'భీష్మ' సుజాత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుజాత
Sujatha Bhishma.jpg
జననంసరోజిని
చినరావూరు,తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారతదేశం
నివాస ప్రాంతంచెన్నై
వృత్తిభారతీయ చలనచిత్ర నటి
క్రియాశీలక సంవత్సరాలు1959-1991
మతంహిందూ మతం
భార్య / భర్తఎం.ఎం.కె.ఆప్పారావు
పిల్లలుఎం.వి. భానుప్రకాష్
తండ్రిసూరయ్య
తల్లివెంకటరత్నమ్మ

సుజాత పాతతరం సినిమానటి. ఈమె తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలలో నటించింది. భీష్మ సినిమాలో మత్స్యగంధి వేషం వేసి 'హైలో హైలెస్సా హంస కదా నా పడవ' అనే పాట ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని వారి మనసులలో 'భీష్మ' సుజాత గా నిలిచిపోయింది[1].

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె అసలు పేరు సరోజిని. ఈమె గుంటూరు జిల్లా, తెనాలి మండలం, చినరావూరు గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో సూరయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించింది. ఈమెకు బాల్యం నుండే సంగీతం, నాట్యం నేర్పించారు. ఎం.ఎస్.శైవ అనే నాట్యాచార్యుని వద్ద ఈమె కూచిపూడి నాట్యం నేర్చుకుంది. ఈమె విద్యాభ్యాసం తెనాలి మునిసిపల్ హైస్కూలులో సాగింది. హైస్కూలులో ఉన్నప్పుడే ఈమె నాటకాలలో నటించడం మొదలుపెట్టింది. బేబి సుజాత & పార్టీ పేరుతో ఒక డ్యాన్స్ ట్రూపు పెట్టి నాట్యప్రదర్శనలు ఇచ్చింది. ఈమె నాట్యకౌశలానికి మెచ్చి 11 ఏళ్ల అతి పిన్న వయసులోనే భువనగిరిలో నృత్య ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం లభించింది. సినిమాలలో నటించాలనే కోరికతో చెన్నైకి చేరుకుని సినిమాలకు ప్రయత్నిస్తూనే నాటకాలలో నటించింది. పంజరంలో పక్షులు అనే నాటక ప్రదర్శనలో ఈమెను చూసిన పిఠాపురం రాజా గారి మనవడు ఎం.ఎం.కె.ఆప్పారావు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి తరువాత ఈమె సినిమాలకు కొంతకాలం దూరంగా ఉండి ఆంధ్ర మహిళాసభలో మెట్రిక్ చదివింది. రాజావారి ఆస్తిపాస్తులు కోర్టు వ్యవహారాలలో చిక్కుకుని ఆర్థిక ఒడిదుడుకులు ఏర్పడి ఈమె మళ్ళీ సినిమాలలో నటించాల్సి వచ్చింది. 1991 వరకు సినిమాలలో నటించి ప్రస్తుతం చెన్నైలో కుమారుని వద్ద నివసిస్తున్నది.

నాటకరంగం[మార్చు]

ఈమె చింతామణి, శ్రీకాళహస్తి మహాత్మ్యం, శాంతినివాసం, మనోహర, పంజరంలో పక్షులు, బాలనాగమ్మ, చాణక్య చంద్రగుప్త, శ్రీకృష్ణతులాభారం మొదలైన అనేక నాటకాలలో నటించి పేరుగడించింది. సూరవరపు వెంకటేశ్వర్లు, కాళిదాసు కోటేశ్వరరావు, పద్మనాభం, మాడా వెంకటేశ్వరరావు, స్థానం నరసింహారావు, టి.జి.కమలాదేవి, వాణిశ్రీ, జమున, ఎస్.వి.రంగారావు, శారద, రామకృష్ణ, నాగభూషణం, వల్లం నరసింహారావు, జి.వరలక్ష్మి మొదలైన నటీనటులతో కలిసి నాటకాలలో నటించింది.

సినిమారంగం[మార్చు]

ఈమె 60కి పైగా తెలుగు సినిమాలలో, నాలుగైదు తమిళ సినిమాలలో, కొన్ని కన్నడ సినిమాలలో, ఒక ఒరియా సినిమాలో నటించింది. అవకాశాలు తగ్గినప్పుడు రాజసులోచన, సుకుమారి, మంజుల, కుయిలీ, జ్యోతిలక్ష్మి, సిల్క్‌స్మిత మొదలైన వారికి తమిళం నుండి తెలుగులోనికి వచ్చిన అనేక సినిమాలకు డబ్బింగ్ చెప్పింది.

ఈమె నటించిన సినిమాలలో కొన్ని:

 1. భక్త అంబరీష (1959) - మహాలక్ష్మి
 2. దీపావళి (1960) - రంభ
 3. కన్నకొడుకు (1961)
 4. నాగార్జున (1962)
 5. భీష్మ (1962) - మత్స్యగంధి
 6. గౌరి (కన్నడ సినిమా)
 7. సతిశక్తి (కన్నడ సినిమా)
 8. రణధీరకంఠీరవ (కన్నడ సినిమా)
 9. మదనకామరాజు కథ (1962)
 10. పరువు ప్రతిష్ఠ (1963)
 11. బంగారు తిమ్మరాజు (1964)
 12. వీరాభిమన్యు (1965) - మంజుల (అభిమన్యుడు స్త్రీ వేషంలో ఉత్తరను సమీపించే పాత్ర)
 13. అమ్మమాట (1972) - రాజబాబు తల్లి
 14. తులాభారం (1974)
 15. నిప్పులాంటి మనిషి (1974)
 16. అన్నదమ్ముల అనుబంధం (1975)
 17. చిన్ననాటి కలలు (1975)
 18. దొరలు దొంగలు (1976)
 19. నా పేరే భగవాన్ (1976)
 20. నేరం నాది కాదు ఆకలిది (1976)
 21. తిరగబడ్డ తెలుగు బిడ్డ (1978)
 22. నాలాగ ఎందరో (1978)
 23. చిరంజీవి రాంబాబు (1978)
 24. శ్రీరామ పట్టాభిషేకం (1978)
 25. జగన్నాటకం (1991)

టెలివిజన్[మార్చు]

ఈమె నాగమ్మ, పవిత్రబంధం, అక్క, మూడుముళ్ళబంధం మొదలైన తెలుగు టి.వి.సీరియళ్లలోను, శివమయం, కాలం, చిత్తి మొదలైన తమిళ టి.వి.సీరియళ్లలోను నటించింది.

మూలాలు[మార్చు]

 1. కంపల్లె, రవిచంద్రన్ (20 May 2012). "జ్ఞాపకాలు - హైలో హైలెస్సా... హంస కదా నా పడవ". ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచిక. Archived from the original on 18 ఆగస్టు 2017. Retrieved 22 March 2017. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)