంద్రలోకానికి వెళ్తారు. ధర్మం కోసం వాదించి దేవరాయు దేవేంద్రునితో విరోధం తెచ్చుకుంటాడు. రఘుపతిరాయలకు మహేంద్రమణిని ప్రసాదిస్తూ దేవరాయల్ని నాశనంచేస్తానని పంతం పడతాడు దేవేంద్రుడు.

స్వామి అనుగ్రహంవల్ల రాణి మేనాంబిక పుత్రుడ్ని ప్రసవిస్తుంది. పుట్టిన బిడ్డడికి తిరుపతి తిమ్మప్ప పేరుగా "బంగారు తిమ్మప్ప" అని నామకరణం చేస్తారు.

దేవరాయల మీద కక్షకొద్దీ సాళువ సామ్రాజ్యంలో వర్షాలు కురవడానికి వీల్లేదని మేఘాల్ని శాసిస్తాడు దేవేంద్రుడు; కాని స్వామి దయవల్ల ఆకాశంలో మళ్ళిపోతున్న మేఘాలు ఆగి వర్షిస్తాయ్. దేవరాయల భక్తి ముందు తనశక్తి పనిచేయదని తెలుసుకున్న ఇంద్రుడు తగిన సమయం కోసం కాచుకుంటాడు.

రఘుపతిరాయలకు మహేంద్రమణి ప్రభావంవల్ల భూమిలో ఒక ఆడపిల్ల దొరుకుతుంది. ఆబిడ్డకు "వాసవి" అని పేరు పెట్టి పెంచుకుంటారు.

తిమ్మరాజుకు మూడవ సంవత్సరం పూర్తి కాబోతుందనగా మొక్కు విషయం భర్తకు గుర్తుచేస్తుంది మేనమ్మ. కాని బిడ్డడి మీద మమకారంతో తలనీలాలు యివ్వడానికి నిరాకరిస్తాడు దేవరాయలు. దాంతో స్వామికి ఆగ్రహం కలుగుతుంది.

ఈ అవకాశం చూసుకొని ఇంద్రుడు దేవరాయల్ని రాజ్యభ్రష్టుడ్ని చేస్తాడు. చివరికి ఎంతో కాలంగా స్వామిని సేవించి పొందిన వెంకటేశ్వర పూజాఫలాన్ని కూడా ధారపోయించు కుంటాడు. ఇన్ని చేసినా దేవరాయలు తనకు లొంగకపోవడంతో ఇంద్రుడు కోపం పట్టలేక దేవరాయలను సర్పంగా మార్చివేస్తాడు. పసివాడైన తిమ్మరాజును కారడవిలో ఒంటరిగా విడిచి పెడతాడు. పాపం! భర్తనూ బిడ్డనూ వెదుక్కుంటూ బయలుదేరుతుంది మేనమ్మ.

"అమ్మా! అమ్మా!" అని అరణ్యంలో రోదిస్తున్న పనివాడి ఆక్రందనవిని దీనావనుడైన తిరుమలేశుడు, అలమేలుమంగా సహితుడై మారువేషంతో వచ్చి ఆదుకుంటాడు. విద్యాబుద్ధులు నేర్పి తిమ్మరాజును పెద్దవాణ్ణి చేస్తాడు.

ఒకనాడు వేటకు వెళ్ళిన తిమ్మరాజు వాసవిని కలుసుకుంటాడు. ప్రేమిస్తాడు. వాసవికూడా తిమ్మరాజును చూసి తీయని కలలుకంటుంది. స్వామి దయవల్ల తిమ్మరాజు తన తల్లినీ; మేనమామైన రఘుపతి రాయలను కలుసుకుంటాడు. మేనమ్మ, తిమ్మరాజును తీసుకొని అన్నగారి రాజ్యానికి వెళ్తుంది. మనసులతోబాటు వరసలు కూడా కలసిన వాసవీ తిమ్మరాజుల ప్రణయం మారాకు వేస్తుంది.

మాయానగరానికి అధికారిణి యోగ సుందరి. అణిమాద్యష్ట సిద్ధులూ, ఇంద్రజాలాది విద్యలూ నేర్చిన మాంత్రికురాలు. తన మాయాబలంతో, లేని యౌవనాన్ని తెచ్చుకుని బేండా భైరవుడనే మాంత్రికుడ్ని ప్రేమిస్తుంది. కాని బేండా భైరవుడు ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. మాంత్రికురాలికన్నా ఎక్కువ శక్తుల్ని సంపాదించాలని కాలభైరవుడ్ని ఉపాసిస్తాడు.

కళింగ రాజ్యంలో పెళ్ళికూతుర్లు మాయమౌతుంటారు. మేనమ్మ తిమ్మరాజులను చేరదీయడం వల్లనే యిలాంటి అరిష్టాలు వస్తున్నాయమొ నింద వేస్తుంది జగదాంబ. ఆ అపవాదు భరించలేక అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు - తిమ్మరాజు మేనమ్మలు. కాని ఇంతలో కాలభైరవునకు అర్పించడానికై “వాసవిని” అపహరిస్తాడు బేండా భైరవుడు. నిజం తెలియక రఘుపతిరాజూ జగదాంబ, తిమ్మరాజునే నిందిస్తారు. వాసవి ఎక్కడున్నాసరే మూడో పున్నమి దాటకుండా తెచ్చి అప్పగిస్తాను అని ప్రతిజ్ఞ చేసి బయలుదేరతాడు తిమ్మరాజు.

కాలభైరవునకు అర్పించాలని తెచ్చిన వాసవిని చూసి ఆమె అందచందాలకు ముగ్గుడై ఆమెను అనుభవించాలనుకుంటాడు బేండా భైరవుడు. కాని ఇదంతా తన మాయాజాలంతో తెలుసుకున్న యోగసుందరి ఎత్తుకు పైయెత్తు వేస్తుంది. తిమ్మరాజు అనేక కష్టాలుపడి మాయానగరం చేరుకుంటాడు. కాని వెంకటేశ్వరుని అనుగ్రహం లేనందువల్ల ఎన్ని శక్తులున్నా ఏమి చెయ్యలేక చివరకు చిక్కుల్లో పడతాడు.

ఒక మహర్షి ద్వారా తనభర్త సర్పరూపంలో ఉన్నాడని; తన బిడ్డడు ఆపదలో చిక్కుకున్నాడని తెలుసుకుంటుంది మేనమ్మ. ఇంద్రలోకంలో ఉన్న అమృతజలం తెచ్చి చల్లితే పూర్వపు రూపు వస్తుందని చెప్తూ; సర్పంగా ఉన్న దేవరాయలకు కొన్నిశక్తుల్ని ప్రసారిస్తాడు మహర్షి. ఆ అపూర్వశక్తులతో ఆకాశయానం చేస్తూ తన తనయుడ్ని చేరుకుంటాడు దేవరాయలు.

బేండా భైరవుడు నిద్రలోనుండగా సర్పంగా ఉన్న దేవరాయలు మంత్రదండాన్ని తెచ్చి తిమ్మరాజును బంధవిముక్తుడ్ని చేస్తాడు. తెల్లవారేలోగా తిరుపతికి వెళ్ళి మొక్కు చెల్లించుకు రావాలంటాడు. ఈలోగా జరిగిన మోసం తెలుసుకున్న బేండా భైరవుడు సర్పంగా ఉన్న దేవరాయల ప్రాణం హరిస్తాడు. వాసనిని కాలభైరవునకు ఆర్పించడానికి సన్నాహాలు చేస్తాడు.

తిమ్మరాజు తిరుమలేశుని అనుగ్రహం పొందగలుగుతాడా? వాసవిని రక్షించి తన ప్రతిజ్ఞను కాపాడుకోగలుగుతాడా? తన తండ్రిని బ్రతికించ గలుగుతాడా? ఇంద్రుని ఆధీనంలో ఉన్న అమృతజలం తీసుకురాగలుగుతాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సినిమా పతాక సన్నివేశంలో తెలుస్తాయి.[2]

పాటలు

[మార్చు]
పాటలు, పద్యాల వివరాలు[2][3]
సం.పాటపాట రచయితగాయకుడు(లు)పాట నిడివి
1."ఈ వింత పులకింత నాలొన కలిగేను నిను కనినంత"వీటూరిఎస్. జానకి 
2."ఓ నిండు చందమామా నిగనిగల భామా ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా"ఆరుద్రకె. జె. ఏసుదాసు 
3."రాగభోగాల తేలించు దొరవని కోరి పిలిచేనురా సురభామినీ"వీటూరిపి.సుశీల 
4."నాగమల్లి కోనలోనా నక్కింది లేడికూనా ఎర వేసి గురిచూసి పట్టాలి మావా"వీటూరికె.జమునారాణి 
5."బలే బలే బలే బాగుంది అలా అలా ఒళ్ళు తేలిపోతోంది" కె.జమునారాణి 
6."లేడిని సీత చూడకపోతే రావణుడొచ్చేనా రామరామ సీతమ్మను చెర పట్టక పోతే లంకకు చేటౌనా"వీటూరిమాధవపెద్ది సత్యం,
స్వర్ణలత,
శర్మ,
పట్టాభి
 
7."కోడెకారు చినవాడా కొంటెచూపుల మొనగాడా కోనలోనా వేటలాడే నేర్పు నీకుందా"వీటూరిపి.బి.శ్రీనివాస్
ఎస్.జానకి
 
8."శ్రీ వెంకటేశ్వర సుప్రభాతమ్" పి.బి.శ్రీనివాస్
పి.ఎస్.వైదేహి
 
9."శ్రీమద్రమాకాంత కాంతోరు రత్నప్రభా భానుసాహస్ర దీవ్యత్కిరీటా (దండకం)" పి.బి.శ్రీనివాస్ 
10."శ్రీకర నీ పదాబ్జముల సేవలు చేయుచు నెల్లకాలమున్ (పద్యం)"ఆరుద్రపి.బి.శ్రీనివాస్ 
11."స్దిరమై ముక్తికి మార్గదర్శకరమై శ్రీమన్మహాలక్ష్మికాకరమై (పద్యం)"వీటూరిమాధవపెద్ది సత్యం 
12."బలదర్పమున దుర్జనుల్ ప్రబలి నీ భక్తాళి భాదింపగా (పద్యం)"వీటూరిపి.బి.శ్రీనివాస్ 
13."హ్రీంకారాసన గర్భితానలశిఖమ్ (సాంప్రదాయ శ్లోకం)" ఎస్.జానకి,
పి.బి. శ్రీనివాస్
 

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Bangaru Thimmaraju (G. Vishwanath) 1964". ఇండియన్ సినిమా. Retrieved 25 February 2024.
  2. 2.0 2.1 కేతా & గంగాధర్ (1964). Bangaru Thimmaraju or Sri Venkateswara Pooja Mahima (1964)-Song_Booklet (1 ed.). మద్రాసు: గౌరీ ప్రొడక్షన్స్. p. 16. Retrieved 25 February 2024.
  3. కొల్లూరి భాస్కరరావు. "బంగారు తిమ్మరాజు - 1964". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 25 February 2024.

బయటిలింకులు

[మార్చు]